Site icon Sanchika

చిరుజల్లు-125

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

భారపు పగ్గాలు – పాపపుణ్యములు

[dropcap]త్రి[/dropcap]నాథరావు ‘బే’ ఏరియాలో ఉన్నన్ని రోజులూ ఆయనకు డ్రైవింగ్ ఫోర్స్ మంజులవాణియే.

ఇప్పుడు కూడా ఆయన ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్నాడు. ఆమె కారు డ్రైవ్ చేస్తోంది.

ఆయన ఏదైనా ఒక పని చేద్దాం అనుకునే లోపల మంజులవాణి ఆ పని చేసేస్తుంది. కారు ఎయిర్‍పోర్ట్ ముందు ఆగింది. ఆయన కారులోనుంచి లగేజ్ దించే లోపల, ఆమె కార్ట్ తీసుకొచ్చింది. లగేజ్ దాని మీద పెట్టింది. కారు పార్క్ చేయటానికి వెళ్లింది.

త్రినాథరావు లగేజ్ చెకిన్ చేసి, బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పటికి ఆమె వచ్చేసింది.

ఇంకా ఒక గంట టైం ఉంది. అందుకని విడిపోయే ముందు మాట్లాడుకుంటున్నారు. మంజులవాణి అన్నది.

“మీరు ఈసారి వచ్చినప్పటినుంచీ ఎందుకో దిగులుగా కనిపిస్తున్నారు. ఎందుకని?” అని అడిగింది.

ఈ రెండు నెలల్లో ఆమె ఈ ప్రశ్న వేయటం వందోసారి. ఇప్పుడైనా కారణం చెప్పమని అడిగింది.

“కోకాపేటలో చాలా ఏళ్ల కిందటనే మూడు ఎకరాలు కొని ఉంచాను. ఇప్పుడు అక్కడ మట్టి ముట్టుకుంటే బంగారం అయింది. ఒక్కో టవర్ ఇరవైనాలుగు అంతస్తులతో రెండు టవర్లు కట్టించాలని ప్లాన్ శాంక్షన్ చేయించాను. వెయ్యి కోట్లు బ్యాంక్ లోన్ తీసుకున్నాను. ఆ రెండు టవర్లూ పూర్తి అయితే, ఇప్పట్లో మనకు దిగులు లేదనుకున్నాను. కానీ కార్పొరేషన్ వాళ్లే ఎవడి చేతనో, ఒక చిన్న కాగితం పెట్టించారు – ఆ స్థలం వాడిదంటూ. ఆలస్యం అయ్యేకొద్ది ఇబ్బందుల్లో పడతానని వాళ్లకు తెల్సు..” అన్నాడు త్రినాథరావు.

“పోనీ, నేను రానా?” అని అడిగింది మంజుల వాణి.

“వద్దు, వద్దు. నువ్వు వస్తే ఇక్కడ బిజినెస్ దెబ్బతింటుంది” అన్నాడు త్రినాథరావు.

ఆయన ఇప్పుడు రెండు పడవల మీద కాళ్లు పెట్టి నడుస్తున్నాడు. హైదరాబాదులో పదేళ్ల కిందట తన నిజ భార్య మంగళగౌరి పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాడు. అది అంచెలంచెలుగా ఎదిగి నిండు జాబిల్లికి నిచ్చెనలు వేసే స్థాయికి చేరుకున్నాడు.

ఆ ఊపులోనే, అదలా ఉండగానే, –

అమెరికాలో కాలిఫోర్నియాలో ‘బే’ పరియాలో అంతా తెలుగువాళ్లే ఉన్న చోటు రియల్ స్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. నిజానికి ఆయనకు అసిస్టెంట్‌గా ఉన్న మంజులవాణి, ఒంటి చేత్తో, వ్యాపారాన్ని అంతా నల్లేరు మీద బండి లాగా లాక్కొస్తోంది.

ఆమె మనిషి చిరునవ్వుతో ఓ మాదిరిగా దృఢంగా భారీగా ఉంటుంది. మనసూ, మాటా అన్నీ మృదువుగా ఉంటాయి. ఇప్పుడు ‘బే’ ఏరియాలో ఎవరు ఇల్లు అమ్మాలన్నా, కొనాలన్నా, అద్దెకు ఇవ్వులన్నా, అద్దెకు తీసుకోవాలన్నా మంగళగౌరి రియల్ ఎస్టేట్‍ను సంప్రదించాల్సిందే. ‘ఓపెన్ బోర్డ్’ ఇంటి ముందు పెట్టేలోపల ఆ ఇంటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతుంది. వచ్చిన వాళ్లను మాటలతో కోటలు దాటిస్తుంది. అమ్మకాలు, కొనుగోళ్లు తాలూకు పేపర్ వర్క్ అంతా రెండు రోజుల్లో చక చకా చేసేసి తమకు రావల్సిన ఇరవై శాతం కమిషన్ తీసేసుకుంటుంది. త్రినాథరావు అమెరికాకు, ఇండియాకు మధ్య తిరుగుతుంటాడు.

“సరే. అయితే నేను వెళ్తున్నాను. ఈసారి ఆ వ్యవహారం అంతా చక్కబెట్టి వచ్చేటప్పటికి కొంచెం టైం పట్టవచ్చు” అన్నాడు.

“అక్కడ పనులన్నీ చూసుకోండి. ఇక్కడి పనులు నేను చూసుకుంటాను గదా” అన్నది మంజులవాణి.

అయిష్టంగానే ఇద్దరూ చెరో వైపుకు వెళ్లి పోయారు,

***

చాలా మంది వ్యాపారస్థుల లాగానే త్రినాథరావుకీ జాతకాల పిచ్చి ఉంది. వ్యాపారం పాలపొంగులా పొంగటానికి, తన ప్రయోజకత్వం కన్నా వ్యాపారం తన భార్య  పేరు మీద చెయ్యటమే కారణం అని అందరూ అంటూ ఉంటే అది నిజమేనని ఆయనకూ నమ్మకం కుదిరింది.

పురుషుడు అర్ధానుస్వారమే. స్త్రీతో కలిసినప్పుడే పరిపూర్ణం అవుతాడన్న అభిప్రాయం ఏర్పడింది. ఒక అందమైన స్త్రీని ముందు కూర్చొబెట్టుకుని, తను వెనక నుండి వ్యాపారం చేస్తే, సిరి తామర తంపరగా అల్లుకుంటుందన్న ఆలోచన కుమ్మరి పురుగులా తొలుస్తున్న సమయంలోనే, హైదరాబాద్ లోని మంగళగౌరి రియల్ ఎస్టేట్‌లో చిన్న చిరు ఉద్యోగం కోసం వచ్చింది వరూధిని.

ఆమె ముఖం సూర్యకాంతి పడి తళతళా మెరిసిపోతున్న నిలకు జలాశయంలో, అదో రకమైన ఎంత కాంతితో మెరిసిపోతోంది. ఇంతకన్నా ‘సిరిజిమ్ము వదనమ్ము’ ఇంకెక్కడా దొరకదనుకున్నాడు. ఆమె మేనిలోని సొంపులన్నీ ఇంపొసగు ఆభరణాల్లా ఉన్నాయి. ఆమె శరీర ఆకృతి అంతా అనేక కృతులలోని వర్ణనల సమాహారంలా ఉంది.

శ్రీనాధరావుకు వరధుని తేనెతుట్టెలా దొరికింది.

ఆమెను అందలం ఎక్కించాడు. ఆరునెలల పాటు దగ్గర కూర్చొజెట్టుకుని వ్యాపార లావాదేవీలన్నీ పిల్లాడికి పాఠం చెప్పినట్లు చెప్పాడు. ఆర్థులతో, ప్రత్యర్థులతో ఎలా నడుచుకోవాలో సోదాహరణంగా వివరించాడు.

వరూధుని మనసు పాదరసం లాంటిది.

త్రినాథరావు ఆమెకు చెప్పాడు “మనకు పదిమంది సివిల్ ఇంజనీర్లు ఉన్నారు. అయిదుగురు అడ్వకేట్స్ ఉన్నారు. యాభైమంది మార్కెటింగ్ వాళ్ళున్నారు. ఇంకో యాభైమంది ఆఫీసు సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరి చేతా రోజూ పరుగులు పెట్టించి పనులు చేయించాలి. ఎవరిని అదిరించకూడదు. బెదిరించకూడదు. చెరగని చిరునవ్వుతోనే చంద్రకోల విదిలించినట్లు ఉండాలి.

రోజూ వంద మంది కస్టమర్లు వస్తారు. అందరూ లక్షలు గుమ్మరించరు అయినా సరే, అలుపు సొలుపు లేకుండా, కలకండ లాంటి పలుకులతో ఆకట్టుకోవాలి. డబ్బు కట్టించుకోవాలి. ఇది అంత తేలికకాదు. అరచేతిలో స్వర్గం చూపించాలి. మాటలతో మెస్మరిజం చెయ్యాలి..” అంటూ ఎన్నో విషయాలు ఆమెకు వివరించాడు.

వరూధునికి ఇది తలవని తలంపుగా, ఒళ్లో వచ్చిపడిన మల్లెల మాలలా ఉంది. ముల్లెల మూటలా ఉంది.

చక చకా అన్నీ చేర్చేసుకుంది. గబగబా అదృష్టపు నిచ్చెనల మెట్లు ఎక్కేసింది.

త్రినాథరావుకి కుడిచెయ్యి, కుడి భుజమూ, మనసులోని ఊహ, నోటి లోని మాట – అన్నీ వరూధినే అయింది.

ఆమె అవసరం అలాంటిది.

చిన్ననాడే దారిద్ర్యం అనే పేగును మెడన వేసుకుని పుట్టింది. ఎదిగీ ఎదగక ముందే ఎవడినో అంటగట్టారు. పెనం మీద నుంచి గెంతి పొయ్యిలో పడినట్లు అయింది.

పెళ్ళాం పుస్తెలు అమ్ముకుని తినే, తాగే మగవాడి మీద ఏ స్త్రీకి అయినా ఏం గౌరవం ఉంటుంది? నిస్సారమైన ఆమె సంసారం, పాడుబడిన గుడిలో మకిల పట్టిన మట్టి ప్రమిదలో వెలిగించిన దీపంలా ఉంది.

ఈ ఆరు నెలలనే వరూధిని దశ దశవిధాలుగా తిరిగింది. మంగళగౌరి రియల్ ఎస్టేట్ డైరెక్టర్ స్థాయికి ఎదిగింది. కారు, మేడ, చేతినిండా డబ్బు, చుట్టూ పరివారమూ, పేరూ, ప్రతిష్ఠలతో ఆమె జీవితం మిట్ట మధ్యాహ్నపు మార్తాండునిలా అప్రతిహతంగా వెలిగిపోతోంది.

కొత్త వెంచర్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఒకరిద్దరు కష్టమర్ల ద్వారా, చార్మినార్ అవతల జియాగూడాలో ఉన్న ఒక మహాత్ముడి గురించి విన్నది.

వరూధిని, త్రినాథరావును వెంట బెట్టుకుని ఆయన ఆశ్రమానికి వెళ్లింది. గడ్డాలు, మీసాలు పెంచిన ఆయన అంజనేయుని భక్తుడు.

సాదాసీదాగా ఉన్నాడు.

ఇద్దరూ ఆయన పాదాలకు నమస్కరించారు.

“మీ దంపతుల అభీష్ట సిద్ధిరస్తు” అని ఆయన దీవించాడు. తాము దంపతులము కాము అని, అంటూ, వచ్చిన పని చెప్పారు.

“ఏడు శనివారాలు వచ్చి, ఆంజనేయుడికి ఏడు ప్రదక్షణలు చేసి చివరివారం వడమాల చేయిస్తే, ఎలాంటి పని అయినా నెరవేరుతుంది” అని స్వామీజీ చెప్పాడు.

త్రినాథరావుకు వీలు పడలేదు గానీ, వరూధిని వారం వారం వచ్చి ప్రదక్షణాలు చేసింది. స్వామీజీతో కొంచెం చనువుగా మాట్లాడేదాకా వచ్చింది.

“మొదటి రోజున మమ్మల్ని దంపతులుగా దీవించారేం, స్వామీ?” అని అడిగింది.

“వాక్శుద్ధి ఉన్న చోట, వాక్సిద్ధి ఉంటుంది. అయినా అంజనేయుడే అలా అనిపించాడు. నాదేముంది?” అన్నాడు స్వామీజీ.

“మీరు అన్నమాట నిజమై, మమ్మల్ని దంపతులను చేసే బాధ్యత మీ మీదే పెడుతున్నాను స్వామీ. నా ఈ కోరిక నెరవేరితే, మీ ఆశ్రమానికి పదిఎకరాల భూమిని కూడా ఇప్పించే పూచీ నాది” అన్నది వరూధిని.

“నామీద భారం పెట్టావేమమ్మా? మీరిద్దరూ రోజంతా కల్సిమెల్సి ఉంటారు గదా. ‘ఘృత కుంభ సమా నారీ తప్తా౦గా రాసమః పుమాన్’- అన్నారు. స్త్రీని నేతి కుండతోనూ, పురుషుని అగ్నితోనూ పోల్చారు. నేయి తోడయితే అగ్ని ప్రజ్వరిల్లుతుంది గదా” అన్నాడు స్వామీజీ నవ్వుతూ.

“ఇద్దరం సాయంత్రం అందరూ వెళ్ళిపోయాక, జమా ఖర్చులు. భవిష్యత్ ప్రణాళికలు చర్చించుకుంటాం. ఆ సమయంలో నా ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉన్నాను, మాటల్లోనూ, చేతల్లోనూ కూడా. ఆయనకు ఇష్టమే. కానీ ఎందుకో వెనక అడుగు వేస్తున్నాడు. మీరు కొంచెం ఆయనకు నచ్చచెబితే ప్రయోజనం ఉంటుందని అనుకుంటున్నాను” అన్నది వరూధిని.

“తపోధనుల తపస్సును అపహరించగల అప్సరసలా ఉన్నావు. నీకు సాధ్యం కానిదేముంది?” అన్నాను స్వామీజీ చిరునవ్వు గడ్డంలో దాచుకుంటూ.

“నిజమే నేను అందమైన దానినే. కానీ ఎందుకో ఆయన చలించడం లేదు. నిస్సారమైన సంసారం నుంచీ బయటపడాలి. ఇంటికి వెళ్తే.. ఎన్ని ఉన్నా, ఎందుకో నా మనస్సు అంతా విష సర్పాలతో నిండిన మడుగులా ఉంటోంది. ఈ నా జీవితం ఎండిన నదిలాగా ఉంది. మీరే ఏదో ఒక విధంగా నన్ను కడతేర్చండి స్వామీ” అన్నది వరూధిని. ఆమె ముఖం వర్షించే మేఘంలా ఉంది.

“కలలోనూ, ప్రేమకళలోనూ అసాధ్యం అయినది ఏమీ లేదు. నిజానికి నీవే దీన్ని సాధించగలవు. అయినా అడిగావు కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. ఒకసారి ఆయన్ని నా దగ్గరకు పంపించు” అన్నాడు స్వామీజీ.

తరువాత శనివారం నాడు త్రినాథరావు ఒక్కడినే స్వామిజీ దగ్గరకు పంపి, ఒంట్లో బాగా లేదన్న సాకు చెప్పి తను తప్పించుకుంది.

పూజ అయినాక స్వామీజీ త్రినాథరావుతో ఆ మాటా ఈ మాట మాట్లాడుతూ, అసలు విషయంలోకి వచ్చాడు.

“మీ బిజినెస్ ఎలా ఉంది?” అని అడిగాడు.

“అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఉంది నా పరిస్థితి. అన్ని అనుమతులూ ఇచ్చారు. మళ్లీ ఏదో అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఈ రెండు టవర్స్ నిర్మిస్తే నా జన్మ ధన్యమై పోతుంది స్వామీ. మీరే ఏదన్నా రక్షరేక ఇవ్వండి..” అన్నాడు త్రినాథరావు.

“శ్రీరామ రక్ష లేనిదే ఎన్ని రక్షరేకలు కట్టినా ప్రయోజనం లేదు. మానవ ప్రయత్నం ఒకటే సరిపోదు. దైవానుగ్రహమూ ఉండాలి. గ్రహాలు అనుకూలించాలి. నీది కుంభరాశి. ఏలినాటి శని నడుస్తోంది. ఇంకో అయిదేళ్ల దాకా నీవు ఏ పని మొదలుపెట్టినా, సానుకూలం కాదు, గ్రహాలు అనుకూలంగా ఉన్న స్త్రీ నీ సహచరి అయితే, పరిస్థితులు మారవచ్చు..”

“అదెలా స్వామీ?”

“వరూధిని జాతకం దివ్యంగా ఉంది. మీరిద్దరూ ఒకటి కాగలిగితే పరిస్థితులు మారతాయి.. ఆమె కూడా మహర్జాతకురాలు అవుతుంది. నీకిష్టమైతే నేను ఆమెతో మాట్లాడతాను..” అన్నాడు స్వామీజీ.

“ఉన్న విషయం మీతో చెబుతున్నాను స్వామి. నాకు ఇదివరకే మంగళగౌరితో వివాహం అయింది. అమెరికాలో మంజులవాణి కల్సింది. పెళ్లి అంటూ చేసుకోలేదుగానీ, ఆమెతో సహజీవనం సాగిస్తున్నాను. ఆమెకు నా అన్నవాళ్లు తీరు గనుక పెద్దగా అభ్యంతరం లేకపోయింది. కానీ వరూధినికి వివాహం అయింది. భర్త ఉన్నాడు. నా స్వార్థం కోసం ఒక సంసారాన్ని కూలదోయటం పాపం కదా అన్న ఆలోచనే నన్ను వేధిస్తోంది..”

“నీకు మీవాళ్లు త్రినాథరావు అని పేరు పెట్టారు. ఆ రోజు వాళ్లకు తెలియదు – నీ జీవితంలోకి ముగ్గురు వస్తారని, ఇక వరూధిని విషయానికి వస్తే, వాళ్ల సంసారం అనుకున్నంత సవ్యంగా ఏమీ లేదు. భర్త దేశాంతరగతుడైనా, మరణించినా, సన్యసించినా, నపుంసకుడైనా, ధర్మ భ్రష్టుడై పోయినా స్త్రీ మరొక వివాహం చేసుకోవచ్చునని పరాశర స్మృతిలో ఉన్నది. వరూధిని జీవితం మండుటెండలో ఎండిన తీగెలాగా ఉన్నది. కనుక, ఆమె సంసారాన్ని నీవు విచ్ఛిన్నం చేయటం లేదు. ఆమె గుండె జ్వలించే అగ్ని గుండంలా ఉంది. కనుక మీరు వివాహం చేసుకోవటం వల్ల ఆమెను పట్టి పీడిస్తున్న గ్రహణం నుంచి విడిపించినవాడవే అవుతావు. టవర్ల నిర్మాణం పూర్తి కావాలన్న నీ కల నెరవేరాలంటే, ఆమెను చేపట్టటం తప్ప మరో మార్గం నాకు కనిపించటం లేదు” అని హితబోధ చేశాడు స్వామిజీ.

వారం రోజులు ఆలోచించిన తరువాత త్రినాథరావు వరూధినిని వివాహం చేసుకోవటానికి అంగీకరించాడు. ఇద్దరూ స్వామీజీ పాదాలకు నమస్కరించారు. మరో రెండు నెలలదాకా మంచి రోజులు లేవు అన్నాడు స్వామీజీ. ఈ రెండు నెలల్లో ఒకసారి అమెరికా వెళ్ళివస్తానన్నాడు. అమెరికా వచ్చాడు.

రెండు నెలలూ గడిచి పోయాయి.

మంజులవాణి ఎప్పుడూ స్వాగతాలు తప్ప వీడ్కోలు చెప్పి ఎరుగదు.

ఈసారి వీడ్కోలు చెప్పింది.

***

త్రినాథరావు విమానంలో తన సీట్లో కూర్చున్నాడు. బయల్దేరటానికి సిద్ధంగా ఉంది. ఎంత పెద్ద వ్యాపారం చేస్తున్నా ఆయన ప్రయాణం ఎప్పుడూ ఎకానమీయే. లేటుగా వచ్చిన వాళ్లు ఎవరో పైన ఓవర్ హెడ్ ర్యాక్‍లో ఉన్న బ్యాగులు పక్కకు జరిపి వాళ్ల స్ట్రోలర్ పెట్టుకున్నారు. చోటు చాలక అది సగం బయటకే ఉంది.

ఎయిర్ హోస్టెస్ వచ్చి ఆ స్ట్రోలర్‍ను తీసి సర్దబోయే సమయంలో పొరపాటున అది త్రినాథరావు నెత్తి మీద పడింది. స్ట్రోలర్ చక్రాలు నడినెత్తిన బలంగా తగలడం వల్ల కళ్లు తిరిగినట్లు అయింది.

ఎయిర్ హోస్టెస్ కంగారు పడింది. పక్కన కూర్చున్న వాళ్లు కూడా లేచి ఆయనకు సపర్యలు చేశారుగానీ, ఆయన క్రమంగా కోమాలోకి వెళ్లి పోయాడు.

మనిషి అంతస్తుల మీద అంతస్తులు లేపాలని, కోట్లకు పడగలెత్తాలని కళ్ళు మూసీ, కళ్ళు తెరిచి ఎన్నో కలలు కంటాడు. కానీ ఈ నీటి బుడగ ఎప్పుడు పేలిపోతుందో తెలియదు. ప్యూజ్ ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదు. మృత్యువు ఎప్పుడు ఎవర్ని ఎలా కౌగలించుకుంటుందో అంత కన్నా తెలియదు.

త్రినాథరావు సెల్ ఫోన్‍లో ఉన్న నెంబర్లను పట్టుకుని మంజులవాణికి ఫోన్ చేశారు. ఆమె హైదరాబాద్ ఆఫీసు నెంబరు ఇచ్చింది. ఒకరోజు ఆలస్యంగా త్రినాథరావు శరీరం మంగళగౌరి ఇంటికి చేరింది.

వరూధిని దగ్గర ఉండి జరగవల్సిన తంతు అంతా జరిపించింది.

***

రెండేళ్లు గడిచి పోయాయి.

త్రినాథరావుకి రుణం ఇచ్చిన బ్యాంకు వాళ్లు అయన వారసురాలు అయిన మంగళగౌరికి నోటీసు ఇచ్చారు. ఆమె ఎప్పుడూ తమ కంపెనీ వ్యవహారాలు పట్టించుకోలేదు. ఇప్పుడూ పట్టించుకోలేదు. బ్యాంక్ వాళ్లు పంపిన నోటీసు కాగితాలను పసుపు, కుంకుమ పొట్లాలు కట్టుకోవటానికి వాడుకుంది. ఆమె పత్తితో వత్తులు చేస్తోంది. భక్తితో పూజలు చేస్తోంది. ఉపవాసాలు ఉంటోంది. ‘భారపు పగ్గాలు పాపపుణ్యములు నేరుపున బోవు నీవు వద్దనక’ అని పాడుకుంటోంది.

మంజులవాణి రియల్ ఎస్టేట్ వ్యాపారం మానేసి గ్రేట్ మాల్ ఒక దుకాణంలో క్యాషియర్‍గా చేరింది.

వరూధిని ఇరవైనాలుగు అంతస్తుల టవర్ల నిర్మాణాన్ని శరవేగంతో పూర్తి చేస్తోంది. ఈసారి నలభై ఎనిమిది అంతస్తుల టవర్ల నిర్మాణానికి ప్లాన్లు తయారు చేయిస్తోంది.

Exit mobile version