చిరుజల్లు 16

0
2

ఉద్యోగ పర్వాలు

[dropcap]సు[/dropcap]బ్బారావు ఏ రోజూ ఆఫీసుకు కరెక్ట్ టైంకి రాడు. ఒక గంట లేటుగా వస్తాడు. కానీ అది తన తప్పు కాదన్నట్లు ఏదో ఒక కారణం చెబుతాడు. ఒక రోజు ఆటో మధ్యలో ఆగిపోయిందంటాడు. ఇంకో రోజు బస్సులో గొడవైతే, పోలీసు స్టేషన్‌కి తీసుకెళ్లారంటాడు. ఇంకోసారి ఏదో ఊరేగింపు వల్ల లేటు అయిదంటాడు.

“నువ్వు వచ్చేటప్పటికి అందరూ పని చేస్తుంటారు. నీకేమీ అనిపించదా?” అని ఆఫీసరు అడిగితే “ఎందుకు అనిపించదు సర్, అందరి కన్నా ముందు రావాలనుకున్నా… బస్సులో కూర్చుంటే చిన్నకునుకు… మీరే గుర్తొచ్చారు సర్, ఎంత డిసిప్లిన్? ఎంత స్ట్రిక్ట్? ఎప్పుడూ మీ గురించే మా పిల్లలకు చెబుతుంటాను సర్…” అంటూ ఆయనకు గాలికొడతాడు. పొగడ్తలకు లొంగనివాడు ఎవడుంటాడు?

ప్రతి వాడికి ఏదో ఒక పిచ్చి ఉంటుంది. వేపకాయంత వెర్రి ఉంటుంది. ఆ వెర్రి ఏమిటో కనిపెడితే చాలు, ఎంతటి వాడైనైనా వెర్రి వెధవను చేయటం, వెరీ వెరీ ఈజీ. ఉదాహరణకు ఆఫీసర్‌కి కవిత్వం పిచ్చి ఉందనుకోండి. ఆయన ‘నీటిపై తేలితే తెప్ప, నీటిలో మునిగితే కప్ప’ అంటాడు. ఇంక ఈ భక్తులు భజన మొదలు పెడతారు. “అసలు మీరు రవీంద్రనాధ్ ఠాగూర్ అంతటి వాళ్లు సర్… తెలుగులో మీరు కవిత్వం రాసినందు వల్ల, వాళ్లకు తెలుగు రానందు వల్ల, నోబెల్ బహుమతి రావటం లేదు గానీ, లేకపోతే, ఇండియాలో ఇంతటి లోతైన కవిత్వం చెప్పిన వాడు ఎవరూ లేరండి… మీరు రాసిన కవిత్వం నా ముఖాన పారెయ్యిండి. నేను అచ్చువేయించి, కేంద్ర, రాష్ట్ర సాహిత్య కాడెమీలకు పంపిస్తాను. మీకు అవార్డు ఎందుకివ్వరో నేను చూస్తాను…” అంటూ వీర లెవెల్లో ఆఫీసు వాళ్ళంతా పొగడ్తలతో ముంచెత్తుతారు.

పొంగిపోయిన సదరు సార్ “ఏంటోనయ్యా, థాట్స్ అలా కౌడ్స్ లాగా వచ్చేస్తుంటయి…” అంటారు. అంతే. ఎవడినో పట్టుకొని వెయ్యి కాపీలు అచ్చువేయించి, పని మీద ఆఫీసుకు వచ్చిన వాళ్లందరికీ తలా ఒక కాపీ అంటగడతారు. అదే పనిగా – ఆఫీసు పని మానేసి.

ఆఫీసరుగారు, నట, విట, గాయకుడు అయినా, ఆయన పేరు అలా మోగిపోతుంటుంది. అది కుర్చీ మహిమ.

“మా సార్, పులి… ఒకసారి ఆయన్ను చూడండి… ఎలా ఉంటారో?” అని ఆకాశానికి ఎత్తేస్తారు. ఆయన ఆఫీసులో పులి. కానీ ఇంట్లో మేడమ్ దగ్గర పిల్లి… అని ఎవడైనా గిట్టనివాడు చాటుగా వాగితే, దానినీ సమర్థిస్తారు. “అమ్మవారు, పులి మీదనే గదా స్వారీ చేస్తారు…” అని పనిలో పనిగా అమ్మగారికీ కిరీటం పెట్టేస్తారు.

ఇద్విధంబున, అయ్యగారిని ప్రసన్నుడను చేసుకుంటే, ఇంక వాడు పని చేసినా, చెయ్యకపోయినా, హవా నడిచిపోతుంది. గవర్నమెంటు ఆఫీసుల్లో చాలా మంది ఉద్యోగాలు చేస్తుంటారు. నెల నెలా జీతాలు తీసుకుంటారు. కానీ పని చేసేది మాత్రం సగం మందే.

ఎవడైనా పని మీద ఒక ఆఫీసుకు వెళ్లి, ఫలానా పని కావాలండీ అని అడిగితే, ‘నేను కాదు, నేను కాదు, నేను కాదు’ అనే ప్రతి వాడూ చెబుతాడు. అసలు వాడు సీట్లో ఉండడు. కొంత మంది స్వంత పనులన్నీ ఆఫీసు టైంలలోనే కానిచ్చేస్తారు. బ్యాంకుకు, పోస్టాఫీసుకు, హాస్పిటల్‌కు, కరెంటు బిల్లులు కట్టటానికి – ఇంకా సవాలక్ష పనులకు బయటకు పోయివచ్చే వాళ్లు ఉంటారు. లంచ్ టైం ఒంటి గంట నుంచీ, మూడు గంటల దాకా ఉంటుంది. ఇంకా ఒక గంట అటూ, ఒక గంట ఇటూ జరిగిపోతుంటుంది.

ఈలోగా ఆఫీసరు పిలిస్తే, పెళ్లానికో, తల్లికో ప్రాణం మీదకు వచ్చిందని, హృదయ విదారకమైన కథ చెప్పేస్తారు. ఎంతటి రాతి గుండె అయినా, పొయ్యిమీద పెట్టిన వెన్నలా కరిగిపోవాల్సిందే.

నేటి గుమాస్తాలే, రేపటి ఆఫీసర్లు. నిజానికి ప్రమోషన్లు పొందటానికి వంద రూల్సు ఉంటయి. అయినా సరే, అవన్నీ పక్కన పెట్టేసి, తమకు కావాల్సిన వాడికే ప్రమోషన్లు ఇచ్చుకుంటారు. మధ్యలో ఎవడన్నా అడ్డు ఉంటే వాడికి రెండు మెమోలు ఇచ్చి, ఎంక్వయిరీ కమిటీ వేస్తారు. ఇంక వాడికి ఈ జన్మకు ప్రమోషన్ రాదు.

గవర్నమెంటు ఆఫీసుల్లో లంచాలు ఇవ్వకపోతే, పనులు కావు అనే నమ్మకం మామూలు జనానికీ ఉంటుంది. ‘అర్జీలకు పనులు కావు, ఆశీర్వచనాలకు పిల్లలు పుట్టరు’ అనే సామెత ఉంది. పిల్లనిచ్చేటప్పుడు కూడా గవర్నమెంటు ఉద్యోగం అనగానే జీతం ఎంతొస్తుందీ అని అడిగి, పైన ఎంతొస్తుందీ అని అడుగుతారు.

ప్రజలతో సంబంధాలు ఉండే ఆపీసులో పని చేసే వారికి పంట పండినట్లే. అదే కొన్ని సీట్లల్లో ఉండేవారికి కనకవర్షమే. కొన్ని ఆఫీసుల్లో కొన్ని సీట్లల్లో పోస్టింగ్ చేయించుకోవటానికీ లంచాలు ఇస్తారంటే, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాటి విలువ ఎంతో. అందరి కళ్లూ ఆ సీట్లలో ఉన్నవాడి మీదే ఉంటాయి. ఉంటే ఉండనీయ్యి అనుకుంటాం. ఉన్నకొద్ది కాలంలోనే పది కాలాలకు సరిపడా సంపాదించుకుంటారు. ఆనక ఉద్యోగం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఏ లంచం తీసుకొని సస్పెండు అవుతాడో, ఆ లంచం ద్వారానే తిరిగి ఉద్యోగం సంపాదించుకుంటాడు. ఇందుకు ఏ ఒక్కడినీ తప్పుపట్టలేం. అన్ని రంగాలలోనూ అత్యున్నత స్థాయిలలో ఉన్న వారూ చేస్తున్న పని అదే. వాళ్లే కింద వాళ్లకి ఆదర్శం అవుతున్నారు.

ఇక గుమాస్తాగా ఉన్నప్పుడూ పని చేయడు. అప్పుడు పై వాడు చూసుకుంటాడని అంటాడు. వీడు పై స్థాయికి ఎదిగాక, కింద వాడు పని చేసి పెడితే, వాడు అతి కష్టం మీద సంతకం పెట్టటం నేర్చుకుంటాడు.

ఉద్యోగం అంటే గవర్నమెంటు ఉద్యోగమే కాదు. ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు మరో రకంగా ఉంటయి. అక్కడా వీళ్లే ఉంటారు. మనస్తత్వాలు ఇలాగే ఉంటయి. ‘మనోడు’ అయితే ఒక రకంగానూ, కాకపోతే మరో రకంగానూ ఉంటయి. తేడా ఏమిటంటే, ఎప్పటికప్పుడు లాభనష్టాల లెక్కలు చూసే వాళ్లు పైన ఉంటారు గనుక ఇక్కడ ఊరికే కూర్చో బెట్టి ఎవరికీ జీతాలు ఇవ్వరు. వారం వారం మీటింగ్‌లు పెట్టి ఎవరెంత పని చేసిందీ గమనిస్తుంటారు. కష్టపడి పని చేసేవాడు ఉంటేనే కంపెనీ నిలబడుతుంది. అందుకని అలాంటి వాడికే అక్కడ స్థానం. పని చేతగాని వాడిని ఒక్కరోజు కూడా భరించరు. అందుకే లక్షల రూపాయల జీతాలు వచ్చే వాళ్లకూ ఎప్పటికప్పుడు ఎన్నాళ్లు ఈ భోగాలో తెలియక భయపడుతుంటారు. కొన్ని కంపెనీలలో ముఖ్యంగా కొత్త కొత్త ప్రయోగాల కోసం చూసే భారీ అంతర్జాతీయ కంపెనీలలో నెల రోజుల దాకా ఏం చేస్తున్నారో ఎవరూ చూడరు. నెలాఖరున జీతం ఇచ్చేటప్పుడు మాత్రం, ఎవరెంత ఉపయోగపడే పని చేసిందీ లెక్కగడుతుంటారు.

అక్కడ కొన్ని జిమ్మిక్స్ జరుగుతుంటాయి. కింద వాళ్లు చేసిన పని, తాము చేసినట్లు చూపించి, క్రెడిట్ కొట్టేయ్యాలని చూసే మహాశయిలకీ కొదవలేదు. ముఖ్యంగా పోటాపోటీగా పనులు చేసే అంతర్జాతీయ సంస్థలలోనే చాకిరొకడిదీ, సౌఖ్యం ఒకడిది అన్న చందంగా నడుస్తుంటుంది. తమ టాలెంటు అంతా వేరే వాళ్ల ఖాతాల్లోకి వెళ్లిపోతున్నప్పుడు, ఇతను గట్టిగా నోరు విప్పలేనప్పుడు మరో చోటు వెతుక్కొవటమూ సర్వసాధారణం అయిపోయింది.

కంపెనీలు ఎప్పుడూ తక్కువ ఖర్చుతో, ఎక్కవ పని చేయించుకోవాలని చూస్తయి. ఉత్పాదన ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం అన్నమాట. అమెరికాలో ఒకరికి ఇచ్చే జీతంతో ఇండియాలో నలుగురు పని వాళ్ల చేత పని చేయించుకోవచ్చు. అది లాభసాటి వ్యాపారమే గానీ, ఇందులోనూ కొన్ని సమస్యలున్నయి. అక్కడ పగలు, ఇక్కడ రాత్రి. ఇక్కడ పగలు, అక్కడ రాత్రి. సమన్వయ లోపాలూ ఉంటయి. అనుభవ రాహిత్యమూ ఉంటుంది. తక్కువ జీతం ఇచ్చే వాడి నుంచి, నైపుణ్యం ఆశించటం అత్యాశే గదా. వీళ్లు చేసే తప్పులు దిద్దుకోవటానికి, ఇంకో ఇద్దర్ని పెట్టుకోవాలి. కింద వాళ్లు చేస్తే తప్పులు, పై వాళ్లు చేస్తే పొరపాట్లు. తప్పుకీ, పొరపాటుకీ తేడా ఏమిటంటే, తప్పు చేసినట్లు కూడా తెలియకపోవటం, తప్పు లక్షణం. తప్పు అని తెలిసి, తప్పు చేస్తే అది పొరపాటు అవుతుంది. లెక్కలు బాగా తెల్సిన విద్యార్థి అత్యుత్సాహంతో అన్సర్ తప్పుగా చూపించినట్లు అన్నమాట.

ఇలాంటి తప్పులు దిద్దటానికే కొద్ది మంది నిపుణులను పెట్టుకుంటారు. వాళ్లని ఎక్స్‌పర్ట్‌లు అంటుంటారు. అనుభవమే పాఠాలు నేర్పుతుంటుంది. ఎలా చెయ్యాలో తెల్సుకోవటం ఎంత అవసరమో, ఎలా చెయ్యకూడదో కూడా తెల్సుకోవటం అంతే అవసరం. ఎందుకంటే ఒకోసారి, చేసిన తప్పుకు శిక్ష జీవితాంతం అనుభవించాల్సి వస్తుంది.

కంపెనీలలో వారానికి అయిదు రోజులే పని చేస్తారు. ఆ అయిదు రోజులూ ఊపిరాడనంత పని చేయిస్తుంటారు. నలుగురి పని ఒక్కరి చేత చేయిస్తుంటారు. రాత్రింబగళ్లు చేసినా, ఇరవైనాలుగు గంటలూ సరిపోనంత పని చేసినా, ఎవరూ మెచ్చుకోరు. ఇంకా ఏదో ఒకటి వ్యాఖ్యానిస్తూనే ఉంటారు. ఇదొక దిగులు. ఈ ఉద్యోగం పోతే ఎలా – అని అదొక దిగులు. నలఫై ఏళ్లకే ఎనభై ఏళ్ల వాళ్లకి వచ్చే జబ్బులన్నీ వస్తున్నయి. దీనికి పరిష్కారం లేదు.

ఉద్యోగం అంటే, గవర్నమెంటు ఆఫీసుల్లోనూ, ప్రైవేటు కంపెనీల లోనూ పని చేయటం మాత్రమే కాదు. ఏ విధంగా డబ్బు సంపాదించ గలిగినా, అది ఉద్యోగమే.

డబ్బు సంపాదన గురించి చెప్పాలంటే, వ్యాపారం తరువాతనే మరేది అయినా. వ్యాపారం అంటే, పెద్ద పెద్ద మాల్సు, సినిమా హాల్సు దగ్గర నుంచి, చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వారి దాకా – అందరిదీ బిజినెస్సే. వ్యాపారంలో రాణించాలంటే, అందుకు సంబంధించిన లోగుట్టు తెల్సుకోవాలి. పట్టూ విడుపూ తెలియాలి. తెల్సినంత మాత్రాన సరిపోదు. అదృష్టం ఉండాలంటారు. కష్టపడి పని చేయటానికి మారు పేరే అదృష్టం. ఏ వ్యాపారం చేయదలచినా పరిజ్ఞానం తప్పనిసరి. చాలా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వారంతా, మొదట్లో చిన్న చిన్న వ్యాపారాలతో జీవన సమరాన్ని ఆరంభించిన వారే. ఎదగాలన్న తపన ఉండాలి. కొంత వరకూ తెగువ కూడా ఉండాలి. కష్టనష్టాలు ఎదురైనా తట్టుకొని నిలబడగల ధైర్యం, సామర్థ్యం ఉండాలి. చేస్తున్న పనిలో ఆసక్తి ఉండాలి. దానినే దైవంలా భావించాలి. పూజలూ, పునస్కారాలూ చేసేందుకు వినియోగించే సమయమూ, డబ్బు కూడా వ్యాపారాభివృద్ధికి వినియోగిస్తే, తప్పక రాణిస్తాడు. వ్యాపారం అనగానే ఎప్పటికప్పుడు కొత్త కొత్త విధానాలను అనుసరించాలి. అందర్నీ ఆకట్టుకునేలా ఏదో ఒకటి చెయ్యాలి. వ్యాపారం పెంపొందించాలంటే పబ్లిసిటీ చాలా ముఖ్యం. పబ్లిసిటీ లేని వ్యాపారం ఎలాంటిదంటే, చీకట్లో కూర్చుని ఎదురుగా ఉన్న అమ్మాయికి కన్ను కొట్టటం లాంటిది. కన్ను కొట్టటం నీకు తెలుస్తుంది. చీకట్లో ఉన్న ఎదుటి వాళ్లకు కనబడదు గదా.

బద్ధకం వ్యాపారానికి బద్ధ శత్రువు. పుష్టిగా తిని, నిద్రపోతే, వ్యాపారమూ నిద్రపోతుంది. పగలంతా ఒళ్లు వంచి పని చేయాలి. రాత్రికి కంటి నిండా నిద్రపోవాలి. అప్పుడే ఏ బిజినెస్ అయినా బాగుపడుతుంది.

ఈ మధ్య కాలంలో బాగా లాభసాటి వ్యాపారం ఏదీ – అంటే, రాజకీయాల గురించే చెప్పుకోవాలి. వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి కేంద్ర మంత్రి దాకా ఎదగాలంటే, నలుగురిని తన చుట్టూ తిప్పుకునే మంత్రాంగం తెలియాలి. రాజకీయాల్లోకి దిగటం అంటే, ఇది వరకు ప్రజాసేవే పరమార్థంగా ఉండేది. ఆ తరాలు అంతరించిపోయాయి. ఇప్పుడది ఖరీదైన వ్యాపారం. పంచాయితీ స్థాయి నుంచీ, అంతా డబ్బుతో ముడి పడిపోయింది. ప్రజానాయకుడు ప్రభుత్వ ఆస్తులకు, ప్రజల సొమ్ములకు కాపలాదారుడునంటాడు. నిజమే. కాపలాదారుడిని కాపలా కాసే వాడు ఎవరూ లేరు. వారి ఇష్టం. వారి దయా ధర్మం మీద ప్రజలు ఆధారపడి ఉంటారు.

నమ్మకంగా మాట్లాడాలి. ఎవరేది అడిగినా కాదు, లేదు అనకూడదు. ఎదుటి వాడు ఇది సాధ్యమా, అసాధ్యమా అని ఆలోచించుకునేందుకు అవకాశం ఇవ్వకూడదు.

కానీ రాజకీయాల్లో ప్రత్యర్థులకు కొదవ ఉండదు. ఒకరి చరిత్ర మరొకరు వెల్లడిస్తుంటారు. అవన్నీ రుజువు చేస్తే, సన్యాసం పుచ్చుకుంటానని వీరు శపథం చేస్తుంటారు. ఇవన్నీ జనానికి కాసేపు వినోదం కోసం.

ఎటొచ్చీ రాజకీయాల్లో ఎదగాలంటే, ఇంట్లో ‘మనీ ప్లాంట్’ పెట్టుకోవాలి.

రాజకీయాలే ఇప్పుడు ప్రామిసింగ్‌గా ఉన్నాయి. ఎందుకంటే, ప్రామిస్ చేయటం తెలిస్తే చాలు. పబ్బం గడిపేసుకోవచ్చు. ఆ ప్రామిస్‌లు నెరవేరుస్తానన్న ప్రామిస్ ఎవరూ చేయరు. ఇతర పార్టీల ప్రామిస్‌లకు మించి పోయే ప్రామిస్‌లు చెయ్యాలి.

ఏమీ చెప్పకపోయినా, ఏమీ చెప్పలేదన్న విషయం తెలియకుండా వేదిక నెక్కి అనర్గళంగా రెండు గంటలు ఏవో ఒకటి చెప్పెయ్యాలి. అదొక పెద్ద ఆర్ట్.

ఇంతకీ రాజకీయం ఒక మాయాలోకం. దీనిలోకి డబ్బు ఎవరికీ, ఎప్పుడు, ఎలా వస్తుందో మూడో కంటి వాడికి కూడా తెలియదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here