Site icon Sanchika

చిరుజల్లు 20

దొర్లి పడిన బండరాళ్లు

[dropcap]అ[/dropcap]తనొక విచిత్రమైన మనిషి. ఎవరికీ అర్థం కాడు. అతనికి అతనే అర్థం కాడు. అతనొక భిన్నభావాల, స్వభావాల కుప్ప, వైరుధ్యాల పుట్ట.

అతనిది – ఎదిగీ ఎదగని మనుష్యులు మసలే, ఎదిగీ ఎదగని పల్లె. ఇప్పటిప్పుడే పట్నంగా మారుతోంది. ఆ ఊరిలో అన్నకీ, అతనికీ కలిపి ఉమ్మడిగా ఒక చిన్న ఇల్లు, ఒక ఎకరం మడి ఉన్నాయి.

అన్నకీ చదువుకీ సరిపడలేదు. బుద్ధిగా వ్యవసాయం చేసుకుంటున్నాడు. తమ్ముడినీ సాయం చేయమన్నాడు. ఒక ఏడాది చేశాడు.

అతనికి కాలేజీ చదువు అయిపోయింది. అయినా ఎప్పుడూ ఏదో ఒకటి – చివరకు పొట్లం కట్టిన పాత పేపరు దొరికినా చదువుతూనే ఉంటాడు. అతని ఆశయాలు రెండు. మొదటిది – చచ్చేదాకా ఎప్పుడూ చదువుతూనే ఉండాలి. రెండోది – నిముషం వృథా కాకుండా ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. అందుకనే రెడ్డిగారి దగ్గరున్న ట్రాక్టరు, చౌదరిగారి దగ్గరున్న కారు నడపటం నేర్చుకున్నాడు. సుబ్బాయమ్మ పాకలో చేరి ఇడ్లీలు, వడలూ, పెసరట్లు వేయటం నేర్చుకున్నాడు. అనంతాచారి వెనకాల తిరుగుతూ శ్లోకాలు నేర్చుకున్నాడు. శేషారత్నం దగ్గర కూర్చుని బంగారు నగలు తాకట్టు పెట్టుకొని డబ్బు ఎలా వడ్డీకి ఇవ్వాలో తెల్సుకున్నాడు. ఇదంతా ఇరవై ఏళ్ల లోపే.

ఇప్పుడుతనికి ఆ ఊరు ఇరుకుగా ఉంది. ఊపిరాడనంతగా, ఉక్కపోతగానూ ఉంది.

అతను రెండు జతల బట్టలు, ఒక తెల్లకాగితాల పుస్తకం, ఒక కలం, ఒక వెయ్యి రూపాయల డబ్బుతో, ఒకరోజు ఉదయమే వచ్చి మహానగరంలో వాలిపోయ్యాడు.

అతను, అతను అంటారే? అతనికి ఒక పేరు లేదా – అంటే, చిన్నప్పుడు అమ్మానాన్నా పెట్టిన పేరుతో అతను తృప్తిపడటం లేదు. స్వంతంగా తను పేరు తెచ్చుకోవాలి. ఇదుగో, ఆ తాపత్రయంతోనే వచ్చి నగరమంతా నాలుగు రోజులు కలియతిరిగాడు.

ప్రతి మనిషికీ కావల్సింది, కూడూ, గుడ్డ, నీడ. ఇవి లేకపోయినా అతను ఎలాగోలా సర్దుకుపోతాడు. బస్ కాంప్లెక్స్‌లో కాలకృత్యాలు తీర్చుకొని లైబ్రరీలు ఎక్కడున్నాయో వెతుక్కుని రోజంతా అక్కడే గడిపాడు.

పార్కుల్లో, వీధుల్లో తిరుగుతుంటే, కొత్త ఉత్సాహం ఏదో గుండెల నిండా ఆక్సిజన్ నింపుతోంది.

ఒక హోటల్లో రెండు రోజులు టిఫెన్లూ, భోజనాలు చేశాక, కౌంటర్లోకి వెళ్లి అవి మరింత రుచిగా ఎలా చేయాలో చెప్పాడు. నాలుగు రోజులు చేసి చూపించాడు. వాళ్లకు అతను నచ్చాడు. అక్కడే ఉండమన్నారు.

నెలరోజుల తరువాత కౌంటర్లో కూర్చునేంతగా ఎదిగాడు.

ఎనిమిది గంటలు పని. పది గంటలు చదువు. మిగిలినవాటికి అయిదారు గంటలు చాలు. అతని దీక్ష చూసి మొదట్లో హోటలు మేనేజరు సంతోషించాడు. కాని అతను అక్కడ ఎంతో కాలం ఉండడని తెల్సిపోయింది.

“ఎప్పుడూ ఏం చదువుతుంటావు?” అని అడిగాడు.

నవ్వేసి ఉరుకున్నాడు. చెప్పినా నీకు అర్థం కాదులే అన్నభావం ఉంది అందులో.

ఒక రోజు ఆ యజమాని కావాలని ఏదో దొంగతనం అంటగట్టి బయటకు సాగనంపాడు.

మళ్లీ రోడ్డున పడ్డాడు. కొండ మీద నుంచి దొర్లుకుంటూ వచ్చి పడిన బండరాయిలా దురదృష్టం వచ్చి మీద పడింది.

తన లాగా బస్సు కాంప్లెక్సుల్లో, రైల్వేస్టేషన్లల్లో జీవితాలు గడిపేస్తున్న వారిని చూశాక, అతనికి కొండంత ధైర్యం వచ్చింది. మన మధ్యనే అన్నిరకాల మనుష్యులూ ఉన్నారని గ్రహించాడు.

ఐ.ఏ.యస్. పరీక్షలకు వెళ్లేవాళ్లకి శిక్షణ నిచ్చే చోటుకి వెళ్ళాడు.

“నేను మీకు వేలకు వేలకు ఫీజులు కట్టలేను. కానీ ఏ రకంగా వినియోగించుకున్నా ఉపయోగపడతాను” అన్నాడు.

“నువ్వేం చదువుకున్నావు?” అని అడిగాడు ఆ పెద్దమనిషి.

“వయసులో చిన్నవాడిని కదా. ఇంకా గ్రహంబెల్ దగ్గర, విలియం షేక్స్‌పియర్ దగ్గర, డాక్టర్ శామ్యూల్ జాన్సన్ దగ్గర, గౌతమ బుద్ధుని దగ్గర, మార్టిన్ లూథర్ దగ్గర, స్వామి వివేకానంద దగ్గర, బెంజిమిన్ ఫ్రాంక్లిన్ దగ్గర, మార్కోపోలో దగ్గర, హెన్రీ ఎయిత్ దగ్గర, రాబర్ట్ క్లీవ్ దగ్గర, విన్ స్టన్ చర్చిల్ దగ్గర, మహాత్మా గాంధీ దగ్గర ఉన్నాను” అన్నాడు.

“దేశం గురించి నీకేం తెల్సు?”

“దేశం అనేది భోగోళిక సరిహద్దులను మాత్రమే తెలియజేస్తుంది. నీ ఊరునీ, నీ వాళ్లనీ, నీ భాషనీ, నీ రాష్ట్రాన్నీ, నీ దేశాన్నీ మాత్రమే కాదు, మనిషిగా జన్మ ఎత్తినందుకు యావత్ ప్రపంచంలోని మానవాళినీ ప్రేమించు. నీవు చేయబోయేది ఏది అయినా, మానవ జాతికి మొత్తానికి ఉపయెగపడేదిగా ఉంటేనే, జన్మ ఎత్తినందుకు సార్థకత…” అన్నాడు అతను.

వారం రోజుల పాటు ఆ కాలేజీ యజమాని, అతనితో మాట్లాడుతూనే ఉన్నాడు. వాళ్ల సంభాషణ ఇంకా పూర్తి కాలేదు. చివరకు ఆయన అన్నాడు.

“నేను నీకు చెప్పవల్సినదేమీ లేదు. నువ్వే నాకు చెప్పే స్థితిలో ఉన్నావు. రేపటి నుంచి మా పిల్లలకు పాఠాలు చెప్పు….” అన్నాడు.

అతని సంతోషం ఏమిటంటే, వాళ్లకు పాఠాలు చెబుతున్నందుకు కాదు. ఆ వంకతో అతనికి ఉండటానికి, ఒక నీడ దొరికింది.

పిల్లలతో పాటు అతను పరీక్షలు రాశాడు. ఉత్తీర్ణుడయ్యాడు. కానీ ఉద్యోగం రాలేదు. అతని కళ్లజోడు చూసి ఇంటర్య్యూలో “నీకు సైట్ ఎంత ఉంది” అని అడిగారు.

“మైనస్ టెన్, మైనస్ ఎయిట్…” అన్నాడు తను.

“మైగాడ్, నువ్వు సగం గుడ్డివాడివి…” అన్నారు వాళ్లు.

“అవును. నేను చాలా విషయాల్లో గుడ్డివాడినే” అన్నాడతను.

వచ్చిందనుకున్న సెలక్షన్ చివరి క్షణంలో వెనక్కి పోయింది. మళ్లీ మరోసారి కొండమీద నుంచి దొర్లుకుంటూ వచ్చి మీద పడిన బండరాయిలా దురదృష్టం వచ్చి మీద పడింది.

ఇంకో ఏడాది గడిచింది. ఆ స్కూలు మూత పడింది. అతనికి పని లేకుండా పోయింది.

ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి ఎవరి ద్వారానో అతని విషయం తెల్సి, పిలిపించాడు.

“మా అమ్మాయిని ఐ.ఏ.ఎస్. చేయించాలి. రేపటి నుంచీ పాఠాలు మొదలు పెట్టు” అన్నాడాయన.

మళ్లీ తిండికి, నీడకీ సరిపడిన డబ్బు, దస్కం అమరింది. కానీ ఆ అమ్మాయికి చదువు మీద తప్ప మిగిలిన అన్నింటిమీద ఎంతో ఆసక్తి ఉంది. రోజు బాగా ముస్తాబయి వచ్చి ఎదురుగా కూర్చుంటుంది.

“ఈ డ్రెస్ ఎలా ఉంది?ఈ టాప్స్ ఎలా ఉన్నయి? ఈ హాంగింగ్స్ బాగున్నాయా?” అని అడుగుతుంది గానీ, అసలు విషయాలు పట్టింటుకోదు.

“రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్‌లో ఏముందంటే…” అని అతను చెబుతుంటే, ఆ అమ్మాయి ఒళ్లు విరుచుకుంటుంది.

“ఇప్పటి దాకా రాజ్యాంగానికి నూట అయిదు సవరణలు చేశారు.” అని అతను చెబుతుంటే, “గోళ్లకున్న రంగు బావుందా?” అని నవ్వుతుంది.

“సివిల్ ప్రోసిజర్ కోడ్, క్రిమినల్ ప్రోసిజర్ కోడ్, ఎనిడెన్స్ యాక్ట్ – వీటిని ప్రోసిజర్ కోడ్ అంటారు…”

“మన ప్రొసీజర్ సంగతి ఏంటి?” అంటుంది కళ్ళింత చేసుకొని. అతను ఏమీ చెప్పకముందే మళ్లీ అన్నది.

“నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా?”

“అడుగు…”

“జీవితంలో సుఖపడాలంటే ఏం చెయ్యాలి? ”

“జీవితంలో ఎవరితో మనకు అవసరం లేదో వాళ్ల గురించి అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకూడదు. దేని గురించీ అనవసరంగా ఆవేశపడకూడదు. మర్చిపోవటం అనేది మనిషి వివేకానికి నిదర్శనం అని శాస్త్రజ్ఞులు అంటుంటారు” అన్నాడు అతను.

“నేను మీకు ఏమవుతాను?”

“ఒక స్నేహితురాలివి…”

“ఆడా, మగా మధ్య స్నేహంలో, మోహం ఉంటుందా? ఉండదా?”

“ఉండనూ వచ్చు, ఉండకపోనూ వచ్చు.”

“మనం ఎక్కడికన్నా వెళ్దామా?”

“ఎక్కడికి?”

“సూర్యుడు ఉదయంచని చోటుకు, చంద్రుడు మొహం చాటెయ్యని చోటుకి. చుక్కలు మొహానికి మాస్క్ ధరించని చోటుకి…”

“ప్రతిదానికీ ఒక సమయం ఉంటుంది…”

“నా హార్ట్ హర్ట్ అయింది… మీ వల్లనే…”

“ఇవాళ్టికి ఇంక చాలు. నీకు మూడ్ లేదు…”

“నాకు మూడ్ ఉంది. లేచిపోదామా?”

అంతటితో ఆ అధ్యాయమూ ముగిసింది. మర్నాటి నుంచి అతను వెళ్లలేదు.

మళ్లీ కొండ మీద నుంచి బండరాయి దొర్లుకుంటూ వచ్చి మీద పడింది. పడిన ప్రతిసారీ పైకి లేస్తూనే ఉన్నాడు.

కొత్తగా సెల్ ఫోన్ కొన్నాడు. ఇంకా కొత్త. ఎలా వాడుకోవాలో తెలియదు. ఫేస్‌బుక్‌లో ఎవరెవరితోనో పరిచయం. ఏదో స్టికర్స్ నొక్కాడు. అవి ఎలా తొలగించాలో కూడా తెలియదు. అందరూ తిట్టి పోశారు. పొగరు అన్నారు. పోకిరీ అన్నారు. ‘ఇగో’ అనే మూడు అక్షరాలు, రిలేషన్‌షిప్ అనే పన్నెండు అక్షరాలను దెబ్బతీస్తాయన్నారు.  ఈ అక్షరాల లెక్కలెంటో అసలే తెలియలేదు.

రోజూ రోజుకీ టెక్నాలజీ పెరిగి పోతోంది. ముందుకు పరుగిడుతోంది. ఇంకా అబ్రహం లింకన్ దగ్గర, బంకర్ దగ్గర ఉంటే లాభం లేదు. వెనకబడితే, పడిపోవటమే.

ఇంటర్నెట్ – ఐటి నేర్పే చోటికి వెళ్లాడు. పాత పాటే పాడాడు.

“ఏమీ ఇచ్చుకోలేను. సేవ చేయగలను….” అని.

ఉదయమే వచ్చి షటర్ తెరవటం దగ్గర నుంచి, రాత్రి పదిన్నరకు షట్టర్ వేసే దాకా అక్కడే కాలక్షేపం.

మనసు నిలవనీయదు గదా.

మదర్ బోర్డు దగ్గర నుంచీ అన్నీ విప్పిచూడటం మొదలెట్టాడు. వాటిని మళ్లీ కూర్చటమూ నేర్చుకున్నాడు.

నేర్చుకున్నవాడు ఎప్పుడూ మరోకరికి నేర్పుతూనే ఉండాలి. అది జీవన పరిణామదశ.

పద్మజ రోజూ నేర్చుకోవటానికి వచ్చేది. ఓర్పుగా అన్నీ చెప్పేవాడు.

“మీ లాంటి వాడు దొరకటం నా అదృష్టం” అన్నది.

దొరకటం ఏమిటో – అర్థం కాలేదు.

“కాలం అనేది ఒక ప్రవాహం… ఒక స్రవంతి. జీవన స్రవంతి. రోజూ ఎన్నో సంఘటనలు, మంచివీ, చెడువీ జరుగుతుంటయి. ఒదుగుతుంటయి. కాలవాహినిలో పడి కొట్టుకుపోతుంటయి. అవి కొట్టుకుపోతుండగానే, కొత్త సంఘటనలు చుట్టుముట్టేస్తుంటయి. ఇదీ రేపటికి కొట్టుకు పోతుంది…”

పద్మజ కన్నార్పకుండా చూసింది. “మీలో మీకు తెలియని ఒక మంచి రచయిత ఉన్నాడు. ఏవైనా రాస్తూ ఉండండి…” అన్నది.

“నేనింకా చదవటం దగ్గరే ఉన్నాను…”

“చచ్చేదాకా చదువుతూనే ఉండొచ్చు. చదివింది చాలు… తోచింది రాయండి. ఎవరన్నా చదువుతారు.. ఇంతకు ముందు రాసిన వాళ్లు మీలా అనుకుని ఉంటే, చదవటానికి మీకు ఇన్ని పుస్తకాలు దొరికేవా?” అని అడిగింది పద్మజ.

“థాంక్స్, పద్మా, రేపే రాయటం మొదలు పెడతాను. నీ గురించే రాస్తాను…”

పద్మజ నవ్వింది. “నా గురించి మీకు ఏం తెల్సు?”

“ఏమీ తెలియనక్కర్లేదు. నీ గురించిన నా అనుభూతులే చాలు… ఒక మహాకావ్యం రాస్తాను. నీకే అంకితం ఇస్తాను… ”

వెన్నెల కన్నా చల్లగా, తెల్లగా నవ్వింది.

నెల రోజులలో నవల రాశాడు. ఆమెకి ఇచ్చాడు.

“ఏమన్నా తప్పులుంటే క్షమించు…” అన్నాడు.

పద్మజ కన్నీళ్లతో అన్నది “నేను మిమ్మల్ని క్షమించటమా?”

“క్షమించటం అంటే తప్పు చేసినట్లు కాదు. ఒప్పు చేసినట్లు కాదు. మన అనుబంధానికి మరింత విలువనిస్తున్నట్లు… నిన్ను అందలం ఎక్కిస్తున్నట్లు…”

‘వాచస్పతి’ అని రచయిత కలం పేరు పెట్టి నవల పోటీకి పంపింది. మొదటి బహుమతి వచ్చింది.

“నీ చేతిలో పంపబట్టి బహుమతి వచ్చింది” అన్నాడు అతను.

“ఇంకా నయం. రాసిన చెయ్యి ఏమీ లేదుగానీ, పోస్టు చేసిన చెయ్యిలో ఉంటుందా?” అని నవ్వింది.

“ఒక్క విషయం అడుగుతున్నాను. ఏమనుకోకండి. ప్రేమ విషయంలో ఎవరు బయటపడతారు? ఎవరు మనసులో దాచుకుంటారు?”

“అబ్బాయి ఇరవై అయిదు శాతం గుండెల్లో దాచుకొని డెబ్బయి అయిదు శాతం బయట పడేస్తాడు. అమ్మాయి డెబ్బయి అయిదు శాతం గుండెల్లో పెట్టుకొని, ఇరవై అయిదు శాతం బయటకు కనబరుస్తుంది… ” అన్నాడు.

ఇంకో ఆరు నెలలు గడిచాయి. పద్మజకు ఆమెరికా నుంచి మంచి సంబంధం వచ్చింది. ఖాయం చేశారు.

పెళ్లి శుభలేఖ ఇస్తూ అన్నది. “దేవుడు కనిపిస్తే ఒకటి అడగాలి. జీవితాంతం కలిసి ఉండని వాళ్లని అసలెందుకు కలుపుతావు?” అని.

అతను నవ్వాడు. “జీవితంలో ప్రతి దశలో ఎంతో మంది కలుస్తుంటారు. విడిపోతుంటారు. అందర్నీ చేసుకోలేవు గదా… ఎవరో ఒకర్నే గదా చేసుకుంటావు…”

ఆమె పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది.

మళ్లీ కొండమీద నుంచి ఒక బండరాయి వచ్చి మీద పడింది.

అతని నవలను ఎవరో కాపీ కొట్టి సినిమా తీశారు. అతను వెళ్లి చూశాడు. ఎవరో అడిగారు ఆ సినిమాకు కథ మీ నవలే ఆధారం, సినిమా ఎలా ఉందని.

“ఆ నవలలో ఉన్న మార్దవం ఆ సినిమాలో నాకు కనిపించలేదు… అందు చేత ఆ కథ నాది కాదు.”

ఇంకెవరో నిర్మాతలు సినిమాలకు రాయమన్నారు, రాయలేదు. “నేను రాసేది మీకు నచ్చదు. మీరు తీసేది నాకు నచ్చదు” అన్నాడు.

***

అతనికి ఇప్పుడు ఎనభై అయిదేళ్లు. చూపు ఆనంటం లేదు. చేతి కర్ర లేనిదే బయటకు నడవటం లేదు.

నిన్న ఒక ఐ.ఏ.యస్. సీనియర్ ఆఫీసర్ వచ్చి చాలా సేపు కూర్చుని వెళ్లాడు.

ఆమెరికాలో ఒక పెద్ద ఐ.టి కంపెనీ సి.ఇ.ఓ. అయిన పద్మజ ఒక సభలో మాడ్లాడుతూ, ఆమెను ప్రభావితం చేసిన వారిలో అతను ముఖ్యుడు అని చెప్పింది.

గాజు కళ్లులాంటి అతని కళ్ల వెంట నీళ్లు ధారగా కారాయి.

పద్మజ ఫోన్‌లో ఫోటోలు పెట్టింది.

అతను జవాబు ఇచ్చాడు.

“జీవితం ఒక అవేశం. ఒక ఆదర్శం. ఒక ఆరాటం. ఒక పోరాటం… ”.

Exit mobile version