చిరుజల్లు-113

0
2

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

శత మర్కటం

[dropcap]రై[/dropcap]లు కాలంలో పోటీ పడి వేగంగా, అమిత వేగంగా పరుగిడుతోంది.

రేవతి కిటికీ దగ్గర కూర్చుని బయటకు చూస్తోంది. చకచకా వెనక్కి తప్పుకుంటున్న కరెంటు స్తంభాలను, ప్రకృతి దృశ్యాలనూ, గ్రామాలనూ నిరామయంగా చూస్తోంది, ఇంకేమీ చేయలేక. ఎవరి మొహాల్లోకి చూడలేక. అటుపక్క సీట్లో, ఒకే సీట్లో ఒద్దికగా ఒదిగిపోయి కూర్చున్న కొత్త దంపతుల వంక చూడలేక.. ఎదురు సీట్లో కూర్చున్న వయసు మళ్లిన జంటను చూడలేక.. దురుగా కూర్చున్న యువకుడి వంక చూడలేక..

ఆ యువకుడు మాత్రం రేవతి వంకే చూస్తున్నాడు. ఆమె క్షణం సేపు అతనివైపు దృష్టి మళ్లించినా, పళ్ళు పదారూ వెళ్ళబెట్టి నవ్వుతున్నాడు. తనవంక చూసి నవ్వేవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లందరికీ దూరంగా, చాలా దూరంగా వెళ్తోంది.. రైల్లో.. అమిత వేగంతో.

“ఎక్స్‌క్యూజ్ మీ. టైం ఎంతయింది?” అని అడిగాడు ఎదురుగా కూర్చున్న యువకుడు.

అతని చేతికి గడియారం ఉంది. అది ఆగిపోయినట్లుంది. తనను అడిగే గడియారంలోని టైం కరెక్ట్ చేసుకోబోతున్నట్లు నటిస్తూ.

ఒంటరిగా ఉన్న ఆడదాన్ని పలకరించటానికి ఎన్ని వేషాలో. అతను పడే తాపత్రయాన్ని తల్చుకుంటే, రోడ్డుమీద కోతులను ఆడించే వాడిని చూసినంత సంతోషంగా, సరదాగా ఉంది.

“అప్ టు వాట్ ప్లేస్ యు ఆర్ గోయింగ్? ఆప్ టు ఢిల్లీ” అని అడిగాడు.

అవునన్నట్లు తల ఊపింది. అతను చేతిలోని పుస్తకం కింద పడేశాడు. దాన్ని తీసుకోబోతూ కావాలనే ఆమెకు చెయ్యి తగిలించే ప్రయత్నం చేశాడు.

నిన్న సాయంత్రం రోడ్డు మీద కోతులాట చూసింది. ‘అమ్మగారికి దణ్ణం పెట్టు’ అంటే, కోతి ఇలాగే పల్టీలు కొట్టి దణ్ణాలు పెట్టింది.

రేవతి అలా తల తిప్పి చూసింది. కొత్త దంపతులు తమ మధ్య గాలిని కూడా చొరబడనివ్వటం లేదు. కొందరు పుట్టుకతోనే అతుక్కుపోయి పుడతారట. వాళ్లను ఎవరూ విడదీయలేరు. వీళ్లు అలాగే ఉన్నారు. ఆమె ఏదో అతనికి మాత్రమే వినబడేటట్లు చెబుతోంది. ఆతను క్లాస్ పాఠం వింటున్న పిల్లాడిలా శ్రద్ధగా వింటున్నాడు.

ఎదురు బెర్త్ మీదనున్న వృద్ధ దంపతులు మాట్లాడుకుంటున్నారు. “పప్పు వారి అబ్బాయికి, నేతివారి అమ్మాయిని ఇచ్చారుట” అన్నాడాయన.

“పప్పు, నెయ్యి, సరిపోయారు ఇద్దరూనూ” అన్నదామె. వాళ్లిద్దరూ ఇంక తమ గొడవలో పడిపోయారు.

ఎదురు సీట్లోని యువకుడు కాళ్లు జాపి, తన కాళ్లను తాకే ప్రయత్నం చేస్తున్నాడు. శతమర్కటం.

రేవతి బయటకు చూస్తోంది. చెట్టూ చేమాతో పాటు ఆమె ఆలోచనలూ వెనక్కి పరుగెత్తాయి.

ఆమె తండ్రి గోపాలరావు సెక్రటేరియట్‍లో జాయింట్ సెక్రటరీగా పని చేస్తున్నాడు. పై సంపాదనకు కొదవ లేనందువల్ల సంపన్న కుటుంబం కిందే లెక్క. ఆయనకు కూతురి మీద ఎనలేని మమకారం. రేవతి ఇంటికి రావటం అరగంట ఆలస్యం అయితే, ఆయన వెతకడానికి బయల్దేరుతాడు. ఆ అమ్మాయికి కాల్లో ముల్లు గుచ్చుకుంటే, ఆయన కుంటుకుంటూ నడిచేవాడు. ఆమెకు జలుబు చేస్తే, ఆయనకు తుమ్ములొచ్చేవి. ఆమెకు జ్వరం వస్తే, ఆయన అన్నం తినటం చూసే మానేసి బ్రెడ్ తినేవాడు. కూతురు మీద అంత ప్రేమ. అల్లారు ముద్దుగా పెంచటం అంటే ఏమిటో ఆయన్న చూసి నేర్చుకోవాలి.

రేవతి చదువు పూర్తి అయ్యాక సంబంధాల వేట ప్రారంభం అయిుంది. అన్నిటిలోకీ బెస్ట్ సంబంధం అనుకొని రఘరాంతో వివాహం జరిపించారు.

రఘురాం చూడచక్కనివాడు. అతి నెమ్మదిగా మాట్లాడుతాడు. ఎంతో అణుకువ, వినయం గల వాడిలా కనిపిస్తాడు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు. సొంత ఊరిలో పొలాలూ, ఆస్తులూ ఉన్నాయి. ఇంతకన్నా ఇంకేం కావాలి? సలక్షణమైన సంబంధం అని ఆ మూడు ముళ్లూ వేయించారు.

ఎన్నో ఆశలతో కోరికలతో పరువాల రాగాలతో కాపురానికి వెళ్లింది.

వైవాహిక జీవితం ఎంత భయంకరమైనదో ఊహలకీ, వాస్తవాలకీ ఎంత వ్యత్యాసం ఉంటుందో ఆమెకు కొద్ది రోజులలోనే తెల్సొచ్చింది.

తన బాధ పగవాళ్లకు కూడా వద్దు. ఆ బాధ ఏమిటో ఎవరితోనూ పెదవి విప్పి చెప్పలేదు. అలా అని మౌనంగా భరించనూ లేదు.

గోముఖ వాఘ్రాలూ, పయోముఖ విషకుంభాలూ ఉంటాయని అంటారు. భర్తలో ఆ లక్షణాలు స్పష్టంగా చూసి ఆశ్చర్యపోయింది.

పుట్టింటికి వచ్చేసింది. మళ్లీ అమ్మా నాన్నా, ప్రేమ, ఆదరణ.. ఇక్కడికి రాగానే వాన వెలిసినట్లు ఉంది. మనసుకు ఎంతో తెలిపిగా ఉంది. “ఏమ్మా, నీ కాపురం ఎలా ఉంది? అతను ఎలాంటి వాడు?” అని అడిగింది తల్లి.

“ఏంటోనమ్మా, నాకేం బాగా లేదు” అని చెప్పింది.

ఇంతకన్నా ఇంకేం చెప్పలేక పోయింది కన్న తల్లికి కూడా. తండ్రికి విషయం తెల్సి, కంగారు పడ్డాడు.

“ఏమ్మా, ఏంటి ప్రాబ్లమ్, డబ్బు ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా?” అని అడిగాడు.

“ఆయన డబ్బు ఖర్చు షెడితే కదా, చాలక పోవటానికి? ఆయనంత పరమ పీనాసి మనిషిని మనం మరెక్కడా చూడలేం. రోజూ రెండు పూటలా బ్యాంకు పాస్‍బుక్ లోని అంకెలు చూసుకొని సంతోషిస్తారు. కాఫీ తాగడు. టిఫిన్ తినడు. బట్టలు కుట్టించుకోడు. నెలకు సరిపడే సరుకులు ఇంట్లోకి తీసుకురాడు. రోజుకూలీ మాదిరిగా ఏ రోజు వచ్చే పై డబ్బులతో బియ్యం, ఉప్పు, పప్పు కొనుక్కొస్తాడు. పొదుపు పేరుతో కడుపు మాడుస్తున్నాడు” అన్నది రేవతి కన్నీరు తుడుచుకుంటూ.

“ఇది సిటీలో పెరిగిన పిల్ల. పైగా చేతికి అడ్డూ, ఆపూ లేకుండా యథేచ్ఛగా ఖర్చు చేయటానికి అలవాటు పడింది. అందుచేత కొంచెం పొదుపుగా ఉండేవాడ్ని చూస్తే అలాగే ఉంటుంది. నాలుగు రోగజులు పోతే అదే సర్దుకుంటుంది” అన్నది తల్లి కూతురు కుటుంబం నిలబెట్టాలనే ఉద్దేశంతో.

“అంతే నంటావా?” అన్నాడు గోపాలరావు.

“ఆ, అంతగాక, ఇంకెంత? ఇలాంటివి చిన్న చితకా సమస్యలు ప్రతి కుటుంబం లోనూ ఉంటూనే ఉంటాయి” అని తల్లి తేలికగా కొట్టిపారేసింది.

కానీ రేవతి తన అసలు సమస్య చెప్పలేదు. ఎలా చెప్పటం?

రైలు ఏదో స్టేషన్‌లో ఆగింది. కొత్త దంపతులలోనుంచి మొగుడు కిందకి దిగాడు. భార్యకు కాఫీ అందిస్తున్నాడు.

ఎదుటి సీట్లో నుంచి శత మర్కటమూ దిగాడు. ప్లాట్‌ఫాం మీద నుంచి రేవతికి కాఫీ అందించాడు.

“అక్కర్లేదు” అన్నదామె. అయినా అతను వినలేదు. తీస్మాండి, తీస్కోండి అని పట్టుపట్టాడు. కోతులాట గుర్తొచ్చిందామెకు. నప్వొచ్చింది. అతని మొహం వికసించింది. రేవతి పర్సులో నుంచి డబ్బు తీసి ఇవ్వబోయింది.

నేను ఇచ్చేసాను అని చెప్పి, ఆమె దగ్గర నుంచి డబ్బు తీసుకోలేదు. ప్రయాణం మళ్లీ మొదలైంది.

మళ్లీ రేవతికి గతంలోకి జారిపోయింది.

రేవతి మాత్రం భర్త దగ్గరకు వెళ్లనని మొండికేసింది. “నీకిదేం పొయ్యేకాలమే” అని తల్లి తిట్టిపోసింది.

“నువ్వు ఎందుకు వెళ్ళనంటున్నావో, నీ ప్రాబ్లం ఏమిటో చెప్పమ్మా, నేను సాల్వ్ చేస్తాను” అని తండ్రి అన్నాడు.

కానీ? – ఎలా చెబుతుంది? నోరు రావటం లేదు.

తండ్రికి ఏమీ చెప్పలేక బావురు మని ఏడ్చింది. అరగంట సేపు వెక్కి వెక్కి ఏడుస్తునే ఉంది.

ఏదో సీరియస్ విషయమే అయి ఉంటుందని ఆయన ఊహించాడు.

“ఇదంతా మీరు చేసిన గారాబం వల్లనే” అని తల్లి కోపంతో చిర్రుబుర్రులాడింది.

తండ్రి రఘురాంని పిలిపించాడు. కూతుర్నీ, అల్లుడినీ దగ్గర చేసేందుకు, వాళ్ళ మధ్య స్పర్ధలు తొలగించేందుకు చేయవలసినదంతా చేశాడు. అతనికి బట్టలూ, బనీన్లూ, డ్రాయర్లు దగ్గర నుంచీ అన్నీ కొని ఇచ్చాడు.

నాలుగు రోజులు సిటీలో సరదాగా తిప్పి, బాధలు మర్చిపోయేలా చేశాడు.

కానీ రేవతి భర్త నుంచి తప్పుకుని, తప్పుకుని తిరగటమే ఆయనకు ఎంతకీ అర్థం కాలేదు.

భర్త నుంచి ఎంతకాలం అయినా దూరంగా ఉండాలని చూసే కూతుర్ని చూస్తుంటే, ఆయనకు బాధగానూ ఉంది. కోపంగానూ ఉంది. కూతుర్ని కోప్పడి అల్లుడితో పంపించాడు.

వారం తిరగక ముందే ఫుట్‍బాల్‌లా వచ్చి పుట్టింట్లో పడిపోయింది.

తండ్రికి కోపం వచ్చింది. స్వయంగా తీసుకెళ్లి అల్లుడి దగ్గర దించివచ్చాడు. “స్కూల్లో దించిన చిన్నపిల్లాడిలా మాటిమాటికీ పారిపోయి రావద్దు” అని గట్టిగా చెప్పాడు.

ఎవరెన్ని చెప్పినా భర్త దగ్గర ఉండలేక పోయింది.

ఈసారి పుట్టింటికి వెళ్లటం లేదు. ఒక ప్రెండు దగ్గరకు వెళ్లింది. మాటిమాటికీ తీసుకెళ్లి భర్తకు అప్పగించని ఒక స్నేహితురాలి దగ్గరకు వెళ్లింది.

రైలు లయబద్ధంగా కుదుపుతుంటే, నిద్రపట్టింది. కలలోనూ అదే దృశ్యం –

తను ఇంట్లో పడుకుని నిద్రపోతోంది. భర్త తాగేసి వచ్చాడు. తాగటానికి మాత్రం డబ్బులు వస్తయి. వచ్చి ఎలుగు బంటిలా మీద పడ్డాడు. ఆమెను వివస్త్రను చేసి నగ్నంగా నిలబెట్టాడు. కాలే సిగరెట్టుతో, తొడ మీద కాల్చాడు. ఆమె కెవ్వుమని అరిచింది. అతును వికటంగా నవ్వాడు. కత్తి మొనతో సుతిమెత్తని శరీరం మీద నెత్తురు కారేలాగా గీతలు గీస్తున్నాడు.

ఆమె బాధతో కేకలుపెడుతోంది. అతనికి సరదాగా ఉంది. నవ్వుకుంటున్నాడు.

ఒళ్లంతా చెమటలు పచ్చేశాయి.

ఉలిక్కిపడి లేచింది. గుండె దడదడలాడింది. బెర్త్ మీద నుంచి దిగి, బాత్ రూంలోకి వెళ్లి మొహం కడుక్కుని వచ్చింది.

కంపార్ట్‍మెంట్ తలుపు తీసి, డోర్ అంచున నిలబడింది. చీకట్లోకి చూసింది. గాలి రివ్వున వీసాగింది.

ఇక్కడ నుంచి దూకేస్తే, సమస్య శాశ్వతంగా పరిష్కారం అయిపోతుంది. ముందుకు వంగింది.

ఎవరిదో చెయ్యి, నడుం దగ్గర పట్టుకుని వెనక్కి లాగింది.

వెనక్కి తిరిగి చూసింది.

శత మర్కటం నవ్వుతున్నాడు. రేవతి నవ్వింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here