చిరుజల్లు-143

1
2

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

షేరింగ్ రూం

[dropcap]న[/dropcap]గరంలో అత్యంత ఖరీదైన, మేలైన మెరుగైన వైద్యం అందించే హాస్పటల్. అక్కడ స్టార్ హోటల్లో ఉండే సదుపాయాలన్నీ ఉన్నాయి.

పన్నెండో అంతస్తులో నర్సులు, ఆయాలు అంతా హడావిడిగా ఉన్నారు. డ్యూటీ డాక్టర్లు డెస్క్‌టాప్‌లు చూస్తున్నారు.

పదో నెంబర్ రూంలో షేరింగ్ రూంలో ఇద్దరు పేషెంట్లు ఉన్నారు. పార్టిషన్ అవతల నున్న బెడ్ మీద వనజాక్షి, రూఫ్ కేసి చూస్తోంది. పెద్ద కొడుకు సారథి కొద్ది దూరంలో కుర్చీలో కూర్చుని, టీవీలో వస్తున్న సినిమా చూస్తున్నాడు.

ఆమె కొడుకుతో ఏదో మాట్లాడాలనుకున్నది. కానీ ఎందుకో అయిష్టంగా తల తిప్పుకుంది.

రెండు రోజుల కిందట మెట్లు దిగుతూ జారిపడింది. కాలి ఎముకకు ఎయిర్ క్రాక్ అయింది. దెబ్బ చిన్నదే అయినా, అసుపత్రి పెద్దది గనుక పెద్ద కట్టు కట్టారు. రోజూ ఆరు, ఏడు టాబ్లెట్లు మింగిస్తున్నారు. గంటకోసారి నర్సులు వచ్చి చూస్తున్నారు.

షేరింగ్ రూంలో ముందు వైపు ఉన్న పేషెంట్ కమలమ్మ. ఆమెకు అరవై ఏళ్లు. పదేళ్ల క్రితం నుంచీ షుగర్ పేషెంట్, ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్. నూట రెండు జ్వరం. చలి, వణుకు.. మాట స్పష్టత లేదు. నిన్నటి నుంచీ ఐ.వి. ఎక్కిస్తున్నారు. ఇప్పుడు కొంచెం తేరుకుంది.

పదిగంటలకు వనజాక్షి డాక్టర్, ఆయన టీమ్ లోని మరో నలుగురు జూనియర్ డాక్టర్లు వచ్చారు. కేస్ షీట్ చూసి వాళ్ళల్లో వాళ్లు ఏదో వాళ్ల భాషలో మాట్లాడుకున్నారు.

తరువాత పెద్ద డాక్టర్ ఆమెకు ధైర్యం చెప్పాడు. “ఎయిర్ క్రాక్.. తొందరలోనే నయం అవుతుంది. ఇంకో రెండు రోజులు కట్టు అలాగే ఉంచుకోండి” అన్నాడు.

ఆమె కొడుకుతో రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పి వెళ్లాడు, ఆయన తన పరివారంతో.

తల్లి కొడుకు వంక చూసింది. కొడుకు తల ఎత్తి పైన తిరుగుతున్న ఫాన్ కేసి చూశాడు.

“రేపు పంపిస్తాం అంటున్నారు” అని ఆమె తనలో తనే గొణుక్కుంది. కొడుకు ఏమీ మాట్లాడలేదు.

నర్స్ వచ్చింది. ఒకదాని తరువాత మరొకటి మూడు టాబ్లెట్స్ మింగించి వెళ్ళిపోయింది.

క్యాంటీన్ కుర్రాడు వచ్చి టమాటో సూప్ టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు. ఈ సూప్ ఒక్కటే అక్కడ ఆమెకి నచ్చిన పదార్థం. ఆ సూప్ తాగాలని ఆమెకు ఆశగా ఉన్నది. కొడుకు మాట్లాడలేదు. టి.వీ. ఆన్ చేసి వార్తలు వింటున్నారు. ఆమె సూప్ వంక చూసి తల తిప్పుకొంది.

ఈ హాస్పటల్‌లో ఒక్కో రకమైన రోగానికి ఒక్కో స్పెషలిస్ట్ డాక్టరు, ఆయన టీమ్‍లో నలుగురు, అయిదుగురు చిన్న డాక్టర్లు ఉన్నారు.

పదకొండు గంటలకు పార్టిషన్‍కు అవతల ఉన్న కమలమ్మను చూడడానికి మరో డాక్టరు, తన గుంపుతో వచ్చాడు.

కాసేపు కమలమ్మ యోగక్షేమాలు కనుక్కున్నాడు.

“యూరిన్‍కి వెళ్లినప్పుడు నొప్పి వస్తుందా? మోషన్ అయిందా? ఆకలి ఉందా?” అని అడిగాడు.

యాంటీబయాటిక్ మందులు ఇస్తున్నందున నోరు చేదుగా ఉందనీ, ఏమీ సహించటం లేదనీ కమలమ్మ చెప్పింది.

ఇన్‌ఫెక్షన్ తగ్గితే రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పి, డాక్టరు, ఆయన బృందం వెళ్లి పోయింది.

నర్స్ వచ్చి బ్లడ్ శాంపుల్ తీసుకుంది. రెండు టాబ్లెట్లు మింగించింది.

ఇంకో నర్స్ వచ్చి నరానికి ఐ.వి. ఇచ్చి వెళ్లింది.

ఒక నడి వయసు స్త్రీ వచ్చింది. “నేను ఈ ఫ్లోర్ ఇన్‍చార్జిని. మీకు అన్నీ సౌకర్యంగా ఉన్నాయా? ఏమన్నా కంప్లయింట్స్ ఉన్నాయా?” అని అడిగింది.

అన్నీబాగానే ఉన్నాయని చెప్పాడు కమలమ్మ మొగుడు రామనాథం.

క్యాంటీన్ వాడు వచ్చాడు. “భోజనం లోకి చపాతీ కావాలా? పూరీ కావాలా?” అని అడిగాడు.

ఆమెకు ఏమీ తినబుద్ధి కావటం లేదు.

***

రాత్రి ఏడు గంటలు అయింది.

వనజాక్షికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు గవర్నమెంటు జాబులో ఉన్నాడు. రెండోవాడు హైటెక్ సిటీలో ఒక ఐ.టి కంపెనీలో పని చేస్తున్నాడు.

ఇద్దరు కొడుకులూ మాట్లాడుకోరు. బద్ధ శత్రువుల్లా ఉంటారు. హాస్పటల్లో చేరినప్పటి నుండి పెద్దవాడు వచ్చి పగలు పూట తల్లికి తోడుగా ఉంటున్నాడు. రాత్రిపూట రెండో కొడుకు వచ్చి ఉంటున్నాడు. ఏడున్నర అయింది. పెద్ద కొడుకు వెళ్లిపోయే టైమ్ అయింది. అందుకొని ఆమె చిన్న కొడుక్కి ఫోన్ చేయబోయింది. పెద్ద కొడుకు కస్సుమన్నాడు.

“ఎవరికి ఫోన్ చేస్తున్నావ్? వాడికి స్వాగతాలు పలకాలా? టైమ్‌కి రావాలని తెలీదా? ఫోన్ పెట్టెయ్” అని గదమాయించాడు. ఆమె ఫోన్ పెట్టేసింది. ఒక వయసు వరకు వాళ్ళు ఫలానా అంటే వనజాక్షి కొడుకులు. ఇప్పుడలా కాదు. ఆమె పలానా సారథి తల్లి. అంటే ఉనికి మారిపోతుంది. కొంత వయసు వచ్చాకా, తల్లిదండ్రులే అయినా పిల్లల అదీనం లోకి వెళ్లిపోతారు. అంతే.

ఎనిమిది గంటల దాకా చూసే సారథి వెళ్లిపోయాడు చెప్పకుండానే.

అరగంట తరువాత రెండో కొడుకు అనిల్ వచ్చాడు. ఆమె ఏమీ అనలేదు. అడగలేదు. అయినా అతనే అన్నాడు.

“హైటెక్ సిటీ నుంచీ రావాలి. ట్రాఫిక్ జామ్. పెందరాళే బయల్దేరడానికి నాది గవర్నమెంటు జాబ్ కాదు. ప్రైవేటు కంపెనీ. అయిదు నిముషాలు ఆలస్యం అయితే పీకి పారేస్తారు. అసలే ఉద్యోగాలు దొరక్క చస్తున్నాం. ఈ ఉద్యోగం ఊడితే, గుడి ముందు కూర్చుని అడుక్కోవాల్సిందే” అన్నాడు అనిల్.

***

మర్నాడు తొమ్మిది గంటలకు చిన్న కొడుకు వెళ్లి పోయాడు. పెద్దకొడుకు పన్నెండు గంటలు అయినా రాలేదు.

ఇద్దరు డాక్టర్లు వచ్చారు. ఇద్దర్నీ డిశ్చార్జ్ చేశారు.

కమలమ్మ మొగుడు రామనాథం బిల్లు కట్టటానికి వెళ్ళాడు. భార్యాభర్తలు ఇద్దరూ మాట్లాడుకోవటం వనజాక్షి విన్నది. నర్స్ వచ్చి ఆమెకు డిశ్చార్జ్ సమ్మరీ ఇచ్చేసింది. “బిల్లు కట్టేయండి” అని చెప్పింది.

వనజాక్షి కదలలేదు. పన్నెండో అంతస్తులో ఉన్నది. కింద గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్లి బిల్లు కట్టాలి. ఆమె కదలలేదు.

కమలమ్మ మొగుడిని పిల్చింది. తన కథ అంతా ఒక్క నిముషంలో చెప్పింది.

“మా ఆయన రైల్వేలో పని చేశాడు. ఆయన చనిపోయాక నాకు పెన్షన్ వస్తోంది. నాకు ఇద్దరు కొడుకులు. నేను పోతూ పోతూ మూట కట్టుకు పోయేదేం లేదు. కానీ నా పెన్షన్ డబ్బులు ఒకరికి ఇస్తే రెండో వాడికి శత్రువునై పోతాను. అందుచేత విడిగానే ఒంటరిగా ఉంటున్నాను. ఇవాళ ఇలా వీళ్ళ ఆధారపడాల్సి వచ్చింది. బిల్లు ఎక్కడ కొట్టాల్సి వస్తుందోనని ఇద్దరూ మొహం చాటేశారు. నిజానికి నా డబ్బు నేను తెచ్చుకున్నాను. దయ చేసి ఈ బిల్లు కట్టేసి రండి” అన్నది వనజాక్షి.

కమలమ్మ మొగుడు రామనాథం సాయం చేశారు.

ఆమె డిశ్చార్జి అయింది.

“మీరు ఎక్కడన్నా వృద్ధాశ్రమంలో చేరండి. అంతదాకా రెండు రోజులు మా ఇంట్లో మాతో ఉండండి” అన్నాడు కమలమ్మ మొగుడు.

రెండు చేతులూ జోడించి నమస్కరించింది.

వీల్‍ఛైర్‍లో వనజాక్షి, కమలమ్మ ఇద్దరూ కిందకి వచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here