చిరుజల్లు-133

0
2

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

అ…. పూర్వ విద్యార్థులు

[dropcap]ము[/dropcap]ప్ఫయి సంవత్సరాల క్రిందట తనతో పాటు కాలేజీలో చదువుకున్న స్నేహితులందరినీ పిలిపించి, ఒక రోజు సరదాగా గడపాలన్నది కొండలరావు ఆశ.

కాలేజీ నుంచి విడిపోయేటప్పుడు అందరూ కల్సి తీయించుకున్న గ్రూఫ్ ఫొటో ఒకటి ఆయన దగ్గర ఉంది. అందులో ఒకరిద్దరివి తప్పు, ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు కూడా వాళ్ళందరి పేర్లు చెప్పగలడు.

అయితే అయిదారుగురు తప్ప, అందరూ రెక్కలు కట్టుకుని ఎక్కడెక్కడికో ఎగిరిపోయారు. ఒక్కొక్కరు ఒక్క రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. వాళ్లందరినీ ఒకే రోజు ఒకే చోటుకి రప్పించడం అంత తేలిక కాదు. ముందు అసలు వాళ్ల ఆడ్రసులు, ఫోన్ నెంబర్లూ కనుక్కోవటం, సంప్రదించడమే కష్టం.

కానీ కొండలరావు అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యాలని సంకల్పించాడు. అదొక యజ్ఞంలా మొదలెట్టాడు. ఎవరో ఒక స్నేహితుడిని పట్టుకుని, అతని నుంచి మరో ఒకరిద్దరినీ వాళ్లనుంచి మరి కొందరినీ ఒప్పించి రప్పించే ప్రయత్నం చేశాడు.

పూర్వ విద్యార్థులలో అయిదారుగురు ఆ పట్టణంలోనే రకరకాల వృత్తులలో ఉన్నారు. ముందు వాళ్లందరినీ కూడగట్టుకుని, నాలుగయిదు మీటింగ్లు పెట్టుకుని, దానికి రిసెప్షన్ కమిటీ అని పేరు పెట్టాడు.

ఎప్పుడో పేరు విడిచి వెళ్ళిన వాళ్లకు ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఏమేం ఉన్నాయో తెలియదు. వచ్చే అతిథులకు అన్ని సౌకర్యాలూ కల్పించటం ఈ రిసెప్షన్ కమిటీ డ్యూటీ. కొండలరావు కమిటీ అధ్యక్షుడు అయితే, రైబ్రేరియన్ గోపాలరావు ఉపాధ్యక్షుడు.

దాదాపు నలభైమంది పూర్వవిద్యార్థులు అనుకున్న తేదీకి రావటానికి సుముఖత తెలియ జేశారు.

అందులో ఒకరు హెకోర్టు జడ్జి విశ్వనాధం, మరొకరు ప్రొఫెసర్ చంద్రశేఖర్, ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు గవర్నమెంటు ఆఫీసర్స్, మరో ఇద్దరు రాజకీయ నాయకులు, ఇద్దరు పారిశ్రామికవేత్తలు, ముగ్గురు సినిమా పరిశ్రమ లోని వాళ్లు, ముగ్గురు పత్రికా సంపాదకులు – ఇంకా అనేక రంగాలకు చెందిన వాళ్లూ ఉన్నారు.

కొందరు దగ్గర్లోని విమానాశ్రయానికి, కొందరు నలుమూలలనుంచి వేర్వేరు సమయాల్లో వచ్చే రైళ్లల్లోను, మరి కొందరు సొంత కార్లల్లో వస్తున్నారు.

వీళ్లందరికీ ఎదురేగి, వాళ్లను సాదరంగా ఆహ్వానించి, నాలుగయిదు హోటళ్లల్లో వీళ్ల కోసం రిజర్వు చేసిన రూమ్‍లలోకి పంపి, వాళ్లకు సమయానికి టిఫిన్లు, కాఫీలు, భోజనాలు, ఇంకా ఏమైనా ఉంటే ఆ అవసరాలు అన్నీ తీర్చే పని పాపారావు ఒక్కడే తన నెత్తిన వేసుకున్నాడు.

పాపారావుకి, ఆ ఊర్లో ఎలక్ట్రానిక్ షాపు ఉంది. ఆ రోజు హాలును ఆ అందంగా అలంకరించటం, మైక్, లైటింగ్ ఏర్పాట్లు చూడటం కూడా పాపారావు పనే.

ఎదురు చూసిన రోజు దగ్గరకొచ్చింది. ముందు రోజు నుంచే హడావిడి మొదలైంది.

పాపారావు దగ్గర్లోని ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి జడ్జి విశ్వనాధం గారికి స్వాగతం పలికి రిసీవ్ చేసుకున్నాడు.

తన పేరు పాపారావు అనీ, తనూ ఆ సంవత్సరం కాలేజీలో చదివిన పాత విద్యార్థిననీ చెప్పుకున్నాడు. ఆయన సూట్‍కేసు అందుకుని బయట ఆగి ఉన్న కారు దగ్గరికి తీసుకొచ్చాడు. జడ్డిగారు ‘ఊ’ అని గానీ’; ‘ఆ’ అని గానీ అనలేదు. ఆ పాపారావు ఒక ఎలక్ట్రిషియన్ కావడం ఆయనకు నచ్చలేదు. ఆ కారు నచ్చలేదు. ఆయనకి కేటాయించిన హోటలు నచ్చలేదు. రూం నచ్చలేదు. టిఫిన్ నచ్చలేదు.

కాసేపటికి లైబ్రేరియన్ గోపాలరావు వచ్చి నమస్కరించి వినమ్రంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు.

“ఆ ఎయిపోర్ట్‌కి వచ్చిన వాడు ఎవడయ్యా? నీకంటే వెధవలా ఉన్నాడు. ఆ చెత్త కారులోనా తీసుకురావడం? ఈ హోటలు ఏమిటి? థర్డ్ క్లాస్‌లా ఉంది..” అని విసుక్కున్నాడు.

అదే సమయంలో కొండల్ రావు ప్రొఫెసర్ చంద్రశేఖర్‌ని రిసీవ్ చేసుకుని, మరో హోటల్లో ఆయన గది చూపించారు. చంద్రశేఖర్ సంతోషించాడు. “ఊరు చాలా మారిపోయింది. కొత్త హోటల్స్, షాప్‌లూ, అసలు అప్పటికీ ఇప్పటికీ పోలికే లేదు” అన్నారాయన.

“అవునండీ.. చాలా మారిపోయింది. మనమూ చాలా మారిపోయాం గదా” అన్నాడు కొండలరావు.

“అవునవును, కాలం మన కళ్ల ముందే ఎన్నెన్నో గారడీలు చేస్తుంది” అన్నాడు ప్రొఫెసర్.

వచ్చిన రాజకీయ నాయకులు ఇద్దరిలో ఒకరు అధికార పార్టీ కాగా, మరొకరు ప్రతిపక్ష పార్టీ. ఎందుకైనా మంచిదని ఇద్దరినీ వేరు వేరు హోటల్స్‌లో ఉంచారు. అయినా విమర్శలు తప్పలేదు

“వాడికి ఆ హోటల్లో ఎందుకు ఉంచారు? ఆ గోపీ హాల్ చాలు వాడి ముఖానికి..” అని ఒకరంటే, “వాడికి అంత ఆర్భాటం అక్కర్లేదు” అని మరొకరు అన్నారు. సినిమావాళ్లు సొంత కార్లల్లో అర్ధరాత్రి దాటాక వచ్చారు. అదీ ఒక్కొక్కరు ఒక్కో సమయంలో. వాళ్లందరికీ ఫోన్ చేస్తూ, వాళ్ళను హోటల్ రూంలలో ఉంచాడు పాపారావు.

అతనికి నిద్రలేదు, తిండి తినే తీరికలేదు.

అనుకున్న రోజు రాసే వచ్చింది.

ఆ ఉదయం కూడా ఇంకా కొంతమంది వస్తునే ఉన్నారు. వాళ్లందరికీ ఫోన్ చేస్తూ, మరో పక్క సమావేశం జరగబోయే హాల్‍ను అందంగా అలంకరించటంలో మునిగిపోయాడు పాపారావు.

పదిగంటలకు కాలేజీలో ఒక చోట ఒక మొక్క నాటే కార్యక్రమం పెట్టారు. ప్రముఖులంతా హాజరైనారు.

రాజకీయ నాయకుడు ఆనందరావు మొక్కను పాతిపెడితే, జడ్జి గారు నీరు పోశారు.

ప్రతిపక్ష నాయకుడు సుబ్రమణ్యం అన్నాడు “వాడిది ఐరన్ లెగ్. వాడి పార్టీయే రెండుసార్లు ఓడిపోయింది. ఇంక ఈ మొక్క ఏం పెరుగుద్ది?”

“ఇప్పుడు నీ పార్టీ గతి ఏంటో ఆలోచించుకో. ఇంకో పాతికేళ్ల దాకా నీకు సీటు దక్కదు” అన్నాడు అధికార పార్టీ ఆనందరావు.

ఇద్దరు సినిమా యాక్టర్లు, ఒక సినీ నటి కూడా వచ్చారు.

“వసంతా, నువ్వు ఈ మొక్క అంత ఉన్నప్పుడు కాలేజీలో చదివావు. ఇప్పుడు చూడు ఆ మర్రిచెట్టు అంత ఎదిగావు” అన్నాడు సరసం ఆడుతూ మరో నటుడు.

“నువ్వు తాతయ్య అయ్యావు. నువ్వు కూడా నన్ను అంటే ఎట్లా?” అని తిప్పికొట్టింది వసంత.

గవర్నమెంటు ఆఫీసర్లు ముగ్గురూ చాలా ముభావంగా, ఎటో చూస్తూ, జరుగుతున్న దానితో తమకేమీ సంబంధం లేనట్లు ఎడ ఎడంగా తిరుగుతున్నారు.

మధ్యాహ్నం సుధా హోటల్లో అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశారు.

అక్కడా ఎవరి హోదాను వారు గొప్పగా భావిస్తూ ఒకరితో మరొకరు అంటీ ముట్టనట్లే ఉన్నారు. పారిశ్రామికవేత్తలు మాత్రం గవర్నమెంట్ ఆఫీసర్స్‌ని కనిపెట్టుకుని వాళ్ళ చుట్టే ఈగలు ముసిరినట్లు ముసురుతున్నారు.

“మీరు కాలేజీ రోజుల్లోనూ చాలా ఇంటలిజెంట్. నేను అప్పుడే అనుకున్నాను అత్యున్నత పదవికి చేరుకుంటారని..” అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

వచ్చిన వాళ్ళంతా ఒకప్పుడు తమతో కల్పి చదువుకున్నవాళ్లు. అప్పట్లో ‘ఏరా’ అంటే ‘ఏరా’ అనుకున్న వాళ్లు. ఇప్పుడు పదవుల మెట్లు ఎక్కి అందనంత ఎత్తున ఉన్నారు. పూర్వ పరిచయాలు గుర్తు చేసి ఇప్పటి తమ బాధలు చెప్పుకుని, ఒకింత సాయం చేయమని అడగాలని సగం మందికి మనసులో ఉంది. తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు.

అడ్వకేట్ సూర్యారావు, జడ్జి విశ్వనాధంకి ఆనాటి స్నేహాన్ని గుర్తు చేస్తున్నాడు.

లైబ్రేరియన్ గోపాలరావు కొడుకు యం.ఏ. చదువుతున్నాడు. కొడుకు చేత పి.హెచ్‌డి. చేయించాలని ఆయన తాపత్రయం. అందుకని ప్రొఫెసర్ చంద్రశేఖర్‍ను అంటిపెట్టుకుని నీడలా తిరుగుతున్నాడు.

పాపారావు కూతురు చదువు పూర్తి అయింది. ఏదన్నా గవర్నమెంటు ఉద్యోగం ఇప్పించాలని ఎదురు చూస్తున్నాడు. తెల్సిన వాళ్లు ఎవరూ లేరని ఇంత కాలం మథనపడుతున్నాడు. తనతో భుజాలు భుజాలు రాసుకుని తిరిగివాళ్లు ఇప్పుడు ప్రభుత్వ అధికారులుగా ఉన్నారు. అంతా అయ్యాక, వెళ్లిపోయేటప్పుడు, తన కోరిక బయట పెట్టాలని అనుకుంటున్నాడు.

సినిమా నటులు ఇప్పుడు వేషాలు లేక గోళ్ళు గిల్లుకుంటున్నారు. ఒక పారిశ్రామికవేత్త చుట్టూ చేరారు. కొత్త సినిమా మొదలు పెట్టమని ప్రోత్సహిస్తున్నారు.

“మేమంతా ఉన్నాం గదా, తలా ఒక చెయ్యి వేస్తాం” అన్నది వసంత, “నువ్వు చెయ్యి వేయవద్దు. నువ్వు వేసేవి వేరే ఉన్నాయి. ఒక వేషం వెయ్యి చాలు” అన్నాడు రిటైర్ అయిన నటుడు.

ఇంకా చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు. సాయంత్రం లోపల పనులు చక్కబెట్టుకునే ప్రయత్నంలోనే, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నదీ కనుక్కుంటున్నారు, వచ్చి కల్సుకుంటామని చెబుతున్నారు.

సాయంత్రం అసలు సభ ప్రారంభం అయింది.

ముందుగా కొండలరావు స్వాగతం చెప్పాడు.

“మనం అందరం ఈ ఊళ్లో పుట్టి పెరిగాం. ఇది మన సొంత ఊరు. పుట్టి పెరిగిన ఊరిని, కనిపెంచిన తల్లినీ మర్చిపోలేం. కనిపెంచిన తల్లి ప్రేమ, పైకి కనిపించని ప్రేమ. అమ్మ ప్రేమ లాంటిదే, ఉన్న ఊరి మీద ఉండే ప్రేమ కూడా.. నా అభ్యర్థనను అంగీకరించి, మీ పనులన్నీ పక్కన పెట్టి, ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికీ అభినందనలు..” అన్నాడు.

సభకు అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ చంద్రశేఖర్ అన్నాడు – “మాట్లాడవల్సిన వాళ్లు చాలామంది ఉన్నారు. సమయం తక్కువగా ఉంది. అందుచేత మీ ప్రసంగం ఎలా ఉండాలంటే – దొరసాని గౌను లాగా ఉండాలి. వీలైనంత పొట్టిదిగా ఉండాలి. కానీ కవర్ చేయాల్సిన వాటిని అన్నిటినీ కవర్ చెయ్యాలి.. మనం అందరం ఇక్కడ విద్యను అభ్యసించాం. విద్య అంటే తెలియని విషయాలను తెలియజేసేది. జీవితమే ఆసలైన విద్యను నేర్పుతుంది. తెలియని వాటిని రోజుకో కొత్త విషయాన్ని తెలియజేస్తుంది. ఎవరి వృత్తి వాళ్లది. ఎవరి లోకం వాళ్లది. క్లాస్ రూంలో ఉన్నంత సేపు మనది ఒకటే క్లాస్. ఆ రూంలో నుంచి బయటకు వచ్చాక, ఎవరి క్లాస్ వాళ్లదే. ఎవరి విద్య వాళ్లదే.. అందరూ తమ తమ రంగాల్లో ఆరితేరిన వాళ్లే. అందరూ గొప్ప విద్యావంతులే..” అని ముగించాడు.

జడ్జి విశ్వనాదం మాట్లాడాడు – “మనదేశంలోని ఉన్నన్ని చట్టాలు ప్రపంచంలో ఎక్కడా లేవని అంటాను. ఎక్కడ నేరప్రవృత్తి గల వాళ్ళు ఎక్కువ మంది ఉంటారో అక్కడ ఎక్కువ చట్టాలు, ఎక్కువ కోర్టులూ అవసరం అవుతాయి. అసలు ఏది సరియైన విధానం, ఏది సరిమైన విధానం కాదు ఎవరు నిర్ణయించాలి? కాలం మారుతూ ఉంటుంది. కాలంతో పాటు పరిస్థితులూ, అవసరాలూ మారుతుంటాయి. నిన్న సరియైనది అనుకున్నది, నేడు సరియైనది కాకపోవచ్చు. ఇవాళ సరియైనది. అనుకున్నది రేపు సరియైనది కాకపోవచ్చు. అందుచేత ఎప్పటికప్పుడు ఉన్న చట్టాలను సవరించాల్సి ఉంటుంది. కొత్త చట్టాలను చేయాల్సి ఉంటుంది” అని అన్నాడు.

పారిశ్రామికవేత్త ఆయన ధోరణిలో అన్నాడు “మన పట్టణానికి చుట్టుపక్కల మరిన్ని పరిశ్రమలు పెట్టటానికి మేము సిద్ధంగా ఉన్నం. మరి ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకుని తగిన పరిషన్లు కల్పించాలి” అంటూ సూచించాడు.

ఒక వేదాంతి అన్నాడు – “మనం చదువుకున్నాం అని అనుకుంటాం. కానీ ఎంత చదువుకున్నా, ప్రతి నాగరికుడిలోనూ ఎలుగెత్తి అరిచే అనాగరికుడు ఉన్నాడు. మనిషి జేబులో డబ్బు ఉండకపోయినా పర్వాలేదు, గుండెలో దయాగుణం ఉంటే చాలు. కష్టపడి పనిచేసే వాళ్లంతా మేధావులు కారు. మేధావులు ఎవరూ కష్టపడి పని చేయలేరు. సమాజం బాగు పడటానికి ఇద్దరూ కావాలి. ఒకరి సహకారం మరొకరికి కావాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నవాళ్ళంతా ఒకనాటి మిత్రులు, సన్నిహితులు. నీవు మారినప్పుడల్లా నీకు అనుకూలంగా మాట్లాడేవాడే నీకు మిత్రుడు కాదు. నీకు పరిస్థితులు అనుకూలించనప్పుడూ, నీకు నేను ఉన్నాను అని ఆదుకునేవాడే సరైన మిత్రుడు” అని ముగించాడు.

రాజకీయ నాయకుడు మైక్ ముందుకు వచ్చాడు – “ప్రజల సమస్యలుం తీర్చటానికి మేము ఉన్నాం. అందుచేత సమస్యల గురించి మీరు బాధ పడవద్దు, మీరే ఒక సమస్య కాకుండా చూడండి” అనగానే ప్రతిపక్షానికి చెందిన రాజకీయ నాయకుడు “నువ్వే అసలు పెద్ద సమస్య” అన్నాడు.

“షటప్” అని ఒకరంటే “యూ షటప్” అని మరొకరు అన్నారు.

ఇంతలో మైక్ నుంచి ‘కీచు’ మని చెవులు చిల్లులు పడేంత శబ్దం వచ్చింది

“నా గొంతు నొక్కేందుకు మీరు ప్రయత్నిస్తున్నారు” అంటూ ఆయన అధ్యక్షుడి వైపు చూశారు.

“బావుంది. నేనేం చేశాను” అని ఆయన అన్నారు.

ఎవరేం మాట్లాడుతున్నదీ ఎవరికీ వినపడలేదు.

సభాధ్యక్షుడు, నిర్వాహకుడు ‘పాపారావ్, పాపారావ్’ అంటూ వేదిక కింద మైక్ సెట్ ఆపరేటర్ ఉన్న వైపు చూశారు. అక్కడ ఎవరూ లేరు.

“సభ జరుగుతుంటే, ఇంత నిర్లక్ష్యమా? మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ ఫెలోస్” అంటూ లేచాడు.

సభలో అంతటా రసాభాస అయింది.

సభ ముగిసినట్లు అధ్యక్షుడు ప్రకటించారు. అందరూ లేచి భోజనాల శాలకు వెళ్లిపోయారు.

రెండు రోజుల నుంచి ఈ సభా ఏర్పాట్లలో మునిగి తేలుతూ, నిద్రాహారాలు మాని పని చేసినందు వల్ల పాపారావుకి గుండెపోటు వచ్చింది.

రిసెప్షన్ కమిటీ సభ్యులు గోపాలరావు, మరో నలుగురు – సభకు ఆటంకం కలగకూడదని, ఏ మాత్రం హడావిడి చేయకుండా పాపారావును దగ్గరలోని హాస్ప‍టల్‌కి తీసుకెళ్లారు.

ఈ రాత్రి గడిస్తే గానీ, ఏమీ చెప్పలేమని డాక్టర్లు చెప్పటంతో అతనికి సేవ చేస్తూ కమిటీ సభ్యులు తెల్లవార్లూ హాస్పటల్ లోనే ఉన్నారు.

ఒక్క కొండలరావుకి తప్ప మిగిలిన వారికి ఎవరికీ ఈ విషయం చెప్పలేదు.

ఆయనా ఈ సంగతి పొక్కనివ్వలేదు.

సభకు ఆటంకం కలిగినందుకు అందరికీ క్షమాపణలు చెప్పుకున్నాడు. ఎందుకు ఆటంకం కలిగిందని ఎవరూ అడగలేదు.

వాళ్ల స్థాయి వేరు.

వాళ్ల క్లాస్ వేరు.

ఇవన్నీ చిన్న విషయాలు. ‘వీళ్లకి సభా మర్యాదలు తెలియదు’ అని వ్యాఖ్యానించారు.

మర్నాడు ఎక్కడి వాళ్ల అక్కడ బయల్దేరి వెళ్లిపోయారు. పాపారావును ఐసియులోకి తీసుకెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here