Site icon Sanchika

చిరుజల్లు 15

పిల్లలు కాదు పిడుగులు

[dropcap]వే[/dropcap]ణు అయిదేళ్ళ పిల్లాడు. వాళ్లింట్లో ఉన్న కుక్క పిల్లతోనే వాడికి రోజంతా కాలక్షేపం. ఎక్కడికన్నా వెళ్లినా వాడి ధ్యాస అంతా కుక్క పిల్ల మీదనే ఉండేది. దానితోనే ఆడుకుంటూ ఉండేవాడు. ఒక రోజు ఆ కుక్కపిల్ల చనిపోయింది. రోజంతా వాడు దాని కోసం ఏడుస్తూనే ఉన్నాడు. వాడి మనస్తాపాన్ని తగ్గించటం కోసం వాళ్ల అమ్మ వాడితో అన్నది “దాన్ని దేవుడు తీసుకెళ్లాడురా. బాధపడకు” అని

“చచ్చిపోయిన కుక్క పిల్లను దేవుడు ఏం చేసుకుంటాడమ్మా” అన్నాడు వేణు కన్నీళ్లు తుడుచుకుంటూ.

వాడి ప్రశ్నకు సమాధానం ఎవరు మాత్రం ఏ చెప్పగలరు?  ఈ కాలం పిల్లలే అలా ఉన్నారు. వాళ్లకు సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ఎదురవుతున్నయి. వాళ్లు పిల్లలు కాదు పిడుగులు.

ఒక స్కూలో ఒక టీచరు పిల్లలకు మంచి బుద్ధులు అలవాటు చేయటం కోసం చిన్న కథ చెప్పంది.

“నేను నా ఇల్లు, ఆస్తి అంతా అమ్మేసి పేదలకు దానధర్మాలు చేశాననుకో. నేను స్వర్గానికి పోతానా?” అని అడిగింది టీచరు. “స్వర్గానికి పోరు” అని ముక్త కంఠంతో చెప్పారు పిల్లలు. “పోనీ, నేను రోజూ గుడిలోకి వెళ్లి గుడి అంతా శుభ్రంగా కడిగి, ముగ్గులు పెట్టి, పూజలు చేశాననుకో. నేను స్వర్గానికి పోతానా?” అని అడిగింది. “పోరు” అన్నారు పిల్లలు కోరస్‍గా. “మరి, నేను ఏం చేస్తే, స్వర్గానికి పోతాను” అని అడిగింది. “స్వర్గానికి పోవాలంటే ముందు మీరు చచ్చిపోవాలి మేడం” అన్నారు పిల్లలు.

ఇప్పటి పిల్లలు తెలివితేటలు ఆ స్థాయిలో ఉంటున్నయి. ఎవరికీ తట్టని విషయాలు వాళ్లకు తడుతున్నాయి. తరానికీ తరానికీ మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటోంది. దీన్ని ఎవరూ కాదనలేరు.

పిల్లలు పరిశీలన దృష్టి చాలా నిశితంగా ఉంటోంది.

ఎయిర్‌పోర్టులో ఒక వృద్ధురాలు వీల్ చైర్‌లో కూర్చుంది. మరొకరు ఆమె కూర్చున్న వీల్ ఛైర్‌ను నెట్టుకుంటూ వస్తున్నారు. మూడేళ్ల పాప ఆమె దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్పింది. “బాధపడకు ఇది వరకు నేనూ నడవలేక పోతే, మా అమ్మ నన్ను ఇలాగే స్ట్రోలర్‍లో తీసుకెళ్లేది. ఇప్పుడు నడుస్తున్నా. నువ్వు నడుస్తావులే” అని ధైర్యం చెప్పింది.

పిల్లలు ఆలోచనా శక్తి ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. వాళ్లు ప్రతిదీ నిశితంగా గమనిస్తుంటారు. తమ ఊహకు అందినంత మేరకు తెల్సుకుంటుంటారు. ఏదైనా కొత్త విషయం కనిపిస్తే అది ఏమిటీ అని తల్లిదండ్రులను అడిగి తెల్సుకుంటూంటారు. వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పవల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. పిల్లలే కాదు, ఇది ఏమిటి, ఎందుకిలా ఉంది – అని ఆలోచించటం మేధావులకూ ఉంటుంది – కొత్తగా ఇంకా ఏదో తెల్సుకోవాలన్న ఉత్సుకత ఉండటం వల్లనే, సమాజంలో ఈ వేళ మనం ఇన్ని సదుపాయాలూ, సౌకర్యాలూ పొందగలుగుతున్నాం. విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్నది. కనుక పిల్లల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. అయితే కొన్ని చిక్కు ప్రశ్నలు వాళ్ల వయసుకు మించి అడిగినప్పుడు, కొంత ఇబ్బంది పడే సందర్భాలూ ఉంటయి.

పక్కింటి శ్రీనుకు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు. రాజు మూడేళ్లవాడు. వాడికి తమ్ముడు లేడు. అమ్మను అడిగాడు “నాకూ ఒక తమ్ముడు కావాలి” అని. వారం రోజుల తరువాత వాళ్ళ అమ్మ రాజును డాక్టరు దగ్గరకు తీసుకెళ్లింది. క్లినిక్‌లో గోడ మీద పసిపిల్లను ఎత్తుకున్న స్త్రీ ఫోటో చూసి, “ఈయన పిల్లల్ని అమ్ముతాడా?” అని అడిగాడు. వాడికి తోచిన పరిధిలో ఆలోచించాడు. ఎదిగిన పిల్లలూ అంతే. కొన్ని విషయాల్లో అంత అమాయకంగానూ ఉంటారు.

పిల్లలు అల్లరి చేస్తుంటారు. వస్తువులన్నీ పగలకొడుతుంటారు. పారబోస్తుంటారు. విరగకొడుతుంటారు. అది వాళ్ల సహజ లక్షణం. ఇరుగుపొరుగు పిల్లలతో దెబ్బలాడుతుంటారు. పోట్లాటలూ, తగువులూ తెస్తుంటారు. కొంప కొల్లేరు చేస్తుంటారు. అయినా సరే, పిల్లలు ఉన్న ఇల్లే ఇల్లు. ఎంత ఖరీదైన భవంతి అయినా, రాజ ప్రాసాదం అయినా, ఎన్ని అధునాతన అలంకరణలున్నా, ఆడే పాడే పిల్లలు లేని ఇంటికి కళాకాంతి లేనట్లే. పిల్లలు దైవ స్వరూపాలు. వాళ్లకు ఏమీ తెలియదు. అన్నీ తల్లిదండ్రుల దగ్గర నుంచీ, ఇరుగు పొరుగు వారి నుంచీ తెల్సుకుంటారు.

ఏ ఇద్దరు పిల్లలూ ఒకేలా ఉండరు. ఎవడి తెలివి వాడిదే. ఎవడి ఆకలి వాడిదే.

తొమ్మిది నెలలు మోసి, ప్రసవవేదన పడి, దాదాపుగా పునర్జన్మను పొంది, తల్లి పిల్లవాడికి జన్మనిస్తుంది. ఆ సమయంలో శారీరకంగా అలసిపోతుంది. నీరసించిపోతుంది. కళ్లు మూతలు పడిపోతుంటయి. చేతులు నిస్సత్తువగా ఉంటయి. అయినా సరే, అప్పుడే పుట్టిన పసికందును చేతిలోకి తీసుకొని, తృప్తిగా, సంతోషంగా, గర్వంగా నవ్వుకుంటుంది. వాడికి తనకు తెల్సినవన్నీ చెప్పానుకుంటుంది. తనకు ఉన్నవన్నీ ఇవ్వాలనుకుంటుంది. తన కన్నా వాడు గొప్పవాడు కావాలనుకుంటుంది. ఏడుస్తున్న బిడ్డ ఏడుపు ఆపటానికి ఏం చేయాలో ఆమెకు తెల్సు. అప్పటి నుంచీ ప్రారంభమవుతుంది బిడ్డను పెంచటం.

పసిపిల్లలు రోజుకు పన్నెండు గంటలు నిద్రపోతారు. అయితే ఒకేసారి పన్నెండుగంటలూ నిద్రపోరు. మధ్య మధ్యలో నిద్రలేస్తుంటారు. రాత్రి, పగలూ కూడా. అంటే తల్లి సమయాసమయాలంటూ లేకుండా తన పనులు మానుకొని, నిద్ర మానుకొని, పసివాడి అవసరాలు చూస్తుంటుంది.

బుడి బుడి నడకలు వేస్తుంటే, ఆ తల్లి మనసు వెయ్యి కాండిల్ బల్పులా వెలిగిపోతుంది. వచ్చీరాని మాటలు ఊరి ఊరిని ఊరగాయి లాంటి వంటారు. ఎంత సంబరమో, ఆమె ముఖంలో.

తల్లీ బిడ్డల జీవితాల్లో అదొక మధురాతి మధురమైన ఘట్టం. ఇప్పుడు చాలా చోట్ల భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇది వరకు పసిపిల్లల్ని చూసేందుకు, అమ్మమ్మలూ, నాయనమ్మలూ రెడీగా ఉండేవారు. అనేక కారణాల వల్ల ఇప్పుడు గ్రాండ్ మదర్స్ అండ దొరకటం లేదు. పిల్లవాడు ఎవరెవరి సంరక్షణలోనో, స్కూల్లోనో రోజంతా గడుపుతున్నాడు. ఇది కాలం తెచ్చిన మార్పు. కాదన లేని సత్యం.

ప్రతి చిన్న విషయామూ వాడికి ఎవరు చెప్పాలి? మంచి బుద్ధులూ, అలవాట్లూ, పద్ధతులూ అన్నీ టీచరే నేర్పాలని తల్లిదండ్రుల భావన. ఒక్క పిల్లాడిని మీరు చూసుకోలేక పోతే, ఇరవై మంది పిల్లలను చూడటం, అన్నీ నేర్పటం టీచరుకు సాధ్యమేనా అన్నది అసలైన ప్రశ్న.

ఆ వయసులో పిల్లలకు ఎవరో ఒకరు తోడు ఉంటాలి. వాళ్లను సరియైన మార్గంలో తీర్చిదిద్దాలి. ముందు వాడి సందేహాలు తీర్చాలి. పిల్లవాడు చెప్పేది వినాలి. వాడిని చెప్పనివ్వాలి. సంభాషణ కొనసాగించాలి. వాదించకూడదు. నెమ్మదిగా వివరించాలి. ఏది ఎందుకు మంచిది, ఎందుకు మంచిది కాదు – అని విపులంగా చెప్పాలి. ఇందుకు భూదేవి కున్నంత సహనం ఉండాలి. వారానికోసారి ఇంట్లో వాళ్లంతా కల్సి ముచ్చటించుకోవాలి. పిల్లవాడి స్థాయిలో వాడిని పని చేయనివ్వాలి. కోపాలు, కొట్టడాలు అవన్నీ పాతబడిన విద్యలు. ఇప్పుడవి కుదరదు.

అమ్మకు సాయం చేసే ప్రయత్నంలో పాప చెయ్యి మీద గిన్నె పడేసుకుంటుంది. కొంచెం గాయం అవుతంది. మిగిలిన వాళ్లకు చిన్న విషయమే అయినా, పాపకి అది పెద్ద విషయమే. ఎక్కడో ఉన్న అమ్మమ్మకు వీడియోలో వాచిపోయిన వేలు చూపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలంటూ, ‘దీన్ని బట్టి ఏం నేర్చుకున్నావు’ – అని అమ్మమ్మ అడుగుతుంది. “వంటింట్లో అమ్మకు ఇంకెప్పుడూ హెల్ప్ చేయకూడదని నేర్చుకున్నాను అమ్మమ్మా” –  అంటుంది మనవరాలు. అమ్మమ్మ కదీ ఆనందమే మరి.

పిల్లలకు తల్లితండ్రుల పోలికలే కాదు వాళ్ల బుద్ధులూ వస్తాయి. పెద్దవాళ్లు అయితే ఇంట్లో గొడవలు బయటి వాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడతారు. పిల్లలకు అవేమీ తెలియవు. ఉన్నదున్నట్లు చెప్పేస్తుంటారు. పెద్ద వాళ్లకు పెద్ద ఇబ్బంది కలిగినా వాళ్లు అనేమీ పట్టించుకోరు. ఏదన్నా ఫంక్షన్‌లో నలుగురి మధ్యలో ఉన్నప్పుడు, పక్కింటామెను చూపించి “అమ్మా, నువ్వెప్పుడూ చెక్క మొహంది అంటుంటావు ఇదేనా?” అని అడుగుతుంది పాప. తండ్రి కొడుకును మందలించబోయినా, పిల్లవాడు ఊరుకోడు – “అమ్మతో చెపుతా…” అంటూ తండ్రిని బెదిరిస్తాడు అందరి ముందూ.

అమ్మనీ, నాన్ననీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, పసిపిల్లల లేత చేతులే అమ్మనీ, నాన్ననీ మానసికంగా మరింత దగ్గిరకు లాక్కొనివస్తాయి. కంఠాన్ని కావలించుకున్న ఆ చిట్టి చేతులే, కుటుంబాన్ని పోషించే స్థాయికి ఎదుగుతాయి.

చిన్నప్పుడు అమ్మ భుజం మీద పడుకుని నిద్రపోతారు పిల్లలు. పెద్దయ్యాక ఏ ఆపద వచ్చినా తండ్రి భుజం మీద వాలపోయి, కన్నీటి భారాన్ని దించుకుంటారు పిల్లలు.

“ఈ ప్రపంచంలో పశుపక్ష్యాదులు, జలచరాలు, క్రూర జంతువులు – ఇలా ఎన్నో రకాల జాతులు ఉన్నాయి. అందులో మనది మానవ జాతి…” అని తల్లి చెబుతుంది.

“నాన్నది, నానమ్మది కూడా మన జాతేనా?” అని అడుగుతుంది నాలుగేళ్ల పాప.

“ఇంక పడుకో, చాలా రాత్రి అయిపోయింది…” అని తల్లి అంటే, “చంద్రుడు పడుకోడా? ఆయనకు నిద్ర రాదా?” అని అడిగే పాపకి తల్లి ఓపికగా జవాబు చెప్పాలి.

పిల్లలకు అరమరికలు ఉండవు. తమది అనుకున్న ప్రతిదానినీ అమితంగా ప్రేమిస్తారు. అమ్మనీ, నాన్ననీ అక్క చెల్లెళ్లనూ, అన్న దమ్ములనూ, ఇరుగు పొరుగు వారినీ, స్నేహితులనూ, ఇంటినీ, ఇంటి పరిసరాలనూ – ఊరినీ, ఊరిలోని చెట్టునూ, పుట్టనూ కూడా ప్రేమిస్తారు.

ఈ చిన్ననాటి అనుభవాలూ, అనుభూతులూ వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, ప్రపంచమంతా తిరిగినా, ఎంత  ఉన్నత స్థాయికి చేరుకున్నా పుట్టి పెరిగిన చిన్ననాటి ఆ ఊరు, ఆ ఏరు, ఆ చెట్టూ పుట్టా, ఆ చెరువూ, ఆ కాలువ అన్నీ జ్ఞాపకాలలో చిరస్థాయిగా నిలిచిపోతయి. ఒక రకంగా అతని వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేస్తాయి.

వంశం, లేదా కుటుంబం, ఒక వృక్షం అనుకుంటే, తండ్రి ఆ చెట్టును చుట్టుకొని ఉన్న గట్టి బెరడు లాంటి వాడు. తల్లి చెట్టును ఎప్పటికీ సజీవంగా ఉంచే వేరు లాంటిది. కూతురు, ఆ చెట్టుకు శోభనిచ్చే ఆకులు, పూలు వంటిది. కొడుకు, ఆ చెట్టు నుంచి పుట్టన మొలకలాంటి వాడు. ఆ మొలకే మరో మహా వృక్షం అవుతుంది.

పుట్టిన ప్రతి పసివాడికి, జీవించే హక్కు ఉంది. పోషక ఆహారాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, విద్యనీ, మిగిలిన వారితో సమానంగా ప్రకృతి సిద్ధమైన వాటినీ అనుభవించే హక్కు ఉంది. ఆ హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదు. కానీ గత రెండు సంవత్సరాలుగా, కోవిడ్ మహమ్మారి వల్ల, అన్ని దేశాల్లోనూ మిగిలిన వాటితో పాటు పిల్లల హక్కులకూ భంగం వాటిల్లింది. ఇప్పుడిప్పుడే తిరిగి పరిస్థితులు కుదుటపడుతున్నాయి. కొందరు పేద పిల్లలు చిన్నతనం నుంచీ కష్టపడి సంపాదనకు దిగుతున్నారు. పేదరికం వాళ్ల తప్పు కాదు. అందుకు వాళ్లను బలి చేయకూడదు. కొన్ని చోట్ల కొన్ని ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు, పిల్లలకు పోషకాహారాన్ని అందించటానికి, పాఠశాలలు నిర్వహించడానికి ముందుకు రావటం ముదావహం.

పిల్లలు చిన్నప్పడు స్కూలుకు వెళ్లకపోతే, జీవితం సరియైన మార్గాన నడవదు. నేర మార్గాన్ని అవలంభించే అవకాశం ఉంది. ఇటీవల అమెరికాలో ఒక పిల్లవాడు ఒక స్టోర్‌లో నుంచి ట్రెడ్ దొంగతనం చేసినందుకు, ఆ పిల్లవాడి మీద కేసు పెట్టారు. విచారణ సమయం జడ్జి అనేక ప్రశ్నలు వేశాడు. ఆ పిల్లవాడి యథార్థ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. వాడికి తండ్రి లేడు. తల్లి జబ్బుతో బయటకు రాలేని స్థితిలో ఉంది. బ్రెడ్ కొనటానికి డబ్బు లేదు. అకలి బాధకు తట్టుకోలేక దొంగతనం చేశాడు. ఈ పరిస్థితికి సమాజం మొత్తం బాధ్యత వహించాలని జడ్జిగారు, తానొక పది డాలర్లు ఇచ్చి, అక్కుడున్న వారందిరినీ తలా ఒక పది డాలర్ల ఇవ్వాలని ఆదేశించాడు.

పిల్లవాడు చెడిపోయాడని తల్లిదండ్రులు బాధపడతారు. నా పిల్లలందరూ చెడిపోతున్నారని భగవంతుడు ఎంత బాధపడతాడో మరి.

ఒక కుటుంబంలో నలుగురు పిల్లలు ఉంటే, నలుగురూ ఒకేలా ఉండరు. నలుగురిదీ నాలుగు మార్గాలు. పైకి రావటానికీ ఎన్ని మార్గాలుంటాయో, చెడిపోవటానికీ అన్ని మార్గాలుంటాయి.

ఇంతకీ, ఇందులో

ఇంటి పేరు నిలిపేదెవడో, ఇండియాకు ప్రెసిడెంటు ఎవడో?

Exit mobile version