చిరుజల్లు-120

0
2

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

నల్ల పిల్ల

[dropcap]ఆ[/dropcap] వేళ సాయంత్రం రేఖ ఒక రిసెప్షన్‌కి వెళ్లాలి. ఇంటికి వచ్చేంత టైం ఉండదు. కనుక ఆఫీసు నుంచి అటే వెళ్లాలనుకుని కొత్త చీర కట్టుకుని ఆఫీసుకు వెళ్లింది.

ఆమె సీట్‌లో కూర్చోగానే ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు కొలీగ్స్ వచ్చారు. “ఏమిటి విశేషం” అని అడిగారు. డార్క్ కలర్ శారీ ఆమెకు బాగా నప్పిందని అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు

“నిజం చెప్పండి. నేను నల్లగా ఉంటాను కదా. నాకీ స్నఫ్ కలర్ సూట్ అవుతుందా?” అని అడిగింది రేఖ.

“మీరు నల్లగా ఉంటారని ఎవరైనా ఉంటే, వాళ్ళను దృష్టిలోపం ఉన్నట్లే లెక్క” అన్నది జయంతి.

“నలుపూ తెలుపూ అని కాదు. వయసులో ఉన్నప్పుడు అందరూ అందంగానే ఉంటారు. వార్ధక్యంలో ఆ అందం రూపు మారిపోతుంటుంది” అన్నది శ్రీదేవి.

ఇంతలో రేఖకు ఫోన్ వచ్చింది.

“రేఖా, నేను ఫణిభూషణ రావుని..”

“మీరా మామయ్యగారూ.. ఎప్పుడొచ్చారు? ఎక్కడున్నారు?” అని అడిగింది రేఖ.

“ఉదయమే వచ్చాను. లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లో ఉన్నాను. మీటింగ్ ఉంది. ఒంటి గంటకు మీటింగ్ అయిపోతుంది. రెండు గంటలకు మీ ఇంటికి వస్తాను. సాయంత్రం చెన్నయ్ వెళ్ళాలి. ఇంత దూరం వచ్చాక మిమ్మల్ని చూడకుండా వెళ్లటం బాగుండదు కదా. లంచ్‌కి మీ ఇంటికి వస్తాను. వేణుకు కూడా చెప్పు..” అన్నాడు ఫణిభూషణ రావు.

“మీ అబ్బాయి ఊళ్లో లేరు. క్యాంప్‌లో ఉన్నారు. మీరు లంచ్‌కి రండి. నేను వెయిట్ చేస్తుంటాను” అన్నది రేఖ.

“సరే” అన్నాడాయన.

రేఖ మనసంతా వికలమై పోయింది. నిశ్చలంగా ఉన్న కొలను లోకి బండరాయిని దొర్లించినట్లు ప్రశాంతంగా ఉన్న మనసు, ఆయన రాకతో అనేక ఆలోచనలతో కలవరపడింది.

సమయానికి ఆయన ఊళ్ళో లేరు. వేణు ఉంటే తండ్రీ కొడుకులు ఏం మాట్లాడుకునే వాళ్ళో, వాళ్ళే చూసుకునేవాళ్లు. ఇప్పుడు తను ఏం మాట్లాడవచ్చో, మాట్లాడకూడదో తెలియదు.

ఫణిభూషణ రావు ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీలో ఉన్నత స్థాయి అధికారి. ఢిల్లీలో ఉంటారు, అక్కడ సొంత ఇల్లు, కారు, నౌకర్లు.. హోదాకేం లోటు లేదు. ఇండియా లోని పెద్ద నగరాలన్నీ తిరుగుతుంటారు. పొద్దున ఒక సిటీలో ఉంటే, సాయంత్రం మరో సిటీలో ఉంటారు. అంత బిజీగా ఉండే మామగారు, ఎన్నిసార్లు పిలిచినా ఎవరింటికీ వెళ్లని ఆయన లంచ్‌కి ఇంటికి వస్తానంటూ స్వయంగా ఫోన్ చేసి చెప్పటం రేఖకు ఆశ్చర్యంగా ఉంది. ఇంతకు ముందు రెండు సార్లు ఆయన హైదరాబాద్ వచ్చి వెళ్లినా ఆ విషయం తరువాత ఎప్పుడో గాని తెలియలేదు.

ఆయన ఎప్పుడేనా ఆరునెలలకో, ఏడాదికో, ఏ పండగకో ఫోన్ చేసి కొడుక్కి గ్రీటింగ్స్ చెబుతారు. అప్పుడు వేణు తల్లితో ఒక నిముషం మాట్లాడుతాడు. అంతకు మించి పెద్దగా అనుబంధాలేమీ లేవు.

ఒకే కుటుంబంలోని మనుషులు. ప్రతి చిన్న సంఘటనకు స్పందించవలసిన వాళ్లు పూర్తిగా పరాయివాళ్లు అయిపోయారు. ఆప్యాయతలు ఇంకిపోయాయి. అనుబంధాలు తెగిపోయాయి.

ఇన్నాళ్ల తరువాత, మామగారు ఇంటికి వస్తానంటుంటే, ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియటం లేదు.

రేఖ సెలవు పెట్టింది. ఇంటికి వెళ్లి వంట చేసింది. ఒంటిగంట కల్లా అన్నీ రెడీ చేసి టేబుల్ మీద పెట్టింది. మామగారి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది.

వేణుతో ఆమెకు పెళ్లి అయి అయిదేండ్లు అయింది. కొత్తలో అందరూ రేఖను ఆకాశానికి ఎత్తేశారు. అంతమంచి సంబంధం దొరకటం ఆమె అదృష్టం అన్నారు. రేఖ కూడా అలాగే అనుకుంది.

ఏ విధంగా చూసినా వంక పెట్టటానికి వీల్లేని సంబంధం కనుకనే వేణు, రేఖను చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. రేఖ చాలా సెన్సిటివ్. చాలా ఇంటిలిజెంట్. ఎంత క్లిష్టమైన విషయమైనా ఒకసారి చెబితే ఇట్టే అర్థం చేసుకోగలదు. చదువుకునే రోజుల్లోనే అందరి ప్రశంసలు పొందింది. అపజయం అన్నది ఎరుగదు. ఏదైనా సాధించగలనన్న ధీమా, ధైర్యం ఉండేవి. చలాకీగా తిరుగుతూ, సరదాగా నవ్వుతూ, హుషారుగా ఉండేది.

వివాహం గురించి మొదట్లో అనేక భయాలు, సందేహాలు ఆమెను వేధించాయి. భర్త చేత, అత్త చేత రకరకాల బాధలు పడుతున్న వాళ్ల గురించినప్పుడు, ఆసలు పెళ్ళి చేసుకోకూడదన్న అభిప్రాయం కలిగేది.

వైవాహిక జీవితం సుఖంగా సాగితే, మిగిలిన విషయాల్లో ఫెయిల్ అయినా, జీవితంలో విజయం సాధించినట్లేనని ఆమె ఫ్రెండ్స్ అంటుండేవారు.

పెళ్లి సెల్ఫ్ సర్వీసు లాంటిది. నీకు ఇష్టమైనది తెచ్చుకుని, టేబుల్ దగ్గర కూర్చుంటావు. అప్పుడు పక్కవాడు తెచ్చుకున్నది చూసి, అది తెచ్చుకుంటే బావుండునని అనిపిస్తుంది. హ్యుమన్ సైకాలజీ అలాంటిది. ఇవన్నీ విన్న రేఖ పెళ్లికి ముందు ఎన్నోరకాల భయాందోళనలకు గురి అయింది. పెళ్ళి కూడా లాటరీ లాంటిదే. అదృష్టం ఉంటే ప్రైజు వస్తుంది. లేదంటే అసలుకే మోసం వస్తుంది. వేణు ఆమెకున్న భయాలన్నీ పోగొట్టాడు. “జీవితం కూడా పేకాట లాంటిదే. మన చేతిలో మంచి ముక్కలు ఉండగానే సరిపోదు. నేర్పుగా, తెలివిగా ఆడటం కూడా తెల్సి ఉండాలి” అన్నాడు. “నాకు జీవితం గురించి ఏమీ తెలియదు. మీరు అంటున్నఆ పేకాటలో ఎన్ని ముక్కలు ఉంటాయో కూడా తెలియదు. మిమ్మల్ని నమ్ముకుని నిశ్చింతగా రోజులు గడపటం మాత్రమే నాకు తెల్సు” అన్నది రేఖ భర్త గుండెల మీద వాలిపోతూ.

కొద్దినెలలు గడిచినప్పటి నుంచీ సమస్యలు ప్రారంభం అయినయి.

అత్తగారు ఎవరితో మాట్లాడినా, ఈ ప్రస్తావన తీసుకు వచ్చేది. “మా కోడలా? ఏమంత పెద్ద అందగత్తె కాదు లెండి. నల్ల పిల్ల. ఎందుకు చేసుకున్నామంటారా? ఎవరికి ఎక్కడ రాసిపెట్టి ఉంటే అక్కడే అవుతుంది గదా మరి..”

రేఖ ఈ మాటలు వింటూనే ఉంది. అదేమిటి? తను నలుపు ఎలా అవుతుంది? ఈమె తప్ప ఇంతవరకూ ఎవరూ మాట అనలేదే? – అనుకుంది. ఈ నల్ల పిల్ల అన్నమాట బాణంలా వచ్చి తగిలింది. మనసు విలవిల్లాడింది. అయినా ఓర్చుకుంది.

ఒకసారి బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్ళింది. కొత్తగా ఫామిలీ మెంబర్ అయిన రేఖ ప్రస్తావన వచ్చింది. సుందరమ్మ వాళ్లతో అన్నది “మీ సుశీ, మా కోడలూ ఒకే రంగులో ఉంటారు” అని.

ఆ సుశీ అన్న అమ్మాయి అక్కడే ఉన్నది. బాగా నలుపు. రేఖను ఆ అమ్మాయితో జతకలిపి మాట్లాడటం, రేఖకు అవమానంగా తోచింది.

ఇంటికి వస్తూ దారిలో రేఖతో ఉన్నది. “నల్ల పిల్ల అని నలుగురూ అంటారు, పడాల్సిందే. ఎంతమంది నోరు మూయించగలం?” అని.

ఈవిడ తప్ప ఈ మాట ఇంకెవరూ అనలేదు. ఎందుకలా పదేపదే తనను నల్ల పిల్ల అంటోందో రేఖకు అర్థం కావటం లేదు. పౌరుషం వస్తున్నా నిగ్రహించుకుంది.

ఇంకో సందర్భంలో ఎవరితోనో పోలుస్తూ “నల్ల పిల్లతో కాపురం ఎలా చేస్తారో?” అన్నది సుందరమ్మ

ఈ మాటలు వేణు కూడా విన్నాడు. రేఖకు దుఃఖం వచ్చింది. బెడ్రూంలోకి పోయి ఏడుస్తూ కూర్చుంది.

“ఏదో, పెద్దావిడ అంటుంటుంది. అవన్నీ పట్టించుకోకు” అన్నాడు వేణు.

“పెద్దరికాన్ని నిలబెట్టుకునేటట్లున్నాయా ఆ మాటలు?” అని అడిగింది రేఖ.

ఇంట్లో ఎవరూ లేనప్పుడూ కావాలనే ఈ ప్రస్తావన తీసుకొచ్చేది. ఏదో ఔదార్యం ప్రదర్శిస్తున్నట్లు అనేది “మాకింతే ప్రాప్తం అని అనుకుంటాం.” అని.

ఆవిడకు దృష్టిలోపం ఉందో, లేక కావాలనే అంటుందో తెలియదు గానీ, రోజుకు నాలుగయిదు సార్లు ‘నల్ల పిల్ల’ అన్న విషయాన్ని గుర్తు చేసేది.

రేఖకు కోపం కట్టలు తెంచుకుంటోంది. భర్తకు చెబుతూనే ఉంది. అతను ఆమెను మౌనంగా భరించమనే అంటున్నాడు.

“గంట గంటకూ ఇలా పొగ పెడుతుంటే, ఎలా భరించగలను? పెళ్లికి ముందు మూడు నాలుగు సార్లు చూశారు. నేను నలుపో, తెలుపో అప్పుడు తెలియలేదా? కళ్లు కనపడలేదా? కోడలుగా ఇంట్లో అడుగు పెట్టాక, నేను ఈ ఇంట్లో మనిషిని. బరువు బాధ్యతల్లోనూ, మంచి చెడుల్లోనూ కల్సిపోతున్నాను. కానీ నల్ల పిల్లనంటూ ప్రతిక్షణం ఆమె నన్ను హింసించాలని చూస్తోంది.

కాఫీలు, టిఫెన్లూ అందించటానికి నల్ల పిల్ల పనికొస్తుంది. వంట చేయటానికీ, అంట్లు తోమటానికీ, నల్ల పిల్ల పనికొస్తుంది. కానీ ఇంటి కోడలినని చెప్పుకోవటానికి పనికిరాదు. ఈ పోరు భరించటం నా వల్ల కాదు. ఇంకొకసారి ఆ మాట అంటే, ఐ విల్ వాకౌట్.. దట్సాల్” అన్నది రేఖ.

వేణు తల్లికి ఆ విషయం చెప్పాడు.

“బావుందిరా మా కోడలు అందాల బొమ్మ అని పదిమందికీ చెప్పుకుంటే నరఘోష. అందుకే అలా చెబుతుంటాను. అన్నంత మాత్రాన ఉన్న అందాలు పోతాయా? లేని అందాలు వస్తాయా?” అన్నది సుందరమ్మ. ఈ మాటలే వేణు, రేఖతో అన్నాడు.

“ఈ క్షణం నుంచీ నేను ఆమెతో మాట్లాడను. ఆమెను నాతో మాట్లాడవద్దని చెప్పండి” అన్నది రేఖ.

మర్నాడు సుందరమ్మ మంచం ఎక్కింది. జ్వరం అన్నది. నాలుగు రోజులు మంచం దిగలేదు. ఆమెకు ఎప్పుడేం కావాలో చూసి, రేఖ ఆమె గదిలో మంచం దగ్గర పడేసి వస్తోంది.

ఆమె మీద ఉన్న ప్రేమ అంతా ద్వేషంగా మారింది. నిష్కారణంగా మనసుని విరిచేసింది. ఇంక ఆ ఇంట్లో ఉండబుద్ధి కావటం లేదు.

సుందరమ్మకు జ్వరం తగ్గింది. ఆ రోజు భోజనం చేసింది. కొంచెం ఓపిక వచ్చింది.

“అవునూ, ఎన్నాళ్లబట్టో అడగాలనుకుంటున్నాను. మీ అమ్మా, నాన్న ఎర్రగా ఉంటారు గదా. నువ్వు నల్లగా ఎలా పుట్టావు?” అని అడిగింది.

రేఖ చేతిలోని గిన్నె విసిరి కొట్టింది, కోపం పట్టలేక.

గదిలోకి వెళ్లి వేణుకు ఒక చీటీ రాసింది.

“మీ అమ్మ పోరు భరించే శక్తి నాలో నశించిపోయింది. ఇవాళ ఆమె వేసిన ప్రశ్న మీకు నేనూ వేయగలను. కానీ నాకు సంస్కారం అడ్డం వస్తోంది. విని తట్టుకునే శక్తి మీకు ఉండదు. సహనానికీ ఓర్పుకీ ఓ హద్దు ఉంటుంది – సముద్రానికి ఉన్నట్లే. శరీర రంగుని చూసి మనిషికి విలువ కట్టటం, ఇంటి పెయింటింగ్‍ను చూసి ఇంటికి విలువ కట్టడం లాంటిది. మీరు ఎవరికి ఏ విలువ ఇవ్వాలో తేల్చుకోండి. నేను మా ఇంటికి వెళ్తున్నాను. నేను కావాలనుకుంటే అక్కడికి రండి..”

ఆ చీటే టేబుల్ మీద పెట్టింది. దాని మీద బరువు పెట్టింది. సూట్‍కేస్ తీసుకుని బయటకు వెళ్తున్న రేఖ వంక సుందరమ్మ ఆశ్చర్యంగా చూసింది.

హైదరాబాద్ వచ్చిన రేఖ తండ్రికి విషయమంతా చెప్పింది.

“మంచి పని చేశావు. ఎన్నో అవకరాలు ఉన్నవాళ్లు కూడా, ఎన్నో పరిశోధనలు చేసి కోట్లాదిమంది జీవితాల్లో వెలుగు నింపారు. మనిషి రంగు కాదు. మనసు రంగు ముఖ్యం. బంగారం లాంటి మనసున్న నిన్ను కుళ్ళబొడిచి, దాని కన్ను అదే పొడుచుకుంది. నీ కాళ్ళ మీద నిలబడగల శక్తి నీకు ఉంది. అక్కడ మోకాళ్ళ మీద నిలబడాల్సిన అవసరం లేదు” అన్నాడు రేఖ తండ్రి.

రేఖ ఉద్యోగం సంపాదించుకుంది. వేణు ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు.

దానితో ఒకే కుటుంబం – రెండు ముక్కలు అయింది.

ఇన్నాళ్ల తరువాత ఫణిభూషణ రావు మళ్ళీ కొడుకూ, కోడల్ని వెతుక్కుంటూ వచ్చాడు.

ఆయన కారు దిగి లోపలికి రాగానే, రేఖ సాదరంగా ఆహ్వానించింది. భోజనానికి లేవమంది. ఆయన తింటున్నంత సేపు ఎదురుగా నిలబడే ఉంది.

ఆయన ముందుగదిలోకి వచ్చాడు. రేఖ వక్కపొడి డబ్బా ఆయన ముందు పెట్టింది.

“మా మీద ఇంకా కోపం తగ్గలేదా మీకు?” అని అడిగాడు ఆయన.

రేఖ సమాధానం చెప్పలేదు.

“కోడల్ని లొంగదీసుకోవాలంటే, ఏదో ఒక లోపం ఎత్తి చూపించి, దాన్ని గుర్తు చేస్తుంటే, నువ్వు గిల్జీగా ఫీలయి అణిగిమణిగి పడి ఉంటావని ఆశించింది. ఏదైనా సరే, అతిగా వంచితే, విరిగిపోతుందని గ్రహించలేకపోయింది..” అన్నాడాయన.

“నేను నలుపో తెలుపో ఎన్నడూ ఆలోచించలేదు. నాకా ధ్యాసే లేదు. ఒక వేళ మీ శ్రీమతి గారు అన్నట్లు నేను నలుపే అయినా, నాకే బాధా లేదు. పుట్టబోయే పిల్లలు నలుపే అయినా నేను బాధపడను. కానీ వాళ్లు అప్రయోజకులూ, కుత్సితమైన బుద్ధిగల వాళ్ళు అయిన రోజున బాధ పడతాను. ఎదుటి వాళ్ళను శారీరకంగా గానీ మానసికంగా గానీ హింసించి, క్రిమినల్ హేపీనెస్ పొందేవాళ్ళు అయితే వాళ్లను వదులుకోవటానికే నేను ఇష్టపడతాను..” అన్నది రేఖ. ఎన్నాళ్ళగానో దాచుకున్న ఆవేశం కట్టలు తెంచుకుంది.

“రేపు నేను రిటైర్ అయ్యాక, వచ్చి మీ దగ్గర ఉందామనుకుంటున్నాను.”

“రండి. మీకు సంతోషంగా సేవ చేస్తాను. అది నా బాధ్యత, కర్తవ్యం కూడా..”

“నాతో పాటు మీ అత్తయ్యా వస్తుంది.”

రేఖ నిట్టూర్చింది. “నల్లవాళ్ళు తెల్లవాళ్ళ మధ్య గొడవలు ప్రపంచమంతటా ఉన్నాయి. అమెరికాలోని తెల్లవాళ్ళకు, ఆఫ్రికాలోని నల్లవాళ్లంటే పరమ అసహ్యం. కానీ చాకిరీ చేసేందుకూ, బండ పనులు చేయించుకునేందుకూ నల్లవాళ్ల మీదనే ఆధార పడతారు.. నల్లవాళ్లను ఎప్పుడు ఎంతవరకు ఎలా ఉపయోగించుకోవాలో మీ శ్రీమతితో సహా, తెల్లవాళ్లందరికీ బాగా తెల్సు..” అన్నది రేఖ.

ఆయన ఆశ్చర్యంగా రేఖ వంక చూశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here