Site icon Sanchika

చిరుజల్లు-140

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

తప్పు ఎవరిది?

[dropcap]ఇ[/dropcap]ద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. చూపుల కోలాటాలు సాగుతున్నాయి. మనసులో ఎవరి భావాలు వారికున్నాయి.

“మేము లేని వాళ్లల్లో ఉన్నవాళ్లం. ఉన్నవాళ్లల్లో లేని వాళ్లం. పెద్దగా భోగభాగ్యాలు అనుభవించలేదు. అలా అని నిత్యావసరాలకు ఇబ్బంది పడలేదు. మా నాన్న చనిపోయి రెండేళ్లు అవుతోంది. అమ్మకు పెన్షన్ వస్తుంది. నేను ఒక కంపెనీలో పని చేస్తున్నాను. నెలకో ముప్ఫయి వేలు జీతం వస్తుంది. కానీ ఇది గొర్రెతోక లాంటిది. ఇంకో ముప్ఫయి ఏళ్లు పనిచేసినా ముప్ఫయి వేలే వస్తాయి. ఏదో కాలక్షేపం కోసం చేస్తున్నాను. ఇక నా పర్సనాలిటీ అంటారా… చూస్తున్నారు గదా. పెద్ద అందగత్తెను కాదుగానీ, అంద వికారంగానూ లేను.. మా నాన్న ఉండగా నాకు పెళ్లి చేయాలని తాపత్రయ పడ్డాడు. కానీ కట్నాల మార్కెట్‌లో లక్షలూ, కోట్లు పోసి ఒక పనికి మాలిన వాని చేత.. సారీ, ఏమనుకోకండి, తలదించుకుని తాళి కట్టించుకుని, వాటికి ఊడిగం చేస్తూ బ్రతకాలన్న ఆలోచనే, పెళ్లి పట్ల నాకు విముఖతను నా అభిప్రాయం. కలిగించింది.. భార్యాభర్తలు ఇద్దరూ స్నేహితుల్లా ఉండాలని నా అభిప్రాయం. ఇంక చెప్పటానికేం లేదు. దేవుడంటే నమ్మకం ఉంది. ఈ ఊగిసలాటతోనే సగం జీవితం గడిచి పోయింది. బట్ నో రిగ్రెట్స్.. ఇంతకన్నా నేను చెప్పవల్సిం దేమీ లేదు” అని ముగించింది పల్లవి.

రవి కుమార్ ఏమీ మాట్లాడలేదు. పెట్టినవన్నీ తిన్నాడు. చెప్పినవన్నీ విన్నాడు. నెమ్మదిగా అన్నాడు..

“నా గురించి ఇదివరకే చెప్పాను గదా. నా భార్య ఒక ప్రమాదంలో చనిపోయింది. అందుచేత అందరికీ నేను నచ్చక పోవచ్చు. నాకు బాధ్యతలు ఏమీ లేవు. నా మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్లూ లేరు. ఒంటరివాడిని, గుండె గడపకు ఆశల తోరణాలు కట్టుకునే వయసు, దాటిపోయింది. ఆర్థికంగా ఇబ్బందులూ లేవు. కానీ ఒంటరితనం అనేది జైలు శిక్ష లాంటిది. ఎప్పుడూ ఒకేలా ఉండదుగదా. ఒకోసారి నైరాశ్యం ఆవహిస్తుంది. తినటం, పడుకోవటం, లేవటం – ఇంతకన్నా ఏముంది? ముందు ముందు భవిష్యత్తు ఏదో తవ్వి తలకెత్తుతుందన్న ఆశా లేదు. ఎక్కడో ఒక చోట కూర్చుని ఎన్నాళ్లు, ఎన్నేళ్లు ఆ అస్తమయ సూర్యుడ్ని చూస్తూ గడపటం? ముసురుకుంటున్న చీకట్లో, తదుముకుంటూ తిరగటం – ఎందుకో దిగులు. గుండెల్లో సన్నని పగులు.. మనసు విప్పి చెప్పుకునే తోడు ఒకరు లేక పోపటం అసలైన పేదరికం.. గతకాలపు విగతాశలతో నిద్రలేమితనం.. ఇంతకన్నా నా గురించి చెప్పుకోవటానికి ఏమీ మిగల్లేదు..” అన్నాడు రవి. ·

ఇద్దరి మధ్యా కొద్దిసేపు నిశ్శబ్దం నిండు గర్భిణిలా నిలిచింది.

ఇద్దరూ నిర్జీవంగా నవ్వుకున్నారు.

“ఇప్పటికిప్పుడు నిర్ణయాలు చేయాల్సిన అత్యవసర పరిస్థితులు ఏమీ లేవు. మనం కావాలనుకున్నప్పుడు వర్షం కురవదు – ఆ సమయం వచ్చి, కారు మబ్బులు కమ్ముకున్నప్పుడు, ఆపినా ఆగదు. ఈలోగా మీకు తీరినప్పుడు, మనసుకు తోచినప్పుడు ఎప్పుడేనా ఫోన్ చేయాలనిపిస్తే, పిలిస్తే వస్తాను” అని లేచాడు రవి.

ఆమె అలాగేనంటూ తల ఊపింది. గేటు దాకా వచ్చి సాగనంపింది.

రవి ఇంటికి వచ్చాడు. టి.వి. చూస్తున్నాడు. ఎవరో ఒక నాయకుడు, ఒక పరాయి స్త్రీతో సాగించిన ప్రణయం బెడిసి కొట్టింది. ఆమె రచ్చకెక్కింది. మోసం చేశాడంటూ పోలీసు రిపోర్టు ఇచ్చింది. అతన్ని అరెస్టు చేశారు. ఇదంతా తనపై సాగించిన కుట్ర అంటున్నాడేగానీ, ఆమెతో ఎలాంటి అక్రమ సంబంధం లేదనటం లేదు.

ఎవరి దగ్గర మాత్రం ఏముంది? బండెడు ఎముకలు, ఇన్ని మాంసం ముద్దలూ తప్ప.. జీవితాన్ని కుక్కలు చించిన విస్తరి లాగా చేసుకోదగ్గ అనుభవాలు ఏముంటాయి?

పనిమనిషి లక్ష్మి వచ్చింది. రవి భార్య చనిపోయినప్పటి నుంచీ ఇంటి పనీ, వంట పనీ అదే చేసుకుపోతోంది. వచ్చినప్పటి నుంచీ క్షణం సేపు ఊరుకోదు. ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. రవి వ్యక్తిగత విషయాల్లోనూ జోక్యం చేసుకుంటుంది. అయాచితంగా సలహాలు ఇస్తుంటుంది. పైగా దాని సలహాలు వివేదాకా వెంటబడి విసిగిస్తూనే ఉంటుంది. ఇప్పుడతన్ని శాసించే స్థితికి చేరుకుంటోంది.

“ఎవర్నో చూసొచ్చారు గదా, బాగుందా? ఒప్పుకుందా?”

“లేదు. ఇంకా ఏదీ నిర్ణయించుకోలేదు. ఉరికే కల్సుకొని మాట్లాడుకున్నాం” అన్నాడు రవి.

“అందంగా ఉందా?” అని అడిగింది లక్ష్మి.

“ఫర్లేదు” అన్నాడు రవి..

“ఫోటో ఉందా?” అని అడిగింది.

“ఫోటో వాట్సప్‌లో ఉంది” అంటూ ఆమె ఫోటో చూపించాడు.

“ఏం బాలేదు. మీ పక్కన నిలబడే ఇదిలేదు..” అన్నది ఫోన్ అలాగే పట్టుకుని.

“బాలేదంటావా?” అని అడిగాడు

“అస్సలు బాలేదు” అన్నది అన్నది.

దానికి ముప్ఫయి ఏళ్ళు ఉంటాయి. పెళ్లి అయింది. మొగుడు ఆటో డ్రైవరు. ఏడాది కూడా కాపరం చేయకుండానే మొగుడ్ని వదిలేసింది. వాడు మాత్రం దీన్ని వదలలేదు.

రవిది సొంత ఇల్లు. లక్ష్మి వాచ్‍మన్ గదిలో ఉంటుంది. అప్పుడప్పుడు దాని మొగుడు వస్తుంటాడు. కాసేపు గొడవ పడతారు. తరువాత రాజీ పడతారు. అంతలోనే మళ్లీ గొడవ.. చెరో దోవ. వాడు వెళ్లిపోతాడు. ఒక్కోసారి నెలరోజుల దాకా తిరిగిరాడు.

రవికి కావల్సినవన్నీ చూస్తూ, ఉచిత సలహాలు ఉచితంగా ఇస్తూ, తన నిర్ణయాలు అన్నీ అతని మీద రుద్దేస్తూ, తెలియకుండానే అతని మీద ఒక అధికారాన్ని చెలాయిస్తుంటూంది.

దాని మనసులో ఏముందో స్పష్టంగా బయట పెట్టుకపోయినా, అది అతన్ని అంటిపెట్టుకుని తిరుగుతుంటుంది. బట్టల దగ్గర నుంచీ డబ్బు దాకా అన్నీ సర్దేస్తుంటుంది.

అతను ఏదన్నా చెప్పబోయినా, “మీకు ఏం తెలవదండీ.. అమ్మగారు ఉండగా కూడా అదే అనేవారు” అంటుంది.

చెప్పి కొంత, చెప్పకుండా కొంత ఇంటి పనులన్నీ చొరవ తీసుకుని చేసేది.

“కూరలు తెచ్చాను. పాలవాడికి ఇవ్వాలి. ఇస్త్రీ బట్టల వాడికి ఇవ్వాలి” అంటూ సొంత భార్యలాగా ఆయన ముందే, పర్సులోనుంచి డబ్బు తీసుకునేది.

రవికి సొంత ఇల్లు ఉంది. గవర్నమెంటు ఉద్యోగం ఉంది. బాగానే సంపాదిస్తున్నాడు. అతని ముందు తన మొగుడ్ని తిడుతుంది.

“వాడో తాగుబోతు వెధవ” అంటుంది లక్ష్మి.

“మీరు తాగినా తాగినట్లుండరు. గమ్మున ఉంటారు. వాడు అలా కాదు. తెగ వాగుతాడు. ఏం చేస్తాడో వాడికే తెలియదు” అంటుంది.

“మరి వాడ్ని ఎందుకు రానిస్తావు?” అని అడిగితే,

“నేనెక్కడ రానిచ్చాను. వాడే వారానికో, పదిరోజులకో వచ్చి, సారీ సారీ అంటూ మీద పడిపోతాడు. మీలాగా బుద్దిగా పడుకోడు” అంటుంది.

వాళ్ల దాంపత్యం గురించి చెప్పినప్పుడల్లా నవ్వుతాడు.

“మీ ఇదే వేరు లెండి” అనీ అంటుంది.

నెలరోజుల తరువాత పల్లవికి ఫోన్ చేశాడు ‘ఏం చేస్తున్నారం’టూ కుశల ప్రశ్నలు వేశాడు.

“మీకు గిట్టని వాళ్లు ఎవరైనా ఉన్నారా?” అని అడిగింది.

“ఏం? ఎందుకని అలా అడుగుతున్నారు?” అన్నాడు రవి.

“మీరు ఎవరో ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్న ఫోటో ఒకటి నాకు ఎవరో వాట్సప్‌లో పంపించారు” అన్నది పల్లవి.

“అవునా? నాకు ఆ ఫోటో పంపించండి” అన్నాడు.

తీరా చూస్తే, అతనితో కలిసి సరసమాడుతున్న ఫోటో ఎవరిదో కాదు – లక్ష్మిదే.

‘దీనికి ఇన్ని తెలివితలులు ఎక్కడి నుంచి వచ్చాయి?’ అన్న అనుమానం వచ్చింది.

ఇది దాని మొగుడి పనే అయి ఉంటుందనుకున్నాడు.

లేక –

ఇద్దరూ కల్సి ఆడుతున్న నాటకమా?

తనకు పెళ్ళికాకుండా దీని మీదనే ఆధారపడి ఉండాలన్న- స్వార్థం ఎవరిది?

ఎవరిదైతేనేం – అతి చనువు ఇవ్వటం తనదే తప్పు.

వాచ్‍మన్ రూం ఖాళీ చేయమని చెప్పాడు లక్ష్మితో.

Exit mobile version