Site icon Sanchika

చిరుజల్లు-27

నిచ్చెనలు – పాములు

[dropcap]సె[/dropcap]క్రటేరియట్‌లో మూడో అంతస్తులో నున్న ఒక ముఖ్యమైన శాఖలో నున్న ఒక ముఖ్యమైన సెక్షన్ ఆఫీసర్‍గా నున్న మధుర మీనాక్షి డెస్క్‌టాప్ లోకి చూస్తున్నప్పుడు, ఆమెకు ఎదురుగా కారిడార్‌లో నుంచి తొంగి తొంగి చూస్తున్న కుప్పుస్వామి కనబడ్డాడు.

అతన్ని లోపలికి రమ్మని పిలిచింది. “ఏంటి, తొంగి తొంగి చూస్తున్నావ్?” అని అడిగింది.

“అబ్బెబ్బె, అది గాదండీ, ఆ గుమాస్తాగారి కోసం…” అన్నాడు కుప్పుస్వామి వినయంగా వంగి.

“ఇక్కడ ఏదన్నా ఉంటే నాతో మాట్లాడాలి. కారిడార్‌లో తిరుగుతుంటే, పై ఆఫీసర్లు చూస్తే ఏమనుకుంటారు… ఇక్కడ కనపడొద్దు…” అని కరాఖండీగా చెప్పింది.

అందుచేత కుప్పుస్వామి కాంటిన్ దగ్గర కాపు కాసి పట్టుకున్నాడు గుమస్తాగారిని.

“అయ్యా, సుబ్బరాజుగారు తమర్ని సూడాలని శానా ఇదిగా ఉండారు. తాజ్‌లో దిగారు. మీరుదా రావాలి…” అన్నాడు కుప్పుస్వామి.

క్లార్క్ రాంబాబు సాయంత్రం తాజ్ బంజారాలో సుబ్బరాజుగారిని కల్సుకున్నాడు.

అవసరమైన సామాగ్రి అంతా వచ్చి ముందు వాలింది. సుబ్బరాజుగారు స్వయంగా రాంబాబుకి గ్లాసు అందించాడు. రాంబాబు యోగక్షేమాలు విచారించాడు. ఏదన్నా సాయం కావాలంటే అడగమన్నాడు.

తరువాత ఇంక అసలు విషయానికొచ్చాడు.

“మా ఫైలు సంగతి ఏం చేశారు?” అని అడిగాడు.

రాంబాబు మామూలుగా ఉండే స్పీడ్ బ్రేకర్స్ అన్నింటి గురించీ వివరించాడు.

“ఇప్పుడు ఫైల్సు అన్నీ కంప్యూటర్‌లో ఫీడ్ అవుతున్నాయండీ. సీరియల్‌గా చూస్తామండి… అందులోనూ ఇది మూడు నాలుగు డిపార్ట్‌మెంట్స్‌కి వెళ్లాలి. వాళ్ల ఆమోదాలు రావాలి. ఎంత లేదన్నా ఆరు నెలలు పడుతుందండీ” అన్నాడు రాంబాబు.

“నువ్వు తల్చుకుంటే షార్ట్‌కట్ ఏదో ఒకటి ఉంటుందిలే” అన్నాడు సుబ్బరాజుగారు.

“అవుననుకోండి. ఇదివరలో ఇలాంటి సందర్భాల్లో ఆయా శాఖల వారు ఇచ్చిన ఆమోదాలను చూపించి, ఇదీ అలాంటిదే అని… షార్ట్‌కట్‌లో వెళ్లొచ్చు… కానీ పై వాళ్లు ఒప్పుకోవాలి గదండీ…” అని నసిగాడు.

“నువ్వు పంపించు, పై వాళ్ల సంగతి నేను చూసుకుంటా… నేను మినిస్టర్‌తో మాట్లాడుతా…” అన్నాడు సుబ్బరాజుగారు.

కానీ రాంబాబు మౌనం వహించటంతో ఆయనకు విషయం అర్థమైంది.

“నీ విషయం ఏమిటో తేల్చు…” అన్నాడు సుబ్బరాజుగారు

రాంబాబు ఈ విషయంలో బాగానే ఆశ పెట్టుకున్నాడు. వందల కోట్ల పెట్టుబడితో ఆయన ఒక పెద్ద ఫాక్టరీ పెట్టబోతున్నాడు. అందుకు కావాల్సిన అనుమతుల కోసం గవర్నమెంటుకు దరఖాస్తు పెట్టుకున్నాడు సుబ్బరాజుగారు. ఆ ఫైలు రాంబాబు దగ్గర మొదలై మినిస్టర్ల దగ్గర ముగుస్తుంది.

పాతిక లక్షల దగ్గర మొదలైన బేరం మూడు లక్షల దగ్గర ముగిసింది.

తరువాత ఇంక మధుర మీనాక్షి దగ్గరకు వెళ్లాడు సుబ్బరాజుగారు. ఆఫీసులో ఆమె నిప్పులా ఉంటుంది. ఎవర్నీ దరిదాపులకు కూడా రానివ్వదు. అందుచేత ఆమె ఇంటికి వెళ్లి పట్టుచీరతో పాటు మడుపులూ చెల్లించుకున్నాడు. పై ఆఫీసర్లను ఒప్పించే భారం కూడా ఆమె మీదనే పెట్టాడు. సరే నన్నది.

నిజానికి సుబ్బరాజుగారికి ఉన్న పలుకుబడి సామాన్యమైనది కాదు. ఒకప్పుడు ఆయన తాతగారు మంత్రి పదవిని అలంకరించారు. ఇప్పటికీ పై లెవెల్లో ఆయనకు పరిచయస్థులు చాలామంది ఉన్నారు. పైన ఎంత పలుకుబడి ఉన్నా, వాళ్లంతా సంతకాలు పెట్టే వాళ్లే గానీ, కింద నుంచీ సానుకూలంగా లేకపోతే వాళ్లు చేయగలిగేదేం ఉండదు.

ఇవన్నీ తెల్సుగనుకనే సుబ్బరాజుగారు ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. కాలం మారింది. పరిస్థితులు మారి లంచాలు ఇవ్వటం, పుచ్చుకోవటం అన్నీ స్థాయిల్లోనూ సాధారణం అయింది. ఇరుసున కండెన లేక ఈశ్వరుని బండి అయినా కదలదు అన్న సత్యం అందరికీ అవగతం అయింది.

అందుచేత ఫైలు కదలాలంటే అన్ని స్థాయిలలోనూ దాని వెనకాల పడాల్సిందేనన్నది సుబ్బరాజుగారికి తెలియకపోలేదు.

అలా అన్ని దశలు దాటి మంత్రిగారి దగ్గరకు వెళ్లింది ఫైలు. సుబ్బరాజుగారు వెళ్ళి మంత్రి గారిని కలిశారు. వీరి వంశ చరిత్ర అంతా తెల్సుగనుక, మంత్రిగారూ మర్యాద చేశారు.

“మీ తాతగారి పేరు తెలియని వారు ఎవరున్నారు? ఆయన గురించి ఇప్పటికీ చెప్పకుంటూనే ఉంటాం” అన్నారాయన.

ఆయన ముందే ఫైలు తెప్పించుకొని చూశారు. అటూ ఇటూ తిరిగేసి చూశారు. ఎంత చూసినా ఆయనకు విషయం మింగుడు పడలేదు. ఫాక్టరీ పెట్టటానికి ఎన్ని ఇబ్బందులున్నాయో కూడా రాశారు.

మంత్రిగారు సుబ్బరాజుగారితో అన్నారు.

“ఏంటండీ, ఇంత అనుభవం ఉన్నోళ్లు, మీరు గూడా ఇలా చేస్తే ఎలా? ఇన్ని మెలికలు పెట్టారు… ఎట్లా చెప్పండి. కింద వాళ్లని కూడా చూసుకోవద్దూ… ఏం చేద్దాం మరి?” అని ఆలోచించారు.

రెండు రోజుల పాటు సుబ్బరాజుగారు మంత్రిగారి చుట్టూ తిరిగారు. ఆయన ఎటూ తేల్చలేదు.

ఈలోగా సుబ్బరాజుగారు రాంబాబుని, మధుర మీనాక్షినీ అడిగితే… “మేం రూలు పోజిషన్ రాయాలి గనుక అలాగే రాస్తాం… నిర్ణయం తీసుకోవాల్సింది పైవాళ్లు, మాదేం లేదు…” అని సన్నాయి నొక్కులు నొక్కారు.

రూలు పోజిషన్ రాయటానికి మీకు ఇంత డబ్బు ఎందుకివ్వాలి – అన్నదానికి సమాధానం లేదు.

చివరకు మంత్రిగారు ఒక సలహా ఇచ్చారు.

“జీవితంలో పైకి రావాలంటే డబ్బు ఒక్కటే సాలదు. అదృష్టమూ ఉండాలి. మీరు పెద్దవారు. ఇలా ఎన్నింటికి అని తిరుగుతారు? మా వాడు ఒకడున్నాడు. వాడ్ని పార్ట్‌నర్‌గా పెట్టుకోండి. మీరు కుర్చీలో నుంచి కాలు కదపక్కర్లా. అన్నీ వాడు చూసుకుంటాడు. రేపు కంపెనీ నడవాలంటే, లాభాల బాట పట్టాలంటే, కొన్ని పనులు కాలానుగుణంగా చెయ్యాలి. మీరు పెద్దవారు. మీకు అవి నచ్చవు… తరం మారింది. అంతరం మారింది. మా వాడికి అవకాశం ఇవ్వండి. అన్నీ వాడి నెత్తిన పెట్టి మీరు పైన పెత్తనం చేద్దురుగాని…” అని అన్నాడు.

సుబ్బరాజుగారు అవుననీ అనేలదు, కాదనీ అనలేదు. మౌనమే అంగీకారం అనుకున్నారు మంత్రిగారు. ఆయన ముందే ఆఫీసర్లను పిలిపించి, వాళ్లమీద అగ్గ మీద గుగ్గిలం అయ్యినారు.

“ఏంటండీ ఇది? మన రాష్ట్రంలో కొత్త ఫాక్టరీ పెట్టాలని పాపం ఆయన ఎంతో ఆశగా వస్తే, ఇలా అభ్యంతరాలు పెడితే ఎలా? మనం కాదంటే, రేపు అతను మరో రాష్ట్రానికి పోయి,. అక్కడ పెట్టుకుంటాడు. అందువల్ల నష్టపోయేది ఎవరు? కొత్తగా ఒక ఫాక్టరీ వచ్చినా, కంపెనీ వచ్చినా కొన్ని వందల మందికి ఉద్యోగాలు వస్తయి. కొన్ని వందల కుటుంబాలు బాగు పడతయి. మనం ఈ కుర్చీలో కూర్చునందుకు నలుగురికి ఉపయోగపడేలా పని చెయ్యాలి. ఏదో ఒక సాకు చెప్పి, అడ్డుపడితే మన కాళ్లకు మనమే సంకెళ్లు వేసుకుంటున్నట్లు అవుతుంది. కింద స్థాయిలో వాళ్లు, వాళ్ల స్థాయిలోనే ఆలోచిస్తారు… పెద్ద మనసుతో ఆలోచించలేరు…” అని మంత్రిగారు జ్ఞానోదయం కలిగించారు.

సుబ్బరాజుగారి మొహం వికసించింది.

ఆఫీసర్లు తమ గదుల్లో కూర్చుని మీటింగ్ పెట్టుకున్నారు.

ఈ ఫాక్టరీ పెట్టినందువల్ల, గాలి కలుషితమవుతుందనీ, నీరు కలుషితమవుతుందనీ, ఇలాంటి వాటిని గ్రామాలకు దగ్గరగా అనుమతించవద్దని చుట్టు పక్కల గ్రామాల వారు దరఖాస్తులు పెట్టుకున్నారు.

ఈసారి మళ్లీ ఆ దరఖాస్తులన్నీ జత చేసి పంపిచారు.

మినిస్టరుగారు మళ్లీ మీటింగు పెట్టారు.

ఈలోగా ఆ ఆఫీసర్లు ట్రాన్సఫర్ అయిపోయారు.

కొత్తవారు వచ్చారు.

అన్ని అనుమతులూ వచ్చాయి. ఫాక్టరీ ప్రారంభమూ అయింది.

***

రాంబాబు స్కూటర్ మీద ఇంటికి వెళ్తుంటే వెనక నుంచి లారీ గుద్దేసింది. రెండేళ్ల పాటు ఇంట్లోనే ఉన్నాడు. మెడికల్లీ ఇన్‌వాలిడ్ అని కంపల్సరీ రిటైర్‌మెంట్ ఇచ్చారు.

Exit mobile version