చిరుజల్లు-123

0
2

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

ఇది తెల్లవారని రాత్రి

[dropcap]తె[/dropcap]ల్లవారుతోంది. నిద్రాముద్రితమైన జగత్తు సుషుప్తి లోనుంచి లేచి బద్ధకంగా ఒళ్లు విరుచుకుంటోంది. అక్కడక్కడా ఒకరిద్దరు కదులుతున్నా, వీధులన్నీ నిర్మానుష్యంగానే ఉన్నాయి. ప్రకృతి ఎందుకనో నీరవ నిశ్చల నిశ్శబ్దంలో మునిగిపోయి ఉంది. ఎప్పుడూ వెర్రిగా పరుగులు తీస్తుండే గాలి సైతం స్తంభించి పోయింది. జరగరానిదేదో జరిగిపోయిందన్న భావంతో, పక్షులు కూడా గళం విప్పటం లేదు.

గరల్స్ హాస్టల్స్ మొదటి అంతస్తులో మొదటి గదిలో ఉండే పద్మిని నిద్రలేచింది. కళ్లు మూసుకు పోతున్నా, బ్రష్ మీద పేస్ట్ వేసుకుని బాత్రూంకు వెళ్తూ పక్క రూం వైపు చూసింది. తలుపులు ఓరగా వేసి ఉన్నాయి. మొహం కడుక్కుని వస్తూ, “ఏం చేస్తున్నావే నాయకురాలా?” అని పెద్దగా అన్నది. కానీ ప్రసన్న గదిలోనుంచి సమాధానం రాలేదు.

పద్మిని టవల్‍తో మొహం తుడుచుకుని, ప్రసన్న రూం తలుపు తెరిచి లోపలికి వెళ్లింది.

భూమండలం దద్దరిల్లేటట్లు పొలికేక పెట్టింది. వెర్రిగా అరుచుకుంటూ బయటకు వచ్చింది.

ఆ కేక హాస్టల్ అంతా ప్రతిధ్వనించింది. నిద్రలో ఉన్న వాళ్లంతా ఉలిక్కిపడి లేచారు. పరుగెత్తుకుంటూ వచ్చారు.

భయంతో వణికి పోతున్న పద్మిని చుట్టూ చేరి “ఏమైంది, ఏమైంది?” అని ఆత్రంగా అడిగారు.

“ప్రసన్న ఉరి వేసుకుంది” అని రొప్పుతూ చెప్పింది పద్మిని.

అందరూ రూంలోకి తొంగి చూసి నిశ్చేష్టులైపోయారు. వీళ్లంతా ఇరవై సంవత్సరాల లోపు వయస్సుగల ఆడపిల్లలు. చుట్టు పక్కల గ్రామాలలోని నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. ఆడుతూ పాడుతూ తిరిగే వయస్సు. రోగాలు, జీవులూ, హత్యలూ, ఆత్మహత్యలూ – ఇలాంటివేవీ కనీవినీ ఎరుగని అమాయక బాలికలు. అందుచేతనే తమ స్నేహితురాలు, ఆప్తురాలు చనిపోయిందనీ, అదే సీలింగ్ ఫాన్‍కు వేలాడుతున్నదని తెలియగానే దుఃఖాన్ని ఆపుకోలేక ఏడ్చేశారు.

వార్డెన్ హడావుడిగా వచ్చింది. వచ్చీ రాగానే అక్కడ గుమిగూడిన అమ్మాయిలను అందర్నీ తరిమేయటం మొదలు పెట్టింది.

“ఇది సూయిసైడ్ కేసు, మీరు ఎవరూ లోపలికి రాగూడదు. ఏమీ ముట్టుకోగూడదు. రూం తలుపులు తెరవకూడదు, పోలీసులు వచ్చేదాకా” అంటూ తలుపు మూసి బయట గడియ పెట్టింది.

“ఇదిగో, ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుంది. దాని గొడవలేవో దానికున్నాయి. మీరు మాత్రం ఎవరూ నోరు విప్పటానికి వీల్లేదు. ఎవరు ఏం అడిగినా, మీరు మాట్లాడటానికి వీల్లేదు. మీ రూంలో నుంచి బయటకు రాకూడదు. పోలీసులూ, కేసులూ, కోర్పులూ, నానా గొడవలు అవుతాయి. ఈ న్యూసెన్స్ అంతా నా మెడకు చుట్టుకుంటుంది. నా చావు నేను చస్తాను. మీరు పిచ్చి పిచ్చిగా వాగారో, దానికి పట్టిన గతే మీకూ పడుతుంది” అని హెచ్చరించింది వార్డెన్.

వార్డెన్ కిందకు వెళ్లింది. వాచ్‍మన్ చేత పోలీసులకు కబురు పంపించింది. అమ్మాయిలంతా గుంపులుగా చేరి వాళ్ల తోచినట్లు మాట్లాడుకుంటున్నారు.

“రాత్రి ఎనిమిది గంటలప్పుడు, బట్టలు ఉతికి ఆరేసింది. నిజంగా ఉరి వేసుకునేది అయితే, ఆ టైంలో బట్టలు ఉతకి ఆరేసుకుంటుందా?” అని అడిగింది పద్మిని.

“ఉరివేసుకుని చనిపోయిన వాళ్లను నాలుక బయటకు వెళ్లుకొస్తుందిట. మిడిగుడ్లు వస్తాయట. దీనికి అవన్నీ ఏం లేవు. ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుగా ఉంది. ఉరి వేసుకుంటే అన్ని ముడులు ఎలా వేసుకుంటుందే?” అన్నది నీరజ.

ప్రసన్న చురుకైన పిల్ల. అందరిలోకి తెలివైన అమ్మాయి. ముఖ్యంగా అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం గలది. ఆ హాస్టల్‌లో ఉన్న అమ్మాయిలకు చిన్నవీ, పెద్దవీ ఎన్నో సమస్యలున్నయి. తమ బాధల గురించి చెప్పుకోవటానికి, బాధ్యులైన వారిని నిలదీసి అడగటానికీ ఎవరికీ ధైర్యం లేదు. ఒక్క ప్రసన్న మాత్రమే ఎదిరించి అడగగలదు. అందుకనే వార్డెన్ ఆమెను ఎప్పుడూ ‘నాయకురాలా’ అని పిలుస్తుంటుంది. ఇవాళ తమ నాయకురాలే చనిపోవటంతో వాళ్లంతా దిక్కులు లేని పిల్లల్లాగా అలమటించిపోతున్నారు.

పది గంటలకు తీరిగ్గా ఒక కానిస్టేబుల్ వచ్చాడు. గంట తరువాత సబ్-ఇన్‌స్పెక్టర్ వచ్చాడు. రూం లోని ప్రతివస్తువునీ పరీక్షించాడు. వార్డెన్ ఆయన వెనకనే తిరుగుతూ అన్నీ వివరించి చెబుతోంది.

“ఆత్మహత్య ఎందుకు చేసుతుంది? ఏదైనా మీకు తెల్సిన కారణాలు ఉన్నాయా?” అని అడిగాడు యస్.ఐ.

“మీకు తెలియని దేముందండీ? ఈ కాలంలో ఆడపిల్లలకు ప్రేమా – బాయ్ ఫ్రెండ్స్, లవ్ లెటర్స్ రాయటం, నాలుగు రాజులు కల్పి తిరగటం, తరువాత బెడిసి కొట్టటం, ఇలా ఆత్మహత్యలు చేసుకోవటం” అని చెప్పింది వార్డెన్.

“ఈ అమ్మాయి ఎవర్ని ప్రేమించింది? ఎవరికి లవ్ లెటర్స్ రాసింది? ఎవరితో తిరిగింది? సాక్ష్యాధారాలు ఉన్నాయా?” అని ఆడిగాడు యస్.ఐ.

“అవన్నీ ఎక్కడ దొరుకుతాయండీ? రహస్యంగా సాగే ప్రేమ కలాపాలను ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు కదండీ? ఇంక రుజువులు ఎక్కడ దొరుకుతాయి?” అన్నదామె.

తరువాత ఫోటోగ్రాఫర్ వచ్చాడు. ఫోటోలు తీసిన తరువాత బాడీని పోస్ట్‌మార్టమ్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పుసన్న తల్లిదండ్రులు దగ్గర లోని ఒక పల్లెటూరిలో ఉంటారు. వాళ్లకు కబురు పంపించింది వార్డెన్.

ప్రసన్న శవంతో పాటే తామూ ఆస్పత్రికి వెళ్తామని కొందరు అమ్మయిలు బయల్దేరారు.

“మీరేం చేస్తారక్కడ?” అని గదిమింది వార్డెన్.

“ప్రసన్న మా క్లోజ్ ఫ్రెండ్. రాత్రి దాకా మాతో సరదాగా కబుర్లు చెబుతూ, ఎన్నో విషయాలు చెబుతూ, నవ్వుతూ, నవ్విస్తూ తిరిగిన ప్రసన్న ఇప్పుడు శవంగా మారింది. ఈ కాసేపైనా మమ్మల్ని దాన్ని చూడనివ్వండి” అన్నది పద్మిని.

“చూడటానికి అదేం పెళ్లికూతురు కాదు. డెడ్ బాడీ. మీరు జడుసుకుని జ్వరాలు తెచ్చుకుంటే, మళ్లీ నేనే చావాలి” అన్నది వార్డెన్.

ఆమె వారించినా, పద్మిని మరీ కొంత మంది అమ్మాయిలు ఆస్పత్రికి వెళ్లారు. పద్మిని పోస్ట్‌మార్టమ్ చేసే డాక్టర్ని కారిడార్‍లో నిలిపి,

“మీ అభిప్రాయం చెప్పండి సర్” అని అడిగింది.

“పోస్టుమార్టమ్ ఇంకా మొదలు పెట్టలేదు” అన్నాడు డాక్టర్.

“కళ్ల ముందు కనిపించే సాక్ష్యాధారాలను చూడకుండా కళ్లు మూసుకున్న మీకు, శాశ్వతంగా కనుమూసిన దాని శరీరాన్ని కోస్తే మాత్రం ఏం సాక్ష్యాలు, ఆధారాలు కనిపిస్తయి సర్” అని అడిగింది పద్మని.

ప్రసన్న తల్లీ తండ్రీ వచ్చారు. గుండెలు అవిసిపోయేలా ఏడుస్తోందా తల్లి హృదయం. లోలోపలే ఇటుకల బట్టీలా రగులుకుంటోంది తండ్రి హృదయం. ఆయన స్కూలు టీచర్‍గా పని చేస్తున్నాడు.

“నిక్షేపంలా చదువుకుంటుందని, పట్టణానికి పంపించాం. బయట ఎక్కడైనా విడిగా ఉంచితే ఆడపిల్లకు రక్షణ ఉండదని, హాస్టల్లో సీటు సంపాదించి చేర్పించాం. కానీ ఈ హాస్టలే దాని ప్రాణాలను బలిగొనే మృత్యుగృహం అవుతుందని ఊహించలేక పోయాం” అంటూ ప్రసన్న తల్లి బావురుమంది. రాత్రి ఏడుగంటలకు శవాన్ని అప్పగించారు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ రావటానికి ఆలస్యం అవుతుందన్నారు.

“అనుమానాస్పద కేసుల్లో శవ పరీక్ష జరిపేటప్పుడు మేజిస్ట్రేటును పిలిపించాలి గదా. ఎందుకు పిలిపించలేదు?” అని అడిగాడు ప్రసన్న తండ్రి.

‘పోస్ట్‌మార్టమ్‌లో అబ్డామినల్, చెస్ట్ కావిటీ మాత్రమే పరీక్ష చేసి చూశారు గానీ, కార్నియల్ కావిటీ ఎందుకు పరీక్ష చేయలేదు?” అని అడిగింది హెల్త్ విజిటర్‌గా పనిచేస్తున్న ప్రసన్న తల్లి.

ప్రసన్న శరీరం మీద అక్కడ ఎర్రని, నల్లని మచ్చలు ఏర్పడినయి. చెస్ట్ దగ్గర గాయాలు ఉన్నాయి. చేతికి ఇంజక్షన్ ఇచ్చిన గుర్తూ కనిపించింది. పుసన్న శవాన్ని రాత్రి సమయంలోనే దహనం చేశారు.

ప్రసన్నకు మత్తు మందు ఇచ్చి ఆమెను మానభంగం చేసి చంపేశారన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని తల్లి వెల్లడించింది. కానీ ఉరివేసుకుని చనిపోయినట్లు పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్ ఇచ్చారు.

హాస్టల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఎవరూ తిరిగి హాస్టల్‍కు వెళ్లలేదు.

“మనం ఇప్పుడు ఇక్కడి నుంచి తిన్నగా కలెక్టర్ ఇంటికి వెళ్దాం. ఆయనకు అన్ని విషయాలూ చెబుదాం. ఎందుకంటే, ఇది మన జీవన్మరణ సమస్య” అని తన ఫ్రెండ్స్‌కు చెప్పింది పద్మిని. వాళ్లంతా ఇప్పుడు వికలమైన మనస్సుతో, ఏం చేయాలో తెలియని స్థితిన ఉన్నారు.

వాళ్ళతో పాటు ప్రసన్న తల్లీ, తండ్రి కూడా బయదేరారు. అందరూ కలెక్టర్ బంగళా గేటు ముందు నిలబడి నినాదాలు చేశారు. కలెక్టరు మేడ దిగి వచ్చారు. జరిగిన విషయమంతా విన్నారు.

“తవ్వుకుంటూ పోతే, ఇది చాలా దూరం వెళ్తుంది. మా అమ్మాయి ఇదివరకే నాతో చెప్పింది. ఆ హాస్టల్లో ఆడపిల్లలకు రక్షణ లేదు, మగవాళ్లు ఎప్పుడు బడితే ఇప్పుడు లోపలికి వచ్చి వెళ్తుంటారు. అర్ధరాత్రిళ్లు ఎవరెవరో తాగేసి వచ్చి తలుపులు కొడుతుంటారని.. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆడపిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన వార్డెన్ వీళ్లను బెదిరించి రాత్రిళ్ళు ఎక్కడెక్కడికో పంపిస్తుంటుందని మా అమ్మాయి చెప్పింది. అక్కడ రక్షణ లేనప్పుడు, అక్కడ ఉండవద్దనీ, వేరే ఏర్పాట్లు చేస్తామనే మా అమ్మాయికి చెప్పాను. కానీ మా పిల్ల ఒప్పుకోలేదు. ఇలా, ప్రతిదానికీ భయపడి పారిపోవటం మొదలు పెడితే, ఎంత దూరమని పారిపోగలమమ్మా.. అని నా చిట్టి తల్లి ఎంతో ధైర్యంగా చెప్పింది. చివరకు నా బంగారు తల్లినే బలిపశువును చేశారు.. తిరిగి రాలేనంత దూరం తరిమి కొట్టారు” అని ఇంక మాటలు రాక, రెండు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కివెక్కి ఏడ్చింది ప్రసన్న తల్లి.

“ఇది నిజమేనా?” అని అడిగాడు శలెక్టర్.

మౌనంగా తలదించుతుంది పద్మిని. “ఏ రాత్రి కారాత్రి, ఈ రాత్రి తెల్లవారుతుందా – అని భయపడుతున్నాం సర్” అన్నది.

“స్త్రీ అర్ధరాత్రి నడిరోడ్డు మీద నిర్భయంగా నడవగలిగిన పరిస్థితి ఏర్పడాలని గంభీరోపన్యాసాలను చేయటమేగానీ, స్త్రీ మాన ప్రాణాలను కాపాడటానికి ఏమీ చేయలేక పోతున్నామని తెల్సినప్పుడు బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వాళ్లంతా సిగ్గుతో తల వంచుకోవాలి. మీ అమ్మాయి చెప్పిన మాట నిజం. పారిపోవటం పరిష్కారం కాదు. పోరాడాల్సిందే. తప్పు చేసినవాళ్లను శిక్షింపక తప్పదు.” అన్నాడు కలెక్టర్ చర్యలు తీనుకోమని సబ్-కలెక్టర్‌కు ఫోన్ చేస్తూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here