Site icon Sanchika

చిరుజల్లు-146

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

ధనమేరా అన్నిటికీ మూలం

[dropcap]‘మ[/dropcap]నీ ఈజ్ హనీ’ అన్నారు.

డబ్బు బంధాలను తెంపుతుంది. కొత్త బంధాలను కలుపుతుంది.

పుట్టి పెరిగిన ప్రదేశాన్ని, దేశాన్నీ, కన్నవారినీ, నా అనుకున్న వారినీ అందరినీ వదిలేసి ప్రపంచం నలుమూలలకీ ఎగిరిపోతున్నారు సంపాదన కోసం.

కానీ ఆ ఆశ అయినా తీరుతోందా అంటే, ఏదో కొద్ది మంది విషయంలో తప్పిస్తే, చాలామంది విషయంలో నిరాశనే మిగిలిస్తోంది. పైగా అయినవారినందరికీ దూరమై, ఏకాకిగా మిగిలిపోయామన్న చింత, ఇంతై, ఇంతింతై వేధిస్తోంది.

వెంకట్ వంకాయల ఉద్యోగం కోసం, భార్యతో సహా ఆమెరికా వెళ్లి ఏడేళ్లు అయింది. ఇద్దరూ సంపాదిస్తూనే ఉన్నారు.. అయినా తాము కేవలం డబ్బు సంపాదించే యంత్రాల్లా మారిపోయామన్న అసంతృప్తి లోలోపల రంగులుతోంది.

అందుచేత, సంపాదనకు అంతు ఏముంది? ఇద్దరం కష్టపడితే ఈ మాత్రం ఎక్కడయినా సంపాదించుకోలేమా – అన్న జ్ఞానోదయం కలిగింది.

స్వదేశం వెళ్లిపోవాలన్న ఆలోచన కలిగాక, వెంకట్ వంకాయల తన మేనమామ నేతి సీతారామయ్యకు ఫోన్ చేశాడు. ఈ పదేళ్ల కాలంలో బంధువులు చాలా మంది దూరమైనారు. మరి కొంతమంది జ్ఞాపకాల నుంచే దూరమైనారు.

వెంకట్ వంకాయల మేనమామతో తన అభిప్రాయం వెలిబుచ్చాడు.

“హైదరాబాదు వచ్చేసి, అక్కడే ఉండిపోవాలనుకుంటున్నాం. ఏదైనా మంచి లొకాలిటీలో మంచి ఇల్లు కొందామనీ అనుకుంటున్నాం. అంచేత, మంచి ఇల్లు ఒకటి చూడు. నేను డబ్బు పంపిస్తాను. వీలైనంత తొందరలో ఇల్లు కొనేద్దాం” అన్నాడు.

“నువ్వు రావాలనుకోవటమే గొప్పవిషయం. ఇంక ఇంటిదేముంది? రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా? చేతిలో డబ్బు ఉండాలే గానీ ఇళ్లకేం కొదవ? రేపటి నుంచీ ఎంక్వయిరీ చేసి చెబుతాను. నెల రోజుల్లో కొనేద్దాం” అన్నాడు నేతి సీతారామయ్య.

మర్నాటి నుంచీ ఇంక ఆ పనిలో పడిపోయాడు.

హైదరాబాదులో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆకాశహర్మ్యాలు వెల్లివిరుస్తున్నాయి. అయితే, ఈ అపార్ట్‌మెంట్ కల్చర్ అందరికీ సరిపడక అక్కడి సాధక బాధకాలు చెప్పుకునేవారు ఎక్కువయ్యారు. డబ్బు ఉంటే విల్లా కొనుక్కోవటం నయం అని సలహా ఇచ్చారు.

నేతి సీతారామయ్య విల్లాల కోసం వెతకటం మొదలు పెట్టాడు. కానీ అవి కొంచెం దూరంగా ఉండటంతో, ఆలోచనలో పడ్డాడు.

ఇలా ఇంటి కోసం వెతుకుతున్న సమయంలో- “మీరు విల్లాలు కొనాలనుకుంటున్నారా?” అంటూ ఒక మృదు మధురమైన స్వరం ఆయన్ను పలకరించింది.

“విల్లాలను ఇల్లాలిని కొనాలనుకుంటున్నా” అంటూ నేతి సీతారామయ్య సరసమాడాడు.

“అయితే, మీ అన్వేషణ పూర్తి అయినట్లే” అన్నదా కోకిల కంఠం.

“ఎలాగ?” అని అడిగాడు నేతి సీతారామయ్య.

“ఇంటర్నేషల్ ఎయిర్‌పోర్ట్ నుంచి పదినిముషాల దూరంలో అత్యంత అధునాతనమైన వరల్డ్ క్లాస్ కంపర్ట్స్‌తో విల్లాలు నిర్మిస్తున్నాం, చాలా సరసమైన ధరలలో” అన్నదా అమ్మాయి.

ఇక అక్కడినుంచీ విషయం ముదిరి పాకాన పడింది.

“మీకు స్థలం కావాలనుకుంటే, స్థలం ఇప్పిస్తాను. అపార్ట్‌మెంట్ కావాలనుకుంటే, ఇప్పించగలను. ఇండిపెండెంట్ ఇల్లు కావాలనుకుంటే, అదీ ఇప్పించగలను.. మీ రిక్వైర్‌మెంట్ ఏమిటో చెప్పండి” అన్నది.

“మాకు విడిగా, ఇండిపెండెంట్‌గా కొత్తగా కట్టిన ఇల్లు కావాలి” అన్నాడు నేతి సీతారామయ్య.

“రేపు మీ ఇంటికి కారు పంపిస్తాను. రండి” అన్నది.

మర్నాడు నేతి సీతారామయ్య ఇంటికి పదింటికి కారు వచ్చింది.

కారు ఆయన్ను ఆ కంపెనీ ఆఫీసుకు తీసుకు వెళ్ళింది. అక్కడ ఆయనకు ఒక పాతికేళ్ళ అమ్మాయి ఎదురుపడి, షేక్ హ్యాండ్ ఇచ్చి లోపలికి తన ఛాంబర్ లోకి తీసుకు వెళ్లింది.

“నా పేరు మేకా మాధురి, చెప్పండి. మీకు నేను ఎలాంటి ఇల్లు అయినా సరే ఇప్పిస్తాను.”

“విల్లా కావాలి” అన్నాడు నేతి సీతారామయ్య,

“అలాగే చూపిస్తాను” అంటూ ఒక బ్రోచర్ ముందు పెట్టింది. అందమైన బిల్డింగ్ ఫోటోలన్నీ ఉన్నయి. ఇంటి ప్లాన్ చూపించింది.

“మీకు తూర్పు వైపు పేసింగ్ ఇల్లు కావాలంటే కొంచెం ఎక్కువ ఖరీదు” అన్నది మేకా మాధురి.

“ఎంత అవుతుంది?”

“రెండున్నర కోట్లు ఒక్క విల్లా, ఈస్ట్ ఫేసింగ్ అయితే మూడు కోట్లు..”

“అంత కన్నా తక్కువ ఖరీదులో లేవా?” అని అడిగాడు.

“అంటే కొత్త వెంచర్ వేస్తున్నాం. ప్రీ-లాంచింగ్ రేటు అయితే ఒకటిన్నర కోటి.. చాలా ప్రైమ్ లొకాలిటీ.. అన్నీ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్..” అంటూ మేకా మాధురి ఇంకో బ్రోచర్ ఆయన ముందు పెట్టింది.

మళ్ళీ అన్నది “ఈ ముందు మూడు వరసలు బుక్ అయిపోయినయి. నాలుగో వరస నుంచీ ఉన్నాయి..”

“ముందు వైపు లేవా?” అని అడిగాడు నేతి సీతారామయ్య.

మేకా మాధురి నవ్వింది.

స్వరం తగ్గించి రహస్యంగా అన్నది “మీకు ఏది కావాలంటే అది ఇప్పిస్తాను. కానీ కొంచెం విడిగా మాట్లాడుకుందాం.. ఒక గంట ఆగండి” అన్నది.

ఒక గంట తరువాత మేకా మాధురి, నేతి సీతారామయ్యను కారులో ఒక స్టార్ హోటల్‍కు తీసుకు వెళ్ళింది.

పక్కనే కూర్చుంది.

“మీకు మెయిన్ రోడ్ వైపు, కాలనీ మొదట్లో కోటి రూపాయలకే ఇప్పిస్తాను. అయితే నా కమిషన్ పది లక్షలు.. అంటే మనకు నలభై లక్షలు లాభం.. ఏమంటారు?” అన్నది మేకా మాధురి, నేతి సీతారామయ్యకు తన తనువు తాకిస్తూ.

“అలాగే” అన్నాడు నేతి సీతారామయ్య.

వారం రోజులు అమెరికాలోని వెంకట్ వంకాయలతో ఫోన్లో మాట్లాడాకా, అతను ఒకటిన్నర కోటి డబ్బు పంపించాడు.

అప్పుడు నేతి సీతారామయ్యకు ఇంకో ఆలోచన వచ్చింది.

విల్లా మేనల్లుడి పేరు మీద కాకుండా తన పేరు మీద బుక్ చేసుకుంటే మాత్రం అడిగేదెవడు? వాడు వచ్చినప్పటి సంగతి చూడొచ్చులే – అని తన మనసుకు నచ్చ చెప్పుకున్నాడు.

పది లక్షల రూపాయలు మేకా మాధురి తీసుకుంది. నలభై లక్షలు నేతి సీతారామయ్య ఉంచేసుకున్నాడు. కోటి రూపాయలు విల్లాకు ప్రీ-లాంచింగ్ మొత్తం కట్టేశాడు – తన పేరు మీద.

రెండు నెలల తరువాత –

ఆ కంపెనీ అక్కడ లేదు. ప్రీ-లాంచింగ్ లేనే లేదు. మేకా మాధురికి ఫోన్ చేసినా – ఇప్పుడా ఫోన్ పని చేయటం లేదు.

Exit mobile version