Site icon Sanchika

చిరుజల్లు-114

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

ఉగాది కవి సమ్మేళనం

[dropcap]అ[/dropcap]నంతరామయ్య గారి పెద్దమ్మాయి కరుణకు ఆరు నెలల కిందటే పెళ్లి అయింది. మొదటి సంవత్సరం కాబట్టి కూతుర్ని అల్లుడ్ని పండగకు రమ్మని రాశారు. ‘రావటానికి వీలుపడదు. కావాలంటే మీ అమ్మాయిని పంపుతాను’ అంటూ అల్లుడి దగ్గరనుంచి జవాబు రావటంతో అనంతరామయ్య, ఆయన భార్య కనకమహాలక్ష్మీ డీలా పడిపోయారు.

‘అల్లుడికి అంత కోపం తెప్పించే పని ఏం చేశామా?’ అని తర్జన భర్జనలు పడ్డారు. రెండో అమ్మాయి పావని ‘నే కనుక్కుంటాను’ – అంటూ బావగారితో ఫోన్లో మాట్లాడింది.

“రాను అనటానికి కారణం మరేం లేదు. మా ఆఫీసులో ఉగాది నాడు కవిసమ్మేళనం ఏర్పాటు చేశారు. నేను కూడా కవిత్వం చదువుతున్నాను. ఈ ఛాన్స్ వదులుకోలేను” అని చెప్పాడు.

“అంతేనా? మావల్ల ఇంకా ఏం అపరాధం జరిగిందోనని భయపడిపోయాం. అయితే ఉగాది నాడు ఇక్కడ మేం కవిసమ్మేళనం ఏర్పాటు చేస్తాం. రండి” అని పావని చెప్పింది.

మర్నాడు మళ్లీ చెప్పింది.

“మీ కవిత్వం వినాలని పురప్రముఖులంతా ఉవ్విళ్ళూరుతున్నారు. మీ కోసమని ప్రత్యేకంగా కవిసమ్మేళనం భారీఎత్తున ఏర్పాటు చేస్తున్నాం. కనుక మీరు తప్పక రావాలి..” అని.

“భారీ ఎత్తున అంటే?”

“రండి. వచ్చాక మీకే తెలుస్తుంది.” అన్నది పావని.

మొత్తం మీద ఫణీంద్ర వైజాగ్ లోని కవిసమ్మేళనంలో పాల్గొనే ప్రోగ్రాం కాన్సిల్ చేసుకుని, హైదరాబాదులో భారీ ఎత్తున ఎలక్ట్రానిక్ కవరేజ్‌తో ఏర్పాటు చేస్తున్న కవిసమ్మేళనంలో పాల్గొనేందుకు నిర్ణయించుకున్నాడు.

“తప్పమ్మా.. అలా అబద్ధాలు చెప్పి అతన్ని పిలిపించటం ఏమీ బాగాలేదు” అన్నాడు. అనంతరామయ్య పావనితో.

“అబద్ధాలా? అబద్ధాలేంటి? నిజంగానే మన కాలనీలో కవిసమ్మేళనం ఏర్పాటు చేద్దాం. అవన్నీ నేను చూసుకుంటాను. నాకు వదిలెయ్” అన్నది పావని.

ఆ కాలనీలోని కొంతమంది కుర్రాళ్లను పిచ్చి కవిసమ్మేళనం గురించి మాట్లాడింది. “అయితే, చందాలు పోగుచేద్దాం” అన్నారు వాళ్లు. రెండు రోజుల పాటు ఇంటింటికీ తిరిగారు.

సభాధ్యక్షుల్ని ఎవర్ని పెట్టాలి – అని పావని వాళ్ళతో చర్చించింది. ఊరు చివర రిటైరైన తెలుగు మాష్టారు ఒకరున్నారని విన్న పావని కుర్రకుంకలతో వెళ్లింది.

విషయం తెల్సుకున్న ఆయన “నేను తెలుగు మాష్టారినే అయినా ఎప్పుడూ కవిత్వం రాసి ఎరుగను. ఇప్పుడు ఉగాది మీద కొత్తగా కవిత్వం రాయాలంటే కష్టమే” అన్నాడు రాఘవాచారి.

“ఉగాది గురించి తెలియని వాళ్లు లేరు. దాని గురించి కొత్తగా చెప్పవల్సిందీ ఏమీ లేదు. ఇప్పటికే చాలా మంది చెప్పిన కవిత్వం కుప్పలు తెప్పలుగా పడి ఉంది. అందు చేత ఆ కుప్పల్లోంచి కొంచెం ఏరుకుంటే, ఫ్రెష్ కవిత్వం అయిపోతుంది. సో సింపుల్..” అని పావని ఉపాయం కూడా చెప్పి ఆయన్ని ఒప్పించింది.

‘అక్కడికి సభాధ్యక్షుడు ఫిక్స్ అయిపోయారు. ఇంకా నలుగుర్ని పోగు చేస్తే చాలు’ అనుకుంది పావని.

ఎవరి అడిగినా ఎవరూ ఆసక్తి కనబరచలేదు. ఇద్దరు ముసలమ్మలను ఇద్దరు ఎలిమెంటరీ స్కూలు పిల్లల్ని ఒప్పించగలిగారు. ఇన్నాళ్లకు మైక్లు మాట్లాడే ఛాన్స్ వస్తోందని వాళ్లు ‘సరే’ అన్నారు.

ఉగాది రోజు ఉదయం, కరుణ, ఫణీంద్ర వచ్చారు. కుశలప్రశ్నల అనంతరం ఫణీంద్ర కవి సమ్మేళనం గురించి అడిగాడు. “బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాం. ఇంటింటికీ కరపత్రాలు పంచిపెట్టాం. పెద్ద పబ్లిసిటీ ఇచ్చాం” అన్నది పావని.

ఫణీంద్ర తన కవిత్వాన్ని పదేపదే వల్లె వేసుకుంటున్నాడు.

అల్లుడు పండగకు వచ్చినందుకు కనకమహాలక్ష్మి పొంగిపోయింది. పంచభక్ష్య పరమాన్నాలు చేసి వడ్డించిందామె. అల్లుడికి సూటూ బూటూ అంతా సిద్ధం చేశాడు అనంతరామయ్య. ఫణీంద్ర దృష్టి అంతా సాయంత్రం జరగ బోయే కవిసమ్మేళనం మీదనే ఉంది.

సాయంత్రం నాలుగు గంటల కల్లా స్నానపానాదులు ముగించుకొని లాల్చీ పైజమా వేసుకుని, స్ప్రే చల్లుకుని కవికుల తిలక్‍లాగా తయారైనాడు. “భారీ ఎత్తున కవిసమ్మేళనం ఏర్పాటు చేశానన్నావు. ఇంతకీ ఏ హాల్లో ఏర్పాటు చేశావు?” అని అడిగాడు ఫణీంద్ర.

“హాల్ అయితే, అంత దూరం పనిగట్టుకుని ఎవరూ రారు. అందుచేత ఎదురుగా ఉన్న అపార్ట్‍మెంట్స్ పైన ఏర్పాటు చేశాం. మూడు అంతస్తుల పైన.. భారీ ఎత్తున.. అన్నమాట” అన్నది పావని.

“భారీ ఎత్తున అంటే, మూడు అంతస్తులపైన అనా అర్థం?” అని బుర్ర గోక్కున్నాడు ఫణీంద్ర.

“సరే మరి. ఎలక్ట్రానిక్ కవరేజ్ అన్నావు. దాని మాట ఏమిటి?” అని అడిగాడు మళ్ళీ.

“ఎలక్ట్రానిక్ కంటే కరెంటుతో పనిచేసేది ఏదైనా ఎలక్ట్రానిక్ అనే అర్థం. అందుచేత మైక్ పెట్టించాం” అని చెప్పింది పావని.

అయిదు గంటలకు సభాధ్యక్షులు రాఘవాచారి వచ్చాడు. పైకి తీసుకెళ్ళింది పావని. పైన కిష్టిగాడు, రామిగాడు తప్ప మరెవరూ లేరు. కవి సమ్మేళనంలో పాల్గొనబోయే నాగమ్మ, తులసమ్మ వెంటనే రావాల్సిందిగా ప్రకటన ఇచ్చింది.

“ఏమిటి, అసలు జనం ఎవరూ లేరు?” అని అడిగాడు ఫణీంద్ర.

“మైక్ పెట్టాం గదా, వాళ్ల ఇళ్ల నుంచే వింటారు. ఎలక్ట్రానిక్స్ కవరేజ్ అంటే ఇదే మరి.” అని సర్ది చెప్పింది.

చివరకు పావని కుటుంబ సభ్యులు తప్ప అక్కడ ఇంకెవరూ లేరు. ఒక గంట సేపు చూసి, ఇంకెవరూ రారని నిర్ధారించుకుని మొదలెట్టారు. “అమ్మా, నేనేం చేయాలి?” అని అడిగాడు రాఘవాచారి.

“ఏం లేదండీ.. ముందు మీరు చదవండి. తరువాత ఈ నలుగురూ వచ్చి చదువుతారు. మీరు దాన్ని గొప్ప భావస్పోరకంగా ఉందని చెప్పాలి.. అంతే” అన్నది పావని.

పావని మైక్ అందుకుని తొలిపలుకులు పలికింది.

“ఈనాటి కవి సమ్మేళనానికి విచ్చేసిన రసజ్ఞులైన అశేష ప్రజానీకానికి స్వాగతం. ఈనాటి సభకు ప్రముఖ కవి పుంగవులు, ఉభయ భాషా ప్రవీణులు అయిన రాఘవాచారిగారు మేము అడిగినదే తడవుగా ఈనాటి సభకు అధ్యక్షత వహించటానికి అంగీకరించారు. వారు అభినవ శ్రీనాథులు. శ్రీనాథుడు అనేక గ్రంథాలు రాసి పారేస్తే, వీరు కూడా అనేక గ్రంథాలు పారేశారు. ఆ విధంగా వీరు శ్రీనాథునితో సరిసమానులుగా చెప్పవచ్చు.” అని ముగించింది.

ఫణీంద్ర చప్పట్లు కొట్టాడు. కవిసమ్మేళనం ప్రారంభం అయింది.

“ఉగాదితో కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. కొత్త సంవత్సరంలో అందరికీ అన్ని విధాలా మంచి జరగాలని ఆశిస్తూ ఉంటాం. జీవితం మీద కవులకు మక్కువ ఎక్కువ. అందుచేత వారి ఆశావహ దృక్పధాన్ని వెల్లడిస్తూ కవిత్వం చదువుతుంటారు” అని ఆయన ముగించి నాగమ్మ గారిని తమ కవిత్వాన్ని చదవమన్నాడు

ఆమెకు మైక్‍లో మాట్లాడాలన్న చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఆ సంతోషంతో ఆమెకు తెల్పింది చెప్పింది.

“మాకు పెళ్లయిన కొత్తలోను ఒకసారి ఏమైందంటే, నెహ్రుగారు బాపట్ల వచ్చారు. అప్పుడు మా ఆయన నన్ను వదిలేసి నెహ్రుగారితో తిరగటం మొదలుపెట్టారు. అప్పుడు ఆ బాధ తోను కవిత్వం రాశానన్నమాట. ‘పోవుచున్నాడే విభుడు నన్నాదిలి..’ అని పాడుకున్నానన్న మాట..” అని ఆగిపోయింది.

రాఘవాచారి ముక్తాయింపు ఇచ్చాడు. “ఆమె గుండె లోతుల్లో నుంచి పెల్లుబికిన వ్యథా భరిత కవిత మీరు విన్నారు. తర్వాత మాస్టర్ కిట్టు తన కవిత వినిపిస్తాడు” అన్నాడు రాఘవాచారి.

కిట్టు మైక్ పుచ్చుకుని తనకు వచ్చిన పద్యం చదివాడు.

“ఉప్పు కప్పురంబు ఒక పోలికనుండు. చూడ చూడ రుచుల జాడవేరయా. కవులందు సుకవులు వేరయా..” అని ముగించాడు.

రాఘవాచారి కిట్టును అభినందించాడు. “నాయనా కిట్టు మంచి పద్యం చదివావు. కానీ కవులందరిలో సుకపులు వేరయా అంటూ ఎంతో నర్మగర్భంగా ఒక సత్వాన్ని వెల్లడించావు” అని మెచ్చుకున్నాడు.

తులశమ్మ ఒక సినిమా పాట పాడింది.

రెండోవాడు కూడా ఒక పద్యం చదివాడు.

చివరగా విశిష్ట కవి ఫణీంద్ర మన సమాజంలో ఉన్న రుగ్మతలన్నీ తొలగిపోయిన నాడే, అసలైన ఉగాది పండుగ అని కవితలో చెప్పాడు.

అనంతరామయ్య దంపతులు రాఘవాచారికి కొత్తబట్టలు పెట్టి సత్కరించారు.

అంతా అయిపోయాక, ఇంటికి వచ్చాక పావని అన్నది.

“సారీ బావా, నిన్ను పండగకు రప్పించాలనే ప్రయత్నంలో ఏర్పాటు చేసిన కవిసమ్మేళనం ఇది. అనుకున్నంత భారీఎత్తున జరుపలేక పోయాం.”

ఫణీంద్ర విని ఊరుకున్నాడు. రాత్రి భోజనాలు అయ్యాక ఫణీంద్ర మామగారితో అన్నాడు –

“పావనికి సంబంధాలు చూస్తున్నారా?”

“ఎక్కడ, ఈ ఏడే కదా మీ పెళ్లి చేశాం” అన్నాడాయన.

“నా కొలీగ్ ఒకడున్నాడు. అందంగా ఉంటాడు. మీకు ఇష్టమైతే మాట్లాడతాను. ఏమంటావు పావనీ?” అని అడిగాడు.

“కవిత్వం రాసేవాడిని మాత్రం చేసుకోను” అన్నది నవ్వుతూ.

“అతను కథలు రాస్తాడులే.”

“అయితే ఫరవాలేదు”

అనంతరామయ్య ఇప్పట్లో పెళ్లి చేయటం సాధ్యమయ్యే పనికాదని అన్నాడు.

“మీరు నాకిచ్చిన కట్నం డబ్బు బ్యాంక్‍లో అలాగే ఉంది. ఆ డబ్బు పావని పెళ్లిని ఖర్చు చేద్దాం. నా ఫ్రెండ్ ఆదర్శాలకు కట్టుబడి ఉంటాడు. కట్నం తీసుకోడు” అన్నాడు ఫణీంద్ర.

“కవిత్వాల్లో, కథల్లో ఆశయాలు వల్లెవేయడం కాదు. వాటిని ఆచరణలో పెట్టేవాళ్లు నిజమైన కవులు. నా జీవితంలో ఎన్నో ఉగాదులు చూశాను. కాని ఇదే అసలైన ఉగాది” అంటూ ఆనంద బాష్పాలు తుడుచుకున్నాడాయన.

Exit mobile version