Site icon Sanchika

చిరుజల్లు-26

వి…ముక్తి

[dropcap]జ[/dropcap]గద్గురువులు, పరివ్రాజకాచార్యులు, పీఠాధిపతులు అయిన అమితానందస్వామివారు హైదరాబాదు విచ్చేశారు. స్వామివారి నిత్య పూజాదికాల అనంతరం తొమ్మిదిగంటల నుంచీ భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తున్నారు.

ఉదయం ఏడు గంటల నుంచే ఉపాసకులు, సాధకులు, సాధారణ భక్తులు స్వామివారి పాద దర్శనం కోసం పూలు, పండ్లు కాషాయ వస్త్రాలు తెచ్చి క్యూలో వేచియున్నారు. నిముష నిముషానికీ భక్తుల రద్దీ పెరిగి క్యూ చాంతాండంత పొడుగు సాగుతోంది.

నిత్యకృత్యాలూ, వంటా వార్పూ అన్నీ ముగించుకొని సావిత్రమ్మ ఇంట్లోంచి బయటపడేటప్పటికే తొమ్మిది గంటలు దాటింది. ఆదరాబదరా వెళ్లి భక్తుల క్యూలో నిలబడింది. క్యూ ఇలా స్టిల్ ఫోటో లాగా కదలకుండా అలానే ఉంది. వి.ఐ.పి.లందర్నీ పక్క గదిలోకి పంపించి స్వామివారి దర్శనం కలిగిస్తున్నారు. మంత్రులు, మునుపటి మంత్రులు, కాబోయే మంత్రులూ, సామంతులూ, పుష్కలంగా డబ్బున్న ధీమంతులూ, ఆఫీసర్లు, సస్పెండ్ అయిన ఆఫీసర్లు, బిజినెస్ పీపుల్, ఏ బిజినెస్ చేయకుండానే బిజీగా తిరుగతుండే పురుషులు, స్త్రీలు – రకరకాల వారు – పాముల బుట్టలో చుట్టలు చుట్టుకున్న విషనాగులు లాగా, మొదడు పొరల నిండా పొర్లిపొరలుతున్న తమ తమ కామ్యార్థాలను స్వామి వారికి విన్నవించుకుంటున్నారు. విరాళాలు ఇచ్చి స్వామి ఫోటోలను, ప్రసాదాలను ముందుగానే అందుకుంటున్నారు. స్వామి వారు చెప్పినదే తడవుగా జపాలూ, తపాలూ, యాగాలూ, యజ్ఞాలు, హోమాలూ – ఖర్చుకు వెనకాకుండా చేయటానికి సిద్ధంగా ఉన్నారు.

సావిత్రమ్మకు పెద్దగా పెద్ద పెద్ద కోరికలేమీ లేవు. మరో జన్మంటూ లేకుండా ముక్తిని ప్రసాదించమని స్వామి వారిని వేడుకోవటానికి వచ్చి క్యూలో చిట్ట చివరన నిలబడింది. పూల దండ చేతబట్టుకుని. చూస్తుండగానే అరవై ఏళ్ల జీవితం గడిచిపోయింది. పెళ్లి అయిన కొత్తలో ఆయనకు అదే ధ్యాస. ఆమె భర్త మాట కాదనలేని మహా సాధ్వి. మధ్య మధ్య నోమూలూ, వ్రతాలూ, పండగలూ, పబ్బాలూ, ఇడ్లీలూ, వడలూ రుబ్బటాలూ, – ఇదే లోకం అనుకుంది. ఇక ఏడాది తిరగక ముందే వేవిళ్లూ, పురుళ్లూ… ఒళ్లో ఒక పిల్లాడు, గర్భంలో ఒక పిల్లాడూ… ఎప్పుడూ చూసినా కురవని నల్ల మేఘంలా కదులుతూ, వండటం, వడ్డించటం, ముద్దలు పెడుతూ కలిపి నోట్లో  ముద్దలు పెడుతూ… టిఫెన్లు, లంచ్ బాక్సులు అందించటం, రాత్రి పదింటి దాకా లాంగ్ టెర్మ్ కోర్సు నుంచీ వచ్చిన వాడికి వడ్డించి, నడుం వంగిపోయేదాకా చాకిరీ చేసి, అర్ధరాత్రికి అటు తిరిగి పడుకుని, మళ్లీ అయిందింటికే లేచి, ఇంటర్వూలకీ, ఉద్యోగాలకీ వెళ్లేవాళ్లని సాగనంపుతూండగానే-

కొడుకును కొన్న కోడళ్లలకూ, కూతుర్లు కొనుక్కున్న అల్లుళ్లకూ విడివిడిగా ఒక్కొక్కళ్లూ కన్న మనవళ్లూ… రాళ్లూ…

ఊపిరి సలపనివ్వని వసంతాలన్నీ వచ్చినట్టే వచ్చి చుట్టు ముట్టినట్టే ముట్టి, ఇట్టే కనుమరుగైపోయినయి. జెట్ స్పీడ్‌తో జీవితం గడిచిపోయింది. ఇప్పడామెకి తెలియని తపన ఏదో ప్రారంభం అయింది. జన్మంతా తినటం, లేవటం, పడుకోవటంతోనే సరిపోయింది. ఈ కుక్షుంభరత్వమేనా జీవితం అంటే? పునరపి జననం… పునరపి మరణం… ఈ చక్రభ్రమణం నుంచి బయట పడి, విముక్తి చెంది ముక్తి మార్గాన్ని చూపించమని స్వామి వారిని కోరుకోవాలని వచ్చింది.

క్యూని దాటుకుని, వి.ఐ.పి.ల రూంలోకి వెళ్తున్న కనకవల్లి సావిత్రమ్మను చూసి ఆగి, అవునా కాదా అని పరకాయించి చూసి, ఒక అడుగు ముందుకు వేసి, మళ్లీ ఒక అడుగు వేసి అడిగింది.

 “నువ్వు సావిత్రివి కదూ…”

“అవును… మీరు…”

“కనకవల్లిని… మనం కల్సి చదువుకున్నాం, గుర్తు లేదా?” అని విప్పారిన ముఖంతో అడిగింది.

“అవును, గుర్తొచ్చింది. ఇప్పుడెక్కడున్నావ్?”

“బంజారా హిల్స్, నువ్వు? ”

“బాగ్ లింగంపల్లి…”

“వర్క్ చేస్తున్నావా?”

“లేదు. హౌస్ వైఫ్ గానే.., నువ్వు?”

“అడిషనల్ డైరెక్టర్ చేసి రిటైరైనాను” అని వి.ఐ.పి.ల రూంలోకి వెళ్లిపోయింది.

పన్నెండు గంటలు అయింది.

“స్వామి వారిని దర్శనం చేసుకొని వెళ్లేవారు ఇటు వైపు రండి. స్వామి వారితో విన్న వించుకునే వారు మాత్రం ఆ క్యూలోనే ఉండండి” అన్నారు.

సావిత్రమ్మ జన్మ రాహిత్యం గురించి అడగదల్చుకుంది. అందుకని క్యూలోనే నిలబడింది. ఇంతలో కనకవల్లి వచ్చి తొందర పెట్టింది.

“ఆ క్యూలో ఉంటే, ఇవాళ నీకు లోపలికి వెళ్లే ఛాన్స్ లేదు. మళ్లీ రేపు రావాల్సిందే. దర్శనం చేసుకొని వచ్చేయ్…” అన్నది.

తప్పని సరి అయి, లోపలికి వెళ్లి స్వామి వారి పాదుకల మీద వంద రూపాయలు ఉంచి, కళ్లకు అద్దుకుని బయటకొచ్చింది.

కనకవల్లి, సావిత్రమ్మను బయటకు లాక్కుపోయింది. కార్లో వాళ్లింటికి తీసుకపోయింది.

దార్లోనే సావిత్రమ్మ తన చరిత్ర అంతా చెప్పేసింది.

“మా ఆయన స్టేట్ బ్యాంక్‌లో పని చేసి రిటైరైనాడు. ఇద్దరు కొడుకులు. ఇద్దరు కూతుళ్లు. పెద్దవాడు లెక్చరర్. రెండోవాడు సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. ఒకడు మెహిదీపట్నం. రెండోవాడు కూకట్‌పల్లి. ఆడపిల్లలుకూ పెళ్లిళ్లు అయినయి. వాళ్ల పిల్లలు అవసరం వచ్చినప్పుడల్లా పిలుస్తుంటారు. నేను గడియారంలో ముల్లులాగా అందరి ఇళ్లకీ తిరుగతుంటాను…”

“జీవితంలో ఇంతకు మించిన ఆనందం ఇంకేం ఉంది. చెప్పు… కనుపాపలాంటి పిల్లలు. కంటి రెప్పలా నిన్ను చూసుకుంటున్నారు. ఇంత కన్నా కావాల్సిన దేముంది? ” అన్నది కనకవల్లి.

“నీ సంగతేంటి?” అని అడిగంది సావిత్రమ్మ.

“అగ్రికల్చర్‌లో అడిషనర్ డెరెక్టర్ చేసి రిటైరైనాను. మా ఆయన ఏ.జీ.లో చేసి రిటైరైనారు. బంజారాహిల్స్‌లో ఇల్లు కొన్నాం. అంతా బాగానే ఉంది. మొదట్లో పిల్లలు వద్దనుకున్నాం. తరువాత కావాలనుకున్నాం. లాభం లేక పోయింది. పెద్ద పొరపాటు చేశాం. అదే జీవితంలో పెద్ద దిగులు… విచారం.. ఎంత ఉండీ ఏం లాభం? ఏదో వెలితి…” అన్నది కనకవల్లి.

కనకవల్లి ఇంటికి వెళ్లారు. విశాలమైన రెండు అంతస్తుల భవనం. ఇంటి ముందు లాన్. ఇంట్లో ఖరీదైన ఫర్నిచర్. ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంది.

కనకవల్ల సావిత్రమ్మను తన భర్తకు పరిచయం చేసింది.

“మేం ఇద్దరం తెనాలిలో గర్ల్స్ హైస్కూల్‌లో క్లాస్‌మేట్స్‌మి. అప్పట్లో చాలా క్లోజ్. ఎన్నాళ్లు అయిందే మనం విడిపోయి?  యాబై ఏళ్లు అయిందా?”

“ఆ… దాదాపు…”

ఇద్దరి మధ్యా వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎంతో మంది అధికారుల మధ్య ఏళ్ల తరబడి మసలినందు వల్ల, కనకవల్లిలో ఆ ‘ఇగో’, ఒక రకమైన డాబు దర్పం కనిపిస్తున్నాయి. ఎంతటి వాళ్లని అయినా, ‘ఆ వాడి మొహం’ అని తీసిపారేసి మాట్లాడటం అలవాటైపోయింది. ఇల్లే స్వర్గసీమ, వాకిలే వైకుంఠం అనుకుంటూ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పెరిగినందువల్ల సావిత్రమ్మకు అంతులేని అణుకువ, వినయం ఆభరణాలైనయి.

కాఫీలు, టిఫన్లు అయిన తరువాత సావిత్రమ్మను కార్లో ఇంటికి పంపించింది.

ఇంటికి వెళ్లాక సావిత్రమ్మలో అంతర్మథనం ప్రారంభం అయింది.

‘ఈ ముట్టెపొగరుది అనవసరంగా తన ప్లాన్ అంతా పాడు చేసింది. జీవన్ముక్తిని ప్రసాదించమని స్వామి వారిని వేడుకోవాలనుకుంది. ఛాన్స్ మిస్ అయింది…’ అని బాధపడింది.

దేవి నవరాత్రుల్లో కనకవల్లి ఇంట్లో విశేషంగా పూజలు, భోజనాలు, ప్రసాద వినియోగాలు జరిగాయి. కనకవల్లి బలవంతం మీద సావిత్రమ్మ ఒక రోజు మాత్రం వెళ్లి వచ్చింది. పట్టుచీర పెట్టింది.

“ఇప్పుడు దీనికి మళ్లీ నేను పట్టు చీరె పెట్టాలా?” అని కూతుర్ని అడిగింది.

“ఏమఖ్ఖర్లా” అన్నది పెద్ద కూతురు.

దేవుడు డబ్బున్న వాళ్లు పిలిస్తే పలుకుతాడు. భారీగా పూజలు చేసి ఘనకీర్తి కలవాళ్లందర్నీ పిలిచి, అతిథి మర్యాదలు చేసి, పంచభక్ష్యపరమాన్నాలతో ఆతిథ్యం ఇచ్చి, మర్యాదలు బాగా జరిగాయా లేదా, తన హోదాకు తగినట్లుగా హంగామా ఉందా లేదా అని చూసుకోవటంలో మునిగిపోయిన కనకవల్లి, పట్టుమని పది నిముషాలు అయినా అమ్మవారి మీద ధ్యానం పెట్టి, నమస్కారం చేయాలన్న విషయం మర్చిపోయింది.

సావిత్రమ్మ పెద్ద మనవరాలు టెంత్ పరీక్షలు రాస్తోంది. పెద్ద కొడుకు నెలరోజులు వచ్చి తమ దగ్గర ఉండమని వాళ్లింటికి తీసుకెళ్లాడు. అది కాగానే రెండోవాడు ఆఫీసు పని మీద అమెరికా వెళ్లాడు. నెల రోజులు వాళ్లింట్లో ఉంచుకున్నాడు. లలితా సహస్రనామ పారాయణం చేయటం, అదీ మనసు పెట్టి ధ్యానంతో చదవటం కుదరలేదు. ఇంతలో పెద్దమ్మాయికి ట్రాన్స్‌ఫర్ అయింది. నెల రోజులు అది లాక్కుపోయింది. దాని పిల్లలు పిడుగులు. దీపారాధన చేయగానే ‘హేపీ బడ్డే అమ్మమ్మా’ అంటూ దీపం అర్పేస్తారు. ఇదిలా ఉండగానే రెండో కూతురు రెండో కాన్పు. అల్లుడు అటు లాక్కుపోయాడు. ఆమె గంగిగోవు లాంటి మనిషి. ఎవరి మాటా కాదనలేదు. కాదనటానికి వాళ్లు ఏమన్నా కాలనీ వాళ్లా, కార్పోరేషన్ వాళ్లా? కడుపున పుట్టిన బిడ్డలు. ప్రాణాలన్నీ వాళ్ల మీదే పడి కొట్టుకుంటాయి మరి.

ఈ జన్మలో ఒకరు ఆగర్భ శ్రీమంతుల ఇంట్లో పుట్టటం, మరొకరు కటిక దరిద్రుని ఇంట పుట్టటం కిందటి జన్మలో చేసిన పాప పుణ్యాల ఫలితమే – అని కోటేశ్వరరావు గారు టీ.వీలో చెప్పినప్పటి నుంచీ, లలితా సహస్రనామం చేయలేకపోతున్నానన్న దుగ్ధ మరీ ఎక్కువైపోయింది.

ఇదిలా ఉండగానే – కనకవల్లి ఫోన్ చేసింది “స్వామి వారు చాతుర్మాసం కాశీలో గుడుపుతున్నారు. మేం వెడుతున్నాం. నీకూ టికెట్ బుక్ చేశాను వచ్చే అదివారం ప్రయాణం…” అన్నది.

 “చిన్నదానికి కాన్పు అయి నెల రోజులే అయింది…” అన్నది సావిత్రమ్మ.

“ఎన్నేళ్లు వాళ్ల కోసం తపించి పోతావు? చెట్టంత మనుషులు అయ్యాక వాళ్ల అవసరాలు వాళ్లు చూసుకోలేరా? నీ మెతకదనమే నీకు శాపం… ఏం ఫర్లేదు, వచ్చేయ్…” అన్నది కనకవల్లి.

సావిత్రమ్మ ఎవరి మాటా కాదనలేదు. గంగిగోవు లాంటి మనిషి.

కనకవల్లితో కాశీ వెళ్లింది. కేదార్‌ఘాట్ లోని ఆంధ్రా ఆశ్రమంలో దిగారు.

ఇప్పుడు ప్రాణం కాస్త కుదట పడింది. తెల్లారక ముందే వెళ్లి గంగలో మునిగి, ఒడ్డున ఓ అరగంట కూర్చుంటే, దేవుడు తనను ఒడ్డున పడేసినట్లే అనిపించింది.

కాశీ ప్రాశస్త్యం గురించి అక్కడి వాళ్లు చెప్పగా విన్నది. కాశీలో మరణించిన వారు తిన్నగా కైలాసానికే వెళ్తారు – అని అంటే –

“నాకు ఇక్కడే చనిపోవాలని ఉందే?” అన్నది సావిత్రమ్మ.

“అంతా నీ ఇష్టమేనా?” అన్నది కనకవల్లి.

రోజూ గంగలోనూ, రోజంతా ఐహిక, పారలోకిక అజరామర సూక్తుల విశ్లేషణా రసగంగలోనూ మునిగి తేలుతున్న సావిత్రమ్మకు –

మళ్లీ అవాంతరం వచ్చింది.

కొంచెం జ్వరం తగిలింది. జ్వరంలోనూ వెళ్లి గంగలో మునిగింది.

రెండు రోజులకు మూసిన కన్ను తెరవనంత జ్వరం. ఏదో గొణుక్కుంటోంది. సంధి ప్రేలాపన ఏమో అని కనకవల్లికి అనుమానం వచ్చింది.

“కొంపదీసి, జరగకూడనిది ఏదన్నా జరిగితే, తన పీకల మీదకి వస్తుంది” అని కనకవల్లి, సావిత్రమ్మకు టిక్కెటు బుక్ చేయించి రైలు ఎక్కించింది.

ఆమె పిల్లలకు ఫోన్ చేసి చెప్పింది.

సావిత్రమ్మ తెల్లవారిన తరువాత కళ్లు తెరిచి చూసింది. రైల్లో ఎదురు బెర్త్‌లో ఎవరో ఒకాయన తెల్లని గడ్డాలు, మీసాలతో రవీంద్రనాథ్ ఠాగూర్‌లా కనిపించారు. ఆయనే నవ్వుతూ పలకరించాడు.

కాఫీ ఇప్పించాడు. పళ్లు తినిపించాడు.

“మీరెవరు? మహాత్ములవలెనున్నారు?” అని అడిగింది.

“మాది రాజమండ్రి. తరచుగా కాశీ వచ్చి వెళ్తుంటాను” అన్నాడాయన.

“స్వామీ నాకు కొన్ని సందేహాలున్నాయి, అడగొచ్చా?”

“అడుగు తల్లీ. తెలిస్తే చెబుతాను.”

“అసలు దేవుడున్నాడా?”

“నీకు వచ్చిన సందేహమే పోతనగారికీ వచ్చింది. కలడు కలండనెడివాడు కలడో లేడో అని కలవర పడ్డాడు. ఒక వేళ భగవంతుడు లేకపోయినా, ఆయన్ను మనమే సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది అని ఒక మహాశయుడు అన్నాడు…”

“ఎందుకని?”

“క్లాసులో పిల్లలు అల్లరి చేస్తుంటారు. టీచరు వచ్చి శిక్షిస్తాడన్న భయం ఉంటే కొంత మంది అయినా అల్లరి చేయకుండా ఉంటారు… మన అల్లరి చేసే పిల్లలం… అన్యాయం, అక్రమం, దౌర్జన్యం… కొంత వరకూ అయినా పాపభయంతో తగ్గుతుంది… ”

“ఆయన ఎక్కడుంటాడు?”

“విశ్వం విష్ణుర్వషట్కారో… విశ్వమంతటా వ్యాపించి యున్నాడు…”

“ఆయన్ని ఎలా చేరుకోవాలి?”

“భక్తి మార్గం…”

“భక్తి అంటే ఏమిటి?”

“సన్మార్గాన నడుస్తూ, భగవంతుని మీద మనసు నిలపటమే భక్తి…”

“సంసార లంపటంలో పడి ఈదులాడుతున్న వారికి అది సాధ్యమా? పిల్లలు, వాళ్ల పెళ్లిళ్లు, వాళ్ల పిల్లలు, వాళ్ల పెళ్ళిళ్లు…”

“చెప్పాను కదా… విశ్వమంతటా వ్యాపించి యున్నాడు. నీ పిల్లల్లోనూ, వాళ్ల పిల్లల్లోనూ భగవంతుడే నిండి యున్నాడు. వాళ్ల సేవ చేస్తూ ఇన్నేళ్లూ నీవు భగవంతుని సేవలోనే మునిగి, తరించావు…” అన్నాడాయన.

సావిత్రమ్మకు మళ్లీ నిద్ర ముంచుకొచ్చింది. నిద్ర లేచేటప్పటికి రైలు ఎక్కడో ఆగింది.

ఎదురుగా ఆయన లేడు. రైలు కదిలింది. ఆయన రాలేదు.

Exit mobile version