చిరుజల్లు 17

0
3

గోధూళివేళ కన్నీరు ఏల?

[dropcap]క[/dropcap]లవారి ఇంట్లో ఏం జరిగినా అంగరంగ వైభవంగానే చేస్తారు. వారి ఒక్కగానొక్క అమ్మాయి పుట్టిన రోజు పండుగ జరుగుతోంది. పేరుకు పుట్టిన రోజు పండుగే  అయినా, పెళ్లి జరుగుతున్నంత హడావిడి చేశారు. వంద మంది దాకా వచ్చారు. సురేఖ, శ్యాం కూడా తమ నాలుగేళ్ల పాప హరిణితో వెళ్లారు. అతిథుల మర్యాదలు, మంచీ చెడ్డల ముచ్చట్లు… పరామర్శలతో ఇంట్లో, లాన్‌లో ఉన్నవారంతా చిన్న చిన్న బృందాలుగా విడిపోయారు. సురేఖ ఆడవాళ్లతో కబుర్లుల్లో పడి పోయింది. శ్యాం మగవారితో రాజకీయాల చర్చల్లో మునిగిపోయాడు. పిల్లలంతా గేటు దగ్గర కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. ఒక గంట తరువాత గానీ తమ పాప హరిణి విషయం గుర్తుకు రాలేదు. సురేఖ కంగారుగా కూతురి కోసం వెతికింది. శ్యాంకు చెప్పింది హరిణి కనిపించటం లేదని. అతనితో పాటు మిగిలిన వాళ్లు ఇల్లూ, వాకిలీ పైనా క్రిందా అంతా వెతికారు. నలుగురు కుర్రాళ్లు కార్లు, బండ్లూ బయటకు తీసి అటూ ఇటూ ఉన్న నాలుగు వీధులూ వెతికి వచ్చారు. హరిణి కనపడలేదు. సురేఖకు దుఃఖం ఆగటం లేదు. అప్రయత్నంగానే ఏడ్చేస్తోంది. పక్కనున్న వాళ్లు ఎంత ఓదార్చినా ఏడుపు ఆగటం లేదు. పోలీసు రిపోర్టు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. రాత్రి పది గంటల సమయంలో ఎవరో ఇద్దరు కుర్రాళ్లు హరిణిని టూవీలర్ మీద తీసుకొచ్చారు. పాప ఒక్కతే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే, వాళ్లు దగ్గరకు తీసుకొని ఓదార్చి, హాటల్లో టిఫెను తినిపించి, తల్లిదండ్రులకు అప్పగించాలని కాలనీ అంతా తిరుగుతున్నామని చెప్పారు. సురేఖ కూతుర్ని గుండెలకు హత్తుకొని, ముద్దులు పెడుతూ కన్నీరు కారుస్తోంది. అయితే ఇంతకు ముందు కార్చిన కన్నీరు వేరు. ఇప్పుడు కార్చే కన్నీరు వారు….

లావణ్య పుట్టింటికి వచ్చి వారం రోజులు అయింది. అందరి ముందూ మామూలుగానే తిరుగుతోంది. తెచ్చి పెట్టుకున్న నవ్వుతో నిర్జీవంగా నవ్వుతోంది. అందరి మధ్యా ఉంటూనే అన్యమనస్కంగా ఉంటోంది. కానీ లోలోపల దేనికో మథన పడుతోంది. మిగిలిన వాళ్లు కనిపెట్టక పోయినా, తల్లి గమనించింది. “ఏం జరిగింది?”  అని అడిగంది. “ఏం లేదు” అని తేల్చేసింది తప్ప తన బాధ ఏమిటో చెప్పలేదు. గోధూళి వేళ డాబా మీద కూర్చుని ఎటో చూస్తూ, ఏదో ఆలోచిస్తోంది. భర్త ఆమెను వదిలేసి, మరొక అమ్మాయి వలలో పడికొట్టుకుంటున్నాడు. పెళ్లి అయి అయిదేళ్లు అయింది. ఒక రకంగా అంతా స్థిరపడినట్లే అనుకొని తృప్తిపడుతున్న సమయంలో పిడుగులాంటి సమస్య వచ్చి పడింది. ఇంత కాలం గడిచాక ఇప్పుడీ విపరీత బుద్ధి ఏమిటి?  ఎందుకింత పిచ్చిలో పడిపోయి, నిండు సంసారాన్ని నాశనం చేసుకుంటారు?  అంత ఒళ్లు తెలియని వ్యామెహంలో పడికొట్టుకు పోవటానికి ఏముంది ఎవరి దగ్గరైనా? బండెడు ఎముకలు, మాంసం ముద్దలు, పైన కప్పిన తోలు తప్ప –  ఏముంది ఎవరి దగ్గరైనా? అందరూ ఇలాగే భ్రమలో పడిపోతే, లోకంలోని కుటుంబాలన్నీ ఏమైపోతయి?  సమాజం భ్రష్టు పట్టిపోదా? చదువుకొని, విద్యాబుద్ధులు ఉండీ, అందరికన్నా నాలుగు రూపాయలు ఎక్కువ సంపాదించుకుంటూ, ఇంత అజ్ఞానంలో పడిపోతే, ఆ మనిషికి ఏమని చెప్పాలి? ఎవరికి చెప్పాలి? మోకాళ్ల మీద తల వాల్చి కన్నీరు కారుస్తున్న లావణ్య నెత్తిన ఎవరో చెయ్యి వేసి నిమిరారు. పక్కన తల్లి కూర్చుని ఉన్నది. “గోధూళి వేళ, నీకెందుకీ కన్నీరు తల్లీ?” అని ఆప్యాయంగా అడిగంది. తల్లి ఒడిలో తల పెట్టి వలవలా ఏడ్చింది. ఉగ్గబట్టుకున్న ఆవేదన కట్టలు తెంచుకున్న నదీప్రవాహంలా పెల్లుబికి వచ్చింది. ఆ కన్నీటికి గల బలమెంత? బరువెంత?…

ఆ ప్రాంతంలో ఆయన నాయకత్వానికి తిరుగు లేదు. అక్కడ ఆయనే మకుటుం లేని మహారాజు. ఎవడన్నా గట్టిగా గాలి పీల్చాలన్నా, వదలాలి అన్నా ఆయన అనుమతి ఉండాల్సిందే. అపరిమితమైన అధికారం ఉన్నప్పుడూ, చేయగల అడ్డమైన పనులన్నీ చేయటం సహజమే గదా. అయితే ఆ అడ్డగోలు పనులు ఆయన చేయనక్కర్లేదు. అవన్నీ ఆయన కోసం చేసి పెట్టేందుకు అనుచరులు ఎప్పుడూ చేతులు కట్టుకొని నిలబడే ఉంటారు. చలపతి ఆయనకు నమ్మినబంటు.ఇంటా బయటా ఆయనను నీడలా వెన్నంటి తిరుగుతుంటాడు. ఆయన కనుసన్నల్లో మనసులుతుంటాడు. ఆయన గుట్టు మట్టు అంతా చలపతికి తెల్సు. నిజానికి ఆయన పేరు మీద అందర్ని బెదిరించి, అదిలించి, అనుకున్నవన్నీ సాధించేది చలపతే. గాదెకింద నుండే పది కొక్కు, అక్కడే తింటుంది గదా. అంచేత చలపతీ కొద్దొగొప్పో సంపాదించుకోవాలనే తాపత్రయంలో పడ్డాడు. దీన్ని ఆయన గారు గమనించాడు. వీడిని ఇలా వదిలేస్తే, రేపు తనకే ఎదురు తిరిగినా తిరుగుతాడు. ఈ లోగా ఆ నాయకులం గారికి రాజధానిలో పెద్ద పదవులు లభించాయి, మకాం మార్చాల్సిన వచ్చింది. కానీ స్వస్థానంలో పట్టు కోల్పోకూడదు. అయితే గీయితే రేపు చలపతే తనకు పచ్చి వెలగకాయలా గొంతులో అడ్డుపడుతాడన్న ఆలోచన రావటంతోనే, ఒక రోజు చలపతి రోడ్డు ప్రమాదంలో లారీ కింద పడి చనిపోయాడు. చలపతి భార్య అనాథ అయింది. దొరగారు పదవుల మెట్లు ఎక్కుతున్న సంరంబంలో, ఆ మెట్ల క్రింద చిట్లిన చిరుగాజులు చప్పుడు ఎవరికీ వినిపించలేదు. రెండు పూటలా ఇంత తిండి పెడుతున్న రెక్కలు విరిగిపోయినయి. ఆమెను అంటి పెట్టుకుని కూర్చున్న పిల్లలకు రెక్కలు రాలేదు. సంతతధారగా కారుతున్న ఆ అబల కన్నీటిని తుడిచే వారెవరు?…

ఆదిలక్ష్మి పదహారేళ్ల పిల్ల. తినటం, తిరగటం తప్ప దానికి దేనిపట్లా పెద్దగా ఆసక్తి లేదు. పదో తరగతి వరకూ వాళ్లే నెట్టేశారు. రెండేళ్ల నుంచీ పదో తరగతి చదువుతున్నానంటుందేగానీ, పుస్తకాలు చదివిన పాపాన పోలేదు. అంచేత కనుచూపు మేరలో, పది గట్టేక్కే మార్గం లేదు. దానికి ఆ దిగులు కూడా లేదు. తూనిగలాగా ఇల్లిల్లూ తిరుగుతూ, కనపడ్డ వాడినల్లా చూసి పళ్లు ఇకిలిస్తుంది. ఇలాంటి  పనిపాటా లేని వాడే ఒకడు దానికి తారసపడ్డాడు. ఒక రోజు వెనకాల పడ్డాడు. రెండు రోజులు వెంటపడ్డాడు. ఆనక ఎగబడ్డాడు. తెగపడ్డాడు –  ‘అయ్ లవ్ యూ’ అంటూ. దాని అర్థం ఏమిటో వాడికి తెలియదు. కామానికి, ప్రేమకీ మధ్య చాలా తేడా ఉందన్న విషయం అసలే తెలియదు. ఆదిలక్ష్మికి వాడి పోకిరీ వేషాలు నచ్చలేదు. ఛీ కొట్టింది. అయినా వాడు వదల్లేదు. మాట్లాడాలి రమ్మన్నాడు. “నీతో నాకు మాటలేంటి, పోమ్మంది”. ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లో చొరబడ్డాడు. ఆదిలక్ష్మి తిరగబడింది. పీక పిసికి చంపేసి వెళ్లిపోయడు. ఆనక పట్టుబడి జైలు కెళ్లాడు. కొన్నాళ్లకు ఉరి శిక్షపడింది. కూతుర్ని పోగొట్టుకున్నందుకు, ఆ పిల్ల తల్లిదండ్రులూ కుమిలికుమిలి ఏడ్చారు. కొడుకు ఉద్ధరిస్తాడనుకుంటే, ఉరికంబం మీద వేలాడినందుకు వాడి తల్లిదండ్రులూ, కడుపుకోతతో కొంత, అవమాన భారంతో మరి కొంత ఏడ్చారు. చివరకు ఏం మిగిలింది? కడివెడు కన్నీళ్లు తప్ప. కేవలం అవివేకంతో దుఃఖాన్ని కొని తెచ్చుకొని, తన వాళ్లకూ తీరని శోకాన్ని మిగిల్చే వాళ్లు మన మధ్య ఉంటున్నందుకు మనమూ బాధపడే రోజులొచ్చాయి…

సత్యం సిపాయిగా సెలక్ట్ అయిన రోజున గర్వంతో పొంగిపోయాడు. ఉద్యోగం దొరికినందుకే కాదు, దేశరక్షణకు తన వంతు పాటు పడుతున్నందుకు. శిక్షణ పూర్తి అయింది. ఎక్కడో పాకిస్తాన్ సరిహద్దుల్లో కొన్నాళ్లు ఉన్నాడు. శెలవు పెట్టి వచ్చాడు. పెళ్లి చేసుకున్నాడు. నెలరోజులు ఉన్నాడు. వెళ్లేటప్పుడు భార్య కన్నీళ్లు పెట్టుకుంది. ధైర్యం చెప్పి వెళ్లాడు. ఏడాది కోసారి వస్తూనే ఉన్నాడు. వచ్చినప్పుడల్లా సంతోషంతో కన్నీళ్లు. తిరిగి వెళ్లేటప్పుడు, వెళ్లిపోతున్నాడన్న బాధతోనూ, ఎప్పుడు ఏమవుతుందన్న శోకంతోను, ఏడుపు ఆపుకోలేకపోయేది సత్యం బార్య. కొన్నేళ్లు గడిచాయి, ఇద్దరు పిల్లలు కలిగారు –  సంయోగ, వియోగాల మధ్య ప్రపంచంలో చాలా దేశాలు ఎంతో కాలంగా ప్రశాంతంగా ఉంటున్నాయి. అక్కడి ప్రజలూ ఉన్నంతలో నిశ్చింతగా బ్రతుకుతున్నారు. ఈ దేశం దౌర్భాగ్యం ఏమో, ఎప్పుడూ, ఎక్కడ, ఎవడు కయ్యానికి కాలు దువ్వుతాడో తెలియదు. ఇంటి పొరుగు వాడూ అలాగే ఉన్నాడు. పొరుగు దేశం వాడూ అలాగే ఉన్నాడు. యుద్ధంలో సత్యం వీరోచితంగా పోరాడాడు. కాని ఒక కాలు, ఒక చెయ్యి సగానికి పైగా తెగిపోయినయి. ఇల్లు చేరాడు. చక్రాల కుర్చీకే పరిమితం అయ్యాడు. ప్రతి చిన్న దానికీ, భార్య పిల్లలు మీద ఆధారపడాల్సి వచ్చనందుకు లోలోపలే కుమిలి పోతున్నాడు. కంచంలో పెట్టింది తినటమూ కష్టంగానే ఉంది. చేతిలోవి జారి కింద పడిపోతే, దాన్ని తీసుకొలేని దుర్భరమైన పరిస్థితిలో రెండు కళ్ల వెంట కృష్ణాగోదావరీ నదులే ఉప్పొంగుతున్నయి. దేశాన్ని కాపాడుతానని ఒకనాడు గర్వపడినవాడు, ఇవాళ నిస్సహాయంగా దిక్కులు చూస్తూ దిగులును గొంతులోనే దిగమింగుకుంటున్నాడు…

విశ్వం అఖండమైన తెలివితేటలున్నవాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. కొత్త కొత్త యాప్ లంటూ ఎప్పుడూ ఏదో కనిపెడుతుంటాడు. ఐన్‌స్టీన్ తరువాత అంత తెలివైనవాడు. ఇప్పుడింకా మొదటి మెట్టు మీద ఉన్నాడు గానీ, భవిష్యత్తులో సోపానాలన్నీ ఎక్కుకుంటూ, ఏదో ఒక రోజు పెద్ద కంపెనీకి సి.ఇ.ఓ అయిపోతాడని అందరూ అనుకుంటున్నారు. చాలామంది శ్రీమంతులు పిల్లనిస్తామని వచ్చారుగానీ, అతనెందుకో పెద్దగా ఆసక్తి చూపలేదు. కారణం అతనికి ఫ్రెండ్స్‌తో కాలక్షేపం చేయటం అంటే చాలా ఇష్టం. రోజూ ఒంటి గంట దాగా బార్ లోనో, పబ్ లోనో స్నేహితులతో సరదాగా ఎంజాయ్ చేసి ఇంటికి రావటం అలవాటైంది. క్రమంగా అతనిలో మార్పు రావటం మొదలెట్టింది. దేన్నీ సీరియస్‌గా తీసుకోవటం లేదు. డబ్బు కూడా మంచినీళ్లు లాగా ఖర్చు చేసేస్తున్నాడు. బద్ధకం ఆవరించింది. కంపెనీకి సరిగా టైంకి వెళ్లటం లేదు. పని పట్ల శ్రద్ధ చూపటం లేదు. రెండు నెలలు చూసి కంపెనీ వాళ్లు ఇంటికి పంపిచారు. వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేయటం లేదు. డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. డబ్బు లేదు. డ్రగ్స్ లేనిదే ఉండలేడు. పిచ్చి వాడిలా తిట్టుకుంటూ, నిస్సత్తువగా మంచంలో పడి ఉంటున్నాడు. తిండి తినటం లేదు. ఆరు నెలలు తిరిగేటప్పటికి వెర్రిరూపు వచ్చేసింది. ఎంతో తెలివిగలవాడు, ఎంతో వృద్ధిలోకి వస్తాడని అనుకున్నారు అందరూ, కానీ మత్తు మందులకు బానిస అయిపోయి, తల్లికీ తండ్రికీ విచారాన్ని మిగిల్చాడు. తమ కళ్ల ముందే, ఎముకలగూడులా మారిన కొడుకుని చూసి వాళ్లు ఏడవని రోజు లేదు. పైకి చెప్పుకోలేరు. గుండెల్లో దాచుకోలేరు….

దుఃఖాన్ని దిగమింగుకోవటం కన్నా, ఏడ్చి ఏడ్చి కన్నీటి రూపంలో బాధను వెళ్లగక్కటమే మంచిదని వైద్యులు అంటున్నారు.

ఒక నర్సు తన తండ్రి కాన్సర్ వ్యాధితో క్షీణించి క్షీణించిపోవటం చూసి వస్తున్న ఏడుపును గొంతులోనే దాచుకోవటం అలవాటు చేసుంది – తల్లి మరింత ఖేధపడకూడదని. తండ్రి చనిపోయాడు. ఆ వేదననూ గుండెలోనే అణుచుకంది. దాని ప్రభావం ఆమె శరీరం మీద పడింది. అంతు తెలియని వ్యాధితో ఆ నర్సు కూడా చనిపోయింది. అంచేత కన్నీటికి ఆనకట్టలు వేయకూడదనే వైద్యనిపుణులు చెబుతున్నారు.

తన బాధలను ఇతరులకు చెప్పుకుంటే, కొంత భారం తగ్గుతుంది. వియోగం ఎప్పుడూ దుఃఖాన్నే మిగుల్చుతుంది. పెళ్లి చేసి కూతుర్ని అత్తవారింటికి సాగనంపేటప్పుడూ ఏడుస్తారు. అయితే ఆ ఎడబాటు తాత్కాలికమైనది. మరణం వల్ల కలిగే ఎడబాటు శాశ్వతమైనది. కన్నీరు దాటున ఉన్న బాధను స్పష్టంగా చూపించే టెలిస్కోప్ లాంటిది.

కష్టాలు కలిగినప్పుడు మనిషి చావాలనుకుంటాడు. కానీ చావటం చాలా కష్టం. బతకటం చావటం కన్నా కష్టం అనుకున్నప్పుడే, ఆ బాధ, ఆ ఉద్వేగం భరించలేనప్పుడే ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు.

కొందరికి అన్నిటికీ కొరతే. కన్నీటికి మాత్రం వరదే. కన్నీటికి ఖరీదు కట్టగల షరాబు ఎవడూ లేడు.

బాధాతప్త హృదయాల కన్నీటి తోనే జీవనదులున్నీ పొంగిపొరలుతున్నయి.

ప్రతి దేశంలోనూ కొన్ని జలపాతాలుంటాయి. వలవలా కారే కన్నీటి జలపాతాలూ ఉంటయి. వాటిని అలా ప్రవహించనివ్వటమే శ్రేయస్కరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here