Site icon Sanchika

చిరుజల్లు 11

చీకటి ముసిరిన ఏకాంతంలోకి…

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి సద్దుమణిగిన రోడ్లన్నీ నిద్దరోతుంటాయి. నిర్మానుష్యంగా ఉంటయి. ఊరంతా ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు ఉంటుంది. ఒక్క ఊరకుక్క కూడా కనిపించదు. కానీ కాసేపటికి, కోడి కూస్తే, జనం లేస్తారు. నడి రోడ్డున అడ్డదిడ్డంగా నడుస్తుంటారు. నిరామయంగా నున్న రోడ్డు మీద కాసేపటికి విపరీతమైన రద్దీ పెరుగుతుంది.

సాయంకాలం వేళ సముద్ర తీరం అంతా జనసందోహంతో కళకళలాడుతుంటుంది. ఆనందోత్సాహాలతో అటూ ఇటూ సందడిగా తిరుగుతుంటారు. పిల్లల అరుపులు, కేకలూ, ఆటలూ, పాటలూ, కేరింతలు – అంతటా సంతోషం వెల్లివిరుస్తూ ఉంటుంది. క్రమంగా చీకటి చిక్కబడుతుంది. పదీ, పదకొండు, పన్నెండు… నిర్మానుష్యంగా మారిన తీరంలో హోరుమనే సముద్ర ఘోష తప్ప ఇంకేమీ ఉండదు. ఎంతలో ఎంత మార్పు?

నగరంలో ఏ దారి ఎటు పోతుందో తెలియదు. అడవిలోకి వెళ్తే, బయటపడే దారే తెలియదు.

ఎటు చూసినా లోకమంతా వైరుధ్యాల పుట్ట.

***

ఒక గదిలో ఎనిమిది మంది ఉన్నారు. వాళ్లంతా రూమ్ మేట్స్. అటు గోడకి ఆనుకుని నలుగురూ, ఇటు గోడకు ఆనుకొని నలుగురు చాపలు పరుచుకుని కూర్చున్నారు. ఇద్దరు తమ ఆఫీసులోని అమ్మాయిల గురించి, ఇంకో ఇద్దరు సినిమా హీరోల గురించి, మరో ఇద్దరు క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకడు శరత్ చంద్ర చటోపాధ్యాయ అంత అయిపోవాలని రచనలు చేస్తున్నాడు. ఒకడు ఐ.ఎ.ఎస్ పరీక్షకు దీక్షగా చదువుతున్నాడు. వాళ్లంతా ఒక సమూహంలో ఉంటూనే, జంట గానూ ఉన్నారు, ఒంటరిగానూ ఉన్నారు.

ఫంక్షన్ హాలులో పెళ్లి జరుగుతోంది. అయిదొందల మంది ఉన్నారు. కొందరు బిజీగా తిరుగుతున్నారు. కొందరు పానీయాలు తాగుతున్నారు. కొందరు పక్కవారితో చిన్నగా మాట్లాడుతున్నారు. కొందరు దిక్కులు చూస్తున్నారు. వాళ్లు జనసమూహంలోనూ ఉన్నారు. పెళ్లి వేడుక చూస్తూనూ ఉన్నారు. కొందరు అందరి మధ్యా ఉన్నా ఒంటరిగానే ఉన్నారు. ఎంత వైరుధ్యం?

ఒక రైలు బోగీలో డెబ్బయి మంది ఉన్నారు. కొందరు బయటకు చూస్తున్నారు. కొందరు కబుర్లు చెప్పుకుంటున్నారు. కొందరు ఫోన్లు చూసుకుంటున్నారు. చుట్టూ ఎంతమంది ఉన్నా, సగం మంది ఒంటరిగానే ఉన్నారు.

ఒక ఇంట్లో ఆమె చపాతీలు చేస్తోంది. ఆయన టీ.వీ.లో వార్తలు చూస్తున్నాడు. కొడుకు ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. కూతురు చదువుకుంటోంది. నలుగురూ దగ్గర దగ్గరే ఉన్నారు, కానీ ఎవరి లోకం వారిదే. ఎవరి పనులలో వారు ఒంటరిగానే ఉన్నారు.

అందరిలో ఉంటూ కూడా ఒంటరిగా ఉండొచ్చు. ఒంటరిగా ఉంటూ కూడా అందరి హృదయాల్లో ఉండొచ్చు. అది ఎలాగంటే, ఒక ఊర్లో సీతారామయ్య అనే పెద్దమనిషి ఉన్నాడు. ఆయనకు భార్యా పిల్లలు ఎవరూ లేరు. తండ్రి దగ్గర ఆయుర్వేద వైద్యం కొద్దిగా నేర్చుకున్నాడు. ఇంటింటికీ వెళ్తాడు. అందరినీ ప్రేమగా పలకరిస్తాడు. ఎవరికి ఏ సమస్య వచ్చిన, ఏదో ఒక ఉచిత సలహా ఇస్తాడు. వాళ్లు ఏ జామ కాయో, బత్తాయి కాయో ఇస్తారు. ఇంకో ఇంటికి వెళ్తాడు. ఆ జామకాయ వాళ్లకు ఇస్తాడు. వాళ్ళు ఏ కరివేపాకో ఇస్తారు. ఇంకొకరి ఇంటికి వెళ్తాడు. ఆ కరివేపాకు వాళ్లకు ఇస్తాడు. ఇలా ఊరందరికీ ఆయన ఆప్తబంధువే, అయినవాడే. ఆయనకు కాలు విరిగితే, ఊళ్లో వాళ్ళంతా కల్సి ఆయన్ను బస్తీకి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఆయన చనిపోయిన రోజున ఊరంతా ఆయన ఇంటి వద్దే ఉన్నారు. ఆయన ఒంటరివాడే, కానీ ఏనాడూ ఆయన ఒంటరితనం అనుభవించలేదు. అందరి మెప్పును పొందేవాడు ఎప్పుడూ ఒంటరివాడు కాదు.

ఇక, ఎవరు ఒంటరివాడూ అంటే, ఎవరి ప్రేమకూ నోచుకోని వాడే ఒంటరివాడు. ఇంట్లో భార్యాపిల్లల్ని కష్టపెట్టే ఇంటి యజమాని, ప్రజలను అష్టకష్టాల పాలు చేసే దేశాధినేత – ఒంటరివాళ్లే. ఒక దుర్మార్గుడి వల్ల ఇబ్బంది పడుతున్న వారంతా, వాడిని ఎదుర్కోవాలనే విషయంలో ఏకమవుతారు. అలా వారి మధ్య ఒక సమైకత్యకు పరోక్షంగా ఆ చెడ్డవాడు దారితీసినవాడు అవుతాడు.

ఒక ఊరిలో ఒక కోపిష్టివాడు ఉన్నాడు. ప్రతివాడి తోనూ నిష్కారణంగా పోట్లాడుతాడు. అందరినీ కలిపి తిట్టిపోస్తాడు. ఓర్వలేనితనం, పగ, ద్వేషం, అసూయ – వీటి అన్నింటికి అతను ప్రతీక. వీడి పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని, అందరూ కల్సి చర్చించుకునేవారు. వాటి లాంటి వాడు ఒక్కడున్నా ఊరు వల్లకాడవుతుందని అందరూ ఏకాభిప్రాయం వెలిబుచ్చేవారు. ఆ కోపిష్టివాడికి పక్క ఊరిలో ఏదో పని దొరికింది. ఆ ఊరికి వెళ్లిపోతున్నానని అందరికీ చెప్పేశాడు. ఊరివారంతా వాడి పీడ విరగడైనందుకు సంతోషించారు. కానీ ఊరి పెద్ద – వాడిని వెళ్లనివ్వలేదు. పొరుగూరిలో ఇచ్చే డబ్బు, ఇస్తాం ఇక్కడే ఉండమన్నాడు. వాడు ఉండిపొయ్యాడు. ఊరివారంతా ఆ పెద్దమనిషిని దుయ్యబట్టారు – ఎందుకిలా చేశారని. ఆయన ఏమన్నాడంటే, వాడు దుర్మార్గుడే. కానీ వాడిని చూసి ఈ ఊరిలోని పిల్లలంతా, ఎలా ఉండకూడదో తెలుసుకున్నారు. ఏ విద్యాలయంలోనూ నేర్పని సద్బుద్ధి వాడి వల్ల పరోక్షంగా ఊరి వారందరికీ కలుగుతోంది. అందువల్ల వాడిని మన ఊరిలోనే ఉండనిచ్చాను – అని అన్నాడు. ఒక చెడ్డవాడి ఒంటరితనం – ఊరి వారందరి సమైక్యతను దారి తీసిందన్న మాట.

ఇంకొక రకం ఒంటరితనం ఉంది. మంచివాడా, చెడ్డవాడా అన్న విచక్షణ లేకుండా – ఈ ఒంటరితనం అంతులేని వేదనను మిగిలిస్తుంది. అలాంటి సమయంలో గుండెల మీద వాలిపోయి హృదయవేదనను వినగలిగే ఒక నేస్తం ఉండాల్సిన అవసరం ఉంది.

ఆమె ఆగర్భ శ్రీమంతురాలు. అతను నిరుపేద. బయట ఎవరి క్లాసు వాళ్లదే అయినా, కాలేజీలో ఇద్దరిదీ ఒకటే క్లాసు. చదువులో నువ్వా నేనా అన్నట్లు పోటీపడేవారు. ఆ పోటీయే ఇద్దరినీ ఒక దరికి చేర్చింది. ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించారు. పెద్దలంటే ఎవరూ లేరు. ఆమెకు తండ్రి మాత్రమే ఉన్నాడు. పెళ్లి అయింది. తండ్రీ కూతురు కారు ప్రమాదంలో చనిపోయారు. ఒకనాటి నిరుపేద ఇప్పుడు శ్రీమంతుడు అయినాడు. ఇంటినిండా పనివాళ్లు, ఊరినిండా ఆప్తులు – ఎందరున్నా, అతను ఒంటరివాడే. అష్టదిక్పాలకులు కూడా నిదురించే నిశిరాత్రి వేళ, ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. ఒకప్పుడు అతని కోసం అమృత భాండాన్ని మోసుకొచ్చిన నవమోహనాంగి, మోసం చేసి వెళ్లిపోయింది. బ్రతికిన నాలుగు రోజులూ గలాగలా పారే సెలయేరులాగా కిలకిలమని నవ్విన ప్రియబాంధవి బ్రతుకును ఎడారి చేసి వెళ్లిపోయింది. చీకటి ముసిరిన సమయంలోనూ ఒంటరిగా నిలబడి, నాలుగు కుటుంబాలను ఆదుకుంటున్నాడు. అతడు ఒంటరివాడు అయినా, బలవంతుడే.

జీవితంలో పైకి వెళ్లటానికి ఎన్ని మార్గాలున్నాయో, దిగజారటానికీ అన్ని మార్గాలున్నయి. ఆఫీసులోనే కాదు, అధికారంలోనే కాదు, ఏ రంగంలోనైనా, పైకి వెళ్లే కొద్దీ మనిషి ఒంటరివాడు అవుతాడు. నిజాయితీగా నిలబడాలనుకునేవాడికే అన్ని కష్టాలూను. అక్రమ మార్గానికి మళ్లితే, స్వార్థమే పరమార్థమే అయితే, అతని చుట్టూ భజనపరులు తయారవుతారు.

నిజాయితీపరునికి భయం ఉండదు. ధైర్యం ఉంటుంది. అవినీతిపరునికి భయం ఎక్కువ. అందుకే తన చుట్టూ తనలాంటి వారిని కొందరిని పోగు చేసుకుంటాడు – తెచ్చిపెట్టుకునే ధైర్యం కోసం.

మనిషి సామాజిక జీవి. కొండలలోనో, లోయలలోనో ఉండలేడు. నలుగురి మధ్యనే ఉండాలి. తెల్లవారి లేస్తే, ఎంతో మంది, ఎన్నో విధాలుగా సహకరిస్తే గాని సేవ చేస్తే గాని జీవితం గడవదు. అందుచేత మనిషి తన చుట్టూ ఉన్న వారితో వారధి కట్టుకోవాలి గానీ, అడ్డుగోడ కట్టుకోకూడదు.

ఏకాంతంలో నిన్ను నీవు తర్కించుకున్నప్పుడు, నీ సద్గుణాలూ, నీ దుర్గుణాలూ జ్ఞప్తికి వస్తయి. విజ్ఞుడు అయినవాడు ఇక ముందు ఎలా ఉండాలో నిర్ణయించుకుంటాడు. లోపాలను సవరించుకుంటాడు.

మదర్ థెరెసా అన్నది – దారిద్ర్యం అంతా సంపన్నుల హృదయ సీమలలోనే ఉన్నదని. ఆ బీడు భూములను ప్రేమ, దయ, జాలి, మానవత్వం అనే వాటితో సాగు చేయాలని.

సాటివారికి సాయపడాలనే ఆలోచన ఉండాలే గానీ, అందుకు ఎన్నో మార్గాలు కనిపిస్తునే ఉంటయి. పుణ్యక్షేత్రాలు తిరిగితేనే కాదు, మనిషికి కొంత సాయం చేసిన పుణ్యం వస్తుంది.

జీవితం పొడుగునా ప్రతీదీ మారిపోతునే ఉంటుంది. సంవత్సరం మారిపోయి కొత్త సంవత్సరం వస్తుంది. బాల్యం అంతం అయి, కౌమారం వస్తుంది. తరువాత యవ్వనం వస్తుంది. అదీ గడిచిపోతుంది – నడి వయసు… అదీ తరిగిపోతుంది. వృద్ధాప్యం తొంగి చూడనే చూస్తుంది.

శరీరంతో పాటు మనసూ మారాలి గదా. ఆ మార్పూ అనివార్యమే మరి.

ఆలోచనలూ శరవేగంతో మారిపోతూ ఉంటయి. ఇవాళ ఇన్ని అధునాతన సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయంటే, కొత్త కొత్త ఆలోచనలు ఎప్పటికప్పుదు కొత్తనీరు వచ్చినట్టు రావడం వల్లనే గదా. ఒకప్పుడు కొలంబస్ ప్రయాణం గురించి ప్రపంచానికి తెలియడానికి అయిదు నెలల కాలం పట్టింది. లింకన్ హత్య గురించి యూరోపు దేశాలకు తెలియడానికి రెండు వారాలు పట్టింది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎక్కడో క్రికెట్ ఆడుతుంటే ఇంట్లో కూర్చుని ప్రత్యక్ష ప్రసారంలో చూడగలుగుతున్నాం. ఎప్పటికప్పుడు మేధోమధనం జరిగి, సరికొత్త ప్రయోగాలు జరుగుతుండబట్టే గదా, ఇది సాధ్యం. ఈ మేధోమధనం గజిబిజి జీవితంలో జరగదు. ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంతే, మేధస్సు కొత్త పుంతలు తొక్కుతుంది.

ఒక వ్యాపారవేత్త పోటీని తట్టుకొని వ్యాపారాభివృద్ధి చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు కొత్త విధానాలు అనుసరించాలి. ఆ కొత్త విధానాల కోసం కొంత మేధస్సు వెచ్చించాలి. ఒంటరిగా కూర్చుని ఆలోచించుకోవాలి మరి.

ఒక కుటుంబ యజమాని కుటుంబంలోని వారి జీవితాలను బాగు చేయాలన్నా, ఒక నాయకుడు సమాజాన్ని తీర్చిదిద్దాలన్నా, కొత్త కొత్త పంథాలను వెతకాలి. కొత్తగా వచ్చే మార్పులకు స్వాగతం పలకాలి.

కొన్నేళ్ళ కిందట కొద్దిమంది శ్రీమంతుల ఇళ్ళల్లోనే ఫోన్లు ఉండేవి. ఇప్పుడు ప్రతివాడి చేతిలో సెల్‍ఫోన్. ఇదొక విప్లవం. అలాగే టీవీలు. మాధ్యమాలలో రోజుకో కొత్త పరికరం అందుబాటులోకి వస్తోంది.

కొత్తగా ఎలెక్ట్రిక్ కార్లు మార్కెట్ లోకి వస్తున్నయి. పెట్రోల్ అక్కర్లేదు. సోలార్ పవర్ కావాలి. ఈ సోలార్ పవర్‍ని ఇంకా ఎన్ని విధాల వినియోగించుకోవచ్చో పరిశీలిస్తున్నారు. ఏటా కొన్ని ఉపగ్రహాలు ఆకాశంలోకి ఎగురుతున్నయి. ఎప్పుడు ఎక్కడ సునామీలు రాబోతున్నాయో తెల్సిపోతోంది. రష్యా యుద్ధ ట్యాంకులు ఎంతవరకు వెళ్లాయో ముందుగా అమెరికాకు తెలుస్తోంది.

ఇంతకీ ప్రపంచంలో అందరూ రోగాలు, యుద్ధాలూ, ఆర్థిక సమస్యలూ లేకుండా, సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లాలంటే, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెల్సుకుంటూనే ఉండాలి. అవి తెలియాలంటే ఎంతో పరిశోధన అవసరం.

జననం, మరణం, ఒంటరిగానే జరిగిపోతుంటయి. ఈ రెండింటి మధ్య కాలంలో, మనిషి అందరితో కల్సి మెల్సి తిరుగుతూ ఉండాలి. కొంతసేపు ఒంటరిగా కూర్చుని జీవితం గురించి అధ్యయనమూ చేస్తుండాలి. ఇలా ఎంత వరకు అంటే, చీకటి ముసిరిన ఏకాంతంలోకి చివరిసారిగా జారిపోయేవరకూ.

Exit mobile version