Site icon Sanchika

చిరుజల్లు 3

ధనమేరా…

శ్లో.
అర్థానా మార్జనే దుఃఖం – ఆర్జతానాం చ రక్షణే
నాశే దుఃఖం, వ్యయే దుఃఖం – ధిగర్థం దుఃఖభాజనం

[dropcap]ధ[/dropcap]నం సంపాదించుటలో దుఃఖము, సంపాదించిన దానిని రక్షించుకొనుటలో దుఃఖము, ఆ ధనము పోతే దుఃఖము, వ్యయమైతే దుఃఖము. ఇన్ని విధాలుగా దుఃఖకారకమైన, ఈ పాడు డబ్బు ఎంత వ్యామోహపెడుతోంది!

నిజానికి డబ్బు మంచిదే. మనిషికి దాని మీద గల అత్యాశే అన్ని అనర్థాలకూ మూలం అవుతోంది. ఇరుసున కందెన బెట్టక పరమేశ్వరుడి బండియైన బారదు సుమతీ అన్నారు. ఇక మన బ్రతుకుబండి గురించి చెప్పేదేముంది?

డబ్బు లేని వాడు గడ్డిపోచ కన్నా హీనం. పేదవాడికి పెళ్ళామే పెద్ద లగ్జరీ. ధనము లేనిచో తెవులు నొప్పులు లేవు, తిరిపెంబు లేదు, నవత బొందుట లేదు, కడకు నరకంబు లేదు.

డబ్బుంటేనా – అబ్బో – అందరికీ ఆత్మీయ బంధువు. కొందరు మంతనంబులతోనూ, కొందరు జంకెన వాడి చూపులతోను, కొందరు జేతిసన్నుల దగుల్పడ జేయుట తోను, ఆదరణీయులవుతారు.

ధనము సంపాదించటంలో ఎలాంటి దుఃఖము ముందో చెప్పాలంటే, ముందుగా సుబ్బారావు గురించి చెప్పాలి.

కలగంటీ… కలగంటీ…

సుబ్బారావుకి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఒక సుందర సుమధుర స్వప్నం నీడలా వెంటాడుతూ వస్తూనే ఉంది. అదేమిటంటే ఎక్కడో ప్రశాంత, నిశాంత వాతావరణం వెల్లివిరిసే చోట అయిదొందల గజాల స్థలం కొనుక్కొని, మల్లెల మొగ్గలు, సన్నజాజులు, సంపెగలు, గులాబీలు, మందారాలు విరియబూసి తేనె నట్టుట్టు (బొట్టు బొట్టు) పడునట్టు, ‘నైట్ క్వీన్స్’ ఇంట్లోనూ, ఇంటి బయటా కళకళలాడుతూ మాణిక్య దీపముల్ వెలయునట్లు తిరుగుతుండాలన్నది – సుబ్బారావు స్వప్నం.

సరే మరి, సిటీ ఇంతలా మరీ తామర తంపరలా పెరగక ముందు నుంచి, స్థలం కొనాలని తిరగటం మొదలుపెట్టాడు. అప్పట్లో గజం పది రూపాయలంటే ముందుకో, వెనక్కో ఊగిసలాడి వెనకనే ఉండిపోయాడు. అయిదేళ్ళ తరువాత రెండు మైళ్ళ అవతల గజం రెండు వేల రూపాయలంటే, ఊగీ, ఊగీ, ఆగిపొయ్యాడు. ఇంకో అయిదేళ్ళ తరువాత ఊరి శివార్లన్నీ సిటీలో కల్సిపోయాకా, మళ్ళీ స్థలాలన్నీ చూసీ, చూసీ, ఆలోచిస్తూ ఉండిపొయ్యాడు. రిటైరనాక తెగించి, ఎవడో విల్లాలు కడతాం, ‘ప్రీ-లాంఛ్’ ఆఫర్ అంటే ముప్ఫయి లక్షలు కట్టాడు. వాడు కట్టిన డబ్బుకి రిసీట్ ఇచ్చాడే గాని, విల్లా ఇవ్వలేదు. ఇప్పుడు సుబ్బారావు రిసీట్ పట్టుకుని తిరుగుతున్నాడు – తనలో తాను గొణుక్కుంటూ – అదే విషాదం.

రక్షించుకొనుటలో దుఃఖము

ధనము అగాదమౌ జలనిధి లాంటిది. గౌరవం, మర్యాద, స్నేహం, అన్నీ అందులో ముగినిపోవాల్సిందే.

రత్నాకర రావు గవర్నమెంటు ఆఫీసులో డిప్యూటీ డైరక్టరుగా పని చేస్తూ అకస్మాత్తుగా గుండె నొప్పితో చనిపోయాడు. సాటి ఆఫీసర్లు అందరూ చివరి చూపు చూడటానికి వచ్చారు. ఏడుస్తున్న భార్యాపిల్లల్ని ఓదార్చారు. ఎలాంటి సాయం అయినా చేస్తామన్నారు – స్మశానంలో కాలుతున్న రత్నాకర రావు సాక్షిగా.

నెల రోజుల తరువాత రత్నాకర రావు కొడుకు తండ్రి ఆఫీసుకెళ్ళి రావల్సిన డబ్బు కోసం ధరఖాస్తు పెట్టుకున్నాడు. “మీ నాన్న ఎక్కడా ఎవరి పేరు నామినీగా రాయలేదు. నీకు డబ్బు రాదు” అన్నారు అధికారులు. “మరి నేనేం చేయాలి?” అని అడిగితే సక్సెషన్ సర్టిఫికెట్ తెమ్మన్నారు. అసలు అదేంటో ఆ కుర్రాడికి తెలియదు. ఆరు నెలలు తిరిగి కాళ్ళావేళ్లా పడితే, రావల్సిన డబ్బులో సగం వదులుకుంటే, సగం వరకూ ఇస్తామన్నారు. మీకు ఇది న్యాయమా, ధర్మమా అని రత్నాకర రావు భార్య గుండెలు బాదుకుంది. న్యాయమూ, ధర్మమూ సంగతి మాకెందుకు – వాటిని చూసుకోవటానికి, ధర్మజుడు ఉన్నాడు, కుబేరుడున్నాడు, పద్మజుడు ఉన్నాడు – అనీ అన్నారు.

ధనము పోగొట్టుకొనుటలో దుఃఖము

ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, అప్పు చుట్టూ తిరుగుతోంది. మనం అగ్రరాజ్యంగా భావించే అమెరికా అప్పు చేయటంలోనూ అగ్రస్థానంలోనే ఉంది. బ్యాంకులలోని అప్పులు తీసుకొని, ఎగనామం పెట్టిన వారంతా ప్రముఖులే. ఎంత చెట్టుకు అంత గాలి. పదివేలు బాకీ తీర్చకపోతే, డీఫాల్టర్. లక్షలు బాకీ కట్టకపోతే, బిజినెస్‍మెన్. వందల కోట్లు కట్టకపోతే ప్రముఖ సంస్థ. లక్షల కోట్ల అప్పు చెల్లించకపోతే ప్రభుత్వం. ఇదీ ఈనాటి జీవనశైలి.

శివరావు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. లోన్ తీసుకొని కారు కొన్నాడు. నెల రోజులకే ఉద్యోగం పోయింది. కుటుంబం గడవటమే కష్టం అయింది. ఆరు నెలలు ఇన్‍స్టాల్‌మెంట్స్ కట్టలేకపోయాడు. బ్యాంక్ లోన్ కలెక్షన్ టీం వాళ్ళు వచ్చి బెదిరించి కారు పట్టుకుపోయారు. ఇలాంటి వాటికి ఇది మొదలూ కాదు, చివరా కాదు.

ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పులు చేస్తే అసలు పదిరెట్లు కట్టినా అప్పు తీరదు. ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయి, నిలువునా కూలిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఏవేవో పేర్లు… కాల్ మనీ అనీ, మరొకటి అనీ. అప్పులు తీర్చలేక కుటుంబాల ఆత్మహత్యలూ, రైతుల ఆత్మహత్యలూ… రోజూ పేపర్లలో, టీవీల్లో చూస్తూనే ఉన్నాం.

అప్పు తీసుకున్నవాడు ఎప్పుడూ, అప్పు ఇచ్చినవాడికి లోకువై పోతాడు. బెదిరింపులూ, చీదరింపులూ తప్పవు.

కొందరు తెలివిగలవారు నాలుగైదు బ్యాంకు కార్డులు తీసుకుంటారు. వీలున్నంత డబ్బు లాగేస్తారు. ఎన్నాళ్ళకీ తరగదు. వన్ టైమ్ సెటిల్‍మెంట్ అని సగం కట్టమంటారు. ఇంకో కార్డు మీద డ్రా చేసి, ఇది సెటిల్ చేస్తారు. శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు.

ప్రపంచంలోని అన్ని దేశాల వారూ స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకోవటం చాలా కాలంగా వస్తున్న అలవాటే. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారీగా జననష్టం జరిగింది. అందులో స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నవారూ అధిక సంఖ్యలో ఉన్నారు. చాలా ఏళ్ళపాటు లావాదేవీలు లేనందున, ఆ ఖాతాదారుల వారసులు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఆ డబ్బు చెల్లిస్తామని కూడా స్విస్ బ్యాంకులు ప్రకటించాయి.

తాత పీనాసి అయితే, మనవడు లక్షాధికారి అవుతాడని సామెత. పాచిపళ్ళవాడు దాచిపెడితే, బంగారు పళ్ళవాడు తిన్నాడని అంటారు.

పొదుపు చేయడం వేరు, పీనాసిగా ఉండడం వేరు. రెండింటికీ చాలా తేడా ఉంది. ధనవంతులు భారీగా ఖర్చు చేస్తూంటారని భావిస్తుంతారు. చాలామంది ధనవంతులు టిప్స్ ఇవ్వటం దగ్గర నుంచీ ప్రతీదీ చూసి చూసి ఖర్చు చేస్తుంటారు.

ఆదా

డబ్బు ఆదా చేస్తే ఆ మేరకు డబ్బు సంపాదించినట్లే. ఒకసారి ఒక వ్యక్తి విమానంలో తన పక్కన కూర్చుని ప్రయాణం చేస్తున్నది నారాయణమూర్తి అని గుర్తు పట్టి కాసేపు ఆయనతో మాటలు కలిపాడు. “మీరు బిజినెస్ క్లాస్‍లో ప్రయాణం చేయవచ్చు గదా” అని అడిగాడు. “ఏ క్లాస్‌లో ప్రయాణం చేసినా ఒకే సమయానికి చేరతాం గదా” అని ఆయన అన్నారు. ఉదాహరణకు బిజినెస్ క్లాస్‍లో ప్రయాణం చేస్తే టిక్కెటు ధర ఒక లక్ష రూపాయలు ఎక్కువ ఉంటుందీ అనుకుంటే, ఎకానమీ క్లాస్‍లో వెళ్ళినందువల్ల లక్ష రూపాయలు మిగిలినట్లే గదా.

ఒక పెద్ద బిజినెస్‍మాన్, నేను జేబులో రూపాయి కూడా లేకుండా, నగరానికి వచ్చాను – అని అన్నాడు. ఇంకొక పెద్ద మనిషి అన్నాడు, నేను చొక్కాకు జేబు కూడా లేకుండా నగరానికి వచ్చాను అని.

నిజమే చిన్న చిన్న వ్యాపారాలతో జీవితం ప్రారంభించి వ్యాపార దిగ్గజాలుగా మారినవారు చాలామంది ఉన్నారు. దానికి సరియైన ప్లానింగ్ కూడా అవసరం.

విద్యుచ్ఛక్తి కనిపెట్టినవాడు గొప్పవాడే. దానిని సక్రమంగా వాడేందుకు మీటర్ కనిపెట్టినవాడూ గొప్పవాడే. అందరికీ అర్థం అయ్యే అంతర్జాతీయ భాష ఏదన్నా ఉందీ అంటే – అది డబ్బు.

నిర్లక్ష్యం పనికిరాదు

మా వాడు డబ్బు మంచినీళ్ళల్లా ఖర్చు చేస్తున్నాడు – అంటారు.  ఇప్పుడు మంచినీళ్ళు కూడా డబ్బు పెట్టి కొనుక్కోవాల్సిందే. డబ్బు సంపాదించటం కొందరికి వ్యసనం. ఖర్చు చెయ్యటం కొందరికి వ్యసనం. ఆదాయం కన్నా ఖర్చు మించకుండా ప్లాన్ చేసుకుంటే, అది సరియైన బడ్జెట్ కిందే లెక్క.

ఒకసారి శ్రీమంతుల జాబితా ఒకటి ప్రచురించారు. మొదటిసారి ఆయన పేరు ఆ జాబితాలో కనబడగానే, సాయం చెయ్యమంటూ ఎంతోమంది కోరటం మొదలుపెట్టారు. మీరు నెల నెలా ఎంత ఆదా చేసి చూపిస్తారో, అంతే మొత్తాన్ని నేను మీకు ఇస్తానని అన్నాడు. వచ్చినవాళ్లు తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు. ప్రతీవాళ్ళకీ ఈజీ మనీ కావాలి. అందుకోస ఎంతో తాపత్రయం.

ఒక జమీందారు గారి దగ్గరకు ఒక కవిగారు వచ్చి ఒక పద్యం చెప్పాడు:

నడవక నడిచి వచ్చితి
నడిచిన నే నడిచిరాను
నడిచెడు నటులన్ నడిపింప నడువనేరను
నడవడికలు చూసి నన్ను నడిపింపరయా

దాని అర్థం ఏమిటంటే, సంసారం నడవటం లేదు. అందుచేత సాయం కోరి నడిచి వచ్చాను. సంసారం నడిచేటట్లుంటే మీ దగ్గరకు ఇలా నడిచి వచ్చేవాడిని కాదు. సంసారం నడిచేటట్లు ఏదన్నా సాయం చేస్తే, ఇంటికి నడిచి వెడతాను – అని.

ఆయన పాండిత్యానికి మంచి బహుమానమే దొరికింది.

ధనము ఘనమైన చుట్టంబు, ధనము పతియు, సతియు, చెలియ, తల్లియు, తండ్రియు, గురువు, దైవము – సర్వస్వమూ ధనమే. ఆదియు, అంతమూ – అన్నీ అదే. దాని గుణములు వర్ణింప, ధరణినాథ, ఎవ్వనికని శక్యంబు కాదు.

తెలియనివెన్నో…

అందరు అమ్మలూ అమెరికా ఎందుకు వెళ్తారో, శాంతమ్మ అందుకే వెళ్ళింది. కూతురికి పురుడు పొయ్యటానికి. అయితే దానికి ముందూ, తరువాత కొన్ని ఆర్భాటాలు ఉంటయి గదా, బేబీ షవర్ అనీ, నామకరణం అనీ… అందుచేత పెట్టెనిండా పట్టుచీరలతో పాటు, ఉన్న నగలన్నీ తీసుకెళ్ళింది. అన్నీ అనుకున్నట్లే సవ్యంగా జరిగిపోయాయి. ఆరు నెలల తర్వాత హైదరాబాదు ఇంటర్నేషనల్ ఎయిర్‍పోర్ట్‌లో దిగాకా, కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారు – ఇంత బంగారం తీసుకురావటానికి అనుమతి లేదంటూ. నా నగలు నేను తెచ్చుకోవటానికి నీ అనుమతి ఏంటని వాదించింది. వెళ్ళేటప్పుడు ఈ నగలు చూపించి ఇమ్మిగ్రేషన్ నుంచి సర్టిఫికెట్ తీసుకున్నావా – అని అడిగారు. నా నగలు వాడెవడికో చూపించటం ఏంటని వాదించింది. నగలు సీజ్ చేసి కస్టమ్స్ ఆఫీసులో డిపాజిట్ చేస్తాం అని బెదిరించారు.

ఇండియాలో ఏమైనా జరగొచ్చు. ఆమె దగ్గరున్న అయిదు వేల రూపాయలు తీసుకుని ఆమె నగలు ఆమెకిచ్చారు. మరి రూల్స్ ఏమైనట్టు?

రూల్స్ ఈతాకు చాపల్లాంటివి. తిరగేసి వేస్తే గుచ్చుకుంటాయి. బోర్లా వేస్తే అంతా బాగానే ఉంటుంది.

ఒకామె ఒక జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్ళి “స్వామీ, మాకు వచ్చే ఆదాయం చాలటం లేదు. ఏం చెయ్యమంటారు స్వామీ” అంటే, “నీకు వచ్చే దానిలో ఇరవై శాతం నాకు దానం చేస్తే, నీకు అష్ట ఐశ్వర్యాలు సమకూరుతాయి” అన్నాడు. ఆమె తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది.

సోమచ్ సో

డబ్బుంటే క్షేమం. లేకుంటే క్షామం.

Exit mobile version