చిరుజల్లు-145

0
1

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

ప్రసూన

[dropcap]ఒ[/dropcap]క వారం రోజులు వరసగా శలవులు కల్సి వచ్చాయి. అందుకని శేఖర్ ఎప్పటి నుంచో వాయిదా వేసుకుంటూ వస్తున్న స్వంత ఊరు ప్రయాణానికి ముహూర్తం కుదిరింది.

పుట్టి పెరిగిన ఊరి మీద ఉన్న మమకారం కొద్దీ వెళ్లాడే గానీ, ఇప్పుడు అక్కడ తనకు తెల్సిన వాళ్లు ఎక్కువ మంది లేరు – ఒక్క డాక్టర్ మామయ్య తప్ప.

శేఖర్ వెళ్ళేటప్పటికి డాక్టరు బిజీగా ఉన్నాడు. అయినా సరే, ఇంట్లోకి తీసుకెళ్లి యోగక్షేమాలు అడిగి, టిఫెన్, కాఫీ తెప్పించాడు, కాసేపు రెస్ట్ తీసుమని చెప్పి, మళ్లీ క్లినిక్‌ లోకి వెళ్ళాడు.

శేఖర్ చిన్నకునుకు తీసి లేచేటప్పటికి లంచ్‌కి వేళ అయింది.

“ఫోన్ కూడా చెయ్యకుండా, ఇంత అకస్మాత్తుగా ఊడి పడ్డావేం?” అని ఆడిగాడు డాక్టర్ మామయ్య.

“ఏం లేదు. నిన్ను చూద్దామని వచ్చాను” అన్నాడు శేఖర్.

“ఇంకా నయం. నా రోగుల్ని చూద్దామని వచ్చావు కావు” అన్నాడాయన నవ్వుతూ.

“ఇప్పుడీ ఊళ్ళో నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు?” అన్నాడు శేఖర్.

“నాలుగిళ్ళు అవతల నీ మాజీ ప్రేయసి ప్రసూన ఇంకా అలానే ఉంది, నీ లాగా..”

“అలాగే అంటే?”

“పెళ్లి కాలేదు. కానీ ఎక్కడి నుంచో వచ్చిన ఒక స్కూలు టీచర్‌తో కొంత గ్రంథం నడిపింది. పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు. తర్వాత ఇంక పెళ్లి ఎందుకులే అని అనుకున్నారు. సాయంత్రం వస్తుందిలే. పలకరించి చూడు..” అన్నాడు డాక్టరు మామయ్య.

శేఖర్ మనసంతా ఎందుకో వికలమై పోయింది.

సాయంత్రం ముందున్న ఖాళీ స్థలంలో కుర్చీ వేయించుకుని కూర్చుని, పుస్తకం చేతిలో పట్టుకుని చదవాలని ప్రయత్నించాడు. కాసేపటికి ప్రసూన వచ్చింది. శేఖర్‌ని చూసి నవ్వి, ఆగి, “బావున్నావా?” అని పలకరించింది.

లోపలికి వెళ్లింది. పావుగంట తరువాత బయటకు వచ్చింది. “ఒక పావుగంట ఆగి పార్క్ రా. నీతో మాట్లాడాలి” అన్నది. ఒక అరగంట తరువాత ఇద్దరూ పార్క్‌లో ఎదురెదురుగా కూర్చున్నారు.

ఇదివరకటి కన్నా కొంచెం లావు అయింది. వయసుతో వచ్చిన లావణ్యం కూడా తోడు అయి, మరింత అందంగా ఉంది. నొక్కుల గిరజాల జుట్టు, ప్రసూనకు ప్రత్యేక ఆకర్షణ.

“నా మీద కోపం తగ్గలేదా?” అని అడిగింది.

“నీ మీద కోపం ఎందుకు?” అని అడిగాడు శేఖర్.

వెంటనే ఏమీ మాట్లాడలేదు. తరువాత అన్నది.

“అప్పుడు నువ్వు అడిగితే కాదన్నాను. వజ్రాన్ని పారేసుకుని గాజు పెంకుల్ని ఏరుకుంటున్నట్లు అయింది నా పని.. డాక్టరుగారు నా గురించి ఏమన్నా చెప్పారా?” అని అడిగింది.

“ నీ ప్రస్తావనే రాలేదు..” అన్నాడు శేఖర్.

“మా వాళ్ళు ఇప్పుడు నాకో సంబంధం ఖాయం చేశారు. కానీ నాకు ఇష్టం లేదు. నా మనసంతా నువ్వే నిండి ఉన్నావు.. ఈ సంబంధం ఎలాగైనా చెడగొట్టకూడదూ?” అన్నది అతని వంక సూటిగా చూస్తూ.

“అది మంచిది కాదు” అన్నాడు శేఖర్.

“ఆ నల్లని తుమ్మ మొద్దుతో కాపురం చెయ్యలేను.. నీకు ఏ మూలనో అంతరాంతరాల్లో నా మీద కాస్తంత కనికరం ఉందనుకున్నాను. నా దురదృష్టం..” అన్నది బాధతో.

ఇద్దరూ లేచి నడుస్తున్నారు.

వెనక వస్తున్న ఇద్దరు కుర్రాళ్లు మాట్లాడుకుంటున్నారు.

“దీని ఖరీదెంతరా?”

“ఇది డొక్కుది. కొత్తది కొందామనుకుంటున్నా సెల్ ఫోన్..”

ఇంటికి వచ్చాక శేఖర్ డాక్టర్ మామయ్యతో జరిగిన విషయం చెప్పాడు.

“కొంపదీసి ఆ సంబంధం చెడగొట్టి, నిన్ను చేసుకోమంటుందా ఏమిటి? అలాంటి ఆలోచన ఏమీ పెట్టుకోకు. ఇవాళ అందరూ ఆ అమ్మాయిని చాలా చులకనగా చూస్తున్నారు. దానికి ఎవడో ఒకడు దొరకటమే ఎక్కువ..” అన్నాడు డాక్టరు మామయ్య.

ఏడాది గడిచి పోయింది.

శేఖర్, అతనితో పని చేసే ఒక కొలీగ్ ఇంటికి పార్టీకి వెళ్లాడు. మెట్లు ఎక్కుతుంటే ప్రసూన కనిపించింది.

శేఖర్‌ని చూడగానే నవ్వు తెచ్చి పెట్టుకుని లోపలికి ఆహ్వానించింది.

ఆ గదిలో ఖరీదైన వస్తువేదీ కనిపించలేదు.

“ఇన్నాళ్ళకు దయ కలిగింది” అన్నది ప్రసూన.

“పైన మా కొలీగ్ ఉన్నాడు. వాళ్ల ఇంటికి వచ్చాను”

“లేకపోతే మా ఇంటికి వస్తావా ఏమిటి?” అని నవ్పింది.

ఆమె నిండు గర్భిణి. భారంగా కదులుతోంది.

అయిదు నిముషాలు కూర్చుని లేచాడు.

“కాఫీ తాగి వెళ్లు”

“ఇంకోసారి వస్తాను లే”

“నిజంగా రావాలి మరి”

“తప్పకుండా వస్తాను”

ప్రసూన సుఖపడుతోందో, కష్టపడుతోందో అతనికి అర్థం కాలేదు. ఎప్పుడూ అదే నవ్వు.

రెండు నెలల తరువాత శేఖర్ కొలీగ్ అతనికి పిడుగు లాంటి వార్త చెప్పాడు.

ప్రసూన చనిపోయింది.

మర్నాడు మరో వార్త చెప్పాడు.

ఆమె భర్త ఆమె పేరు మీద పది లక్షలకు ఇన్సూర్ చేశాడట.

ఇంతకీ ప్రసూనది సహజమైన మరణమేనా? – అని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లకీ అనుమానంగానే ఉందిట.

‘ప్రసూన ఖరీదు పది లక్షలా?’ అనుకున్నాడు శేఖర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here