Site icon Sanchika

చిరుజల్లు-135

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

గాలి తరంగాలు

[dropcap]శ్రా[/dropcap]వణ శుక్రవారం.

శకుంతల సాయంత్రం తనకు తెల్సిన రెండు మూడు కుటుంబాల వాళ్ళను పేరంటానికి పిల్చింది.

పేరంటానికి వచ్చిన వాళ్లల్లో అమ్మలతో పాటు, వాళ్ళ అమ్మాయిలూ వచ్చారు.

సుందరితో పాటు ఆమె కూతురు సౌందర్య కూడా వచ్చింది. పేరుకు తగినట్లే సౌందర్య ముఖంలో సౌందర్యం ఉట్టిపడుతూ ఉంటుంది. ఇంతలేసి కళ్లతో కళ గల మొహం. శాపవశాత్తూ దివి నుండి భువికి దిగిన దేవకన్యలా ఉంటుంది. ఒకసారి చూసినవాళ్లు మళ్లీ మళ్లీ తల తిప్పిచూడకుండా ఉండలేరు. చదువు మీద పెద్ద ఇంటరెస్ట్ లేదు. అంత లావు పుస్తకాలు చదవాలంటే ‘బోర్ ఆంటీ’ అంటుంది్. అయితే గియితే ఛాన్స్ దొరికితే సినిమాలో హీరోయిన్‍గా వెలిగిపోవాలని మాత్రం కోరికగా ఉంది.

సుందరి, సౌందర్య వచ్చిన అయిదు నిముషాలకే, శకుంతల చెల్లెలు వరలక్ష్మి, వరలక్ష్మి కూతురు అనుపమ వచ్చారు. అనుపమ ఎప్పుడెప్పుడు విమానం ఎక్కి అమెరికా పోదామా అని, కనులు మూసీ, కనులు తెరిచీ కలలు కంటోంది – అమెరికా సంబంధం కుదిరితే.

పేరంటం అయిపోయింది.

ఒక అరగంట తరువాత సుందరీ, సౌందర్యతో పాటే, వరలక్ష్మీ, అనుపమ కూడా ‘వస్తాం’ అంటూ ఒకేసారి బయల్దేరారు. వాళ్లు గుమ్మంలోకి వచ్చి పాదరక్షలు వెతుక్కుంటున్న సమయానికి, ఎవరో పిల్చినట్లు వచ్చాడు వంశీకృష్ణ.

అతను చెప్పులు విడుస్తున్నాడు. వీళ్లు చెప్పులు తొడుక్కుంటున్నారు. చెప్పొద్దూ, సౌందర్య వెనక్కి తిరిగేటప్పటికి, వంశీకృష్ణను అమాంతం తాకినంత పని అయింది.

“సారీ” అన్నది సౌందర్య.

సౌందర్యను చూసి నిశ్చేష్టుడైన వంశీకృష్ణ, సారీ కూడా చెప్పటం మర్చిపోయాడు.

“అంకుల్ పైన ఉన్నారు, వెళ్లు” అన్నది శకుంతల,

వంశీృష్ణ పైకి వెళ్లి అంకుల్ ఎదురుగా కూర్చున్నాడు. అంకుల్ ఆనందరావు పేరుకు లాయరే గానీ, ఆయన కవిత్వం అంటే చెవి కోసుకుంటాడు. ఏడాదికో కవితా సంకలనం అచ్చు వేయించి అడిగిన వాళ్లకీ, అడగని వాళ్లకీ కాపీలు సంతకాలు పెట్టి పంచిపెడుతూ ఉంటాడు. డిసెంబర్‍లో జరిగే బుక్ ఎగ్జిబిషన్ నాటికి పుస్తకం అచ్చొతింపించే పనిలో ఉన్నాడు. అంకుల్ ఆనందరావు పుస్తకాన్ని డిటిపి గట్రా, ఫ్రూఫ్ రేడింగ్ గట్రా, ప్రింటింగ్ గట్రా చేయించే భారాన్ని వంశీకృష్ణ తన భుజాల మీద వేసుకున్నాడు.

వంశీని చూడగానే ఆనందరావు మొహం ఆనందంతో ఉదయాన్నే విచ్చుకున్న ముద్ద మందారంలా వికసించింది.

“గుమ్మంలో కనిపించింది, ఆ అమ్మాయి ఎవరు అంకుల్?” అని అడిగాడు. వంశీకృష్ణ

“సౌందర్య అని మనవాళ్లే. పక్క కాలనీలోనే ఉంటారు. దానికి సినిమాల పిచ్చి. హీరోయిన్ కావాలన్న కోరిక. ఇవన్నీ అయ్యేవా, చచ్చేవా?” అన్నాడు ఆనందరావు.

“ఆ, ఇంటరెస్ట్ ఉంటే చెప్పండి. నా ఫ్రెండ్ ఒకడు క్రాంతి అని చిన్న బడ్జట్ ఫిల్మ్ తీస్తున్నాడు. పరిచయం చేస్తాను. కానీ రెమ్యూనరేషన్ పెద్దగా ఆశించవద్దు. లో-బడ్జెబ్ లో తీస్తున్నాడు..” అన్నాడు వంశీ కృష్ణ.

“అయితే ముందు ఆ అమ్మాయితో మాట్లాడు. మీరిద్దరూ చర్చించుకున్నాక, ఆ ప్రొడ్యూసర్‌కో, డైరెక్టర్‌కో పరిచయం చేయవచ్చు” అన్నాడు ఆనందరావు

“అలాగే అంకుల్” అన్నాడు వంశీకృష్ణ.

మర్నాడు ఆనందరావు ఆ అమ్మాయితో ఈ విషయం చెప్పాడు. ‘అలాగే’ అంది సౌందర్య.

“సరే అయితే, రేపు సాయంత్రం బ్లూఫాక్స్ హోటల్లో కలుసుకుని మాట్లాడుకోండి” అన్నాడు.

అదే విషయం వంశీకృష్ణకు చెప్పాడు.

బ్లూ ఫాక్స్ హోటల్‍కు నాలుగు చోట్ల నాలుగు బ్రాంచీలున్నాయి.

వంశీకృష్ణ హిమయత్‌నగర్‌లో ఆ సౌందర్య కోసం రాత్రి పది గంటల దాకా ఎదురు చూశాడు. సౌందర్య అమీర్‍పేటలో ఎదురు చూసి ఎదురు చూసి వెళ్లి పోయింది.

“ఆమె రాలేదు అయల్” అన్నాడు వంశీకృష్ణ.

“అతను రాలేదు అంకుల్” అన్నది సౌందర్య.

“అలాగా, మిస్ అయినట్లున్నారు. ఫోన్ నెంబర్ ఇవ్వమని శకుంతలకు చెబుతాను. మీరే మాట్లాడుకోండి” అన్నాడు ఆనందరావు.

ఆరోజు గుమ్మంలో ఎదురైన తన చెల్లెలు కూతురు అనుపమ గురించి వంశీకృష్ణ అడుగుతున్నాడని అనుకుని, వంశీకృష్ణకు అనుపమ ఫోన్ నెంబర్ ఇచ్చింది శకుంతల. “అతను నీతో ఏదో మాట్లాడాలట, మంచివాడే. అంకుల్‍కు బాగా తెల్సిన వాడే. వెళ్ళు” అని కూడా శకుంతల తన చెల్లెలు కూతునికి చెప్పింది.

ఇక ఆనందరావు సౌందర్యకు వంశీకృష్ణ ఫోన్ నెంబర్ ఇచ్చాడు. సౌందర్య ఇచ్చిన ఫోన్ నెంబర్లలో పొరపాటున చివరి రెండు నెంబర్లూ అటుది ఇటూ, ఇటుది అటూ తిరగేసి చెప్పాడు.

వంశీకృష్ణ సౌందర్య నెంబరు అనుకుని, అనుపమ నెంబర్‌కి రవీంద్రభారతికి రమ్మని ఫోన్ చేశాడు.

అనుపమ ఆటోలో రవీంద్రభారతిలో అటు పక్కనున్న వి.ఐ.పి.ల ఎంట్రస్ దగ్గర దిగి, మొదటి అంతస్తులోని ప్రోగ్రాంలో కాసేపు కూర్చుని విసుగొచ్చి ‘యూజ్‍లెస్ ఫెలో’ అని మెనేజ్ పెట్టి వెళ్లి పోయింది.

ఆనందరావు ఇచ్చిన ఫోన్ నెంబర్‍కి సౌందర్య ఫోన్ చేసి, “సాయంత్రం నెక్లెస్ రోడ్‌కి రండి మాట్లాడదాం” అని చెప్పింది. ఆ ఫోన్ కాల్ ఒక జర్నలిస్ట్‌కి వెళ్లింది. ఇలాంటివి అంటే చాలా ఆసక్తి చూపే, నాగరాజ్ అనే జర్నలిస్ట్ ఆరు గంటల నుంచీ నెక్లెస్ రోడ్ ఎదురుచూసి విసుగొచ్చి వెళ్లిపోయాడు – “డైరెక్షన్ సరిగా ఇవ్వండి” అంటూ. సౌందర్య అక్కడికి వచ్చి, వంశీకృష్ణ కోసం చూసి, చూసి తిట్టుకుంటూ వెళ్లిపోయింది.

రెండు నెలల తరువాత రెండు ప్రేమ వివాహాలకు ఆనందరావుకూ, శకుంతలకీ ఆహ్వానాలు అందాయి.

అయితే వాళ్లు అనుకున్నట్లు కాకుండా, జంటలు మారారు.

Exit mobile version