చిరుజల్లు-35

0
2

తల్లి కాని తల్లి

[dropcap]శాం[/dropcap]తమ్మ యాదమ్మ ఇంటికెళ్లి తలుపు తట్టింది. వేళగాని వేళ వచ్చిన శాంతమ్మను చూసి యాదమ్మ ఆశ్చర్యపోయింది.

“ఏంటి, ఈ వేళప్పుడు వచ్చావు?” అని అడిగింది యాదమ్మ.

“నేను నీకు అయిదొందలు ఇచ్చినాను గదా. ఇప్పుడు ఆ డబ్బు ఇయ్యి. అర్జెంటుగా కావాలి” అని అడిగింది శాంతమ్మ.

“ఇప్పుడా? నా కాడ నేదు..”

“ఎంతుంటే అంత ఇయ్యి, శానా అర్జంటుగా కావాలి..”

“ఏంటి శాంతమ్మా.. గాబరాగా ఉన్నావు. ఏమైంది?” అని యాదమ్మ అడిగినా శాంతమ్మ అసలు విషయం ఏమిటో చెప్పటం లేదు.

అర్జంటుగా డబ్బు కావాలన్న తొందర తప్ప మరో మాట ఆమె నోట నుంచి రావటం లేదు.

యాదమ్మ “నా కాడ గింతే ఉన్నది” అంటూ వంద రూపాయలు ఇచ్చింది.

శాంతమ్మ అక్కడ నుంచి లచ్చి ఇంటికెళ్ళింది. లచ్చి కూడా శాంతమ్మ పని చేసే అస్పత్రిలోనే పని చేస్తోంది. అందుచేత ఇద్దరికీ మంచి దోస్తీ.

“అర్జంటుగా డబ్బు కావాలి” అని అడిగింది శాంతమ్మ.

“ఎంత గావాల?”

“నీతాన ఎంతుంటే అంత ఇవ్వు.”

“ఏంటి, శాన పరేషాన్ అవుతున్నావు?”

“ఏం లేదు. పైసలివ్వు.. అర్జంటుగా నేను పోవాల..” అన్నది శాంతమ్మ.

లచ్చి దగ్గర నూటయాభై తీసుకొని, శిశువిహార్ కెళ్లి పిల్లను తీసుకొని ఇంటికెళ్లింది. ఇరుగు పొరుగు వాళ్ల దగ్గరా ఎంత దొరికితే అంత డబ్బు పోగు చేసుకుంది.

అరగంటలో అన్నీ సర్దుకుని, ఒక చేత్తో పిల్లనూ, మరో చేత్తో ట్రంకు పెట్టెనూ పట్టుకొని మెయిన్ రోడ్డు మీద కొచ్చి, ఆటో ఎక్కి రైలు స్టేషన్‌కు వచ్చింది.

టికెట్ కొనుక్కొని రైలు రాగానే వెళ్లి జనరల్ కంపార్ట్‌మెంటులో కూర్చుంది. రైలు కదిలినాక కొంచెం కుదుటపడింది. ఏదో పెద్ద గండం గడిచినట్లుగా అనిపించింది. ఇంత కంగారు పడినా, హడావుడిగా ఉన్న పళంగా బయల్దేరినా, పిల్ల పాలసీసా గురించి, పిల్ల బట్టల గురించి మర్చిపోలేదు.

రైలు వేగంగా పరుగెడుతోంది. పిల్ల చుట్టూ వింతగా చూస్తోంది. దానికి ఆరు నెలలు దాటినయి. బోర్లా పడుతోంది. మనుషులను గుర్తుపడుతోంది. శాంతమ్మ ప్రేమగా పిల్లను గుండెలకు అదుముకుంది.

కాసేపటికి పిల్ల ఏడవటం మొదలు పెట్టింది. పక్కనున్న వాళ్లంతా శాంతమ్మ వంకా, ఏడుస్తున్న పిల్ల వంకా చూశారు. సీసా పాలు పట్టిన తరువాత పాప నవ్వుతుంటే, పక్కన కూర్చున్న వాళ్లు చేతులు చాచారు తమ దగ్గరకు రమ్మనమని. ఎవరు ఎత్తుకోబోయినా పాప ఏడుపు లంకించుకుంటోంది. శాంతమ్మ పిల్లను భజం మీద వేసుకొని చిచ్చు కొట్టింది. పాప నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది.

రాత్రి తొమ్మిది గంటలు అయింది. ఆ కంపార్ట్‌మెంటులో ఉన్న వాళ్లంతా ఏదో ఒకటి తినేసి నిద్రలోకి జోగుతున్నారు. శాంతమ్మ పిల్ల గురించే ఆలోచించింది గానీ, తన ఆకలి గురించి ఆలోచించలేదు. అందుచేత తన కోసం ఏమీ తెచ్చుకోలేదు. అసలు శాంతమ్మకు ఇప్పుడేమీ తినాలని అనిపించటం లేదు. పిల్ల ఒడిలో పడుకుని ఉంటే చాలు. కడుపు నిండినట్లే ఉంది. ఈ పిల్ల ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు అనుకుంటోంది.

ఆరు నెలల క్రిందట –

ఆ వేళ ఉన్నట్లుండి నగరం అంతా బాంబుల ప్రేలుడులతో దద్దరిల్లిపోయింది.

అసలే ఈ మహానగరంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతులలో పెట్టుకొని బ్రతుకుతున్న వాళ్లంతా ఈ ఘాతుకాలకు విస్తుపోయారు.

శరీరాలు తునాతునకలు అయిపోయిన వాళ్లు, కాళ్లు తెగిపోయిన వాళ్లూ, చేతులు తెగిన వాళ్లూ, పేగులు బయలకు వెళ్లుకొచ్చిన వాళ్లూ – ఒక్కొక్కళ్లనే ఆసుపత్రిలోకి మోసుకొస్తున్నారు. ఎటు చూసినా, అరుపులు, ఏడుపులు, కంగారు, హడావిడి.

డాక్టర్లు, నర్సులు, ఆయాలూ అంతా పరుగులు తీస్తున్నారు. ప్రాణం పోయిన వాళ్లు, ప్రాణం పోతున్న వాళ్లూ, ప్రాణాపాయంలో ఉన్నవాళ్లూ – ఆడా, మగా, పిల్లా, పెద్దా – ఒక్కొక్కళనే ఆసుపత్రిలోకి తీసుకొస్తున్నారు.

కాస్తంత స్పృహ ఉండి, మాట్లాడగలిగిన వారి పేర్లూ, అడ్రసులూ రాసుకొని కేసు షీట్స్ తయారు చేస్తున్నారు.

ఆసుపత్రి నిండా ఎక్కడ చూసినా ఏడ్పులూ, హాహాకారాలు.. పోలీసులూ, నాయకులూ, మంత్రులూ, పత్రికల వాళ్లూ, టీవీల వాళ్లూ, వచ్చి చావు బతుకుల మధ్య నున్న వాళ్లను చుట్టుముట్టి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.

వెంకట నర్సమ్మ పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది. ఆమె ముఖం మీద, చేతుల మీద చర్మం కాలిపోయింది. మనిషి చూడటానికే భయానకంగా ఉంది. ఏ మనిషిని అయినా ఈ చర్మం కప్పుకుని ఉన్నంత సేపే చూడగలం. చర్మాన్ని తొలగిస్తే, అంతా వికృతమే.

వెంకట నర్సమ్మను ఆసుపత్రిలోకి తీసుకొచ్చినప్పుడు కొంచెం స్పృహలోనే ఉన్నది. మాట్లాడుగలుగుతున్నది. ఊరికే ఏడుస్తోంది. ఆమెతో పాటు నెలరోజులు కూడా నిండని పసి గుడ్డును తీసుకొచ్చారు. చిత్రంగా ఆ పిల్లకు ఏమీ కాలేదు. వెంకట నర్సమ్మ పిల్లను కాపాడుకునే ప్రయత్నంలోనే తాను ప్రాణం మీదకు తెచ్చుకుంది.

తను బ్రతకను – అన్న విషయం తెల్సిపోయినప్పటి నుంచీ, తన కూతురు గురించే ఏడవటం మొదలెట్టింది. నాయకులూ, అధికారులూ చూడటానికి వచ్చినప్పుడూ వాళ్లతో తన బిడ్డ గురించే చెప్పుకొని ఏడ్చింది. “నీ బిడ్డకేం భయం లేదు” అని అందరూ అభయం ఇచ్చివెళ్లారు.

రెండు రోజుల తరువాత వెంకట నర్సమ్మ చనిపోయింది. ఆమె కోసం ఎవరూ రాలేదు. శవాన్ని మార్చురీలోకి తరలించారు గానీ, పసిపిల్లను ఏం చేయాలో డాక్టర్లుకు ఏమీ తోచలేదు. పసిపిల్లను ఏదైనా శిశు సంరక్షణా కేంద్రానికి పంపమని పోలీసులకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. పోలీసులంతా బాంబులు పేల్చిన నేరస్థుల ఆరాలు తీయటంలోను, వాళ్లను వెతికి పట్టుకునే పనిలోనూ క్షణం తీరిక లేకుండా ఉన్నారు.

ఈ పసిపిల్ల ఏడుపు వినేంత తీరిక లేదు వాళ్లకు.

డాక్టర్ సువర్ణ ఆ ఆసుపత్రిలోనే క్లాస్ ఫోర్ ఉద్యోగం చేస్తున్న శాంతమ్మను పిల్చింది.

“ఈ పిల్ల తల్లి చనిపోయింది. ఆమె తరుపు వాళ్లు ఎవరూ రాలేదు. వాళ్లకు ఈ విషయం తెల్సో లేదో.. వాళ్ల ఆచూకీ తెలిసే దాకా ఈ పిల్లను కొద్ది రోజుల పాటు కనిపెట్టి చూస్తుండు..” అని చెప్పింది.

పెద్ద డాక్టరమ్మ చెప్పిన మాట శాంతమ్మ కాదనలేకపోయింది. శాంతమ్మ ఆ పసిపిల్లను చేతుల్లోకి తీసుకంది. ఏ క్షణంలో ఆ పసిపాపను గండెలకు హత్తుకున్నదోగాని, అప్పటి నుండీ ఆ పసిదానికీ, శాంతమ్మకీ కనిపించని బంధం ఏర్పడిపోయింది.

డ్యూటీలో ఉన్నా లేకున్నా, పాపను చూసుకోవటమే శాంతమ్మ డ్యూటీ అయిపోయింది. వారంలోజుల తరువాత పిల్లను తన ఇంటికి తీసుకెళ్లింది.

పిల్లను ఇంటికి తీసుకెళ్లిన రోజునే, పక్కింటామె, నీకు ఈ నెల చీటీ వచ్చిందంటూ అయిదువేలరూపాయల డబ్బు తెచ్చి ఇచ్చింది. పాప వచ్చిన రోజే, డబ్బు రావటంతో, శాంతమ్మకు మరింత గట్టి అనుబంధం ఏర్పడిపోయింది.

ఆమెకు పెళ్లి అయిన అయిదేళ్లకే యాక్సిడెంట్‌లో భర్త చనిపోయాడు. ఇక అక్కడ నుంచి అనుకోని ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. వాటిని తట్టుకుంటూ ఒంటరి జీవితాన్ని నెట్టుకొస్తున్నది. అలా నిరామయంగా నిస్తేజంగా జీవితాన్ని గడుపుతున్న సమయంలో దేవుడే ఈ బిడ్డను తనకు అప్పగించినట్లు శాంతమ్మ భావిస్తోంది.

బాంబులు ప్రేలి నగరం అట్టడికిన రోజున వెంకట నరసమ్మ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సమయంలో, ఆమె తన పసిపిల్ల కోసమే తల్లడిల్లిపోతుంటే, ఆమెను చూడటానికి వచ్చిన వారిలో ఎంతోమంది ఆ పసిపిల్లను ఆదుకుంటామని హామీ ఇచ్చారే గానీ ఎవరూ పట్టించుకోలేదు. డాక్టరమ్మ ఆ పిల్లను ఏ అనాథ శరణాలయానికో అప్పగించాలనుకుంది. కానీ ఏదీ నెరవేరలేదు. ఆ పసిపిల్లకు శాంతమ్మే దిక్కు అయింది. ఆమెకు ఆ పసిపిల్ల జీవితం మీద కొత్త ఆశలు చిగురింప చేసింది.

రోజులు గడిచే కొద్దీ ఆ పిల్ల తన కూతురేనన్న భావం బలంగా ఏర్పడిపోయింది. దేవుడిచ్చిన బిడ్డ గనుక, షిర్డీ తీసుకెళ్లి, పిల్లను బాబా పాదాల దగ్గర పెట్టి తెచ్చుకుంది.

ఊరు నుంచి రాగానే పిల్లకు జ్వరం తగిలింది. తను పని చేస్తున్న ఆస్పత్రికి తీసుకెళ్తే అందరికి మళ్లీ గుర్తు చేసినట్లు అవుతుందని, ప్రైవేటుగా క్లినిక్ పెట్టుకున్న ఇంటి దగ్గరున్న డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. ఆ పిల్ల దొరికినప్పటి నుంచీ అవసరాలకు సరిపడిన డబ్బు చేతిలో ఆడుతోంది.

పిల్లకోసం ఊయ్యాల తొట్టె కొన్నది. దోమలు కుట్టకుండా ఉండాలని నెట్ తెచ్చింది. గుడ్డలూ బొమ్మలూ కొంటూనే ఉంది.

పిల్ల బోర్లా పడుతోందని ఇరుగు పొరుగు వాళ్లకు చెప్పింది. అన్నప్రాసన అంటూ నలుగురిని పిల్చి భోజనాలు పెట్టింది. సన్న బంగారు గొలుసు చేయంచి పిల్ల మెడలో వేసి, చూసుకుని మురిసిపోయింది.

శాంతమ్మకు ఆ పిల్లతోనే లోకం అయిపోయింది. ఏదో యాంత్రికంగా అదీ వీలును బట్టి ఆస్పత్రికి వెళ్లి వస్తోందిగానీ, ధ్యాస అంతా పిల్ల మీదనే ఉంటోంది.

ఆ పిల్ల గురించి ఎన్నో, ఎన్నెన్నో ఊహించుకుంటోంది. పగలే కళ్లు తెరిచి చూస్తూనే ఎన్నో కలలు కంటోంది. ఆ పిల్లకు పేరు పెట్టుకుంది. బుల్లి బుల్లి నడకలతో పరుగులు తీస్తున్నట్లు, పుస్తకాల సంచీ తగిలించుకొని స్కూలుకు వెళ్తునట్లు, చదువుల రాణి అయి, అన్నింటిలోనూ బహుమతులు గెల్చుకున్నట్టు, కాలేజీలో చదివి గోల్డ్ మెడల్ సంపాదించినట్లు, పెద్ద పేరు సంపాదించుకున్న డాక్టరు అయినట్లు, హీరో లాంటి కుర్రాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు – ఒకటా, రెండా – రోజంతా సవాలక్ష కలల తోనే కాలం గడిచి పోతోంది శాంతమ్మకు.

ఇలా ఆ పిల్ల భవిష్యత్తు గురించి ఎన్నో బంగారు కలలు కంటున్న సమయంలో ఒక రోజు డాక్టరు సువర్ణ కబురు పెట్టింది. ఆమె దగ్గరకు వెళ్లింది. ఒక వ్యక్తి ఆమెకు ఎదురుగా కూర్చుని ఉన్నాడు.

“చూడు శాంతమ్మా, ఆ రోజు నువు తీసుకెళ్లి నీవు మంచి చెడులు చూస్తున్న పాపకు ఇతను తండ్రి. వెంకట నర్సమ్మ భర్త. సైన్యంలో పని చేస్తున్నాడు. ఇన్నాళ్లూ ఎక్కడో దేశ సరిహద్దులో, మన క్షేమ సమాచారాలు తెలియని ప్రాంతంలో ఉండిపోయాడు. నాలుగురోజుల కిందటే శెలవు మీద వచ్చాడు. భార్య గురించి విచారించి, జరిగిన సంగతి తెల్సుకున్నాడు. భార్య చనిపోయినందుకు పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. తన పిల్లను అప్పగించమని అడుగుతున్నాడు.. ఆ పిల్లను ఆయనకు ఇచ్చెయ్..” అన్నది డాక్టరమ్మ.

శాంతమ్మకు భూమి బద్దలై తాను పాతాళానికి కృంగిపోయినట్లు అనిపించింది. చాటుగా డాక్టరమ్మ కాళ్లు పట్టుకుంది.

“అమ్మగారూ, ఆ పిల్లను నాకు దేవుడే ఇచ్చాడనుకుని, దాని మీదే ప్రాణాలన్నీ పెట్టుకొని బతుకుతున్నాను. దాని చుట్టూ ఎన్నో ఆశలు పోగు చేసుకున్నాను. వాటిని అన్నింటినీ తన్నేసి, పిల్లను లాక్కుపోతారంటే, నేను భరించలేను. మీరే ఎలాగైనా చెప్పి పంపించండి” అన్నది శాంతమ్మ.

“నీ బాధ నాకు అర్థమైంది. ఈ కొద్ది నెలలూ పెంచుకున్న మమకారం నీకు అలా అనిపిస్తోంది. కానీ అతని పరిస్థితి చూడు. భార్యను పోగొట్టుకున్నాడు. కొంతలో కొంత దురదృష్ణంలోనే మిగిలిన అదృష్టం – అతని కూతురు బతికే ఉంది. ఆ పిల్లను అయినా అతనికి దక్కకుండా చేసే అధికారం మనకు లేదు. పైగా అతను పెద్ద పెద్ద సైనికాధికారులతో ఫోన్లు చేయిస్తాడు. మనం మరింత దోషులం అవుతాం. రేపు తెచ్చి పిల్లను అప్పగించు..” అన్నది డాక్టరమ్మ.

రైల్లో కూర్చుని ఇవన్నీ నెమరు వేసుకుంది శాంతమ్మ. ఆ ఊరు నుంచీ, ఆ పరిసరాల నుంచీ పారిపోతే బిడ్డను దక్కించుకోవచ్చునని అనుకున్నది శాంతమ్మ. అందుకనే ఉన్నట్లుండి ఎంత దొరికితే అంత డబ్బు చేతబుచ్చుకుని పిల్లను తీసుకొని బయల్దేరింది.

ఎవరికీ ఆచూకీ దొరకని ఒక పల్లెటూరు చేరుకుంది. దూరపు బంధువు సాయంతో ఒక నెలవు ఏర్పాటు చేసుకుంది. ఎన్ని కష్టాలు పడి అయినా, పసిదాన్ని దక్కించుకోవాలన్న తాపత్రయంలో ఉంది శాంతమ్మ.

అయితే న్యాయం, చట్టం చేతులు పొడవైనవి. ఎంత దూరం పరుగెత్తినా వాటి నుంచి తప్పించుకోవటం సాధ్యం కాదు.

ఆ సైనికుడు అపజయం ఎరుగడు. పోలీసులతో సహా వచ్చాడు. తన కన్న బిడ్డను అక్కున చేర్చుకున్నాడు.

పిల్ల ఏడుస్తోంది.

తల్లి గాని తల్లి ఏడుస్తోంది.

క్రమంగా ఇద్దరి మధ్యా దూరం పెరిగి, పెరిగి ఒకరి ఏడుపు మరొకరికి వినిపించకుండా పోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here