చిరుజల్లు-115

0
2

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

సీత చిరునవ్వు

[dropcap]మ[/dropcap]ధ్యాహ్నం పన్నెండు గంటలు కావస్తోంది. సీతారాముల కళ్యాణం జరుగుతోంది. పందిరి నిండా జనం కిటకిటలాడి పోతున్నారు. అశేష జన సమూహం మధ్యలో కూర్చుని వేదిక వైపు చూస్తున్న సీతామహాలక్ష్మి చేతిలోని పేపరుతో నెమ్మదిగా విసురుకుంటోంది.

సీతారాముల కళ్యాణం కడు వైభవంగా జరుగుతోంది. పండితులు వివాహ తంతు జరిపిస్తూ ఉండగా ప్రేక్షకులను రంజింప చేయణం కోసం వ్యాఖ్యాతలు రాముడి గొప్పదనాన్ని కీర్తిస్తున్నారు.

మైక్‌లో వ్యాఖ్యాత అంటున్నారు – “రామకథ తెలుగువాడి జీవితంతో విడతీయలేనంతగా ముడిపడిపోయింది. రాముడు సకల కళ్యాణ గుణాభిరాముడు. రామాయణంలో సమస్త ధర్మాలూ ఉన్నాయి. ముఖ్యంగా మానవ సంబంధాలకు శిరోధార్యం రామాయణ గాథ. మాతృభక్తి, పితృభక్తి, గురుశిష్యుల సంబంధం, భార్యాభర్తల అనుబంధం – ఇవన్నీ ఎలా ఉండాలో మనకు రామాయణం వివరిస్తుంది. రామకథ తెలియని పామరుడు ఉండడు. రామాలయంలేని గ్రామం ఉండదు. శ్రీరామచంద్రుడిది ఒకటే మాట, ఒకటే బాణం. దీనికైనా తిరుగు ఉండచ్చు గానీ రామబాణానికి తిరుగు ఉండడు. సమస్త ధర్మాలకూ ఆయువు పట్టు ఆయన..”

మైక్‌లో వినిపిస్తున్న వ్యాఖ్యానం వింటూ ప్రేక్షకుల మధ్య కూర్చున్న సీతామహాలక్ష్మి చిరునవ్వు నవ్వుకుంది. ఆ నవ్వుకు ఎన్నో అర్థాలు. ఆ నవ్వులో ఆనందం ఉంది. ఆశ్చర్యం ఉంది. వేదాంతం ఉంది. భక్తి ఉంది. అనురక్తి ఉంది. విరక్తి ఉంది.

వ్యాఖ్యాత చెప్పిన దానిలో నిజం ఉంది. రాముడి కథ తెలుగువారి జీవితంతో ముడిపడి పోయింది. ముఖ్యంగా సీత పడిన కష్టాలు ఎంతోమంది మహిళలకు స్వానుభవమే.

ఆనాడు సీత పడిన బాధలు, అవమానాలు, మానసిక క్షోభ, ఈనాటి ఈ సీతామహాలక్ష్మి అనుభవించింది.

ఈ సీతకూ అందం, ఐశ్వర్యం, వినయం, అణుకువ వంటి సద్గుణాలు అన్నీ ఉన్నాయి. కాలేజీకి వెళ్ళినంత కాలం ఇంటి దగ్గర తల దించితే, క్లాసుకి వెళ్లిన తరువాతనే తల ఎత్తేది. అంటే ఎవరిపైనా ఆమె చూపు పడదని అర్థం. ఎవరూ ఆమె కంటికి అనేవారు కాదని అర్థం. సీత చదివినట్లు ఉండేది కాదు. కానీ క్లాస్ ఫస్ట్ మార్కులన్నీ ఆమెకే. అంటే పరీక్షల్లో కాపీ కొట్టేదని కాదు. ఏదైనా ఒకసారి వింటే, ఒకసారి చదివితే చాలు, ఆమె మనసులో చెరగని ముద్ర పడేది అని అర్థం. ఆమె అడగకుండానే, తండ్రి అన్నీ సమకూర్చేవాడు. సహనంలోను, వినయంలోను ఆమెకు ఆమే సాటి. తొందరపడి నోరు జారదు.

పందిట్లో కూర్చున్న సీతామహాలక్ష్మికి భర్త మనసులో మెదిలాడు. ఆయన్ను చాలా కాలంగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నది. అడగలేక పోతున్నది. ఎందుకంటే ఆయన చెప్పబోయే సమాధానం ఏమిటో ఆమెకు బాగా తెల్సు. ఎట్టొచ్చే ఆ సమాధానంతో ఆమె తృప్తి పడడం లేదు.

సీతామహాలక్ష్మి ఐ.ఏ.యస్. పరీక్షలు రాయాలనుకుంది. “నువ్వు కలెక్టరు చేసి, ఊళ్లు ఏలాలా? ఉద్యోగాలు చేయాలా? మనకేం తక్కువని?” అని అడిగింది తల్లి

“నువ్వు.. ఐ.ఏ.యస్. చదవకుండానే, ఉద్యోగం చేయకుండానే, ఊళ్లు ఏం ఖర్మ, లోకాలనే పాలిస్తావు తల్లీ” అన్నాడు తండ్రి. కూతురు మీద అంత ధైర్యం. అంత ధీమా.

శ్రీరామచంద్రమూర్తి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఆయన అన్నాడు, “మా అమ్మాయి ఏ ఇంట్లో కాలుపెడుతుందో ఆ ఇంట్లో వెలుగునిండి పోతుంది” అని.

“మా అమ్మాయి పేరులోనే లక్ష్మి ఉంది. దాన్ని చేసుకున్నవాడి చేతిలో నిత్యం డబ్బు ఆడుతూనే ఉంటుంది.”

“అబ్బాయి బ్యాంకులో క్యాషియర్. తెల్లారి లేస్తే నోట్ల కట్టలు లెక్కపెట్టడమే పని గదా” అన్నాడు మధ్యవర్తి.

సీతామహాలక్ష్మికి, శ్రీరామచంద్రమూర్తికి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. జంట చూడ ముచ్చటగా, కన్నుల పండుగగా ఉందని అందరూ అంగీకరించారు.

రాముడు భార్య వంక చూశాడు. మెడ నిండా మల్లెపూల దండలతో నిండి ఉన్న సీత సిగ్గుతో చిరునవ్వు నవ్వింది – అర్ధనిమీలిత నేత్రాలతో, ఆమె చిరునవ్వు ముందు తెల్లని మల్లెపూల దండలన్నీ వెల తెలబోయాయి.

రాముడు మితభాషి. మాటలూ, పాటలూ, ఆటలూ – అన్నీ తక్కువే. అయినా ఆయన ఆడని మాటలు, పాడని పాటలు, ఆడని పాటలు – అన్నీ కడు రమణీయంగా ఉన్నట్లు అనిపిస్తాయి సీతకు.

పెళ్లి అయిన రెండు నెలలకే రాముడికి ప్రమోషన్ వచ్చింది. ఆయనకు అంత తొందరగా ప్రమోషన్ రావడం వెనుక, సీత తండ్రి అదృశ్య హస్తం ఉందన్న విషయం ఎవరికీ తెలియదు.

“సీత అదృష్ట జాతకురాలు” అన్నారు అందరూ.

ఇంత ఆనందంలోనూ చిన్న అపశృతి ఏమిటంటే, శ్రీరామచంద్రమూర్తికి ప్రమోషన్ ఇచ్చి మణిపూర్ లోని ఓ మారుమూల ప్రాంతానికి బదిలీ చేశారు.

“అమ్మో, అంత దూరమా?” అన్నారు అందరూ.

“కర్తవ్య నిర్వహణ కోసం కారడవులలోకి అయినా వెళ్తాను” అన్నాడు రాముడు.

“పోనీ సీతను ఇక్కడ ఉంచెయ్. చిన్నపిల్ల. మన భాష కాదు. మన ప్రాంతం కాదు. దేశం కాని దేశంలో ఒక్కర్తీ ఎలా ఉంటుంది?” అన్నారు కొందరు.

సీత మాత్రం తాను వెళ్తానని పట్టుబట్టింది.

“వివాహం చేసుకున్నాక, ఇప్పుడింక మీరే నా ప్రపంచం. నా కలల్లో, కళ్ళల్లో ఎప్పుడూ మీరే మెదులుతుంటారు. అగ్నిహోత్రం చుట్టూ మీ చిటికిన వేలు పట్టుకుని తిరిగినప్పటి నుంచీ ఇంక మీ అడుగులోన అడుగువేసి నడవటమే నాకు అలవాటు అయింది” అన్నది సీత రాముడితో.

ఆమె ఆంతర్యం తెల్సుకుందామని అన్నాడు గానీ, ఆమెను చూడకుండా రాముడు ఉండలేడు. ఆ విషయం అతనికి తెల్సు. ఇద్దరూ బయల్దేరారు.

కలకత్తా నుంచి రెండు రోజుల ప్రయాణం. కొంత దూరం రైలు, కొంత దూరం బస్సు, కొంత దూరం బండి. ఎంతో శ్రమపడి చివరకు ఆ ఊరు చేరుకున్నారు.

బ్యాంక్‌లో పని చేసేవాళ్లు అంతా కలిపి అరడజను మంది కన్నా ఎక్కువ లేరు.

శ్రీరామచంద్రమూర్తికి, సీతామహాలక్ష్మికి బ్యాంక్ సిబ్బంది స్వాగతం చెప్పారు. రెండు రోజుల్లో ఇల్లు చూసి పెట్టారు. ఆ ఇల్లు విసిరేసినట్టు కొంచెం దూరంగా ఉన్న ఎత్తు అయిన ప్రదేశంలో ఉన్నందున చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాలతో ఎంతో అందంగా ఉంది.

“ఇట్లు ఎలా ఉంది?” అని అడిగాడు రాముడు.

“బావుంది. కానీ, ఎదురుగా ఈ కొండలు కాకుండా, ఇళ్లు, మనుష్యులూ ఉంటే బావుండేది” అన్నది సీత.

“చుట్టూ ఇళ్లు, మనుష్యులూ ఉంటే మీ ఆయన్ని వలలో వేసుకుందామని చూసే వాళ్లు ఉంటారు. ఇప్పుడు నీకా భయం లేదు” అన్నాడు రాముడు నవ్వుతూ.

“నాకా భయం ఎప్పుడూ లేదు. భార్యాభర్తలకు ఒకరి మీద మరొకరికి కొండంత నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్నప్పుడు, ఎంత దూరాన ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, శంకించాల్సిన పని లేదు” అన్నది సీత.

రెండు మూడు నెలలు గడిచాయి. శ్రీరామచంద్రమూర్తి ఉదయమే వెళ్ళిపోయేవాడు. సాయంత్రం వచ్చేవాడు. ఇంట్లోకి అవసరమైన సదుపాయాలన్నీ ఇంకా పూర్తిగా అమరలేదు.

ఒకరోజు మధ్యాహ్నం ఇంటిముందు కారు ఆగింది. అందులోనుంచి డ్రైవరు దిగి, సీతను సమీపించాడు. కారులో ఉన్న ఆయన ఆ ప్రాంతంలో చాలా పలుకుబడి గల కాంట్రాక్టర్ దశకంఠం. ఆయనకు బాగా దాహంగా ఉందిట. మంచినీళ్లు కావాలని అడిగాడు. మంచినీళ్లు తెచ్చేటప్పటికి దశకంఠం వరండా లోనికి వచ్చాడు.

ఆమె చెయ్యి పట్టుకొని లాక్కుపోయి కార్లోకి నెట్టేశాడు. కారు రయ్‍మని దూసుకు పోయింది.

సాయంత్రం రాముడు ఇంటికి వచ్చాక గానీ సీతను ఎవరో కిడ్నాప్ చేసిన విషయం తెలియలేదు.

రాముడి గుండె గుభేల్‌మంది. తన సీతను ఎవరో ఆపహరించారన్న విషయాన్ని భరించలేక పోతున్నాడు.

బ్యాంక్‌లో పనిచేసే ఇతర ఉద్యోగుల ఇళ్ళకు పరుగెత్తాడు. వాళ్లు కంగారు పడ్డారు. పోలీసు స్టేషన్‌కి వెళ్లి కంప్లయింట్ ఇచ్చారు. పోలీసులకు ఇలాంటి కేసులు చాలా మామూలు అక్కడ.

నాగరికతకు బహు దూరంగా ఉన్న ప్రదేశం. సీతను ఎవరు ఎత్తుకు పోయారో అనుమానం ఏమన్నా ఉందా అని అడిగారు. రాముడివైపు వాళ్లు, సీతవైపు వాళ్లు అందరూ రంగం లోకి దిగారు. ఢిల్లీ నుంచి ఇంఫాల్ దాకా ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా ఒక కుదుపు కుదిపాక చివరకు ఆచూకీ తెల్పింది.

దశకంఠుడి బంగాళాలో బందీగా ఉన్న సీతను కనుగొన్నారు. ఎట్టకేలకు ఆమెను విడిపించారు.

కిడ్నాప్ జరిగిన మర్నాడే దశకంఠుడు బాత్‍రూమ్‍లో కాలు జారి పడ్డాడు. తొంటి ఎముక విరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అందుచేత అతన్ని వెంటనే కోర్టుకు రప్పించే అవకాశం లేదని చెప్పారు పోలీసులు.

ఇంత జరిగాక –

రాముడికి ట్రాన్సఫర్ అయింది. మళ్లీ వచ్చి అందరి మధ్యలో పడ్డారు. కానీ రాముడి మనసులో చిన్న అనుమానం పట్టి పీడిస్తోంది.

ఒక రోజు రాత్రి సీత రామున్ని అడిగింది – “ఏదైనా జరగకూడనిది జరిగి ఉంటే, నేను ఆ రోజే తల నేలకేసి కొట్టుకుని అక్కడి అక్కడే చనిపోయి ఉండేవాన్ని. ప్రాణం కన్నా శీలం గొప్పదని నమ్మే సంస్కృతి గల స్త్రీ జాతికి చెందిన దాన్ని. నా మీద అనుమానం కలగటమే నన్ను వేధిస్తోంది.”

“నాకు నీ మీద ఎలాంటి అనుమానమూ లేదు సీతా. కానీ లోకం.. నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారు. రకరకాల పుకార్లు పుట్టిస్తారు”

“లోకులు కాకులు గదా. ఆ కాకిగోలను నేను లెక్కచేయను. మీరు నమ్మనంతకాలం..” అంటున్న సీతను రాముడు అక్కున చేర్చుకున్నాడు.

పందిట్లో సీతారాముల కళ్యాణం కడు వైభవంగా జరుగుతుంది. వ్యాఖ్యాత చెబుతున్నాడు –

“సీతాదేవికి భూవేవి అంత సహనం. ఆ మహాతల్లి చల్లని చూపులే మనకు శ్రీరామరక్ష. సీతమ్మ తల్లి నిత్యకళ్యాణం జరిపించుకునే కొత్త పెళ్ళికూతురు..”

రాముడికి ఆరునెలల్లో రెండు చోట్లకు బదిలీ అయింది. ప్రస్తుతం సీత పుట్టింట్లోనే ఉంటోంది. ఆమె కిప్పుడు ఎడబాటు బాగా అలవాటు అయింది.

రాముడ్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటోంది.

‘నేను మీకు దూరమైనప్పుడు నా శీలం మీద మీకు అపనమ్మకం ఏర్పడింది. దాన్ని లోకుల మీద నెట్టారు. కానీ రామా.. నేను మీకు దూరంగా ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు నాకు దూరంగానే ఉన్నారు. మీ మీద నాకు ఎందుకు అపనమ్మకం కలగలేదు – అని అడగాలని ఉంది.’

రాముడి సమాధానం ఏమిటో సీతకు తెల్సు.

“లోకులు కాకులు..”

వ్యాఖ్యాత మైక్‍లో చెబుతున్నాడు –

“రాముడు, మన దశరథ రాముడు, అయోధ్య రాముడు, కష్టాల కడలిని దాటించి ఆవలి ఒడ్డుకు చేర్చే పరంధాముడు. మనకున్న ఏకైక దేవుడు.. మహామునులు సైతం ఎవరి పాదధూళి కోసం పరితపించారో అటువంటి పరమ పావనమూర్తి..”

భక్తుంతా చేతులెత్తి నమస్కరిస్తున్నారు. సీత కూడా నమస్కరించింది.

వెనుదిరిగింది. ఎందుకో సీత చిరునవ్వు చిందించింది.

ఆ నవ్వుకి ఎన్నో అర్థాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here