చిరుజల్లు 2

0
3

దయరానీ… దయరానీ…

ప్రతిఫలాపేక్ష లేని ఆపేక్ష:

[dropcap](1)[/dropcap]

విమానం బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. ప్రయాణీకులు అందరూ సీట్లలో సర్దుకుని కూర్చున్నారు. ఒకే ఒక్కరు రావల్సి ఉంది. అంతా అసహనంగా ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో ఒక ముప్ఫయి ఏళ్ళ ఆమె, ఒక చేతిలో పసిపాపతోనూ, మరో చేతిలో స్ట్రోరల్ తోనూ లోపలికి వచ్చింది. ఎయిర్ హోస్టెస్ ఆమెకు సీటు చూపించి లగేజీ సర్దేసింది. ఇంతలో పసిపిల్ల వాంతి చేసుకుంది. వాయుకన్య టిష్యూ పేపరు తెచ్చి ఇచ్చింది. ఆమె తన బట్టలను శుభ్రం చేసుకుంది. అందరూ ఆమెనే చూస్తున్నారు. ఆమె ఎవరినీ పట్టించుకోవడం లేదు. లోకంతో సంబంధం లేనిదానిలా ఉంది. జుట్టు ముడివేసుకుని సరాసరి వంటింట్లోంచి వచ్చినట్లు ఉంది. చెంపలమీది చారికలు, సజల నేత్రాలు ఆమె దుస్థితిని చెప్పకనే చెబుతున్నయి. అందరూ చోద్యం చూస్తూ కూర్చున్నారు. బిజినెస్ క్లాస్ లోని పార్వతి లేచి తన లగేజి దించి, అందులో నుంచి ఒక చీర తీసి ఆమెకు ఇచ్చింది. పసిపిల్లను అందుకుంది. ఆమె రెస్ట్‌రూం లోకి వెళ్ళి చీర మార్చుకుని వచ్చింది. అయిదు నిముషాలు ఆలస్యంగా విమానం టేకాఫ్ అయింది.

ఒక గంట తరువాత అందరూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాక, పార్వతి ఆమె వివరాలు అడిగి తెల్సుకుంది. ఆమె భర్త సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. రెండు నెలల నుంచి ఉద్యోగం లేదు. అతి కష్టంగా రోజులు నెట్టుకొస్తున్నారు. ఇండియాలో ఉన్న ఆమె తల్లి చనిపోయినట్లు ఆ రోజు ఉదయమే ఫోన్ వచ్చింది. ఎలాగోలా టికెట్ దొరికింది. ఉన్న పళంగా బయల్దేరింది. తను వెళ్ళే దాకా తల్లి శవంను చూసేవారు లేరు. వెళ్ళి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకోవాలి.

ఆమె దుస్థితి విని పార్వతి చలించిపోయింది. తనే ఆ స్థితిలో ఉంటే… అన్న ఊహనే ఆమె తట్టుకోలేకపోయింది. భయపడ వద్దని, తనూ, తన కుటుంబ సభ్యులూ వచ్చి అక్కడ నిలబడి అన్ని ఏర్పాట్లూ చేస్తామని పార్వతి ధైర్యం చెప్పింది. కళ్లు రెండూ కన్నీటి చెలమలు కాగా, ఆమె, పార్వతికి పాదాభివందనం చేసింది.

(2)

రైలు వేగంగా పరుగెడుతోంది. టికెట్ కలెక్టర్ అందరి టికెట్లూ చెక్ చేస్తున్నాడు. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న ఒక అమ్మాయి అతనికి దొరికి పోయింది. ఆ అమ్మాయిని జైలుకు పంపిస్తానని టికెట్ కలెక్టరు బెదిరిస్తున్నాడు. ఆ అమ్మాయి ఏడుస్తోంది. అందరూ చోద్యం చూస్తున్నారు.

సుధామూర్తి జోక్యం చేసుకుంది. ఫైన్‌తో సహా చెల్లించింది. ఆ పిల్ల వివరాలు తెలుసుకుంది. ఆ అమ్మాయి తండ్రి తాగుబోతు. తల్లిని చంపేశాడు. మరొక స్త్రీని ఉంచుకున్నాడు. ఇద్దరూ తాగి వచ్చి ఈ పిల్లను చావగొడుతున్నారు. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది.

సుధామూర్తి ఆ పిల్లను తనతో తీసుకెళ్లి, ప్రభుత్వ అనాథ బాలికల హాస్టల్‍లో చేర్చింది. కొంతకాలం అవసరమైన సాయం చేసింది. తరువాత తనకున్న సవాలక్ష పనుల ఒత్తిడిలో పడి ఆ విషయం మర్చిపోయింది.

కొన్నేళ్ళ తరువాత సుధామూర్తి అమెరికాలోని ఒక ఐ.టి.కంపెనీకి అతిథిగా వెళ్ళింది. పుష్పగుచ్ఛంతో స్వాగతం చెప్పిన ఒక ఉద్యోగిని ఆమెను అడిగింది “ఒకప్పుడు రైలులో ప్రయాణం చేసిన టికెట్‍లెస్ ట్రావెలర్ మీకు గుర్తుందా మేడమ్” అని.

సుధామూర్తి సంతోషానికి, సంభ్రమానికి అంతులేదు.

(3)

ఒక అమ్మాయి సిటీలోని స్నేహితురాలి ఇంటికి బస్సులో వెళ్తోంది. కొత్త కావటం వలన దిగవలసిన స్టాప్ దాటి రెండు కిలోమీటర్ల అవతల బస్సు దిగింది. చీకటిగా ఉంది. ఎదురుగానున్న కల్లు కాంపౌండ్ లోని తూలుతూ వచ్చిన వాళ్లు ఆ అమ్మాయి పక్కన చేరుతున్నారు. ఆ అమ్మాయి భయంతో ఏడుపు మొహం పెట్టింది. పక్కనే ఉన్న గుడిసె లోనుంచి వచ్చిన ఒక స్త్రీ ఆ అమ్మాయికి తోడుగా నిలబడింది. “నేనుండాగా, బయపడమాక” అంది నవ్వుతూ. స్నేహితురాలి తండ్రి స్కూటర్ మీద వచ్చి తీసుకెళ్లేదాకా, ఆ స్త్రీ అక్కడే తోడుగా నిలబడింది.

ఆదుకోవటానికి జేబు నిండా డబ్బు ఉండక్కర్లేదు. గుండెలో నిండుగా దయ ఉన్నా చాలు.

పరోపకారం:

(1)

చెన్నైలో తిరువెంగడం వీరరాఘవన్ అనే డాక్టరు పేదలు నివసించే కాలనీల వద్ద రెండు చోట్ల క్లినిక్‍లు పెట్టి తన దగ్గరకొచ్చే పేదవారికి ఉచితంగా వైద్యం చేస్తుంటాడు. ఒక క్లినిక్‍లో రాత్రి తొమ్మిది గంటల దాకా, మరో క్లినిక్‍లో రాత్రి పన్నెండు గంటల దాకా వైద్యసేవలు అందిస్తుంటాడు.

‘ప్రభుత్వం నాకు ఉచితంగా వైద్యవిద్య నేర్పించింది. అందుకని రోజూ కొంతసేపు పేదలకు వైద్యం చేస్తున్నాను’ అంటాడు వీర రాఘవన్.

(2)

కేరళలో ఒక వ్యక్తికి కిడ్నీ మార్చవలసి వచ్చింది. ఆ రోగి బంధువులు ఒక దళారి ద్వారా తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అందుకు పెద్ద మొత్తంలో డబ్బు కావల్సి వచ్చింది. చందాలు పోగు చేస్తూ ఒక చర్చి ఫాదర్ వద్దకు వెళ్ళారు. విషయం తెల్సుకున్న ఆ ఫాదర్ ఉచితంగా తన కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. అంతే కాదు, ఇలాంటి రోగులను ఆదుకునేందుకు కిడ్నీదాతల పేర్లు సేకరిస్తూ ఒక సేవాసంస్థను నడిపాడు.

(3)

చాలా ఏళ్ల కిందట తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఒక విద్యార్థి కాచిగూడాలో ఒక హైస్కూలులో చదువుకుంటూ రోజూ తెల్లవారు ఝామునే లేచి ట్రూప్ బజార్ దాకా నడుచుకుంటూ వెళ్లి, యాభై పైగా దినపత్రికలను ఇంటింటికీ పంపిణీ చేసేవాడు. ఆ కుర్రవాడి దీనస్థితిని గమనించిన ఒక పోలీసు తమ ఇంట్లో ఉన్న సైకిల్ బహుమతిగా ఇచ్చాడు. ఆ పిల్లవాని ఆనందానికి అవధులు లేవు. కొంతకాలానికి ఆ పిల్లవాడే సైనికాధికారి అయినాడు. సైకిల్ దానం చేసిన పోలీసును కలవడానికి కాచీగుడా అంతా తిరిగాడు. కానీ ఆ పోలీసు దొరకలేదు.

దాత పరోపకార గుణ ధన్యత చిత్తములోన నెప్పుడున్ లేని వివేకశూన్యునకు లేములు వచ్చిన వేల సంపదల్ పూనినవేళ నొక్కసరి పోలును అంటాడు కవి భాస్కర శతకంలో. గుడ్డివాడికి రాత్రికి, పగలుకీ తేడా తెలియనట్లే, అవివేవికి దారిద్ర్యం వచ్చినా, సంపద కలిగినా ఒకటేనంటాడు కవి.

ఉపకారికి ఉపకారము:

(1)

వృద్ధ దంపతులు విమానంలో తిరుపతి వెళ్లారు. అక్కడ దైవ దర్శనాలు అయినాకా, టాక్సీలో కంచికి వెళ్లారు. టాక్సీ అతను అడిగినంత డబ్బు ఇవ్వటమే గాక తమతో టిఫెన్లు, భోజనాలు చేయించారు. రాత్రి పూట అతను టాక్సీలోనే పడుకుంటానంటే, వినకుండా తమ హోటల్ రూమ్ లోనే అతనినీ పడుకోమన్నారు. వాళ్ల ఆదరణకు అతను కరిగిపోయాడు.

ఆమెకు భక్తి ఎక్కువ. పూజలు, పునస్కారాలు అయ్యేదాక టిఫెన్లు తినదు. అసలే ఆమెకు షుగర్ వ్యాధి ఉంది. దానికితోడు హోటల్ తిండి సరిపడక విరోచనాలు అయినయి. పదింటికి షుగర్ కౌంట్ తగ్గిపోయినందువల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమె భర్తకు భాష కూడా తెలియదు. అపరిచితుడైన టాక్సీ డ్రైవరే ఆమెను హాస్పిటల్‍లో చేర్పించాడు. ఒక రోజంతా ఉంచినందుకు ముప్ఫయివేలు బిల్లు అయింది. ఆ టాక్సీ డ్రైవరే తనకు తెల్సిన వాళ్లకు ఎవరెవరికీ ఫోన్లు చేసి డబ్బు పోగు చేసి హాస్పిటల్ బిల్లు చెల్లించాడు. మర్నాడు మళ్ళీ తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో దించాడు.

ఆమె కృతజ్ఞతతో చేతులెత్తి దండం పెట్టి, “నన్ను బతికించావు. నీలో శ్రీనివాసుడినే చూస్తున్నాను” అని అంటే, “నా పేరు శ్రీనివాస్ అమ్మా” అన్నాడు ఆ టాక్సీ డ్రైవర్.

ఎంతటి శ్రీమంతులకైనా ఎప్పుడో ఒకప్పుడు సాటి మనిషి సహాయం అవసరం ఉంది. మనం ఎవరికన్నా కొద్దిపాటి ఉపకారం చేస్తే, అదే పదిరెట్లు పెరిగి మనకు ప్రాణాధారం అవుతుంది.

(2)

ఎప్పుడో వందేళ్ళకు పైబడినప్పటి సంగతి. బ్రిటీష్ పార్లమెంట్ సభ్యుడొకరు స్కాట్‍లాండ్‍లో ఒక సమావేశంలో ప్రసంగించడానికి గుర్రపు బండిలో వెడుతున్నాడు. ముందురోజు రాత్రి బాగా వర్షం కురిసినందువల్ల నేలతల్లి పచ్చి బాలింతరాలిలా ఉంది. గుర్రపుబండి చక్రం ఒకటి బురదలో కూరుకుపోయింది. యం.పి.గారి ఉపన్యాసానికి లేటయిపోతోందని కంగారు ఎక్కువైంది.

ఆ సమయంలో పశువులు కాసుకుంటూ వెళ్తున్న ఒక యువకుడు బండి చక్రాన్ని బయటకు లాగి ఆయనకు చిన్న ఉపకారం చేశాడు. ఆయన డబ్బు ఇవ్వబోయినా, ఆ యువకుడు తీసుకోలేదు. అతని ఔదార్యానికి ముగ్ధుడయిన యం.పి.గారు అతని వివరాలు తెల్సుకున్నాడు. అతనిది పేద కుటుంబం. పశువులే వారి జీవనాధారం. ఆ యువకుడు ఇష్టపడకపోయినా ఒప్పించి, రప్పించి, యూనివర్సిటీలో చేర్పించాడు.

చాలా ఏళ్ళు గడిచిపోయినయి. ప్రధానమంత్రిగా నున్న చర్చిల్‍కు జబ్బు చేసింది. కొత్తగా ఒక శాస్త్రజ్ఞుడు కనిపెట్టిన పెన్సిలిన్ అనే మందు ఆయనను కాపాడింది.

ఆ మందు కనిపెట్టిన శాస్త్రజ్ఞుడే, ఒకప్పుడు యం.పి.గారు చదువు చెప్పించిన యువకుడు. ఇంతకీ ఆ యం.పి.గారు ఎవరో కాదు, చర్చిల్ తండ్రి రాండోల్ఫ్. ఆ శాస్త్రజ్ఞుడే నోబెల్ బహుమతి గ్రహీత సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్.

చూశారా? జీవితంలో చిన్న ఉపకారం ఎలాంటి గొప్ప ప్రయోజనాలను చేకూరుస్తుందో? ఎప్పుడో, ఎక్కడో, బురదలో దిగబడిన గుర్రపు బండి చక్రాన్ని బయటకు లాగి సహాయం చేసిన కుర్రాడికి, ఆయన ప్రత్యుపకారం చేస్తే, ఆ ప్రత్యుపకారం వల్ల శాస్త్రజ్ఞుడు కనిపెట్టిన పెన్సిలిన్ అనే మందు, ఆ యం.పి.గారి కొడుకు మొరాకో దేశంలో న్యుమోనియా వ్యాధితో బాధపడినప్పుడు, ఆయనను కాపాడింది.

సాధారణంగా మనం లింక్‍లు పెట్టి చూడము గాని, చేసిన ఉపకారము ఎప్పుడూ పదింతలుగా పెరిగి మానవాళికి సాయపడుతూనే ఉంటుంది.

(3)

ఒక చిన్న ఉద్యోగి రిటైరైనాడు. పెన్షన్ డబ్బులతో, అతి కష్టం మీద కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కానీ తన దగ్గర డబ్బు ఉన్నా లేకున్నా, కొన్ని గింజలు కొనుక్కొచ్చి ఇంటి ముందు చల్లుతాడు. పక్షులు ఎగురుకుంటూ వస్తయి. ‘నీకే జరిగీ జరగకుండా ఉంటే, ఈ గింజలు తేవడానికి ఎందుకింత డబ్బు తగలేస్తున్నావంటే’, ఆయన అంటాడు గదా… ‘నేను నిద్ర లేవకముందే, బంగారు లేత కిరణాలు అయినా నా ఈ నిరుపేద కుటీరం వాకిట చేరక ముందే, ఈ పక్షిగణం వచ్చి నా ప్రాంగణంలో తమ కిలకిలారావాలతో చేసే మృదు మధుర సంగీతాలాపనలకు, మరి ఇంకెలా రుణం తీర్చుకోగలను?…’ అని అంటాడు.

అపకారికి ఉపకారము:

ఉపకారికి ఉపకారం చెయ్యటమే కాకుండా, అపకారికి కూడా ఉపకారం చేయగల గొప్ప సంస్కృతి మనది. ఇందుకు మనకు ఎన్నో ఇతిహాసాలు, ఎన్నో విధాలుగా బోధిస్తునే ఉన్నాయి.

(1)

అందరికీ బాగా తెలిసిన కథ. వామనుడు వెళ్లి బలి చక్రవర్తిని మూడు అడుగులు దానం ఇవ్వమంటాడు. మరీ మూడు అడుగులు దానం అడగటం ఏమిటి? నువ్వు  దానం అడగటానికి, నేను ఇవ్వటానికీ అయినా ఔచిత్యం ఉండొద్దా – అని అంటాడు బలి చక్రవర్తి. ఆయన గురువు అయిన శుక్రాచార్యుడు హెచ్చరించాడు – వామనావతారంలో వచ్చిన వాడు సామాన్యుడు కాడు, నిన్ను సర్వనాశనం చేయటానికి వచ్చిన నారాయణుడే అని చెబుతాడు. ఇక్కడ పోతన గారు రచించిన అద్భుతమైన పద్యం అందరి నాలుక మీద నర్తిస్తునే ఉంటుంది. బలి చక్రవర్తి అంటాడు – ఇచ్చేవాని చెయ్యి ఎప్పుడూ పైనే ఉంటుంది. పుచ్చుకునేవాని చెయ్యి ఎప్పుడూ క్రిందనే ఉంటుంది. అందులోనూ ఇప్పుదు దానం పుచ్చుకునే చెయ్యి ఎలాంటిది?

ఆదిన్ శ్రీసతి కొప్పుపై, తనువుపై, అంశోత్తరీయంబుపై,
పాదాబ్జంబులపై, కపోలతటిపై పాలిండ్లపై, నూత్న మ
ర్యాదన్ చెందు కరంబు – క్రిందగుట మీదై నా కరంబుంట మేల్
గాదే రాజ్యము, గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?

ఎంతోమంది రాజులు వచ్చారు, పోయారు. వారు ఏమన్నా సిరి మూట కట్టుకొని పోవం జాలిరే – అంటూ మనిషికి ఈ భోగభాగ్యాల కన్నా కీర్తి ప్రతిష్ఠలే గొప్ప, అవే కదా శాశ్వతం అంటాడు బలి చక్రవర్తి.

(2)

కర్ణుడి కథా ఇలాంటిదే. కర్ణుడు సహజ కవచకుండలాలతో జన్మించాడు. అవి ఉన్నంత వరకూ కర్ణుడిని చంపడం ఎవరి తరమూ కాదు. అందుకని ఇంద్రుడు బ్రాహ్మణుని వేషంలో వచ్చి కవచకుండలాలను దానం ఇవ్వమని అడుగుతాడు.

సూర్యుడు కర్ణుడిని ముందే హెచ్చరిస్తాడు, ఇంద్రుడు వచ్చి వాటిని దానం అడగబోతున్నాడని. ఆ దానం ఇవ్వడం వలన తన ప్రాణాలకే ముప్పు ఉందని తెల్సినా, దానం ఇవ్వడం అనే వ్రతం తన ప్రాణం కన్నా మిన్న అని భావించిన కర్ణుడు వాటిని దానం చేస్తాడు. అపకారికి కూడా ఉపకారం చెయ్యటం అంటే ఇదే గదా.

(3)

ప్రకృతి కూడా మనకు ఇదే బోధిస్తుంటుంది. చందనపు వృక్షాన్ని గొడ్డలితో నరికేటప్పుడు ఆ చెట్టు తన సహజమైన పరిమళాన్ని గొడ్డలికి కూడా ఇస్తుంది.

దయ, దాక్షిణ్యం, కనికరం, ఔదార్యం, కరుణ, కృప – పేరు ఏదైతేనేం, ఈ ధార్మికత అనేది ఇంకా కొద్దిగానైనా మిగిలి ఉన్నందువల్లనే ప్రపంచం ఈ మాత్రంగానైనా మనగలుగుతోంది.

ఒకసారి టాల్‌స్టాయ్ సాయంత్రం వాకింగ్‍కు వెళ్తుంటే, ఒక యాచకుడు ఏమన్నా ఉంటే ఇవ్వమని అడుగుతాడు. జేబుల్లో ఏమీ లేదని తెల్సుకున్న టాల్‌స్టాయ్, “ఇప్పుడు నీకివ్వటానికి నా దగ్గర ఏమీ లేదు బ్రదర్” అన్నాడు. ఆ యాచకుడు అంటాడు – “నన్ను బ్రదర్ అని అన్నారు. అంత కన్నా విలువైనది ఇవ్వటానికి ఎవరికి మాత్రం ఏం ఉంటుంది?” అంటాడు.

మనిషి జీవితంలో గొప్ప, అతి గొప్ప సంఘటన ఏమిటంటే – ఎప్పుడో తను చేసిన సహాయం, అతను మర్చిపోయిన తరువాత, దానివల్ల జరిగిన ప్రయోజనాన్ని అనుకోకుండా తెల్సుకోగలగటం.

అందుచేత –

దయ – కలవాడు కలవాడు,

లేనివాడు లేనివాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here