చిరుజల్లు 12

0
2

డాక్టర్లు మనకు చెప్పరు గానీ…

[dropcap]ఆ[/dropcap]మె ఎనభై ఏళ్ల వృద్ధురాలు. ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ. ప్రతి నెలా అన్ని రకాల వైద్య పరీక్షలూ చేయించుకొని, డాక్టరు సలహా తీసుకుంటుంది. రెండు పెద్ద కాగితాల మీద ముప్ఫయి, నలభై ప్రశ్నలు రాసుకొని వెళ్తుంది. ఒక్కొక్క ప్రశ్నే వేసి, బి.పి, షుగరు, హిమోగ్లోబిన్, ప్లాటిలెట్ ఎంత ఉండాలి, ఎంత ఉన్నది, దానికి ఏం చెయ్యాలి అంటూ ఒక గంట సేపు డాక్టర్ని అడుగుతుంది. అవన్నీ నేను చూసుకుంటాను, అవసరమైన సలహాలు చెబుతానని ఆయన చెప్పినా, ఆమెకు తృప్తి ఉండదు. అందుచేత, ఈసారి ఆమె వచ్చినప్పుడు ఏదో రకంగా మాయ చేసి, ఆమె హ్యాడ్ బ్యాగ్‌లో నంచి ఆ కాగితాలు తీసి దాచెయ్యమని డాక్టరు నర్సుకు చెప్పాడు. నర్సు తెలివిగా ఆమె బ్యాగ్‌లో నుంచి ఆ కాగితాలు తీసేసి, డాక్టరుకు సైగ చేసి చెప్పంది. డాక్టరు తన టైం వృథా కానందుకు లోలోపల సంతోషించాడు. కానీ ఆయన సంతోషం ఎంతో సేపు నిలవలేదు. ఆమె హ్యాండ్ బ్యాగ్‌లో ఆ కాగితాలు కనపడకపోయేటప్పటికి, “ఏదో ఒక రోజు ఇలా జరుగుతుందనే, ఇంకో కాపీ రాసి పెట్టుకున్నాను” అంటూ జాకెట్ నుంచి రెండు కాగితాలు తీసి, ప్రశ్నల పరంపర మొదలు పెట్టింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, డాక్టరు దగ్గరకు వెళ్లే ప్రతి రోగీ తన ఆరోగ్య పరిస్థితి గురించి, పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ డాక్టర్లకు అంత సమయం ఉండదు. క్లినిక్‌లో ఆయన రోజుకు రెండు గంటలు ఉంటాడు. ఇరవై మంది రోగులు ఎదురు చూస్తూంటారు. అందు చేత ఒక్కొక్కరికి అయిదు నిముషాల కన్నా ఎక్కువ సమయం కేటాయించలేడు. రోగి తన ఆరోగ్యం గురించి పూర్తిగా చెప్పేలోపలే, ఆయన మందులు రాసేసి కాగితం చేతిలో పెట్టేసి, తరువాత పేషంటును పంపిచమని బెల్ కొట్టేస్తాడు. ఆయన బాధ ఆయనది.

ఇందులో రెండు రకాల డాక్టర్లు ఉంటారు. సీనియర్ డాక్టర్లు, జూనియర్ డాక్టరు. సీనియర్ అపాయింట్‌మెంట్ కావాలంటే వారం పది రోజులు ఆగాలి. ఈ లోగా రోగి ఏమవుతాడో తెలియదు. ఒక పేషెంటు ఒక డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. ఆయన ఇచ్చిన మందులు వేసుకున్నాడు. జబ్బు ఎక్కువైంది. పేషంటు ఇంకో డాక్టరు దగ్గరెళ్లాడు. ఆయన ఇచ్చిన మందులు వేసుకున్నాడు. మరీ ఎక్కువైంది. సీనియర్‌లలో ఎక్స్‌పర్ట్ డాక్టర్ అపాయింట్‍మెంటు తీసుకున్నాడు. పది రోజుల తరువాత రమ్మన్నారు. రోగి ఆ రోజు కోసం ఎదురు చూడటం మొదలెట్టాడు. తీరా ఆ రోజు వచ్చేటప్పటికి రోగికి జబ్బు తగ్గిపోయింది. ఇలాంటి సందర్భాలూ ఉంటాయి.

డాక్టర్లు కూడా పొరపాట్లు పడుతుంటారు. ఒక కంటికి చేయవల్సిన ఆపరేషన్ మరో కంటికి చేస్తుంటారు. ఒక కాలికి చేయవల్సిన ఆపరేషన్ మరో కాలికి చేస్తుంటారు. ఇందుకు అనేక రకాల కారణాలు ఉండొచ్చు.

ఆపరేషన్ అవసరమైనప్పుడు, రోగి సెకండ్ ఒపీనియన్ తీసుకోవటమూ మంచిదే. ఒక డాక్టర్ ఆపరేషన్ అవసరం అని చెబితే, ఇంకొక డాక్టరు అసలు అవసరం లేదనో, ఇప్పుడే అవసరం లేదనో చెప్పవచ్చు. ఇటీవల కొన్ని ప్రైవేటు ఆస్పత్రులలో ప్రతి డాక్టరు నుంచీ, హాస్పటల్‌కి ఇన్ని లక్షల రూపాయల ఆదాయం రావాలని లక్ష్యాలను నిర్ణయిస్తున్నట్లు వింటున్నాం. అలాంటి చోట్ల డాక్టర్లు ఏదీ పూర్తిగా చెప్పరు. అవసరం లేకున్నా అనేక రకాల వైద్య పరీక్షలు చేయిస్తారు. ఆపరేషన్లూ చేస్తారు. కంటికీ, గుండెకీ, కొన్ని ఆపరేషన్లు చేసినప్పుడు కొన్ని పరికరాలను ఇంప్లాంట్ చేస్తారు. వాటి కరెక్ట్ ధరలు పేషంట్లకు చెప్పరు. ఫారెన్ పార్ట్స్ అంటూ రెట్టింపు ధరలు బిల్లులో వేస్తారు. డాక్టర్లు బిల్లుల విషయంలో ఉన్నన్ని జోకులు అన్నీ ఇన్నీ కావు. “ఆపరేషన్ ఆయ్యాక నువ్వు నడుచుకుంటూ ఇంటికి వెళ్లొచ్చు” అని డాక్టర్ అంటే, “బిల్లు కట్టటానికి నా కారు అమ్మోయ్యాలన్న మాట” అని రోగి అనుకుంటాడు.

ఒక డాక్టరు అందమైన ఆమెను ప్రేమించాడు. మరి ఆమెను పెళ్లి చేసుకోవచ్చుగదా అంటే – ఆమె నా పేషెంటు, ఆమె డబ్బుతోనే హాస్పటల్ కట్టాను – అందుకనే ఆమెను పెళ్లి చేసుకోవటానికి వీలు పడలేదని అంటాడు పాపం ఆ డాక్టరు.

ఆపరేషన్ సక్సెస్ అయినా పేషంటు చనిపోయే ప్రమాదం ఉంది. కొన్ని హాస్పటల్స్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ల జీతాలు భరించలేవు. అందుకని అవసరమైనప్పుడు మాత్రమే ఆయన్ను పిలిపించి, ఆపరేషన్ చేయిస్తారు. కానీ తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోనందువల్ల పరిస్థితి విషమించవచ్చు.

పేషెంట్ బతకడని తెల్సినా, డాక్టర్లు ఫిఫ్టీ,ఫిఫ్టీ చాన్స్ ఉందని చెబుతారు. ప్రాణం మీద మనిషికి ఉన్న మమకారం వల్ల ఆపరేషన్ చేయమంటాడు. రిజల్టు తెల్సిందే. పేషెంటు చనిపోయిన ప్రతిసారీ, అతని తాలుకు బంధువుల, ఏడ్పులు వినలేరు – డాక్టర్లు కూడా.

ఒక పెద్ద మనిషి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేయక తప్పనిసరి పరిస్థితి. కానీ రెండు మోకాళ్లలోనూ నొప్పి వల్ల నడవలేని స్థితిలో ఉన్నాడు. ఆపరేషన్ చేయించుకున్నాడు. ఫిజియోథెరపీ కూడా చేయించుకొని నడవటం మొదలు పెట్టాడు. నెల రోజుల తరువాత అతని ఆరోగ్యం మళ్లీ దెబ్బతిని ఒక పక్క పక్షవాతం వచ్చి మంచం దిగలేకపోయాడు. అతని కుటుంబం అటు ఎన్నికల కోసం, ఇటు ఆరోగ్యం కోసం చాలా డబ్బు ఖర్చు చేసినా, చివరకు ప్రయోజనం లేకపోయింది.

ఒక పెద్ద హాస్పిటల్‌లో ఒక పేరు మోసిన సర్జన్ బైపాస్ ఆపరేషన్ చేస్తున్నాడు. రక్తస్రావాన్ని ఆపటం కోసం డాక్టర్ క్లాంప్ ఇవ్వమని అడిగాడు. నర్స్ పొరపాటున కత్తెర ఇచ్చింది. రెండూ ఒకేలా ఉంటాయి. డాక్టరు ఆ నరాన్ని కత్తిరించేశాడు. రోగి చనిపోయాడు. ప్రతి డాక్టరు జీవితంలోనూ మరుపురాని సంఘటనలు ఎన్నో ఉంటాయి.

డాక్టరు – రోగి సంబంధాలు వినియోగదారుల పరిరక్షణ చట్టం పరిధిలోకి వస్తాయని, సుప్రీం కోర్టు 1995లో ఒక తీర్పు చెప్పింది. అప్పటి నుంచి కేసులూ పెరుగుతున్నాయి. డాక్టర్ నిర్లక్ష్యం వల్ల రోగి చనిపోయాడంటూ రోగికి చెందిన వ్యక్తులు హాస్పటల్స్ మీద దాడి చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి సంఘటనల వల్ల డాక్టర్లూ, హాస్పటల్స్ అప్రతిష్ఠ పాలయ్యే అవకాశం ఉంది.

డాక్టర్ల సంగతి కాసేపు పక్కన పెడితే, ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి మీదా ఉంది. కానీ మనం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నామో గదా. ఎక్కువ గంటల సేపు కంప్యూటర్ ముందు కూర్చుని పని చేయటం వల్ల చాలా మంది యువకులు అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఎంత చేసినా ఇంకా మెప్పు పొందలేకపోతున్నామన్న మానసిక ఒత్తిడి రోగాల పాలు చేస్తోంది. ఇక సెల్ ఫోన్లు విషయం చెప్పనవసరం లేదు. దాని వల్ల రేడియోషన్ ప్రభావానికి గురి అవుతున్న పట్టించుకునేవారే లేరు. పైగా కారు నడుపుతూ మెసేజ్‌లు పంపుతూ యాక్సిడెంట్స్ చేసేవారూ ఉన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, ధూమపానం చాలక ఇప్పుడు డ్రగ్స్ విస్తారంగా విజృంభిస్తున్నయి.

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు గానీ, ఇప్పుడు భాగ్యం అంటే డబ్బు కోసం ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న సందర్భాలే ఎక్కువగా కనిపస్తున్నాయి. డబ్బు ఉన్న వాడిని చూసి కొంత మంది ఈర్ష్య పడుతారు. కానీ ఆరోగ్యంగా ఉన్న వాడిని చూసి ఎవరూ ఈర్ష్య పడరు. డబ్బు ఉన్న రోగిష్టి వాడి కన్నా, ఆరోగ్యంగా ఉన్న బీదవాడే గొప్పవాడు. రోగిష్టి వాడు తన దగ్గరున్న డబ్బు అంతా ధారపోసినా ఆరోగ్యాన్ని కొనలేడు.

నిజమైన అదృష్టవంతుడు ఎవరంటే, రోగాలతో బ్రతికేవాడు కాదు, ఆరోగ్యంగా బ్రతికేవాడు. జీవించియున్నంతకాలం, శరీరాన్ని ఆరోగ్యంగానూ, ఆనందంగానూ ఉంచుకోవటం ప్రతివాడి నైతిక బాధ్యత. ఏదో ఒక రకమైన ఆనందం పొందాలని కల్తీ సారా తాగి చనిపోవటం కాదు. వ్యాధులను, ప్రమాదాలను తరిమికొట్టేందుకే తరతరాలుగా ఎన్నో పద్ధతులనూ సాంప్రదాయాలనూ ప్రవేశపెట్టారు.

శరీరం, మెదడు – ఈ రెండూ ఒక దాని మీద అధారపడి మరొకటి మనగలుగుతున్నయి. శరీరమే నేను అనే భావన. కనుక ఈ నేను అనే శరీరం యొక్క ప్రభావాన్ని వెలిగించేది మనసే. అలా అని పూర్తిగా మనసే గొప్పది అని చెప్పలేం. శరీరం లేనిదే మనసు లేదు.

శరీరం దృఢంగా ఉంటే సగం వరకూ ఆరోగ్యంగా ఉన్నట్లే. మరి మనసూ ధృడంగానే ఉండాలి. శరీరం బలంగా ఉండటానికి అవసరమైన ఆహారం, నిద్ర, విశ్రాంతి, వ్యాయమం – అన్నీ తగు మాత్రంగా ఇవ్వాలి. వయసు పెరిగే కొద్దీ శరీర బలం తగ్గిపోతుంటుంది. కానీ మనసు దృఢంగా ఉంటే కొంత వరకూ సమస్య తీరినట్లే. శరీరం యంత్రంలా పని చేస్తూనే ఉంటుంది. సుఖ జీవనానికి అన్న వస్త్రాలు ఎంత అవసరమో, విశ్రాంతి వినోదమూ అంతే అవసరం.

జీవన ప్రమాణాలు పెరిగాయి. మనిషి సగటు జీవితకాలం ఇది వరకటి కన్నా పదేళ్లు పెరిగింది. వైద్యరంగంలో రోజు రోజుకీ ఎన్ని కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయో, అన్ని రకాల వైద్య సదుపాయాలు చికిత్సలూ వస్తున్నయి.

ధూమపానం, వ్యాయామం, అహారనియమాల విషయాలతో పాటు ప్రేమాభిమానాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరి ప్రేమకూ అభిమానానికీ నోచుకోని మనిషి, మానసికంగా దిగులు చెందుతున్నాడు. వ్యాధిగ్రస్థుడవుతున్నాడు. ఈ విషయాన్ని డాక్టరు ఎప్పుడూ ఏ పేషెంటుకీ చెప్పరు. “నీ భార్య నిన్ను బాగా చూస్తుందా?”, “నీ భర్త నిన్ను ప్రేమగా చూస్తాడా?” అని ఏ డాక్టరూ అడగడు. కానీ ఈ కోణంలో అలోచించటమూ అవసరమేనని ఇటీవల పరిశోధనలు తెలియజేస్తున్నయి. ఇవన్నీ మనిషి మనోవేదనకి సంబంధించిన అంశాలు. వీటి ప్రభావం ఆరోగ్యం మీద గణనీయంగా ఉంటుంది. ఈ వేదనలే గుండె జబ్బులకీ దారి తీస్తున్నయి. కుటుంబ సభ్యులతోను, ఇరుగు పొరుగు వారి తోనూ మనిషికి గల అనుబంధం యొక్క ప్రభావం అతని ఆరోగ్యం మీద పడుతుంది.

గుండె అనేది ఒక పంపింగ్ పరికరము మాత్రమే కాదు. దానికి మరో పేరు హృదయం. ప్రేమ, దయ, కరుణ వంటి అనేక అంశాలు ఈ హృదయానికి సంబంధించినవే. గుండె జబ్బులున్న వారికి మందులు అవసరమే. వాటితో పాటు వారి జీవన విధానంలోనూ మార్పు రావాలి. కానీ ఇవన్నీ చెప్పేందుకు డాక్టర్లకు సమయం చాలదు. గుండె రక్తాన్ని పంపు చేసే యంత్రం అయితే, డాక్టరు ఆ యంత్రం సరిగా పంపు చేస్తోందో లేదో చూసే ఒక పంబ్లర్. ఒక టెక్నీషియన్. ఆధ్యాత్మిక కోణం అక్కడ ఉండదు. కానీ అదీ అవసరమే.

ఉద్యోగరీత్యా గానీ, మరో కారణంతో గానీ, ఏడాది, రెండేళ్లకోసారి ఒక ఊరి నుంచి మరో ఊరికి మారిపోతుంటారు. అప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలు, పరిచయస్థులు మారిపోతుంటారు. ఉద్యోగం మారితే, ఆఫీసులోని పరిచయస్థులూ మారిపోతుంటారు. దీని ప్రభావమూ మనసు మీద ఉంటుంది. ప్రవర్తన, ఆలోచన అవసరాలూ అన్నీ మారిపోతుంటాయి. మానసిక ఒత్తిడికి ఇవి కారణాలే.

నయం చేయటం, చికిత్స చేయటం రెండూ ఒకటి కాదు. ఒంట్లో బాగుండక పోవటం, వ్యాధి రెండూ ఒకటి కాదు. నొప్పి, బాధ రెండూ ఒకటి కాదు. ఈ వ్యత్యాసాల గురించి డాక్టర్లు మనకు చెప్పరు. ఎవరూ చెప్పరు.

నయం చేయటం అంటే మానసిక ఉద్విగ్నతను, ఉన్మాదాన్ని తగ్గంచటం. చికిత్స చేయటం అంటే, ఒక రోగానికి మందు ఇవ్వటం. పరిసరాల, లేదా ఇరుగు పొరుగు వారి ప్రవర్తన వల్ల ఒంట్లోనూ, మనసులోనూ బాగుండదు. దిగులుగా, విచారంగా ఉంటుంది. కానీ అది వ్యాధి కాదు. ఇక నొప్పి అంటే శరీరం ఏ రాయికో, గోడకో కొట్టుకుంటే వచ్చేది నొప్పి. బాధ మనసుకు సంబంధించినది.

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నాజీ క్యాంపులలో చాలా మందిని బంధించి యుంచారు. వారిలో చిన్న వయసులో ఉన్నవారే ఎక్కువ మంది చనిపోయారు. వృద్ధాప్యంలో ఉన్నవారు కష్టాలను తట్టుకొని నిలువగలిగారు. కష్టాలను తట్టుకోగల శక్తి, సామర్థ్యం లేనందు వలననే పిన్న వయస్కులు మరణించారు. ప్రేమ విఫలమైందని ఆత్మహత్యలు చేసుకునే వారంతా యువతీ, యువకులే. ప్రేమించిన భార్య గానీ, భర్త గానీ చనిపోయినా వయసు మళ్లిన వారెవరూ ఆత్మహత్యలు చేసుకోరు. కనుక మనసుకీ, శరీరానికీ ఉన్న సంబంధం బలమైనది. డాక్టరు శరీరానికి చికిత్స చేస్తారు. ఎక్కడో మానసిక రోగులకు తప్ప. మిగిలిన వారి మానసిక పరిస్థితిని మామూలు డాక్టర్లు పట్టించుకోరు. ఎవరికి వారే శ్రద్ధ వహించాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here