చిరుజల్లు-112

0
2

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

పూల మంటలు

[dropcap]వం[/dropcap]గిన నింగినిండా శతకోటి తారకల తోరణాలు. కానీ గుడిసె ముందు కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి.

అలివేలు తడిక తలుపును తాడుతో బిగించి, చినిగి పోయిన చాపపరుచుకుని పడుకుంది. మొగుడు ఇంకా ఇంటికి రాలేదు. బాగా పొద్దుపొయ్యాక, వాడు పనిచేస్తున్న అయ్యగారింట్లో అందరూ పడుకున్నాక గానీ ఇంటికి రాడు.

అలివేలుకు పెళ్లి అయి ఆరు నెలలే అయింది. మొగుడు వరహాలు దాని అందాన్ని చూసి ఇష్టపడి, కట్నం ఇవ్వక పోయినా, అప్పు చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ అప్పు తీర్చాలి. అందుకనే అలివేలు కూడా రాఘవయ్య ఇంట్లో పని చేస్తోంది.

బయట నుంచి కేక వినిపించింది. అలివేలు లేచి తలుపు తెరిచి చూసింది. చీకట్లో ఒక మనిషి ఆకారం కనిపించింది.

“ఎవురది?”

“నేనే.. రావుడ్ని.. చినబాబుగారు తోటలో ఉన్నారు. నిన్ను ఒకసారి అర్జంటుగా రమ్మన్నారు..” అన్నాడు రాముడు.

“ఇప్పుడా, దేనికి?” అని అడిగింది భయంగా.

“దీనికో, నాకేం తెలుస్తాది? యజమాని పిల్చినప్పుడు పనోళ్లు ఎల్లాల.. నువ్వేమన్నా ఆఫీసరా? టయం పెకారం ఇంటికెళ్లి పోవటానికి, అర్జంటుగా ఎల్లు” అంటూ రాముడు మందలించి వెళ్లిపోయాడు. తోటలోకి ఈ వేళప్పుడు రమ్మన్నారంటే, విషయం ఏమిటో అర్థమైంది. వెళ్తే ఏం జరుగుతుందో తెల్సు. వెళ్లకపోతే ఏం జరుగుతుందో తెల్సు. పనిలోనుంచి తీసేస్తారు. అప్పు తీర్చమని వరహాలు మీద ఒత్తిడి తెస్తారు. వాడు అంత డబ్బు ఒక్కసారి ఎక్కడ నుంచి తెచ్చి ఇస్తాడు?

ఏమైనా సరే. వెళ్లదల్చుకోలేదు. కళ్లు మూసుకుని పడుకుంది. పది గంటలప్పుడు కుక్కలు మొరిగాయి. అంటే పరహాలు ఇంటికి వస్తున్నాడన్నమాట. అలివేలు తలుపు తీసింది. వాడు లోపలికి వచ్చాడు. మొగుడ్ని చూశాక భయం తగ్గింది. ధైర్యం వచ్చింది.

వరహాలుతో పాటే రివ్వున గాలి లోపలికి వచ్చింది. దీపం ఆరిపోయింది.

చీకట్లో భర్త గుండెల మీద వాలిపోయింది.

“ఏంటే?” అన్నాడు వాడు.

“నేను రేపుటేల నుంచి పనిలోకి వెళ్లను” అన్నది అలివేలు.

“ఎల్లనంటే ఎలాగ? మన పెళ్లి కోసం రాఘవయ్యగారి దగ్గర అప్పు చేశాను. అది తీర్చాలి గందా” అన్నాడు.

ఆ అప్పు తీర్చటం వాళ్లకు శక్తికి మించిన పని. అలివేలు పనిలోకి వెళ్లక తప్పలేదు.

మర్నాడు భయపడుతూనే వెళ్ళింది. ఆయన నిలువెత్తు మనిషి. బట్టతల, గుబురు మీసాలు, నోట్లో చుట్ట. తెలుగుజాతి పౌరుషానికి నిలువెత్తు సాక్ష్యం. మాట పెళుసు.

“ఏంటే అడుగులో అడుగేసుకుంటూ పెళ్లి వారి నడక. తొందరగా కానియ్” అని గదమాయించాడు.

అలివేలు ఇల్లు శుభ్రం చేసింది. కాఫీ తీసుకుని చినబాబు గదిలోకి వెళ్ళింది.

చినబాబు రాఘవయ్యగారి ఏకైక సంతానం. తండ్రిని పెదబాబు గారనీ, కొడుకుని చినబాబు గారినీ అందరూ పిలుస్తారు. చినబాబు కొన్నాళ్లు సిటీలో ఉండి కాలేజీలో చదివి వచ్చాడు. ఉద్యోగం చేయాల్సిన పనిలేదు. పొలం పనులు చూసుకుంటే చాలు. సిటీలో ఉండి వచ్చినందువల్ల, చదువు పెద్దగా అబ్బకపొయినా, ఖరీదైన అలవాట్లు మాత్రం అచ్చాయి.

కాఫీ గదిలో టీపాయ్ మీద పెట్టి వెనక్కి వెళ్తుంటే, చినబాబు సిగరెట్టు పొగ వదులుతూ అన్నాడు.

“ఏంటే కబురు చేస్తే కూడా రాలేదు. అంత గొప్పదానివై పోయావా?”

“రేత్తిరిపూట.. చీకట్లో తోట లోకి బయమండీ” అన్నది భయంగా.

“ఏం బయమే, నేనున్నాను గదా..”

“నేను అలాంటి దాన్ని కాదండీ” అనేసి గబగబా బయటకు వెళ్లిపోయింది.

రోజంతా ఆ ఇంట్లో పని చేయాలి. అక్కడ ఉండే మనుషులు ముగ్గురే. అందుచేత తప్పించుకు తిరుగుదామన్నా కుదరదు. చినబాబు స్నానానికి వేడినీళ్లు తీసుకెళ్లింది. బాచ్ రూంలో చన్నీళ్లు కలుపుతుంటే చినబాబు గుమ్మానికి అడ్డంగా నిలబడి అన్నాడు.

“నేను అలాంటి దాన్ని కాదంటే, ఏంటి నీ ఉద్దేశ్యం? నువ్వు ఎలాంటి దానివో నాకు తెలియదనుకుంటున్నావా?” అంటూ వెనకనుంచి ఆమెను కౌగలించుకోబోయాడు.

పారిపోయి నూతి పళ్లెం దగ్గర కూర్చుని ఏడ్చింది. రాఘవయ్య భార్య సుమిత్రమ్మ చూసి ఏంటని అడిగింది.

“ఒంట్లో బాగాలేదండీ” అని అబద్ధం చెప్పింది.

ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత తప్పించుకు తిరిగినా, భర్తకు ఎన్ని సార్లు తన బాధ చెప్పుకున్నా, అలివేలుకు రాఘవయ్య ఇంటికి వెళ్లక తప్పటం లేదు.

ఎవరి కంట పడుతుందోనని భయం.

పరిస్థితుల చట్రంలో బిగుసుకు పోయిన మనుషులు వాళ్లు. దానిలోనుంచి బయట పడటం అంత తేలిక కాదు.

ఆదరించీ, బెదిరించీ అలివేలును లొంగదీసుకున్నాడు చినబాబు.

తప్పు చేస్తున్నట్లు అలివేలుకు తెల్సు. కావాలని చేయటం లేదు. తప్పు చేయక తప్పనిసరి పరిస్థితి.

ఒక రోజు రాత్రి తోటలో షెడ్డులో చినబాబుతో ఉండగా పెదబాబు కంట పడింది. ఆయన ఉగ్రుడైపోయాడు.

“తిండికి లేక ఏడుస్తుంటే నాలుగు మెతుకులు వేస్తే నమ్మకంగా పడి ఉంటారని జాలిపడితే, ఇంతకు తెగిస్తావా? ఎవరితో చెలగాటం అడుతున్నావో తెల్సా? ఈ రాఘవయ్యతో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా చేస్తాను. ఒళ్లు దగ్గరపెట్టుకుని మసులుకో” అని హెచ్చరిక చేశాడు.

ఏం గొడవై పోతుందోనని అలివేలు రెండు రోజుల పాటు పనిలోకి వెళ్లలేదు. రావుడొచ్చి ‘రమ్మంటున్నారు’ అంటూ పిల్చాడు. వంచిన తల ఎత్తకుండా తన పని చేసుకుపోతాంది. ఊరికనే కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. పైట కొంగుతో తుడుచుకుంటోంది.

రాఘవయ్య భార్యతో మాట్లాడాడు. “ఇంక ఏదో ఒక సంబంధం చూసి వీడికి పెళ్లి చేసేయ్యాలి. అప్పుడుగానీ, దార్లోకి రాడు” అని అన్నాడాయన.

“ఆ సంగతి నేను ఏడాదినుంచీ మొత్తుకుంటుంటే, మీ చెవికి ఎక్కలేదు. ఏ వయసులో జరగాల్సిన అచ్చటా ముచ్చటా, ఆ వయసులో జరగాలి. వాడ్ని అలా గాలికి వదిలేసి,తప్పు దోవన నడుస్తున్నాడంటే ఆ తప్పు ఎవరిది?” అని ఎదురు ప్రశ్నించింది ఆమె.

చినబాబుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనగానే అలివేలు పెద్ద బరువు దించుకున్నటు ఫీలయింది. ఈయన పెళ్లి అయిపోతే, పెళ్ళాం ధ్యాసలో పడిపోతాడు. తనకీ చెర తప్పిపోతుందని భావించింది.

ఒకదాని తరువాత మరొకటి సంబంధాలు వచ్చాయి. అన్నిట్లోని మెరుగైనదీ, అంగబలం, అర్థబలం, అన్నీ ఉన్న సంబంధం ఖాయం చేశారు. పెళ్లికూతురు ఉపారాణికి నలుగురు అన్నదమ్ములున్నారు. ఒకాయన రాజకీయాల్లో, మరొక ఆయన వ్యాపారంలోన, మరొక ఆయన గుండాయిజంలో, మరొక ఆయన విద్యారంగంలో – ఒక్కొక్కరు ఒక్క రంగంలో ఎవరికెవరూ తీసి పోని విధంగా ఉన్నారు.

సంబంధం ఖాయం చేసుకున్నప్పటి నుంచీ, అందరూ పెళ్లి గోడవలో పడి పోవటంతో అలివేలు తేలికగా గాలి పీల్చుకుంది. బంధువులు రావటం మొదలైంది. అలివేలుకు క్షణం తీరిక లేదు.

వచ్చిన వాళ్లకు మర్యాదలు చేయటం దాని డ్యూటీ అయిపోయింది.

పెళ్లి నాలుగు రోజులు ఉందనగా చినబాబు అలివేలును గదిలోకి పిల్చాడు. పట్టు చీర, ముత్యాల గొలుసు, సెంటు బాటిల్ ఇచ్చాడు.

“ఇయ్యన్నీ నా కెందుకండీ ఇస్తున్నారు?” అని ఆడిగింది.

“నా పెళ్ళి కోసం నువ్వు ఎంత శ్రమపడుతున్నావో చూస్తున్నాను.”

“అదంతా నా పని కదండీ. నా పని నేను చేస్తున్నాను!”

“ఓసి, షిచ్చిమొద్దూ, నా పెళ్లిలో నువ్వు కళకళలాడుతూ, కిలకిల లాడుతూ నా ముందు తిరుగుతుండాలి. నాకు నీ తరువాతనే ఎవరైనా..” అన్నాడు.

“బాబుగారూ, ఇంట్లో కూచుంటే రోజు గడపక, ఈ చిన్నపల్లెటూరిలో డబ్బు సంపాదించుకునేందుకు మరో మార్గం లేక, మీ ఇంట్లో పనిచేయటానికి వస్తున్నాను. పరాయి ఆడవాళ్లలో సంబంధాలు మీలాంటి గొప్పోళ్లకు సరదాగానూ, సంతోషంగానూ ఉండొచ్చు. మాకవి ప్రాణాంతకం. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అంటారే – అలాగా ఉంది నా పరిస్థితి – ఇంక ఇంతటితో నన్ను మర్చిపొండి. నామీద దయదలచి, నన్నింక వదిలెయ్యండి బాబూ” అని వేడుకుంది.

“నిన్ను వదలను”

“నేను ఇంకోడి భార్యను”

“అందులోనే థ్రిల్ ఉంది. మన ఇలాకా అని తెలిస్తే, ఎవడూ నీ వంక కన్నెత్తి చూడదు. నిన్ను నేను నెత్తిన పెట్టుకుంటాను. నా మాట కాదనకు, ఈ గిప్ట్ తీసుకో” అన్నాడు.

అలివేలు తప్పలేదు. చీర తీసుకెళ్లి పెట్టెలో అడుగున పడేసింది.

చినబాబును పెళ్ళికొడుకును చేసేటప్పుడు అమ్మగారికి అన్నీ అందిస్తూ పక్కనే ఉంది.

ఒక పక్క చినబాబుకి వివాహం అవుతున్నందుకు సంతోషంగా ఉన్న ఆయన మనసు మారనందుకు విచారం గానూ ఉంది. దాని ముఖం మీద ఆనందం, విచారం కలగలిసిన హరివిల్లు.

ఉషారాణి చామన ఛాయగా ఉన్నా కళ గల ముహం. మళ్లీ మళ్లీ చూడాలనిపించే విలక్షణమైన అందం ఆమెది.

చినబాబుకు, ఉషారాణికి హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకు రావటం, ఉషారాణికి పడక గది చూపించడం, నాలుగు రోజులు పోయాక, వెంటతీసుకుపోయి ఊరంతా చూపించటం – అంతా అలవేలు డ్యూటీ అయింది. ఆమెకు కుడిభుజం అయింది.

కొంతలో కొంత సుగుణం ఏమిటంటే, చినబాబు ఉషారాణిని ప్రేమగా చూస్తున్నాడు. ఇది అలివేలుకు ఆశాజనకం అయింది. క్రమంగా భార్య మోజులో పడి తనను మర్చిపోతాడని ఆశించింది.

ఉషారాణి చాలా తెలివిగలది. మనుషులను ఇట్టే అంచనా వేయగలదు. ఎవర్ని ఎలా వంచాలో, ఎంతలోనే ఉంచాలో కూడా ఆమెకు తెల్సు.

భర్త గురించి ఎవరన్నా ఆమెకు చేరవేశారో, లేక ఆమే పసిగట్టిందో తెలియదుగానీ, భర్తను వేయి కళ్లతో గమనించి చూస్తోంది.

“మనిషికి గౌరవం లేకపోయాక, మిగిలినవి ఎన్ని ఉన్నా, ఏమీ లేనట్లే” అని వివరించింది.

“ఈ విలాసాలకు దాసులైన రాజాధిరాజు లెందరో తమ సామ్రాజ్యాలను పోగొట్టుకున్నారు” అని చెప్పింది.

“మనం బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోతే, రేపు మన పిల్లల్ని క్రమశిక్షణతో ఎలా పెంచుతాం?” అని అడిగింది.

“తప్పులు చేయాని వాళ్లు ఎవరూ ఉండరు. తప్పు అని తెల్సినా, దిద్దుకోకపోతే అతడు వివేకవంతుడు అనిపించుకోడు” అని హితోపదేశం చేసింది.

“మనిషిలోని మానసిక బలహీనతే, అన్ని అనర్థాలకూ మూలం. ఆ బలహీనతను జయించలేకపోతే, జన్మ వృథా” అని చెప్పి చూసింది.

ఉషారాణి గర్భవతి అయింది. నెలలు నిండే కొద్దీ ఆమె నిండు నదిలా నెమ్మదిగా నడుస్తోంది. అంతకన్నా నెమ్మదిగా మాట్లాడుతాగింది.

భర్తను దగ్గరకు పిలిచి, పక్కన కూర్చోబెట్టుకునేది. అతను ఆసహనంగా చూస్తుండేవాడు.

“మీలోని ఈ న్యూనతా భావమే, మిమ్మల్ని తలెత్తి సూటిగా చూడలేని నిస్సహాయ స్థితిలోకి నెడుతోంది. నా ముందు సరే. నలుగురి ముందూ మీరు తలొంచుకునే స్థితిలో ఉండకూడదు” అని చెప్పి చూసింది.

పుట్టింటికి పురిటికి వెళ్లేటప్పుడు భర్తతో స్పష్టంగా చెప్పింది.

“నేను ఎక్కడ ఉన్నా, ఎంత దూరాన ఉన్నా, మీ గురించి అన్నీ తెల్సుకుంటూనే ఉంటాను. అంతా సవ్యంగా జరిగితే నేను కొద్ది రోజులలో తల్లిని అవుతాను. తల్లిదండ్రుల నీడలోనే పిల్లలు పెరుగుతారు. మనమే వాడికి ఆదర్శం కావాలి. తండ్రి అని మీరు గర్వంగా చెప్పుకోగలిగితే, పిల్లాడిని చూడటానికి రండి” అని అన్నది.

అన్నగారితో వెళ్లిపోయే ముందు, అలివేలు వంక చూసింది.

అది ఉషారాణి పాదాలను కన్నీటితో కడిగింది

“అమ్మగారూ, మీరు వెళ్లిపోతున్నారు. నాకు బయంగా ఉందండీ” అన్నది.

దాని మూగ మనసులోని బాధను ఉషారాణి అర్థం చేసుకుంది.

రోజులు ఇట్టే గడిచిపోయాయి.

ఉషారాణికి కొడుకు పుట్టాడు. ఆమె అన్నగార్ల సంతోషానికి అంతులేదు.

చినబాబుకు ఆ వార్త ఆనందం కలిగించలేదు. తోటలో గ్లాసులోకి విస్కీ వంచుకుంటూ అలివేలు వంక చూస్తున్నాడు.

“అది ఇంక పిల్లల కోడి అయిపోయింది. దానికింకి పిల్లల్ని సాకటం తోనే తెల్లారి పోతుంది. దాని లోకం వేరు. మన లోకం వేరు” అన్నాడు అలివేలు భుజం మీద చెయ్యి వేస్తూ.

ఆరునెలలు గడిచిపోయాయి. చినబాబు కొడుకును చూడటానికి వెళ్ళలేదు. ఉషారాణి  కొడుకును తీసుకుని భర్త దగ్గరకు రాలేదు. కన్నీరు తుడుచుకుంటోంది.

విషయాలన్నీ అన్నగార్లకు తెల్సిపోయాయి. వాళ్ల ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. దాని అంతు తేలుస్తామంటూ లేచారు.

ఆరోజు అర్ధరాత్రి అలివేలు గుడిసె తగలబడిపోయింది. ఆ మంటల్లో అదీ ఆహుతై పోయింది.

ఆ విషయం తెల్సి ఉషారాణి చలించిపోయింది. అన్నగార్లను మందలించింది.

“నీ జీవితాన్ని నాశనం చేసిన దానిని చూస్తూ ఊరుకోమంటావా?” అని అడిగారు వాళ్లు.

“దాని జీవితాన్ని అదే చక్కదిద్దుకోలేకపోయింది. నా జీవితాన్ని అదేం నాశనం చేయగలడు?” అని అడిగింది.

“అంటే?”

“అది మీకు అర్థం కాదు. పూల మంటలకీ, మంట ల్లోని పూలకీ ఎంతో తేడా ఉంది” అని అంటున్న ఆమె మాటలు వాళ్లకు అర్థం కాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here