చిరుజల్లు-107

0
3

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

వరుడు కావలెను

[dropcap]ఆ[/dropcap] రోజు పేపర్‍లో హేమలత వేయించిన ప్రకటన వచ్చింది. పదేపదే ఆ ప్రకటన చదువుకున్నది.

‘వరుడు కావలెను – ఉద్యోగం చేసి రిటైరైన అందమైన అవివాహిత స్త్రీకి వరుడు కావలెను. అతను అవివాహితుడైనను, బాదరబందీ లేని భార్యావిహీనుడు అయిననూ, డైవర్సీ అయిననూ అభ్యంతరము లేదు. కుల పట్టింపు లేదు. అయిదున్నర అడుగులకు తక్కువ కానివాడు, ఆరోగ్యవంతుడు, సహృదయుడు అయి ఉండవలెను, బాక్స్ నెం. 1234.’

ఈ వయసులో వరుడు కావలెనని ప్రకటన ఇవ్వటం ఇష్టం లేకపోయినా తప్పలేదు. హేమలతకు ఇంతవరకు పెళ్లి కాకపోవటానికి బలమైన కారణాలు లేవు. ఆమె అందంగా, అపరంజి బొమ్మలా ఉంటుంది. మొదట్లో కొన్ని సంబంధాలు వచ్చాయి. కానీ, ప్రతి సంబంధంలోనూ ఏవో లోపాలు కనిపించేవి. తల్లి జబ్బు మనిషి. తండ్రిని పోషించాల్సిన బాధ్యత ఆమె మీద ఉన్నది. చూస్తుండగానే పాతికేళ్లు దాటి పోయాయి. అప్పట్లో తనతో పని చేసే కుర్రాళ్లు ఒకరిద్దరు రాయబారాలు జరిపినా, ఆమె సుముఖత చూపలేదు. దిగులుతో తల్లి చనిపోయింది. కొద్దినెలల వ్యవధిలోనే తండ్రి కూడా చనిపోయాడు. ఆమెలో ఏదో తెలియని నిర్లిప్తత ఆవరించింది.

హేమలత ఏకాకి అయిపోయింది. చెప్పుకోదగ్గ బంధువులు లేరు. మనసు విప్పి మాట్లాడగల ఆత్మీయులు కరువైనారు. ఒంటరి జీవితానికే అలవాటు పడింది.

రిటైరైనప్పటి నుంచి ఒంటరితనం ఆమెను మరింత భయపెడుతోంది. ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం. ఇన్నాళ్లూ సంపాదించిన డబ్బు ఉంది. ఇంట్లో వస్తువులూ ఉన్నాయి. ఎవడైనా ఇంట్లో దూరి గొంతు పిసికి చంపేసి ఇంట్లోవన్నీ కాజేస్తే.. అన్న ఆలోచన వచ్చినప్పటి నుంచీ తన నీడను చూసి భయపడుతోంది. పర్యవసానమే వరుడు కావలెను అన్న ప్రకటన.

మంచి రెస్పాన్స్ వచ్చింది. నాలుగయిదు ఉత్తరాలు ఆమెను ఆలోచింపచేశాయి. ముఖ్యంగా ఒక ఉత్తరం ఆమెను బాగా ఆకర్షించింది.

‘డియర్ మేడమ్.

నా పేరు శ్రీనివాస మూర్తి. అందరూ కల్నల్ మూర్తి అంటారు. నేను రిటైరై రెండేళ్లు అయింది. ఒక కొడుకు, ఒక కూతురు, ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వాళ్లకూ పిల్లలు ఉన్నారు. అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. టెక్సాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్. అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంది. భార్యాభర్తలిద్దరికీ ఉద్యోగాలు. క్లుప్తంగా ఇవి వివరాలు. సైనిక్‌పురిలో ఇల్లు కట్టుకున్నాను. అయిదేళ్ల కిందట భార్య చనిపోయింది. అప్పటి నుండి ఒంటరితనం. రిటైరైనాక మనం వృద్ధుల కింద లెక్క. వార్ధక్యం మరో బాల్యంతో సమానం అంటారు. మొదటి బాల్యానికీ, రెండో బాల్యానికీ తేడా ఏమిటంటే, చిన్నప్పుడు ఏమీ తెలియదు. ఎవరేం చెబితే అది నమ్ముతాం. ఇప్పుడలా కాదు. అన్నీ మనకు తెల్సుననీ, అందరూ మనం చెప్పినట్లు వినాలనీ అనుకుంటాం. కానీ మన మాట ఎవరూ వినరు. అదీ బాధ. ఆ బాధను అర్థం చేసుకోవాలంటే, అదే వయసులోనున్న వ్యక్తి కావాలి. అందుకని నాతో సహచర్యం జరిపే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాను. మీకు ఇష్టమైతే పైన ఉన్న నెంబర్‌కి ఫోన్ చేయండి.

– మూర్తి’

ఆ ఉత్తరం చదివాక ఎవరిని ఆమెను ఆప్యాయంగా పలకరించినట్లు, ప్రేమగా మనసును మనసుతో సృజించినట్లు అనిపించి మేను పులకరించింది. ఒక రోజంతా తటపటాయించి, ఎలాగో ధైర్యం చేసి ఫోన్ చేసింది. తన గురించి చెప్పింది.

“ఒక స్నేహితురాలు దొరికినందుకు సంతోషం. రేపు మా ఇంటికి రండి.” అన్నాడు మూర్తి.

“ముందు మీరు రావటం సాంప్రదాయం అనుకుంటాను” అన్నది హేమలత

మూర్తి ఫక్కుమని నవ్వాడు. “మన మధ్య నో ఫార్మాలిటీస్. నో ఇన్హిబిషన్స్. మనం ఫ్రెండ్స్.”

“నేను మిమ్మల్ని కేవలం ఒక ఫ్రెండ్ గాక, అంతకు మించిన ఒక ఆత్మీయుడిగా భావిస్తున్నాను.” అన్నది ఆమె.

“మనం ఒకరినొకరం చూసుకోకుండానే నేను నీవాడననీ, నువ్వు నా దానివనీ.. అనిపిస్తోందంటే, ఈ బంధం ఏ నాటిదో అనిపిస్తోంది” అన్నాడు మూర్తి.

మర్నాడు ఆయన కారులో వచ్చాడు. ఆజానుబాహుడు, గంభీరమైన మొహానికి, గుబురు మీసాలు మరింత గాంభీర్యాన్ని తెచ్చిపెట్టాయి. హేమలత ప్రత్యేకంగా అలంకరించుకుంది. తెలియని ఆనందం ఏదో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

“రండి, రండి” అంటూ స్వాగతం పలికింది.

లోపలికి వచ్చి కూర్చున్నాక, ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు.

“మీరు ఒక్కరే ఉంటున్నారా?” అని అడిగాడు.

“అవును. నా అనేవాళ్లు ఎవరూ లేరు. ఒంటరితనం నాకొక శాపం అయింది” అన్నది కించిత్ బాధతో.

ఆమె చిరునవ్వుతో కాఫీ, పలహారాలు అందించింది.

“మీకు చాలా శ్రమ ఇచ్చాను” అన్నాడు మూర్తి.

“ఎండి మోడై పోతున్న జీవితానికో వసంతం తీసుకొచ్చారు. ఆ రుణం ఎలా తీర్చుకోను” అన్నది.

మర్నాడు మూర్తి ఆమెను తన ఇంటికి ఆహ్వానించాడు.

ఈ ఇల్లూ, ఇంట్లోని సామాను కొన్ని లక్షలకు పైనే విలువ చేస్తుంది.

కొంత సేపు కబుర్లు చెప్పుకున్నాక, సాగనంపేటప్పుడు విలువైన నగలూ, పట్టుచీర, రవికలగుడ్డా ఆమెకు అందించాడు మూర్తి

“ఇప్పుడెందు కివన్నీ” అన్నది ఆమె. “ప్రేమించిన మనిషికి ఇచ్చేఈ కానుక చాలా చాలా చిన్నవే”

ఆమెను కారులో ఇంటి దగ్గర దింపాడు మూర్తి. ఆమె కోరిక మీద అక్కడే భోజనం చేశాడు.

ఆ రాత్రికి మూర్తి కొడుకుతోను కూతురితోను ఫోన్లలో మాట్లాడాడు. ఆయన నిర్ణయానికి వాళ్లు ఎంతో సంతోషించారు.

తెల్లారకముందే ఫోన్ మోగితే, మాట్లాడింది హేమలత.

“నేను మూర్తిగారి అబ్బాయిని చక్రవర్తిని. మీరు మా ఇంట్లో సభ్యులు కాబోతున్నందుకు చాలా సంతోషం. వెల్కం టు అవర్ ఫామిలీ. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని మమ్మీ అని పిలుస్తాను. ఉంటాను మమ్మీ..”

హేమలత సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బు అయింది. టెక్సాస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్.. చక్రవర్తి – తనను అమ్మా అని పిలుస్తున్నాడు. ఇంత గొప్ప అనుభూతి ఎన్ని కోట్లు పోసి కొనుక్కుంటే మాత్రం దొరుకుతుంది. ..అని ఆమె నిట్టూరుస్తుండగానే మళ్లీ ఫోన్ మోగింది.

“హలో నేను మూర్తి గారి అమ్మాయి లావణ్యను. మెల్బోర్న్ నుంచి మాట్లాడుతున్నాను. కంగ్రాచ్యులేషన్స్ అండ్ హార్టీ వెల్కం టు అవర్ ఫామిలీ మమ్మీ, డేట్ ఫిక్స్ చేసి చెప్పండి. నేనూ, అన్నయ్యా వస్తాం” అన్నదా అమ్మాయి.

హేమలతకు నోట మాట రావటం లేదు. ఎక్కడో ఆస్ట్రేలియాలో ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో ప్రాజెక్ట్ లీడర్‌గా పని చేస్తున్న లావణ్య తన కూతురు అయింది. ‘మమ్మీ’ అని పిలుస్తుంటే ఆమె హృదయం ఆనంద తాండవం చేస్తున్నది.

మూర్తికి ఫోన్ చేసింది.

“నిన్నటి దాకా ఎవరికీ ఏమీ కాను, మీకు భార్య కాబోతున్నాను. చక్రవర్తికి, లావణ్యకూ తల్లిని కాబోతున్నాను. ఇంతటి సంతోషాన్ని ఈ గుండె తట్టుకోలేదేమోనని అనినిపిస్తోంది.” అని ఆవుకోలేని ఉద్వేగంలో ఆమెకు నా మాట పెగల్లేదు.

చక్రవర్తి, లావణ్య రోజూ హేమలతకు చేస్తున్నారు.

“నాకు దేవుడు ఇచ్చిన బిడ్డలు మీరు. మిమ్మల్ని ఏ రోజున చూడగలిగితే, ఆ రోజే మంచి రోజు నాకు. మీరు మీ కుటుంబాలతో సహా రావాలి. మిమ్మల్ని అందర్నీ చూడాలి.” అని హేమలత చెప్పింది.

వాళ్లు ఆరునెలలే కిందనే వచ్చి వెళ్లారు. అయినా ఈ కొత్త ‘అమ్మ’ కోసం సకుటుంబంగా వస్తున్నారు.

మూర్తితో సినిమాలకు, షికార్లకు వెళ్లింది. పెళ్లికి ఆమెకు పట్టు చీరలు కొనిపెట్టాడు. ఆయనకు ఆమె సూట్ కొనిపెట్టింది.

రెండు నెలల తరువాత, చక్రవర్తి, లావణ్య కుటుంబాలతో వచ్చారు. చక్రవర్తి భార్య సృజన ‘అత్తయ్యగారూ’ అంటోంది. లావణ్య భర్త గిరిధర్ కూడా ‘అత్తయ్యగారూ’ అంటున్నాడు. దొరబాబుల్లాంటి పిల్లలు – శ్రీహర్ష నాయనమ్మ అంటుంటే, చంద్రిక ‘అమ్మమ్మా’ అంటోంది.

అందరి సమక్షంలో మూర్తి, హేమలత రిజస్టర్ మేరేజ్ చేసుకున్నారు. ఆ రోజు రాత్రి ఆయన గుండెల మీద తల వాల్చి హేమలత ఏడుస్తుంటే, ఆయన ఓదార్చాడు.

“ఎందుకీ ఏడుపు?”

“ఏమో నాకే తెలియదు. ఇన్నాళ్లూ దేవుడు నన్ను చిన్నచూపు చూశాడని బాధపడుతుండేదానిని. కానీ ఇంతమంచి భర్తనూ, కొడుకు, కోడలినీ, కూతుర్నీ, అల్లుడినీ, మనవడినీ, మనవరాలనీ ఇవ్వటం కోసమే ఇంత కాలం నన్ను వేచి ఉండమన్నాడు. ఎన్ని జన్మల ఈ పూజల ఫలితమో ఇది. ఇలాంటి మంచి కుటుంబంలోకి రాగలిగాను” అన్నది.

“నీలాంటి సహృదయురాలు దొరకటమూ వాళ్ల అదృష్టమే. సవతి పిల్లలన్న..” అని అంటుండగానే ఆయన నోటికి చేతిని అడ్డం పెట్టింది.

“ఇంకెప్పుడూ ఆ మాట అనకండి. ఆ ఊహ కూడా రానివ్వవద్దు. వాళ్లు మన పిల్లలు..”

రెండు వారాలు ఉండి, చక్రవర్తి, లావణ్య కుటుంబాలలో వెళ్లిపోయారు. ఇల్లు వెలవెలబోయింది. మూర్తి, హేమలత ఇద్దరే మిగిలారు. ఆరునెలలు దేశమంతా తిప్పాడు ఆమెను. చివరకు ఒక రోజు సిమ్లాలో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. డాక్టర్లు విశ్వప్రయత్నం చేశారు, కానీ వాళ్లు దైవ నిర్ణయాన్ని మార్చలేక పోయారు.

ఆమె కుప్ప కూలిపోయింది.

విషయం తెల్సి, చక్రవర్తీ, లావణ్య ఫామిలీస్‌తో సహా పరుగెత్తుకొని వచ్చారు.

జరగవల్సిన తతంగం అంతా జరిగిపోయింది.

వెళ్లబోయే ముందు చక్రవర్తి, లావణ్య అడిగారు – వచ్చి తమ దగ్గర ఉండమని.

తన చెవులను తాను నమ్మలేకపోయింది.

“నాన్నని రమ్మంటే, ఆయన రాలేదు. నువ్వయినా వచ్చి ఉంటే బావుంటుంది. ఈ వయసులో ఒక్క దానివీ ఇక్కడుంటే, మా మనసు ఎప్పుడూ నీ మీదే ఉంటుంది – నువ్వెలా ఉన్నానని..” అన్నాడు చక్రవర్తి. లావణ్య కూడా వచ్చి తన దగ్గర ఉండమన్నది.

హేమలత ఎటూ తేల్చుకోలేక పోయింది.

శ్రీహర్ష ఆమె దగ్గరకు వచ్చాడు “నానమ్మా, మా ఇంటికి రావా, మనం ఆడుకుందాం” అన్నాడు.

వాడ్ని దగ్గరకు తీసుకుంది. ముద్దుల వర్షం కురిపించింది.

ఆయన.. రెండో బాల్యం లోని స్నేహితుడి కోసం ఈ ఇంట్లో అడుగు పెట్టింది. కానీ ఆయన లేడు. బాల్యంలో ఉన్న మనవడు.. చిన్నారి స్నేహితుడు దొరికాడు, ఆడుకోవటానికి. మనసు విప్పి మాట్లాడుకోవటానికి.

శ్రీహర్ష ఆమెను క్షణం వదలటం లేదు. ఆమె వాడిని చంకనేసుకునే అన్ని పనులూ చేసుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here