Site icon Sanchika

చిరుజల్లు 22

బొమ్మలాట

[dropcap]“అ[/dropcap]యితే ఇప్పుడేమంటావ్?” అని కోపంగా కూతురి వంక చూసింది పరిమళ.

“నా పెళ్లి నిశ్చితార్థానికి ఇంత ఆర్భాటం చేస్తున్నావు. తెల్సిన వాళ్లందర్నీ పిలుస్తున్నావు. బాగానే ఉంది. కానీ నాన్నను పిలవకుండా… ఆయన లేకుండా… వచ్చిన వాళ్లంతా ఏమనుకుంటారు?” అన్నది శశికళ సందేహిస్తూనే.

“ఎవరు ఏమనుకున్నా నాకు లెక్కలేదు. ఇరవై ఏళ్ల నుంచీ మనం ఎలా ఉన్నామో, దేశమంతా తెలుసు. ఒంటి చేతి మీద లాక్కొచ్చి నిన్నింత దాన్ని చేశాను. ఇంత ఆస్తి సంపాదించాను. ఇవాళ ఈ పరిమళకున్న పేరు ప్రఖ్యాతులు ఎలాంటివో తెలియని వాళ్లు ఎవరూ లేరు. ఇంత పెద్ద సంబంధం వాళ్లు వెతుక్కుంటూ వచ్చి నిన్ను చేసుకుంటున్నారంటే, ఇదంతా నా గొప్పదనమేనని మర్చిపోకు…” అన్నది పరిమళ గర్వంగా.

“కాని లోకం కోసమైనా… తండ్రి బతికుండగానే, ఆయన లేకుండా పెళ్లిళ్లూ పేరంటాలూ బావుండవు కదమ్మా…” అని తల్లికి నచ్చచెప్పే ప్రయత్నం చేసింది శశికళ.

“ఈ హోదా, ఈ అంతస్తూ, ఈ స్టేటస్, ఈ మేడలు, కార్లు, ఇంటినిండా పరివారం… ఇదంతా నా స్వయంకృషి… వచ్చిన వాళ్లంతా అనుకోవాలి.. ఇదంతా నా స్వయంకృషి, నేను చేజేతులా ఆర్జించినదేనని అందరికీ తెలియాలి. ఇన్నేళ్ల తరువాత ఇప్పుడొచ్చి, నీ పక్కన పదినిముషాలు నిలబడి ఆయనో గొప్పవాడు అయినట్లు నటిస్తే సరిపోతుందా? అదేనా నీకు కావల్సింది?” అని రెట్టించింది పరిమళ.

“పిల్లలకు తల్లీ తండ్రీ ఇద్దరూ సమానమే కదమ్మా…” అన్నది శశికళ.

“మతి ఉండే మాట్లాడుతున్నావా నువ్వు… ఎప్పుడన్నా ఆయన నీ మొహం చూశాడా? నువ్వు ఆయన మొహం చూశావా? ఎన్నడన్నా ఆయన నీకొక చాక్లెట్ కొని పెట్టాడా? ఒక పెన్సిల్, ఒక బలపం? ఒక పుస్తకం? ఒక పరికిణీ? ఒక జాకెట్?… ఎరుగుదువా ఆయన దగ్గర నుంచి… పిల్లల్ని కన్నంత మాత్రాన సరిపోతుందా? బాధ్యతలు ఉండవా?” అని అరిచింది పరిమళ.

“మీరు ఇద్దరూ ఎందుకు విడిపోయారమ్మా? ఆయనకున్న దుర్గుణాలు ఏంటి? తాగుడా? పరస్త్రీ వ్యామోహమా? ఏం తప్పు చేశాడు?” ఇన్నేళ్ల తరువాత ధైర్యం చేసి అడిగింది శశికళ.

“అసలు దుర్గణం చేతిగానితనం… అసమర్థత… అరే, ఇన్నేళ్లు వచ్చినా బ్రతకటం ఎలాగో తెలియకపోతే ఎలా? మనిషికి కొంచెమైనా మెటిరియలిస్టిక్ అవుట్‌లుక్ ఉండక్కర్లా? అందరూ మన కళ్ల ముందు ఎలా బాగుపడుతున్నారు?  నిన్నటి దాకా తాడూబొంగరం లేని వాళ్లు పేవ్‌మెంట్స్ మీద బ్రతికిన వాళ్లు, ఇవాళ కోట్లకు పడగలెత్తి, నోట్ల కట్టల మీద పడుకుని నిద్రపోతున్నారు… ఆ మనిషికి ఏమీ చేతకాదు. ఫిట్ ఫర్ నథింగ్… ఆయన్ని నమ్ముకుని ఉంటే నేను పేద ముత్తయిదువ వేసిన పార్వతీ దేవిలా ఉండేదాన్ని, వెలిసిపోయిన చీరకట్టుకుని… ” వరద ఉరవడిలా సాగిపోతోంది ఆమె వాక్ ప్రవాహం…

“భార్యాభర్తలన్నాక అభిప్రాయ బేధాలుంటాయమ్మా… అంత మాత్రాన తెగ తెంపులు చేసుకోవటమేనా?”

“చెప్పీ చెప్పీ నోరు పడిపోయింది. పడి, పడి విసిగిపోయాను. ఎప్పుడో త్రేతాయుగంలో ఉండాల్సిన మనిషి. ప్రతి దానికీ పెద్ద యుద్ధమే… కొన్నింటిని సాధించాలంటే, కొన్నింటిని వదిలించుకోవాలి… విడిపోయాం కాబట్టే సుఖపడుతున్నాం… నోచిన వారి సొమ్ములివి, నోచనివారికి దక్కునా – అని ఊరికే అన్నారా?… ఇంకెప్పుడూ ఆ చాదస్తపు మనిషి గురించి నాకు చెప్పకు. ఒళ్లు కంపరం ఎత్తిపోతుంది” అన్నది పరిమళ.

తల్లి కోపతాపాల గురించి, మొండి పట్టుదల గురించీ శశికళకు బాగా తెల్సు. అందుకని వాదించదల్చుకోలేదు.

తల్లీ తండ్రీ విడిపోయినప్పుడు శశికళకు అయిదేళ్లు ఉంటాయేమో. కోర్టులూ, కేసులూ విడాకులూ వంటివి ఏమీ లేవు.

ఒక రోజు పరిమళ కోపంతో ఊగిపోతూ “నీ మొహం నాకు చూపించకు” అన్నది.

ఆయన నిలుచున్నవాడు, నిలుచున్నట్లుగా ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఇంతవరకు ఆమెకు తన మొహం చూపించలేదు.

శశికళ బాధ్యత అంతా పరిమళ తీసుకుంది. కూతురుని తండ్రిని కలవనివ్వలేదు. ఆయన విషయాలేవీ తెలియనివ్వకుండా జాగ్రత్తపడింది. కానీ వద్దనుకున్నా రోజూ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటయి. తండ్రి విషయాలు శశికళకు తెలుస్తూనే ఉన్నయి.

నిశ్చితార్థం జరుగుతున్నా తండ్రిని ఆహ్వానించకపోవటాన్ని శశికళ భరించలేకపోయింది. ఎవరన్నా చిన్న సాయం చేస్తేనే ఆయన గాడ్ ఫాదర్ అనీ, దేవుడిచ్చిన తండ్రి అని చెప్పుకుంటారు. మరి జన్మనిచ్చిన తండ్రి ఆప్తుడు, పరమాత్ముడు కాకుండా ఉంటాడా? గుండెల నిండా ఏదో బాధ సుడిగుండాల్లా సుళ్లు తిరుగుతోంది.

నీళ్లు నిండిన కళ్లతో నింగి వంక చూసింది. వర్షించే మేఘాలే ఆమెకు దారి చూపాయి.

శశికళ వెళ్లి ఆయన ఇంటి తలుపు తట్టింది. గుమ్మంలో నిలబడిన ఈ అపరంజి బొమ్మను చూసి ఆయన చేష్టలుడిగిన వాడే అయినాడు.

“నేను నాన్నా శశిని…” అన్నది.

“నువ్వా తల్లీ, రారా… ఇన్నాళ్లకు ఈ కుచేలుడి మీద దయ కలిగిందా తల్లీ….” అంటూ ఆహ్వానించి కుర్చీలో కూర్చోబెట్టాడు. ఆయన గోడకు ఆనుకుని కూర్చున్నాడు.

“ఇవాళ నిన్ను చూశాను. కన్నులున్నందుకు ఇంతకన్నా ప్రయోజనం ఏముంటుంది? ఎప్పుడో పదేళ్ల కిందట అనుకుంటా బజార్లో ఏదో షాపు దగ్గర మీ అమ్మ కారు ఎక్కుతుంటే, దూరం నుంచి చూశాను. చాలా మారిపోయింది. పోల్చుకోలేకపోయాను. కాలంతో పాటు అన్నీ మారిపోతుంటయి. మీ అమ్మ బావుంది గదా…” అన్నాడు నవ్వుతూ.

రెండు చిన్న గదులు. ముందు గదిలో ఒక చెక్క టేబులూ, కుర్చీ… ఒక మూల చాప.. దానిలో మడిచి పెట్టిన పరుపు…

శశికళ కుర్చీలోనుంచి దిగి ఆయనకు ఎదురుగా కూర్చుంది…

“మా గురించి ఇంత మథనపుడుతున్నప్పుడు, ఇక్కడ ఒంటరిగా ఎందుకు? వచ్చి మా దగ్గరే ఉండొచ్చు గదా” అన్నది శశికళ.

కొద్ది క్షణాలు మౌనం వహించి అన్నాడు “ఈ జీవితం చాలా చిన్నది. చూస్తుండగానే సంవత్సరాలు గడిచిపోతున్నయి. ఈ కొద్ది రోజుల భాగ్యానికి నిత్యం ఘర్షణ పడుతూ, తిట్టుకుంటూ, కొట్టుకుంటూ ఉండటం కన్నా, ఎక్కడో ఒక చోట ఎవరి మానాన వాళ్లు ప్రశాంతంగా ఉండటం మంచిది కదమ్మా…”

“కానీ అక్కడ మేము అన్ని భోగభాగ్యాలతో తులదూగుతుంటే సొంత తండ్రివి నువ్వు ఇక్కడ ఇలా పేదరింకంతో సహజీవనం చేస్తున్నావా?”

“పేదరికం ఏమీ లేదమ్మా… చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను. ఒకటో తారీఖున జీతం ఇస్తారు. ఖర్చులకు పోను కొద్దిగా మిగులుతుంది. ఖర్చులకు సరిపోయిన ఆదాయం ఉన్నవాడు పేదవాడు కాదమ్మా… సంపన్నుడే…” అన్నాడు తండ్రి.

అయనే మళ్లీ అడిగాడు. “ఏం చదువుకున్నావు తల్లీ…”

“యం.టెక్ అయింది. ఉద్యోగం చేస్తున్నాను…”

“చాలా సంతోషం… ఎప్పుడో చిన్నప్పుడు ఎత్తుకుని భుజాలమీద పడుకోబెట్టుకున్న పసిపిల్ల, ఇప్పుడు చదువుల సరస్వతిగా సాక్షాత్కరించింది. అందనంత ఎత్తుకు ఎదిగావు… ఇంతకన్నా ఏ తండ్రి అయినా కోరుకునేదేం ఉంటుంది తల్లీ… పెళ్లి సంబంధాలు ఏమన్నా చూస్తున్నదా?”

“ఈ నెలలోనే పెళ్లి. పదో తేదీ నిశ్చితార్థం…”

“శుభం… ఎంత సంతోష వార్త విన్నాను… నువ్వు ఏ వంకా లేని శశివంకవి. ఏ ఇంటికి కోడలుగా వెళ్లినా, ఇంటికే కాదు, ఆ వాడకే బంగారు గోడలు… చాలా సంతోషం… ఎంతమంచి మాట విన్నాను…” అన్నాడు మురిసిపోతూ.

“నువ్వు నిశ్చితార్థానికి రావాలి నాన్నా…” అన్నది శశికళ.

“వద్దులేమ్మా… మీ హోదాకి తగినవాడిని కాను. మీ సంతోషాన్ని పాడుచేసిన వాడనవుతాను. నా ఆశీస్సులు నీకెప్పడూ ఉంటాయమ్మా… రోజూ మీ కోసం అభిషేకం చేస్తూనే ఉన్నాను…”

“నీ మొహం చూడటానికే ఇష్టపడని వాళ్ల గురించి, అభిషేకాలు చేయించానంటావు. ఆకుపూజలు చేయించానంటావు. నీకు రాగాద్వేషాల లేవా?” అని అడిగింది.

“నాది విచిత్రమైన పరిస్థితి… నాకు దేవుడు ఒక ఏనుగును ఇచ్చాడు. కానీ అంకుశం ఇవ్వటం మర్చిపోయాడు. అంకుశం లేనందున ఏనుగును నేను అదుపు చేయలేకపోయినా, ఆ ఏనుగు నాదే… అగ్ని సాక్షిగా తాళి కట్టాను. సతియంచు, పతియంచు బ్రహ్మముడి వేసారు. ఆ ముడి ఈ జీవి ఉన్నంత వరకూ ఎవరూ విప్పదీయలేరు. నా భార్య, నా కూతురు… ఈ బంధాన్ని ఎవరూ తెంపలేరు… ” అన్నాడాయన.

“ఎంతో మంది ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి రాజీపడి బ్రతుకుతున్నారు. లోకం కోసం కల్సి ఉంటున్నారు. మీరెందుకు ఆ మాత్రం సర్దుకు పోలేరు…” అని అడిగింది శశికళ.

ఆయన ఒక నిముషం సేపు మాట్లాడలేదు. తరువాత నెమ్మదిగా అన్నాడు. “ఇది ఒక కుటుంబానికి సంబంధించిన విషయమే అయితే రాజీపడి బ్రతకొచ్చు. నోరు మూసుకొని పడి ఉండొచ్చు. లోకం కోసం అయినా… కాని ఇది అంత చిన్న సమస్యకాదు.. మీ అమ్మ ఒక అధికారి… మంచి హోదాలో ఉన్నది. ఎంతో మంది పేదలకు సాయపడ గలిగే స్థితిలో ఉన్నది. కానీ నిజానికి చేస్తున్నదేమిటి? ఒక రాక్షసిలాగా దేశం మీద పడి దోచుకు తింటున్నది. నిరుపేదల నోరు కొడుతున్నది. వాళ్ల నోటి దగ్గర కూడు లాగేస్తున్నది. ఇన్ని ఎకరాల భూమి, ఇన్ని భవంతులు, షాపులూ ఇవన్నీ ఎవరెవరివో… అధికారంలో ఉన్నవాళ్లు ఇలా దోపిడి దొంగలుగా మారితే దేశం ఏమవుతుంది? జనం తిరగబడి తరిమి కొట్టే రోజు తప్పకుండా వస్తుంది. నా భార్య కదా, నేను క్షమించినా దేవుడు క్షమించడు… ఒక వేళ దేవుడు క్షమించినా, దేశం క్షమించదు. కాలం అంతకన్నా క్షమించడు. క్షమించరాని నేరస్థురాలు… వీళ్లను పట్టి ఉరితీసే రోజులొస్తాయి…” అన్నడాయన ఆవేశంగా.

ఇంత వరకూ ఎంతో సౌమ్యంగా మాట్లాడిన తండ్రిలో ఇప్పుడు ఒక ఉగ్రనరసింహస్వామిని చూసింది.

ఇప్పుడు తల్లి ఏమిటో, తండ్రి ఏమిటో శశికళకు బాగా అర్థమైంది. మరి కాసేపటికి వెళ్తానని లేచింది.

ఆయన ప్రక్క గదిలోకి వెళ్లి రెండు నిముషాల్లో వచ్చాడు.

“నీకు కన్న తండ్రిని. ఇన్నేళ్ల తరువాత చూడాలన్న ఆశతో వచ్చావు. పెళ్లి చేసుకోబోతున్నాని చెప్పావు. నిజానికి నీకు అంగరంగ వైభవంగా పెళ్లి చేయాల్సిన బాధ్యత నాది. కానీ పేదవాడిని. ఈ రెండు వేలూ తీసుకో, ఇవి నీకు చీరె కొనటానికి కాదు గాదా, కాలి చెప్పులు కొనటానికి కూడా సరిపోవని తెల్సు. ఈ చేతగానివాడిని మన్నించు…” అన్నాడాయన.

శశికళ తండ్రి భుజం మీద తల వాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది.

***

శశికళను పెళ్లి చేసుకోబోయే కుర్రాడు రమేష్ అమెరికాలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు.

రమేష్ తండ్రి శ్యామలరావు ఇక్కడ ఒక ప్రభుత్వ శాఖలో ఉన్నత పదవిలో ఉన్నాడు. ఆ శాఖ ఒక పాడిగేదె లాంటిది. పిండుకున్న వాడికి పిండుకున్నంత. లంచాలు గుంజటంలో శ్యామలరావుదీ, పరిమళదీ ఒకటే ఫిలాసఫీ. కనుకనే అభిప్రాయాలు కలిశాయి. ఇప్పుడు చుట్టరికం కలుపుకుంటున్నారు.

ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. కానీ ఎదురు చూసిన పెళ్లి కొడుకు రాలేదు. ఏర్పాట్లన్నీ భారీగా జరిగిపోయినయి. అందరికీ ఆహ్వానాలు వెళ్లినయి.

ఇప్పుడెలా అన్న టెన్షన్ మొదలైంది పరిమళకు. శ్యామాలరావునీ సంప్రదించింది.

రమేష్‍కు సెలపు దొరకలేదు. వాళ్ల కంపెనీ వాళ్లు ఏదో ప్రాజెక్ట్ రిలీజ్ చేయాలిట. ఇతను తప్పనిసరిగా అక్కడ ఉండాలంట.

ఎలా మరి?

ఎవరో సలహా చెప్పారు. కరోనా మూలంగా చాలా చోట్ల ఇలాగే పెళ్లి చేసుకోవాల్సిన వాళ్లకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నయి. ఇప్పుడు టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందినందున అంతా ఆన్‌లైన్ లోనే జరిగిపోతున్నయిట.

ఇలా తలా ఒకరు తమకు తోచిన సలహాలు చెప్పారు.

అప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు.

ఒక చిన్న ఎనౌన్స్‌మెంట్ కూడా చేశారు.

“అనివార్య కారణాల వల్ల పెళ్లికొడుకు రాలేకపోతున్నందున, సాంకేతిక నైపుణ్యాన్ని వెసలుబాటుగా చేసుకొని అక్కడ అబ్బాయి, ఇక్కడ అమ్మాయి ఉండి నిశ్చితార్థం జరిపించబోతున్నాం…” అని చెప్పారు,

స్క్రీన్ మీద పెళ్లి కొడుకు ప్రత్యక్షమైనాడు.

విరబూసిన పొదరిల్లులాగా, సర్వాంగ సందరంగా అలంకరించుకొని, పున్నమి జాబిల్లిని తలదన్నే ముఖారవిందంతో, పెళ్లికూతురు వేషంలో అల్లనల్లన నడిచి వచ్చి శశికళ, స్క్రీన్ పక్కన నిలబడింది.

అందరూ పెద్దగా కరతాళధ్వనులు చేశారు.

“శుక్లాంబరధరం…” అంటూ పురోహితుడు అందుకున్నాడు. ఇటు వారూ, అటు వారూ పట్టుబట్టలూ, పళ్లూ, తాంబూలాలు ఇచ్చి పుచ్చికున్నారు.

అరగంటలో తతంగం అంతా అయిపోయింది.

వచ్చిన వారంతా ఇదే బావుంది అని మెచ్చుకున్నారు. భోజనాలు చేశారు. ఎవరి దోవన వాళ్లు వెళ్లిపోయారు.

శశికళకు ఇదంతా ఒక కలలాగా ఉంది. నిశ్చితార్థం జరిగినట్లో జరగనట్లో తెలియడం లేదు.

రెండు రోజులు నిర్లిప్తంగా గడిచిపోయింది.

రాత్రి పన్నెండు గంటల సమయంలో సెల్ ఫోన్ మోగింది. శశికళ నిద్ర మగతలోనే ‘హలో’ అంది.

“ఏంటే, రమేష్‌ని పెళ్లి చేసుకుంటున్నావంట? అంతా నీ ఇష్టమేనా?”

“ఎవరు నువ్వు?”

“చేసుకుంటే, నాకు సవతివి అవుతావు… నేనూ రమేష్ ఒకే కంపెనీలో పని చేస్తున్నాం… ఒకే ఇంట్లో ఉంటున్నాం…. సహజీవనం చేస్తున్నాం… మాకు పెళ్లి అయినట్లే… మధ్యలో నువ్వు ఎంట్రీ ఇచ్చావేంటే? మీకు పెళ్లి అంటూ జరిగినా, నీది శ్యామలరావు ఇంట్లో పర్మినెంట్ పనిమనిషి పొజిషనే. అర్థమైందా?  పిచ్చివేషాలేస్తే, అడ్రసు ఉండదు” అన్నది అవతలి నుంచి ఆమె.

శశికళ లేచి కూర్చుంది. ఇంక నిద్రపట్టలేదు. ఇంత మోసం చేస్తారా? జీవితంతో ఆడుకుంటారా?

మర్నాడు శశికళ శ్యామలరావుకి ఫోన్ చేసింది. రాత్రి జరిగిన విషయం చెప్పింది.

“మీకీ విషయం తెలియదంటే నేను నమ్మను. కావాలనే నా జీవితం నాశనం చేయాలనుకున్నారు. మీరు ఎవరితో ఆడుకుంటున్నారో తెల్సా? నిప్పుతో చెలగాటమాడుతున్నారు… నేను పోలీసు కమీషనర్‌ని కల్సి మొత్తం విషయం చెప్తాను. క్రిమినల్ కేసు పెట్టిస్తాను. నా సంగతి మీకు తెలియదు…” అని ఆగ్రహావేశాంతో ఊగిపోయింది.

శ్యామలరావు ఏ మాత్రం బెదరలేదు. “ఏంటే, రెచ్చిపోతున్నావ్? నీ బతుకెంత, నీ అమ్మ బతుకెంత? ఎవడికి తెలియదే దాని సంగతి? వాళ్ల డిపార్ట్‌మెంట్ అంతా మీ అమ్మ కతను బుర్రకత చెప్పినట్లు చెప్పుకుంటున్నారు… ఇప్పటికే రెండు సార్లు సస్పెండ్ చేయబోతే మినిష్టర్ కాళ్ళు పట్టుకుని ఆపు చేయించుకుంది. ఈసారి చూడు ఏమవుతుందో?” అన్నాడు.

అయినా శశికళ ఏ మాత్రం తగ్గలేదు. అందరిలో తన పరువు పోయింది. క్షమించకూడదనే నిర్ణయించుకుంది.

జరిగినదంతా రాసి శ్యామలరావు మీద చర్యలు తీసుకోమని పోలీసులకి కంప్లయింట్ ఇచ్చింది. పోలీసుల నుంచి శ్యామలరావుకు పిలుపు వచ్చింది.

ఆయనా ఊరుకోలేదు. పరిమళ ఎప్పుడెప్పుడు, ఎవరెవరి ఆస్తులు కాజేసి అధికారం దుర్వినియోగం చేసిందో వివరాలతో సహా ప్రభుత్వ అధికారులందరికీ ఉత్తరాలు గుప్పించాడు.

మూడు రోజుల తర్వాత పరిమళను అరెస్ట్ చేశారు. ఆఫీస్ వాళ్లు ఆమెను సస్పెండ్ చేశారు. టీ.వీ.ల్లో ఈ విషయం మోత మోగిపోయింది.

శశికళ తండ్రి దగ్గరకు వెళ్లింది.

ఆయన పాదల మీద వాలిపోయింది. కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న కూతుర్ని అక్కున చేర్చుకున్నాడు.

“ఏమిటిది నాన్నా?” అని అడిగింది శశికళ.

“బొమ్మలాట అమ్మా.. విధి ఆడించే ఆట…” అన్నాడాయన.

Exit mobile version