Site icon Sanchika

చిరుజల్లు 14

జయమ్ము నిశ్చయమ్ము

[dropcap]“మీ[/dropcap] ఆఫీసులో అందరికన్నా తెలివైనవాడు, బాగా పని చేసేవాడు ఎవరు?” అని అడిగితే “తాగినప్పుడు రామారావు బాగా పనిచేస్తాడండి” అని సమాధానం చెప్పారు ఒక ఆఫీసులో.  “మరి తాగనప్పుడు తెలివైనవాడు ఎవరూ?” అంటే, “అప్పుడూ రామారావే నండి”  అని సమాధానం చెప్పారు.

అంటే ఆ ఆఫీసులో ఉన్న వాళ్లందరిలోకి రామారావు పనిమంతుడుగా పేరు తెచ్చుకున్నాడు. మిగిలిన వాళ్లు తెలివితక్కువ వాళ్లని చెప్పటానికి వీల్లేదు. వాళ్లూ తెలివిగలవారే. కానీ తమ తెలివితేటలను ఆ పనిలో పూర్తిగా  వినియోగించటానికి ప్రయత్నించలేదు. ఒకడు ఆఫీసులో పని చేస్తూనే చీటీల వ్యాపారం చేస్తూ బాగా సంపాదిస్తుంటాడు. మరొకడు భార్య పేరు మీద ఇన్సూరెన్స్ ఏజెంటుగా పని చేసి అదనంగా సంపాదిస్తుంటాడు. ఇంకొకడు రియల్ ఎస్టేట్ కంపెనీకి ఏజెంటుగా పని చేస్తుంటాడు.

ఒక్కొక్కడు ఒక్కో విధంగా తన శక్తి సామర్థ్యాలను వినియోగిస్తున్నాడు. ఆయా సమయాల్లో, ఆయా స్థానాల్లో తన ఆవశ్యకతను నిరూపించుకుంటున్నాడు. అది పెద్దదా, చిన్నదా అని కాదు. ప్రతి మనిషి అవసరమూ ఉంటుంది ఏదో ఒక సమయంలో.

పనిమనిషి “అమ్మగారూ, నేను నాలుగు రోజులు రావటం లేదు, ఊరికి పోతున్నాను” అంటుంది. “అయ్యో, ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారే” అని ఇంటామె బెంగపడిపోతుంది. ఆ ఇంట్లో పనిమనిషి ప్రాముఖ్యత పనిమనిషికి ఉంది. అది లేకపోతే ఎలా జరుగుతుంది – అన్న ప్రశ్న ఎదురైతే, దాని విలువ దానికి ఉన్నట్లే మరి.

భర్త పొద్దున తొమ్మిది గంటలకు ఆఫీసుకు వెళ్లపోతాడు. రాత్రి తొమ్మిది గంటలకు గాని ఇంటికిరాడు. ఇంటి పని అంతా ఒక గంటలో అయిపోతుంది. మిగిలిన సమయం అంతా ఏం చెయ్యాలి – అని ఆలోచించి, పచ్చళ్లు తయారు చేసి ఇరుగు పొరుగు వారికి ఇవ్వటం మొదలు పెట్టిందామె. తనకున్న శక్తి సామర్థ్యాలన్నీ అందులోనే చూపటం అలవాటు చేసుకుంది. పదేళ్ల తరువాత ఆమె కింద పది మంది పని చేసేంతగా ఆ వ్యాపారం పెంచుకుంది. తన పరిధిలో తన ప్రత్యేకతను చాటుకుంది. ఆమె లేకపోతే ఎలా అనే ప్రశ్న ఉదయించిందంటే, ఆమె విజయం సాధించినట్లే.

స్వతంత్రం వచ్చిన కొత్తలో అస్తవ్యస్తంగా ఉన్న దేశానికి నెహ్రు నాయకత్వం వహించాడు. ప్రపంచ దేశాలన్నీ రెండు కూటములుగా విడిపోయిన సమయంలో, ఎటూ చేరకుండా అలీనోద్యమం అంటూ తటస్తంగా ఉండిపోయి, తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆ రోజుల్లో నెహ్రు తర్వాత ఈ దేశానికి నాయకత్వం వహించగలవాడు ఎవరు –  అన్నది పెద్ద ప్రశ్న అయిందంటే, నాయకుడుగా ఆయన తిరుగులేని విజయాన్ని సాదించినట్లే లెక్క.

ప్రతి వాడూ గొప్పవాడుగానే పుట్టనవసరం లేదు. దయనీయమైన స్థితిలో పుట్టి పెరిగినా, తన ప్రత్యేకతను చూపించుకుంటున్న వాళ్లు ఎందరో ఉన్నారు.

వర్జీనియా రాష్ట్రంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టాడు అతను. పదిహేనేళ్ల వరకూ రైలు ఎలా ఉంటుందో కూడా చూడలేదు. ఒక చిన్న గదిలో అతని కుటుంబం అంతా కాలం గడిపేది. పెద్దగా ఆదాయం ఏమీ లేదు. ఆ పరిస్థితుల్లో ఆ కుర్రాడి తల్లి చనిపోయింది. తండ్రి మరొక ఆమెను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. తల్లి స్థానంలో సవతి తల్లిని ఊహించుకునేందుకు ఆ కుర్రాడికి అసలు ఇష్టం లేదు. కానీ తప్పనిసరి పరిస్థితి. “వీడు రేపు నీ మీద రాళ్లు విసిరినా విసరవచ్చు” అని తండ్రి ఆ సవతి తల్లితో అన్నాడు. కానీ ఆమె నచ్చచెప్పింది. “పిల్లలు… వాళ్లకు తెలిసీ తెలియని వయసు… మనమే అర్థం చేసుకోవాలి… ఈ పిల్లవాడు అంటే నాకు ఇక నుంచి ఎంతో ఇష్టం” అంటూ గడ్డం కింద చెయ్యి పెట్టి, ఆ కుర్రాడి మొహాన్ని పైకి లేపి నవ్వుతూ చూసింది. అతని జీవితాన్ని పైకి లేపింది. ఆ కుర్రాడు తనకు తోచినది ఏవేవో రాసుకుంటుంటే వాటిని ఆమె సవరించింది. రాయమని ప్రోత్సహించింది. ఒక టైపు రైటర్ కొని, టైపు చేయటం నేర్పింది. ఆ అలవాటే అతడిని గొప్ప వ్యాసాలు రాసే రచయితగా తీర్చిదిద్దింది. తరువాత కాలంలో వందల మంది సంపన్నులను ఇంటర్వ్యూలు చేశాడు. అతని పేరు నెపోలియన్ హిల్. అతను రాసిన ‘ధింక్ అండ్ గ్రో రిచ్’  అనే పుస్తకం కొన్ని లక్షల కాపీలు  అమ్ముడుపోయింది. ముప్ఫయి ఏళ్ల తరువాత ఇప్పటికీ అమ్ముడుపోతునే ఉన్నది. ఎంతో మంది శ్రీమంతులూ, దేశాధ్యక్షులు కూడా దానిని చదివారు.

అందరికీ సవితి తల్లి ఉండకపోవచ్చు. కానీ తనకు చేతనైనది ఏదో ఒకటి చేయాలన్న తపన, మనస్తత్వం ఉంటే చాలు. అతను ఎంచుకున్న రంగంలో ఏదో ఒక నాటికి తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని ఏర్పరుచుకుంటాడు.

ఏదైనా ఒక ఘనకార్యం చేయాలంటే, అన్ని సమయాల్లోనూ ఒకే ఒక్కడి వల్ల కాదు. ఒక పని ప్రారంభించి చేసుకుంటూ పోతుంటే అనేక మందితో పరిచయాలు కలుగుతాయి. వారి సహాయ సహకారాలు తోడవుతాయి.

కొన్ని విషయాల్లో కొంత మందిని నమ్మవలసి వస్తుంది. ఒక రియల్ ఎస్టేట్‌లో లక్షల రూపాయలను పెట్టి స్థలం కొంటున్నప్పుడు, దానికి ఎటువంటి సమస్యలూ ఉండబోదన్న నమ్మకంతో కొంటారు. చాలా వరకు ఆ నమ్మకం వమ్ముకాదు.

అలా అని కొత్త వారిని నమ్మటం మంచిది కాకపోవచ్చు. ఉదాహరణకు ఎవరినైనా, సెల్ ఫోన్ అడిగి చూడండి. కొత్తవారు అయితే, వాళ్ల సెల్ ఫోన్ ఇవ్వటానికి ఎంత మాత్రం ఇష్టపడరు.

మనం చేసే పనిలో మనకు ఎదురయ్యే వారిలో రకరకాల మంది ఉంటారు. కొందరు ప్రతి వారినీ, ప్రతి దానికీ అనుమానిస్తుంటారు. కొందరు అహంకారం వెలిబుచ్చుతారు. అన్నిటినీ ఎదుర్కోవాలి.

మీరు కష్టపడి తయారు చేసిన ఒక ప్రాజెక్ట్ వర్క్‌ని మీ మేధా సంపత్తిని తస్కరించే వారుంటారు. పోగోట్టేవారుంటారు. అజాగ్రత్తగా చేజార్చేవారుంటారు.

థామస్ కార్లిలే ఎంతో కష్టపడి, ఎంతో పరిశోధన చేసి ‘ఫ్రెంచి రివల్యూషన్’ అనే పుస్తకం రాశాడు. అంత గొప్ప గ్రంథాన్ని రాసినందుకు ఎంతో సంతృప్తి చెందాడు. అది తనకు ఎంతో మంచి పేరు తెచ్చిపెచుతుందని ఆశించాడు. అయితే ఇతరుల అభిప్రాయం ఎలా ఉంటందో తెల్సుకుందామని, తన మిత్రుడు జాన్ స్టువార్ట్ మిల్‌కి ఇచ్చి అతని అభిప్రాయం చెప్పమన్నాడు. ఎన్ని రోజులకీ ఆ స్నేహితుడి నుంచి సమాధానం రాకపోవటంతో ధామస్ ఆయన ఇంటికి వెళ్లాడు. ఇతన్ని చూసి, ఆ స్నేహిచుడు విచారంగా మొహం పెట్టాడు. ఏం జరిగిందని థామస్ అడిగాడు. “ఆ కాగితాలన్నీ నేను చేబుల్ మీద పెట్టి నిద్రపోయాను. ఆ కాగితాలు కిందపడిపోయాయి. పనికి రాని కాగితాలనుకుని, పనిమనిషి వాటిని తగలబెట్టేసింది” అని చెప్పాడు మిత్రుడు. ఎంతో శ్రమపడి, తన మేధాసంపత్తినంతా ఉపయోగించి రాసిన గొప్ప గ్రంథం అలా బుగ్గిపాలైనందుకు థామస్ చాలా కాలం వరకు తట్టుకోలేపోయాడు. తరువాత తనకు తానే ధైర్యం చెప్పుకొని, మళ్లీ రాయటం మొదలు పెట్టాడు. ఇంతకు ముందు రాసినవి ఒక్కక్కటే గుర్తుచేసుకుంటూ, వాటిని మరింత మెరుగు పరుస్తూ రాశాడు. అంతుకు ముందు రాసిన దాని కన్నా అద్భుతమైన పుస్తకం తయారైంది. అలా అనుకొని సంఘటలు ఎన్నో అవాంతరాలను సృష్టిస్తూనే ఉంటయి. వాటిని అధిగమించాల్సి వస్తుంటుంది.

తెల్లవారి లేస్తే, ఎన్నో విషయాల మీదకు మనసు పరుగిడుతుంటుంది. అందుచేత, ఒక విషయం మీద ఏకాగ్రతతో పనిచేయటం కొన్నిసార్లు కష్టమవుతుంటుంది. ఏవి అయితే, మనసును ఇతర విషయాల మీద పరిభ్రమింపచేస్తున్నాయో, వాటి నుంచి దృష్టి మళ్లించి, లక్షసాధనయే ధ్యేయంగా పెట్టుకున్నప్పుడే ఏదైనా సాధించగలుగుతాము. వేటిని అరికట్టినట్టయితే ఎక్కువ సమయాన్ని దీనికి కేటాయించగలను అని ప్రశ్నించుకోవాలి. నేను చేస్తున్న పనుల వల్ల ఎవరికైనా రవ్వంత ఉపకారమైనా జరుగుతుందా అని తర్కించుకోవాలి. ఒకసారి సమాధాన పరుచుకున్న తరువాత ఇంక అదే జీవిత లక్ష్యంగా నిర్ణయించుకోవాలి. కష్టనష్టాలు ఎదురైనా ఫరవాలేదు.

“నేను రచయితగా స్థిరపడదల్చుకున్నాను. పది పుస్తకాలు రాశాను” అన్నాడొక  వర్థమాన రచయిత. ఏవైనా అమ్ముడుపోయాయా – అని అడిగారు ఎవరో. ఒక స్కూటరు, ఫ్రిజ్, టేబులూ –  అమ్ముడుపోయాయి అని రచయిత చెప్పాడు. నష్టం వచ్చినా సరే, రచయిత కావాలన్న ధ్యేయాన్ని మాత్రం వదలలేదు. అలా పట్టుబట్టి కృషి చేస్తే, ఏదో ఒక రోజుకు రాణించవచ్చు.

ఒక లక్ష్యాన్ని సాధించాలంటే, అందుకు సంబంధించిన మరి కొంతమందితో కల్సి మెల్సి తిరగాల్సి ఉంటుంది. వాళ్ల మద్య స్థానం సంపాదించాలంటే మంచివాడన్న పేరు తెచ్చుకోవాలి. ఎన్నో అబద్ధాలు చెప్పేవాడిని, తగువులు పెట్టే వాడిని ఎవరూ చేరదీయరు.

ఒక వ్యక్తి జీవితంలో స్థిరపడాలన్న ఏదో ఒక చిన్న ఉద్యోగం  చేయాలి. పరువు లేని వాడికి మంచి ఉద్యోగం దొరకదు. మంచి భార్య దొరకదు. ఒకవేళ అలాంటివి దొరికినా, వాటిని నిలబెట్టుకోవటమ కష్టమే. పరువు కూడా గాలి లాంటిదే. అది ఉన్నంత సేపు దాని విలువ తెలియదు. అయిదు నిమిషాలు, ఊపిరాడక పోతే, అప్పుడు గాలి విలువ తెల్సినట్లుగానే, పరువు పోయిన తరువాత గాని దాని విలువ తెలియదు.

గతంలో చేసిన పొరపాట్లు ఏవైనా ఉంటే, అలాంటి పొరపాట్లు మళ్లీ చేయకుండా ఉండేలా చూసుకోవాలి. జీవితమంతా సర్దుబాట్లు చేసుకుంటూనే ఉండాలి.

ప్రతి పని చేయటానికి నిర్ణీతమైన సమయం, నిర్ణీతమైన స్థలం ఉంటుంది. అలా చేసినప్పుడే ప్రగతి సాధ్యం అవుతుంది. కొంత మంది దీనికి భిన్నంగా ఉంటారు. కవులూ, రచయితలూ, చిత్రకారులూ, పగలంతా నిద్రపోతారు. ప్రపంచంలోని అష్టదిక్పాలకులూ నిద్రపోతున్న సమయంలో వీరు మేల్కొని ఏదో, ఏదేదో సృష్టించాలని తపనపడుతుంటారు. వారి విషయం వేరు.

ఒక గొప్ప సాహస కృత్యం చేయలంటే, ధైర్యమూ చాలా అవసరం. ఎన్నో ప్రశ్నలూ, ఎన్నో సందేహాలూ మందు నుంచీ వేధిస్తూనే ఉంటయి. వాటిని అధిగమించినప్పుడే, ఏ పని అయినా సాధించగలుగుతారు ఎవరైనా. యుద్ధానికి బయల్దేరే సైన్యాధికారి విజయం సాధిస్తానన్న నమ్మకంతోనే బయల్దేరాలి. అప్పుడే శత్రువుని జయించగలుగుతాడు.

క్రిస్టోఫర్ కొలంబస్ తాను అమెరికాను కొనుగొనటానికి బయల్దేరే ముందు స్పానిష్ కోర్టులో తాను సముద్రాన్ని జయించి విజయ యాత్ర చేయగలనని నిబ్బరంగా చెప్పాడు. అప్పుడే అతని యాత్రకు ఆర్థిక సహాయం లభించింది.

పని చిన్నదైనా, పెద్దది అయినా, ధైర్యంగా ముందుకు సాగినప్పుడే జయమ్ము నిశ్చయమ్ము అని నిరూపింపబడుతుంది.

Exit mobile version