[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
విరి పనిలో విభుడేడి?
[dropcap]చి[/dropcap]దానంద ఆశ్రమంలో ఆనందమయి మాతాజీ రోజూ సాయంత్రం ఏడు గంటల నుంచీ, ఒక గంట సేపు భక్తి మార్గం గురించి భక్తులను ఉద్దేశించి ఉపన్యసిస్తారు. చుట్టుపక్కల వాళ్లు రోజూ వస్తుంటారు. మరి కొందరు శని ఆదివారాల్లో వస్తుంటారు. వచ్చిన వారందరితోనూ అందరితోనూ ఆమె ఆదరంగా మాట్లాడుతుంది. వారు తమ కష్టసుఖాలను చెప్పుకుంటారు. ఆమె తగిన సలహాలు ఇస్తుంటుంది.
ఈమధ్యనే కొద్ది మంది భక్తులతో కల్సి నైమిశారణ్యం వెళ్లి, అక్కడ నెలరోజులు ఉండి, శ్రీమద్రామాయణ పారాయణ చేసి వచ్చారు. నెల రోజుల తరువాత ఇప్పుడు మళ్లీ ఆశ్రమం భక్తజనంతో కళకళలాడుతోంది.
నిన్న – కర్మ అంటే ఏమిటి, ఉపాసన అంటే ఏమిటి; జ్ఞానము అంటే ఏమిటి అన్న విషయాలను విశదీకరించారు.
ఇవాళ – సాధకుడు – పురుషుడు, ప్రకృతి తినే వాటిని ఎలా గుర్తించాలలో తెలియజేశారు. ఈ రెండూ ఒక దానితో మరొకటి ముడిపడి ఉంటాయి. దయ, సత్యం అనేవి పురుష భాగ చిహ్నములు, జ్ఞాన మూలకమైనవి. రాగద్వేషాలు ప్రకృతిభాగ చిహ్నములు. ముందు రాగద్వేషాలను తొలగించుకుంటేనేగాని, దయాగుణం మొదలైనవి పెరగవు. అవి తొలగటానికే మంత్రము, తంత్రము అను దేవతా రహస్యాలను తెల్సుకోవాలి – అంటూ ఆనందమయి మాతాజీ ప్రబోధించారు.
ఉపన్యాసం అయిన తరువాత భక్తులంతా ఆమెకు పాదాభివందనము చేసి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్లారు.
పార్థసారథి దంపతులు కూడా ఆమె ఆశీర్వచనం తీసుకున్నారు. వారికి ఆమెతో చిరకాల పరిచయం ఉంది. ఆమె అనుమతి లేనిదే వాళ్లు ఏ చిన్న పనీ ప్రారంభించరు.
“నైమిశారణ్యం రాలేక పోయాం. శలవు దొరక లేదు” అన్నాడు పార్థసారథి.
“శివుని ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అంటారు. భగవదునుగ్రహం లేనిదే ఏమీ చేయలేము” అన్నది మాతాజీ.
“మా అబ్బాయి సత్యప్రసాద్ వివాహం చేయాలనుకుంటున్నాం” అన్నాడాయన.
“శుభం.. సంబంధాలు ఏమైనా చూస్తున్నారా?” అని అడిగింది మాతాజీ.
“చూశాం. ఒక సంబంధం అందరికీ నచ్చింది. దాదాపుగా కుదిరినట్లే..” అన్నాడాయన.
“సంతోషం. ఎవరి అమ్మాయి?..”
“రాజశేఖర్ గారని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయన భార్య కిరణ్మయి గారు కూడా సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తోంది.. వారి అమ్మాయి ప్రణీత.. ను చూశాము. అబ్బాయి కూడా ఇష్టపడ్డాడు..”
మాతాజీ ఏదో ఆలోచనలో పడిపోయింది. తరువాత అడిగింది. “వాళ్ల నివాసం ఎక్కడ?”
“మణికొండలో..”
మాతాజీ వెంటనే స్పందించలేదు. ఆశీస్సులు అందించలేదు. కొద్దిసేపటి తరువాత నెమ్మదిగా అన్నది – “తల్లిదండ్రుల నుంచి పోలికలే కాదు, వాళ్ల గుణగణాలూ పిల్లలకు అబ్బుతాయి.. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎక్కడి వాళ్లు, ఎప్పుడు వివాహం చేసుకున్నారు? కొంచెం వివరంగా విచారించండి. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు కదా..” అన్నది మాతాజీ.
“అమ్మాయిని మీకు చూపించకుండా, మీ ఆశీర్వాదం లేకుండా మేము ముందుకు వెళ్లలేం గదా మాతాజీ.. అన్ని వివరాలూ తెల్సుకుంటాం” అన్నాడు పార్థసారథి.
ఆమె మౌనం వహించింది. దంపతులు ఆమెకు పాదాభివందనం చేసి వెళ్లిపోయారు.
రాత్రి పదకొండు గంటలు అయింది. మాతాజీ ఆశ్రమంలో ఆరుబయట కూర్చుని ఉన్నారు. ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్నారు.
ప్రతి మనిషి రాగద్వేషాలకు అతీతంగా జీవించాలని ప్రభోధించింది. కానీ అది అంత సులభం కాదేమోనని ఆమెకు అనిపించింది.
పార్థసారథి చెప్పిన సంబంధానికి ఎందుకు సుముఖత వ్యక్తం చేయలేక పోయింది?
సముద్రంలాంటి గంభీరమైన మాతాజీ మనస్సులో ఏదో చిన్న అలజడి ప్రారంభం అయింది.
చంద్రుడు ఆకాశమనే సరస్సులో రాజహంసలాగా విహరిస్తున్నాడు. చల్లగాలి కన్నతల్లి ప్రేమలాగా ఆప్యాయంగా పలకరించింది. ఆమెకు గతం అంతా గుర్తుకు వచ్చింది. పూర్వాశ్రమంలో ఆమె పేరు మాధవి.
***
రాజశేఖర్, మాథవి కొత్తగా పెళ్లి అయిన జంట. అతనికి హైదరాబాద్‍లో ఐ.టి. కంపెనీలో ఉద్యోగం. లక్షన్నర జీతం. ఫర్వాలేదు. జీవితం అంతా పువ్వుల వానలో నవ్వుల నావలాగా సాగిపోతోంది. ఎటొచ్చీ సమస్వ ఏమిటంటే, ఈ ఉద్యోగాలు చీదితే ఊడే ముక్కులా ఉంటున్నాయి. అందుకని అతను ఎంత జలుబు చేసినా, చీదటం లేదు. ఈ కొద్ది రోజులలోనే మూడు కంపెనీలు మారాడు.
కంపెనీ మారినప్పుడల్లా, నాలాంటి వాడి సేవలు పొందే అదృష్టం వాడికి లేదులెమ్మని తనకు తానే నచ్చచెప్పుకుంటుంటాడు.
ఇదిలా ఉండగా మాధవితో పాటు కాలేజీలో చదివిన కిరణ్మయికి కూడా హైదరాబాద్ లోనే ఒక ఐ.టి కంపెనీలో ఉద్యోగం రావటంతో, కిరణ్మయి, మాధవికి ఫోన్ చేసింది- ‘నేను మీ ఇంటికి రావచ్చా?’ అంటూ. “ఇది నీ ఇల్లే అనుకో” అని మాధవి అనటంతో, కిరణ్మయి వచ్చి వీళ్ల ఇంట్లో వాలిపోయింది.
మాధవి, కిరణ్మయిని తన భర్తకు పరిచయం చేసింది. ఇక అక్కడి నుంచీ కబుర్లు మొదలైనయి.
భోజనాలు చేశాక, తీరికగా కూర్చుని ఒకప్పటి తమ ఫ్రెండ్స్ అందరి గురించీ అడిగింది మాధవి.
“అందరికీ పెళ్ళిళ్లు అయినయి. ఎవరి నిజ భర్తలతో వారు వారి వారి సంసారాలు చేసుకుంటున్నారు. కొందరు తల్లులు కూడా అయి, పిల్లలకు పాలిస్తున్నారు” అన్నది కిరణ్మయి.
“మరి, నువ్వేమిటి ఇంకా ఇలా ఏకాకిగా మిగిలిపోయావ్?”
“ఏ కాకీ దొరకకనే. కళ్యాణం వచ్చినా, కక్కు వచ్చినా ఆగదు అన్నారు గదా. ఇంకా కక్కు రాలేదు మరి..”
“ఓసి నీ దుంపదెగ. కుడి ఎడమైతే గొడవ అయిపోతుంది. ముందు కళ్యాణం తరువాత కక్కు” అన్నది మాధవి.
“ఏదైతేనేంలే ముందు ఉద్యోగం వచ్చింది. ఇదీ మన మంచికే..” అన్నది కిరణ్మయి.
ఉద్యోగంలో చేరిన నెల రోజుల తరువాత, ఒక రోజు కిరణ్మయి అన్నది “నేను ఇలా మీ ఇంట్లో ఫ్రీగా ఉండటం బాగోలేదు.”
రాజశేఖర్ కలగ జేసుకున్నాడు. “మీరు ఏమీ సంకోచించకండి. మాధవి మీ సిస్టర్ అనుకోండి. ఇది మీ ఇల్లే అనుకోండి.”
“నేనూ అదే అనుకుంటున్నాను. కానీ బావుండదు గదా. పేయింగ్ గెస్ట్‌గా ఉంటాను..” అన్నది కిరణ్మయి.
“నీకు అన్నం పెట్టలేని స్థితిలో లేం లే. అంతగా అవసరం అయితే ఏదున్నా డబ్బు కావాలంటే, నేను అడుగుతా..” అన్నది మాధవి.
“అడగాల్సిన అవసరం లేదే. మీ ఇల్లు నా ఇల్లు అనుకున్నప్పుడు, నా హేండ్ బ్యాగ్ లోని డబ్బూ నీదే అనుకో..” అన్నది కిరణ్మయి.
అలా అరమరికలు లేకుండా ఒకరితో ఒకరు కల్సి మెల్సి ఉంటున్నారు. రాజశేఖర్ కారులో కిరణ్మయిని ఆమె ఆఫీసు దగ్గర దించేసి, సాయంత్రం వచ్చేటప్పుడు ఆమెను కారులో తీసుకొస్తున్నాడు.
శలవు రోజుల్లో షికార్లకూ, సినిమాలకు వెళ్తున్నారు. సినిమాల గురించి చర్చించుకుంటున్నారు.
“ఇందులో డ్రామా ఉంది, ఇందులో మెలోడ్రామా ఉంది” అని చెప్పినప్పుడల్లా, “ఆ రెండింటికీ తేడా ఏమిటీ” – అని మాధవి ఆడుగుతుంది. “ఆ, పెద్ద తేడా ఏం లేదే. విలన్ హీరోయిన్‍ను రేప్ చేశాక తప్పించుకుంటే, అది డ్రామా. రేప్ చేస్తాడని తెలిసి ముందే తప్పించుకుంటే అది మెలోడ్రామా” అన్నది కిరణ్మయి.
“నీ సినిమా పరిజ్ఞానం అపరిమితం” అన్నది మాధవి.
“నువ్వొక సినిమా తీయవచ్చుగదా. నేను ఫ్రీగా హీరోగా యాక్ట్ చేస్తాను” అన్నాడు రాజశేఖర్.
“అంతకన్నా, కావల్సిందేముంది? మాధవి హీరోయిన్‌గా చేస్తే తీస్తాను.”
“నేను హీరోయిన్‌కి పనికిరానే..” అన్నది మాధవి.
“అమ్మమ్మ, అలా అనకు. స్త్రీ హృదయానికి వృద్ధాప్యం రాదు. ఎప్పటికీ నవ యవ్వనంలోనే ఉంటుంది” అన్నది కిరణ్మయి.
అలా రోజులు గడిచి పోతున్నయి.
కిరణ్మయికి సొంత ఊరులో కొంత పొలం ఉంది. అప్పుడప్పుడు వెళ్లి పంట డబ్బు తెచ్చుకుంటుంది.
అలా వెళ్లినప్పుడల్లా రాజశేఖర్ కిరణ్మయిని తన కారులో తీసుకెళ్లేవాడు. వారం పది రోజులు అక్కడే ఉండేవాళ్లు,
అందమైన అమ్మాయి, చదువుకున్నది, నెలకు రెండు లక్షలు దాకా సంపాదిస్తుంది. ఇంకా ఆస్తిపాస్తులున్నాయి. ఇన్ని ఉన్న అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు. ఇద్దరూ ఏకాంతంగా ఉండిపోతున్నారు.
పులిమీద పుట్రలాగా, మాధవికి ఇంకో అవాంతరం వచ్చిపడింది.
మాధవి తల్లికి కాన్సర్ వ్యాధి అని తెల్సింది. మాధవి తల్లిని చూసుకోవటానికి, వైద్యం చేయించుకోవటానికి తమ ఊరు వెళ్ళాల్సి వచ్చింది.
ఆ విధంగా మాధవి దూరంగా ఉండటంతో, రాజశేఖర్, కిరణ్మయి మరింత దగ్గర అయ్యారు.
మాధవి చేయాల్సిన సేవలన్నీ కిరణ్మయి చేస్తోంది రాజశేఖర్‌కి.
మాధవి పోస్ట్ లోకి కిరణ్మయి చేరిందన్నమాట. కాలం అలా ఒకరిని దూరం చేసింది. మరొకర్ని దగ్గర చేసింది.
మనుష్యులు దగ్గర అయితే, మనసులు చేరువ అవుతాయి.
తల్లి చనిపోయిందని మాధవి ఫోన్ చేసి చెప్పింది.
ఇద్దరూ వచ్చి రెండు రోజులు ఉండి చూసి వెళ్లారు.
అప్పటికే మాధవికి విషయం అంతా అర్థం అయింది.
ఒకప్పటి తన విరి వనంలో, ఇప్పుడాయన లేడు.
ఆ ఇంటికి వెళ్లదల్చుకోలేదు.
ఒక స్వామీజీని ఆశ్రయించింది. విషయం అంతా చెప్పింది.
“భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఎందుకు కలుపుతాడో, ఎందుకు విడదీస్తాడో తెలియదు. బహుశా నీకు అంతకన్నా మంచి జీవితాన్ని ఆయన ఇవ్వదలచాడేమో” అన్నాడాయన.
ఆయన ఆశ్రమంలో చేరిపోయింది.
కొంతకాలానికి ఆయన కాలం చేశాడు. ఆ ఆశ్రమం ఆమెదే అయింది.
రోజూ కొన్ని వందల మందికి జ్ఞానం అంటే ఏమిటో, అజ్ఞానం అంటే ఏమిటో బోధిస్తోంది. ఎంతో మంది తమ హృదయ వేదనను వెళ్లగక్కితే, ఒక తల్లిలాగా మాతాజీగా ఆమె వారిని ఊరడిస్తోంది.
ఇదీ ఆమెకు ఎంతో తృప్తినిస్తోంది.
రాగద్వేషాలకు అతీతంగా జీవిస్తున్న ఆమె ఇవాళ, రాజశేఖర్ కిరణ్మయిల కూతురు విషయంలో ఎందుకు అడ్డుపుల్ల వేసింది?
నాలుగు రోజుల తరువాత పార్థసారథి దంపతులు వచ్చారు. ఆ సంబంధం నచ్చలేదని చెప్పారు.
మాతాజీ నిట్టూర్చింది.