చిరుజల్లు-31

0
2

నీడ తెగిన మనుషులు

[dropcap]సెం[/dropcap]ద్రి ఎల్లుల్లిపాయలు కొనుక్కునేందుకు వీరాస్వామి కొట్టు కాడికి ఎళ్లింది.

అదే సమయానికి లచ్చి చింతపండు కొనుక్కునేందుకు వీరస్వామి కొట్టుకు ఎళ్లింది.

ఇద్దరూ అప్పాచెల్లెళ్లు. వాళ్లు ఉండేది కూడా దగ్గర దగ్గరే. ఒకరి మీద ఒకరికి వల్లమాలిన ప్రేమ ఉంది. కష్టసుఖాలు ఒకరికొకరు చెప్పుకోకుండా ఉండలేరు. ఎన్ని సంగతులు చెప్పుకున్నా తరిగేది కాదు.

అయితే ఇప్పుడు వాళ్ల మధ్య కనిపించని అడ్డుగోడ ఏదో కట్టినట్లు అయింది.

సెంద్రి మొగుడు సింహాచెలం – బ్రహ్మంగారి పార్టీ.

లచ్చి మొగుడు ఏడుకొండలు – శివంగారి పార్టీ.

రెండు పార్టీల మధ్యా పచ్చగడ్డి ఏస్తే భగ్గుమంటుంది. నీళ్లు పోసినా పెట్రోలు అయి మండిపోతుంది.

నాయకులు ఇద్దరూ బద్ధ శత్రువులు అయినందు వల్ల, వాళ్ల దగ్గర పని చేస్తున్నందువల్ల, సింహాచెలం, ఏడుకొండలు శత్రువులయినందువల్ల వాళ్ల పెళ్లాలు అయినందువల్ల సెంద్రి, లచ్చి కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకోవటానికి వీల్లేకుండా ఉంది. అప్పాచెల్లెళ్ల మధ్య ప్రేమ ఊట బావిలో నీరు ఊరినట్లు ఊరుతున్నా, చూపులతోనే అల్లంత దూరం నుంచి చూసుకుంటూ ఉండి పోవాల్సిన వస్తోంది.

అక్కా చెల్లెళ్ల మధ్య శత్రుత్వం లేదు. కొండంత ప్రేమ ఉంది. మాట్లాడుకున్నట్లు తెలిస్తే, మొగుళ్లు నరికిపోగులు పెడతారని, ఉప్పుపాతర వేస్తారనీ భయపడుతూ అనుకోకుండా ఎదురు పడినా మౌనంగానే మాట్లాడుకుంటున్నారు.

బ్రహ్మంగారు, శివంగారు కుటుంబ సభ్యులనే కాదు, ఊరినే రెండుగా చీల్చివేశారు. ఒకరికి దగ్గర అయిన వాళ్లు, రెండో వాళ్లకు శత్రువర్గం వారికిందనే లెక్క.

ఇప్పుడు ఎన్నికలొస్తున్నయి. రాజకీయ కక్షలు మితిమీరి పోతున్నాయి.

బ్రహ్మంగారు, సింహాచెలంతో అన్నారు “నువ్వు నిలబడమంటే నిలబడతారా” అని. అలా అనటంతో సింహాచెలానికి ఏనుగు ఎక్కినంత సంబంరంగా ఉంది.“ఇది మన పరువుకు సంబంధించిన విషయం సారూ, మీరు నిలబడండి. మిగతాది నేను చూసుకుంటా” అన్నాడు సింహాచెలం.

వాడి నెత్తిన ఆ బరువు మోపటం కోసమే, ఆయన తెలివిగా వాడి మాటకు విలువ ఇస్తున్నట్లు అన్నారు.

సింహాచెలం ఇంటి కొచ్చి పెళ్లాంతో అన్నాడు “అయ్యగారు ఏమన్నారో తెల్సా? ఒరే, నువ్వు నిలబడమంటే నిలబడాతా, లేకపోతే లేదురా… అన్నారు. నేనే ఆయన్ని నిలబెడతన్నా…” అన్నాడు.

అక్కడ శివంగారికీ ఏడుకొండలకీ మధ్య కూడా ఇలాంటి వ్యవహారమే నడిచింది. “మనం గెలవటం, ఓడటం అంతా నీ మీద ఆధారపడి ఉందిరా…” అన్నాడు. “ఈ ఊళ్లో మనల్ని కొట్టే మగాడు ఎవుడున్నాడండీ…” అన్నాడు ఏడుకొండలు.

రాత్రి ఏడుకొండలు ఇంటి కొచ్చి పెళ్లాంతో అన్నాడు “అయ్యగారు… అంతా నువ్వే చూసుకోవాల్రా – అన్నారు… నేనంటే అయ్యగారికి గురి” అని.

బ్రహ్మంగారు హైదరాబాదు వెళ్తూ, సింహాచెలాన్ని తన కార్లో ముందు సీట్లో కూర్చో బెట్టి తీసుకెళ్లారు.

శివంగారూ హైదరాబాదు వెళ్తూ, ఏడుకొండల్ని తనతో రైల్లో తీసుకెళ్లారు.

రెండు పక్షాల వారూ ఎదురెదురు హోటళ్లల్లోనే దిగారు. ఒకరి విషయాలు ఒకరికి తెలుస్తూనే ఉన్నాయి.

బ్రహ్మంగారు అసెంబ్లీకి వెళ్లి తన పార్టీ నాయకులతో మంతనాలు సాగించారు. అప్పుడంతా సింహాచెలం బయట గేటు దగ్గర నిలబడే ఉన్నాడు.

శివంగారు తన పార్టీ ఆఫీసుకు వెళ్లి పార్టీ పెద్దలతో చర్చలు జరిపినప్పుడు, ఏడుకొండలు గది బయట మెట్ల దగ్గర నిలబడే ఉన్నాడు.

బ్రహ్మంగారు నాలుగు రోజులు పాటు ఎక్కడెక్కడికి వెళ్లినా, సింహాచెలాన్ని తనతో తీసుకెళ్లారు. సింహాచెలం తనే గొప్పలీడరు అయిపోయినట్లు లోలోపల పొంగిపోయ్యాడు.

హోటల్లో రాత్రి పూట అయ్యగారు ముందు తాగేటప్పుడు, సింహాచెలం, ఆయన పాదాల చెంత విశ్వాస పాత్రమైన శునకంలా కూర్చుని అన్నీ అందించేవాడు. అయ్యగారు, భోంచేసి నిద్దరోయాక, మిగిలిన వన్నీ సింహాచెలం ఖాళీ చేసేవాడు,.

ఎదురుగా నున్న హోటల్లో శివంగారు కాళ్ల దగ్గర పడి ఉన్న ఏడుకొండలు పరిస్థితీ ఇదే.

బ్రహ్మంగారు, శివంగారు, ఎదురు పడితే, చూపులతోనే ఎలా కత్తులు దూస్తారో, సింహాచెలం, ఏడుకొండలు కూడా అంత కన్నా కర్కశంగా, కత్తి యుద్ధం చేస్తున్నారు – చూపులతోనూ, చేష్టలతోనూ,

ఒకప్పుడు ఒరేయ్, ఒరేయ్ అంటూ భుజాలు భుజాలు రాసుకుంటూ తిరిగుతూ, ఎంతో చనువుగా స్నేహంగా, ప్రేమగా, ఆప్యాయంగా మసిలేవాళ్లు ఇద్దరూ – ఇప్పుడు నిష్కారణంగా – ఒకర్నొకరు చంపటానికి అయినా వెనకాడనంత విరోధులు అయిపోయారు.

ఇంటి కొచ్చాక సింహాచెలం పెళ్లాంతో అన్నాడు “నేను అయ్యగారికి కుడి భుజం. ఆయన ఎళ్లిన చోటికల్లా నన్ను తీసుకెల్లారు. నేను నిముషం కనపడకపోతే ఆయన ఉండలేరు…”అని.

ఏడుకొండలు తన భార్యతో అదే అన్నాడు “యాడికెళ్లినా పక్కన నేనుండాల్సిందే…” అని.

ఎన్నికలోచ్చినాయి. నామినేషన్లు హడావుడి అంతా ఇంతా కాదు. వందల మంది జనాన్ని పోగుచేసి, బ్యాండు మేళం పెట్టి, జెండాలు, పూలదండలు, పూలు చల్లటాలు – ఆర్భాటం అంతా సింహాచెలానిదే. పదివేలు ఇచ్చి, నువ్వు సొంతానికి ఉంచుకోరా – అన్నాడు. అయ్యగారు – మహనుబావుడు!… అనుకున్నాడు సింహాచెలం.

మర్నాడే శివంగారు నామినేషన్ నిన్నటిని మించిన హంగూ ఆర్భాటం… పూజలు, పునస్కారాలు, హోమాలు, భోజనాలు… పాతికవేలు మిగిలినయి ఏడుకొండలకి. ఆయన లెక్కలు అడగలేదు. ‘దేవుడు…’ అనుకున్నాడు ఏడుకొండలు.

“వొరే, నువు సేసిన ఏర్పాట్లు బ్రహ్మండంగా ఉన్నాయిరా. నువ్వు తల్చుకుంటే, ఏమయినా చేయగలవురా…” అన్నాడు బ్రహ్మంగారు మెచ్చుకోలుగా.

“మీరు పైపనులు చూసుకోండి సారూ. మిగిలినయన్నీ నాకు ఒదిలెయ్యండి. మొత్తం జనాన్ని మనవేపు తిప్పే పూచీ నాది…” అన్నాడు సింహాచెలం.

శివంగారు ఏడుకొండల్ని మంచి మాటలతో ముంచెత్తుతున్నారు.

ఎన్నికల ప్రచారం ఊపు అందుకుంది. అటు సింహాచెలం, ఇటు ఏడుకొండలూ, ఒకరిని మించి మరొకరు జనాన్ని కల్సుకుని ప్రలోభపెట్టటంలో తలమునకలుగా ఉన్నారు. ఒకరి ఎత్తులు మరొకరు ఓ కంట కనిపెట్టి చూస్తూనే ఉన్నారు.

తన ఓటర్లు అనుకన్న వాళ్లను అటు వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలియగానే సింహాచెలం కోపంతో ఊగిపోతూ ఇంటి కొచ్చి పెళ్లాన్ని చావకొడుతున్నాడు.

“వాడేవడే… నీ సెల్లి మొగుడు.. మీరంతా ఒకటే.. సేసేదంతా సేసేసి, ఏటీ తెలీనట్లు నాటకాలాడాతున్నారు. నేను ఎవుడ్నీ, దేవుడ్నీ లెక్కసెయ్యను… ఏటనుకుంటున్నారో…” అని సివాలెత్తిపోతున్నాడు సింహచెలం.

“నేనేంటి సేసినాను? ఉత్త పున్నేనికి నన్ను కొట్టి సంపుతున్నావు?” అని సెంద్రి ఏడుస్తోంది.

అటు ఏడు కొండలూ తన అక్కసు అంతా వెళ్లగక్కుతూ పెళ్లాన్ని తంతున్నాడు.

బ్రహ్మంగారూ బాగానే ఉన్నారు, భార్య సలహాలు తీసుకుంటూ ఆమె చెప్పినట్లే చేస్తున్నాడు.

శివంగారూ చిద్విలాసంతోనే భార్యతో మాట్లాడుతున్నాడు. ఆమె చెప్పిన దానికల్లా తల ఊపుతున్నారు.

నాయకులు ఇద్దరూ రాజకీయాల్లో పండిపోయ్యారు. ఎన్నికల ముందు, వినదగునెవ్వరు చెప్పిన… అని అనుకుంటారు.

ఎన్నికలు అయ్యాక, వినీవినట్లు ఉండవలె ఎవరు చెప్పినా… అనీ అనుకుంటున్నారు.

బ్రహ్మంగారు ఊపిరి తిరిగినంత బిజీగా జీపు ఎక్కి చుట్టుపక్కల ఊళ్లల్లో ఊరేగుతున్నారు. సింహాచెలం ఎనకాల చేరి ఆయన మీద గులాబీలు చల్లతున్నాడు.,

శివంగారూ నిద్రాహారాలు మానేసి ప్రచారం, చేస్తున్నారు. ఏడుకొండలు ఆయనకు నీడలా మారాడు. ఆయనకు దాహం వేసినప్పుడల్లా, మంచి నీళ్లు సీసా అందిస్తూ, శివంగారికే మన పవిత్రమైన ఓటు అని గొంతెత్తి అరుస్తున్నాడు.

ఆడవారి ఓట్లను రాబట్టు కోవటానికి, బ్రహ్మంగారి భార్య బ్రహ్మాండమైన జరీ చీర కట్టుకుని, ఇంటి ఇంటికీ బొట్టు పెట్టి మరీ ఓటును అభ్యర్థిస్తోంది.

సింహాచెలం, అయ్యగారి వెంట తిరుగుతున్నాడు గనుగ, సింహాచెలం భార్య అమ్మగారి ఎనకాల బయలుదేరక తప్పలేదు.

శివంగారు ఏమీ తక్కువ తినలేదు. ఆయన భార్యనూ ఇంటింటికీ పంపిస్తున్నాడు. ఏడుకొండలు అయ్యగారి వెంట నీడలా తిరుగుతున్నాడు. గనుక, అమ్మగారి వెనక ఏడుకొండలు భార్యా బయల్దేరాల్సి వచ్చింది.

ఒక చోట రెండు వర్గాలవారూ ఎదురు పడ్డారు.

చాలా రోజులు తరువాత సెంద్రి, లచ్చిని చూసింది. చెల్లిని చూస్తూ కింద చూసుకోలేదు. సెంద్రి కాలు వేలికి దెబ్బతగిలింది. నెత్తురు కారింది.

లచ్చి, సెంద్రి దగ్గర కొచ్చి, నెత్తురు కారకుండా చేతితో నొక్కి పట్టింది.

అది పెద్ద ఘోరమైన నేరం అయిపోయింది.,

రెండు పార్టీలవాళ్లు ఇంత దాన్ని అంత చేశారు.

లోపయికారిగా వాళ్లూ, వాళ్లూ ఒకటే, మనమే పరాయి వాళ్లం అని కొంత మంది బాహాటంగానే అనేశారు.

సింహాచెలం ఉగ్రనరసింహం అయిపోయాడు.

ఇంటి కెళ్లి పెళ్లాన్ని ఇంట్లోంచి గెంటేశాడు.

“మీరంతా ఒకటే నన్ను ఎర్రి ఎదవను చేస్తున్నారు. నీ చెల్లి ఎగస్పార్టీ పెచారం చేస్తావుంటే అదీ నువ్వు కాళ్లట్టుకుంటారా? కావలించుకుంటారా? నువ్వు ఇంట్లో ఉంటానికి ఈల్లేదు… పో… దాని దగ్గరకే పో…” అని ఇంట్లోంచి భార్యను బయటకు నెట్టేశాడు.

అక్కడ లచ్చిని ఏడుకొండలూ, ఇంట్లో నుంచి బయటకు పంపి తలుపుకు తాళం వేశాడు.

ఇరుగు పొరుగు వాళ్లు ఇద్దర్నీ చేరదీశారు.

“ఎదవ సచ్చినోళ్లు, ఎలచ్చన్లు, చూసుకోని, ఓ మిడిసి పడుతున్నారు. ఎన్నికలు అయ్యాక, వీళ్ల మొహాలు కుక్కలు కూడా చూడవు…” అనీ అన్నారు.

తెల్లవారు ఝామున ఏడుకొండలు వెళ్లి కొంత మంది ఇళ్ల తలుపు తట్టి నిద్ర లేపి ఓట్లు అడుగుతున్నాడు.

ఇది తేల్సి సింహాచెలం అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు.

“ఇది నా ఏరియా… నా ఏరియాలోకి నువ్వచ్చినావేంటిరా” అని సింహాచెలం యుద్ధానికి వెళ్లాడు.

“నీ ఏరియా ఏంటిరా? నువ్వు కొనేసినావా?” అని ఏడుకొండలు ఎదురెళ్లాడు.

అటు వైపు వంద మంది, ఇటు వైపు రొండొందల మందీ చేరారు.

“నాతో పెట్టుకోకు, తలకాయలు, పుచ్చకాయల్లా ఎగిరిపోతయి…” అని మీద మీదకు వెళ్లాడు సింహచెలం.

“ఏంట్రా ఎగిరేది? ఇక్కడ మేం గాజులు తొడుక్కొని కూర్చోలేదు” అన్నాడు ఏడుకొండలు యుద్దానికి సిద్ధమై.

అటు వాళ్లూ, ఇటు వాళ్లూ, రాళ్లూ, కర్రలతో కొట్టుకున్నారు. కొన్నాళ్ల నుంచీ వెంట పెట్టుకు తిరుగుతున్న కత్తులు బయటకు తీశారు.

పొడుచుకున్నారు.

పొంగిపోర్లిన క్షణికావేశానికి రక్తం… కారి మడుగు అయింది.

ఇద్దరూ నెత్తుటి మడుగులో పడి, ఆస్పత్రికి చేరేలోపలే అనంత వాయువుల్లో కల్సిపోయారు.

పోలీసులొచ్చారు.

ఒక పథకం ప్రకారం తమ వారిపై దాడి చేసి చంపారని ఇద్దరు నాయకులూ ప్రకటన చేశారు.

అనుచరులిద్దరికీ సాయంత్రం స్మశాన వాటికలో పక్కపక్కనే చితులు ఏర్పాటు చేసి దహనం చేశారు.

నాయకులు ఇద్దరూ, కొత్తగా మరెవరినో అనుచరులుగా చేసుకున్నారు మర్నాడు.

ఎన్నికలు అయినయి. బ్రహ్మంగారు గెల్చారు.

బ్రహ్మంగారి భార్యకి శివంగారి భార్య అభినందనలు తెలిపింది.

సెంద్రి, లచ్చి దిక్కులేని పక్షుల్లా ఆకాశంలోకి చూస్తూ కూర్చున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here