Site icon Sanchika

చిరుజల్లు-33

హిమ బిందు

[dropcap]డా[/dropcap]క్టర్ విశాల ఫోన్ అందుకుంది. అవతలి నుంచి హిమ బిందు మాట్లాడుతోంది.

“ఆంటీ, నాకు నీ అపాయింట్‌మెంటు కావాలి. ఎప్పుడు రమ్మంటావు?” అని అడిగింది.

“నీకు అపాయింట్‌మెంటు ఎందుకమ్మా? నేను అపరేషన్ థియేటర్‌లో ఉన్నప్పుడు తప్ప, నీవు ఎప్పుడయినా రావచ్చు…” అన్నది విశాల.

“కాదు ఆంటీ, నీతో కొంచెం పర్సనల్‍గా మాట్లాడాలి. ఎప్పుడు తీరికగా ఉంటావో చెబితే…”

“తీరికగా కూర్చునే జీవితాలు కావు మావి. సాయంత్రం ఐదింటికి రా”

“ఇంటికా? హాస్పటల్‌కా? ”

“హాస్పటల్‌కే రా… ఇంతకీ ఏమిటి విషయం?” అని నవ్వుతూ అడిగింది విశాల.

“చిన్న ప్రాబ్లమ్ ఆంటీ… నువు మాత్రమే సాల్వ్ చేయగలవు…” అన్నది హిమ బిందు.

“ఆగర్భశ్రీమంతుల ముద్దుల పట్టివి. చదువులో, తెలివితేటల్లో, అందచందాల్లో అందరి కన్నా మిన్నగా ఉంటావు. నీ నోట్లో మాట నోట్లో ఉండగానే, మీ నాన్న నీ కోరిక తీర్చేస్తాడు. అలాంటిది, నీకు ప్రాబ్లమ్ ఏంటమ్మా?” అన్నది విశాల.

“ఎంత చెట్టుకు అంత గాలి. ఎవరి సమస్యలు వారికి ఉంటాయి ఆంటీ” అన్నది హిమ బిందు.

సాయంత్రం హిమ బిందు వెళ్లేటప్పటికే, విశాల ఆమె కోసం ఎదురు చూస్తోంది.

ఆ మాటా ఈ మాటా అయ్యాక, మంతనాలు ముగిశాక, తేనీరు సేవించాక ఇంక అసలు విషయానికొచ్చారు.

“ఏదో ప్రాబ్లమ్ అన్నావు…. ఏంటది?” అని అడిగింది విశాల.

“ఏం లేదు, ఆంటీ. నేను ఒకతన్ని ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మా పేరెంట్స్‌కి ఈ ప్రేమ వ్యవహారాలు అసలు నచ్చవు. ఏవో వాళ్ల భయాలు వాళ్లకు ఉంటాయి. కానీ మీరు అభయం ఇస్తే ఇంక కాదనరు. అంచేత మీరు పెద్దరికం వహించి, మా వాళ్లకు సజెస్ట్ చేసి, నచ్చ చెప్పి, ఎలాగైనా సరే ఒప్పించి, మా పెళ్లి జరిపించాలి. మీదే భారం…” అన్నది హిమ బిందు.

“నువు పుట్టినప్పుడు, మీ అమ్మకు నేనే పురుడు పోశాను. నిన్ను మొట్టమొదట చేతుల్లోకి తీసుకున్నది నేనే. చంద్రబింబంలాగా దినదిన ప్రవర్ధమానమవుతూ వచ్చావు. ఇంతై, ఇంతింతై అన్నట్లు కుందనపు బొమ్మలా ఎదిగావు. అందాలన్నీ పదింతలైనయి. ఎంతటి విరాగులైనా నువు ఎదురు పడితే చాలు రెప్పవేయకుండా చూస్తారు… అన్నిటా ఆరితేరావు. సరే మరి, ఇవాళ వచ్చి, ఆంటీ నేను ఎవరినో ప్రేమించాను, పెళ్లి జరిపించమంటావు. ఎద్దు ఈనిందంటే, దూడను కట్టెయ్యమన్న సామెత లాగా, నువు ప్రేమించాను అని అనగానే, పెళ్లి చేయించమని చెప్పటం ఎలా కుదురుతుంది? నీకు నచ్చిన నరుడు నీవు మెచ్చిన వరుడు, కుబేరుడో, నలకుబేరుడో అయిఉంటాడు. మంచిదే. అటు ప్రేమించిన వాడిని వదులు కోకుండా, ఇటు తల్లిదండ్రులను ఎదిరించి, వాళ్ల నుంచి విడిపోకుండా, ఉభయతారకంగా నువ్వు చేస్తున్న పని బాగానే ఉంది” అని మెచ్చుకుంది విశాల.

“అతను చాలా మంచివాడు. ఉదాత్తమైన వ్యక్తి…”

“యవ్వన వనంతో విహరిస్తున్నప్పుడు, కోరికలు విరబూస్తుంటయి. కళ్లు సరియైన జోడు కోసం అన్వేషిస్తుంటయి. ఎవరి మీదనో చూపులు నిలిచిపోతయి. ఆ చూపులలో నుంచి వచ్చే వైబ్రేషన్స్ వల్ల, మనసు అనేకానేకమైన అనుభూతులకు లోనవుతుంది. అవి మనిషిని నిలువనివ్వవు. తిండి తిననివ్వవు. నిద్రపోనివ్వవు. ఇదంతా ‘లా ఆఫ్ నేచర్’… ప్రకృతి సహజం… ఉదాత్తమైన వాడు అంటున్నావు… ఒకసారి తీసుకురా… నేనూ చూస్తాను… తరువాత నా సలహా ఏమిటో చెబుతాను…” అన్నది విశాల.

“అతన్ని చూడకుండా ఉండలేను… బతకలేను…” ఆ పిల్ల కళ్లల్లో నీళ్లు.

విషయం చాలా దూరం వెళ్లిందని అర్థమైంది.

“రేపు అతన్ని తీసుకురా… అతనితో మాట్లాడతాను. అన్నీ బాగున్నాయనుకుంటే, మీ అమ్మావాళ్లతోనూ చెబుతాను…” అన్నది విశాల.

మరునాడు హిమ బిందు అతన్ని విశాల ఇంటికి తీసుకు వెళ్లి, పరిచయం చేసింది.

“ఇతనే ఆంటీ, రవిచంద్ర అని లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. చాలా ఇంటలిజెంట్. కావాలంటే ఏ సబ్జక్ట్‌లో అయినా అడిగి తెల్సుకోండి. అతను ఎంతో మేధావో తెలుస్తుంది…” అన్నది హిమ బిందు.

విశాల అతని వంక చూసింది. అతను తల దించుకుని కూర్చున్నాడు.

“బిందు మిమ్మల్ని తెగ పొగిడేస్తోంది. అమితంగా ప్రేమిస్తోంది. మరి మీ సంగతి ఏమిటి?” అని అడిగింది డాక్టర్ విశాల.

అతను తలెత్తి ఆమె వంక చూసి ఇబ్బందిగా, బలవంతాన నవ్వు తెచ్చుకున్నాడు.

“ఆయన కొత్త వాళ్లతో ఎక్కువగా మాట్లాడరు ఆంటీ. అందులోనూ మీలాంటి పెద్ద పేరు మోసిన డాక్టరుతో మాట్లాడాలంటే, చాలా ఇన్‌ఫీరియర్‌గా ఫీలవుతున్నాడు ఆంటీ…” అని హిమ బిందు కవర్ చేసే ప్రయత్నం చేసింది.

“నిజంగా న్యూనతా భావంతో ఫీలవుతున్నావా?” అని విశాల రవిచంద్రని అడిగింది.

అతను వెంటనే ఏమీ చెప్పలేదు. ఏదో చెప్పబోయి ఆగిపోయాడు.

విశాల మళ్లీ తనే అన్నది. “మీరు ప్రేమించుకున్నారు సరే. బాగానే ఉంది. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అదీ బాగానే ఉంది. ఇంతకీ మీ ప్రేమ ఎంత దూరం వచ్చింది… ఇంకా మానసికమేనా? శారీరకమూనా?”

“ఒక డాక్టరుగా మీరు అడగవల్సిన ప్రశ్నే అడిగారు…” అన్నాడు రవిచంద్ర.

“డాక్టర్‌గా కాదు. ఒక హితాభిలాషిగా అడుగుతున్నాను…”

“పెళ్లికి ప్రేమ పునాది. ప్రేమకు మనిషి మీద నమ్మకం పునాది. నమ్మకమే మనిషిని నడిపిస్తుంది. మీరు కత్తి పట్టుకొని ఆపరేషన్ చేయబోయే ముందు ఆ అపరేషన్ సక్సెస్ అవుతుంది, అంతా బాగానే జరుగుతుందన్న నమ్మకంతోనే గదా మొదలు పెడతారు… మాదీ అంతే…” అన్నాడు రవిచంద్ర.

విశాల హిమ బిందుతో అన్నది “ఇతను ఇంటలిజెంటే, ఒప్పుకుంటున్నాను.”

“నాకు తెల్సు ఆంటీ. మీకు అతను నచ్చుతాడు. ఎలాగైనా సరే మీరే మా మేరేజి జరిపించాలి. మీకు మంచి పట్టుచీర కొనిపెడతాను…”

“నీ తొందర చూస్తే ఇప్పుడే పట్టు చీరలు కొనటానికి పరుగెత్తే టట్లున్నావు…” అన్నది విశాల నవ్వుతూ.

“ఇంకా నగలన్నీ చెడగొట్టి కొత్తవి చేయుంచుకోవాలి ఆంటీ” అన్నది హిమ బిందు.

“అన్నీ చెడగొట్టుకోవటంలో నువు ఫస్ట్…” అన్నది విశాల.

అతను ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు.

“సరే మరి… నేను చెప్తానులే…” అన్నది విశాల లేచి నిలబడి.

వాళ్లిద్దరూ వెళ్లిపోయారు.

అతని సంగతి డాక్టరు విశాలకు తెల్సు. కనుక ఇలాంటి వాడికి పిల్లనివ్వమని బిందు తల్లిదండ్రులకు చెప్పలేదు. వద్దంటే ఈ పిల్ల వినేటట్లు లేదు. ఇప్పటి పిల్లలకీ అన్నింటికీ తొందర. వద్దంటే ఏ అఘాయిత్యం అయినా చేసుకునేటట్లుంది. కొండంత ఆశతో తన దగ్గరకు వచ్చింది. చేసుకోమని చెబితే ఒక రకమైన సమస్య. వద్దంటే మరో రకమైన సమస్య. తను అనవసరంగా ఇందులో తనని ఇరికించింది. ఎలా తప్పించుకోవాలో అదీ తెలియటం లేదు.

“మా ఇంటికి ఎప్పుడొస్తారు. ఎప్పుడొస్తారు ఆంటీ” – అంటూ హిమ బిందు రోజూ ఫోన్ చేస్తూనే ఉంది. ఇప్పుడు తీరిక లేదని ఒకసారి, ఇప్పుడు మంచి రోజులు కావని మరోసారి – వాయిదాలు వేస్తోంది విశాల.

ఇలా కాదునుకున్నదో ఏమో – హిమ బిందు, రవిచంద్ర చేత విశాలకు ఫోన్ చేయించింది.

“ఈసారి నువ్వు ఒక్కడివేరా, నీతోనే మాట్లాడాలి” అన్నది విశాల.

రవిచంద్ర వచ్చాడు. అతనితో అన్నది విశాల.

“బాచిలర్‌గా సరియైన జీవితం గడపలేని వాడు, పెళ్లి అయ్యాక భర్తగా మాత్రం సరియైన జీవితం గడుపుతాడని నమ్మకం ఏమిటి? నువు అన్నిటికీ నమ్మకమే పునాది అన్నావు. నీ పునాది నమ్మదగ్గదేనా?” అని అడిగింది.

“నా మీద మీకు సరియైన అభిప్రాయం లేదు. అందుకు కారణం ఉంది. కాదనటం లేదు. కానీ నన్ను దోషిగా నిర్ధారించే ముందు, నేను చెప్పేది కూడా వినండి. ఒక వేళ అదీ మీరు నమ్మలేకపోతే, నన్నొక దుష్టుడిగా, దుర్మార్గుడిగా నిర్ణయించండి…”

“రెండు సంవత్సరాల కిందట నేను గీత అనే అమ్మాయితో మీ హాస్పటల్‌కి వచ్చాను. గీతకు అబార్షన్ చేయించాను. అయిష్టంగానే మీరు అంగీకరించారు. ఆమె గర్భవతి కావటానికి నేనే కారణమని, ఇందుకు అయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తాననీ, మా సమస్యలు పరిష్కారం అయ్యాక పెళ్లి చేసుకుంటాననీ మీకు చెప్పాను – ‘ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా అబ్బాయిలంతా, అమ్మాయిని ఆమె ఖర్మకు వదిలేసి పారిపోయేవారినే చూశాను గానీ, నీలాగా ఆమెకు అండగా నిలబడే వారిని చూడలేదు…’ అంటూ నాకు ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. కానీ అప్పుడు నేను మీకు అబద్ధమే చెప్పాను. అసలు విషయం వేరు. చలపతి అని నా రూం మేట్ ఉండేవాడు. గీత అనే అమ్మాయిని ప్రేమించిందీ, ఆమె యవ్వనంతో ఆటాడుకున్నదీ వాడు. గీత వాడిని నమ్మింది. ఆ వయసు అలాంటిది. ఎప్పుడోగాని జరగవల్సినవన్నీ ముందుగానే జరిగిపోయినయి. గీత ఒట్టి మనిషి కాదని తెలియగానే, వాడు వాళ్ల ఊరికి పారిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో అందరు అబ్బాయిలూ ఏం చేస్తారో, వాడూ అదే చేశాడు. ఇద్దరు కల్సి చేసిన పనికి ఒకరినే దోషిగా నిలబెట్టటం చూసి నేను చలించిపోయాను. అందుచేత ఆ అమ్మాయిని ఆదుకుని, ఆ దుర్భర పరిస్థితి నుంచి బయటపడేందుకు సాయం చేశాను. నా మిత్రుడు చేసిన తప్పును నా మీద వేసుకున్నాను. అప్పుడు మీకు చెప్పింది కట్టుకథ. ఇప్పుడు చెబుతున్నది నిజం. ఇందులో ఏది నమ్మాలో నమ్మకూడదో మీరే నిర్మయించుకోండి. గీతకు పెళ్లి అయింది. సుఖంగా ఉంది.”

“ఒక పీడకలను ఆమెకు గుర్తు చేసి, నిశ్చలంగా నున్న ఆమె సంసార జీవితంలో అలజడి సృష్టించలేను. హిమ బిందుది పసిపిల్ల మనస్తత్వం. గాఢమైన ఇష్టాయిష్టాలు గల అమ్మాయి. ఎంతగా ప్రేమిస్తుందో, అంతగానూ ద్వేషిస్తుంది. ద్వేషించినా పరవాలేదు. ఆ డిప్రెషన్‌లో ఏం చేస్తుందోనన్న భయం కూడా ఉంది… లైఫ్ ఈజ్ స్ట్రేంజర్ దేన్ ఫిక్షన్… అంటారు. జీవితంలో ఎప్పుడు ఎవరికి ఎవరు తారసపడతారో, ఎలాంటి బలమైన బంధాలతో బంధిస్తారో ముందుగా మనకు తెలియదు. తెలిస్తే కొంత వరకైనా జాగ్రత్త పడేవాళ్లం…” అన్నాడు రవిచంద్ర.

“గీత ఇప్పుడు ఎక్కుడుంది?” అని అడిగింది విశాల.

“తెలియదు. మీ దగ్గర నుంచి వెళ్లిపోయాక మళ్లీ ఆమెను కల్సుకునే ప్రయత్నం చేయలేదు. పెళ్లి అయిందని మాత్రం ఎవరి ద్వారానో కర్ణాకర్ణిగా విన్నాను…” అన్నాడు రవిచంద్ర.

విశాల వారం రోజుల్లో గీత గురించి తెల్సుకుంది.

హిమ బిందు తల్లిదండ్రులను ఒప్పించి, హిమ బిందుకు ప్రేమించిన వాడితో పెళ్లి చేయించింది. విశాల గీతను కూడా తనతో బిందు వివాహానికి తీసుకెళ్లింది.

అప్పగింతలప్పుడు బిందుతో పాటు రవిచంద్ర కూడా విశాల పాదాలకు వంగి నమస్కారం చేశాడు. అప్రయత్నంగానే రెండు కన్నీటి చుక్కలు రాలి ఆమె పాదాలను ప్రక్షాళన చేశాయి.

“గీతకూ నమస్కారం చెయ్యి” అన్నది విశాల.

“నేను చిన్నదాన్ని… నేనే నీకు నమస్కారం చేయ్యాలి” అన్నది గీత రవిచంద్రకు నమస్కారం చేస్తూ.

Exit mobile version