Site icon Sanchika

చిరుజల్లు-36

కాగితం పడవ

[dropcap]ఆ[/dropcap]దివారం సాయంత్రం.

డాక్టర్ సులోచనకు కాస్తంత విశ్రాంతి దొరికేది ఈ ఒక్క పూటే. వారం రోజులపాటు గడియారంలోని ముళ్లతో పాటే ఇంటికీ, ఆస్పత్రికీ, క్లీనిక్‌కీ క్రమం తప్పుకుండా తిరుగుతూ రోగులూ, రోగాలూ, ఆపరేషన్లూ, మందులూ.. వీటితో విసుగూ విరామం లేకుండా కాలక్షేపం చేసే ఆమెకు ఆదివారం సాయంత్రమే కాస్తంత తెరిపి. రొటీన్ లైఫ్ నుంచి, బిజీ షెడ్యూల్ నుంచి, బయటపడి రిలాక్స్ అవుతుంది.

ఆ సమయంలో ఎక్కడికి వెళ్లబుద్ది కాదు. ఇంట్లోనే ఒంటరిగా టీ.వి. చూస్తూ కూర్చుంటుంది. వంట మనిషీ రాదు. హోటలుకు వెళ్లి భోంచేసి వస్తుంది. అంతర్ముఖురాలై ఆలోచనా లోచనాల ముందు ఆవిష్కరమైన దృశ్యాలను మనో నేత్రంతో చూస్తుంటుంది.

బాల్కనీలో కూర్చీలో కూర్చుంది. టామీ వచ్చి ఆమె కాళ్ల దగ్గర ముడుచుకుని పడుకుంది. చల్లగా వీస్తున్న గాలి హాయిగా లాలిస్తోంది. ఎక్కడి నుంచో వినిపిస్తున్న సంగీతంతో పాటు, కింది తోటలోని సుమదళాల పరిమళాలనూ మోసుకొస్తోంది గాలి.

తోటలో అందమైన పూల మొక్కల మధ్య పిచ్చి మొక్కలూ మొలుస్తాయి. పుడమి తల్లి వీటినీ, వాటినీ సమానంగానే ఎదగనిస్తోంది. మనుషులనూ ఇలాగే.. మంచి వాళ్లకీ, చెడ్డవాళ్లకీ సమానంగానే ఆహార పానీయాలను అందిస్తోంది భూమాత. ఆమెకు మంచి చెడులను ఎంచి చూస్తే అలవాటు ఉంటే, ఈ లోకంలో అందరూ మంచివాళ్లే ఉండేవాళ్లు.

ఫోన్ మోగింది, సులోచన మాట్లాడింది.

“నా పేరు నిరంజనరావు. నా భార్య సీతామహాలక్ష్మి మీ దగ్గర రెండు నెలల నుంచీ చెకప్ చేయించుకుంది. వారం రోజులు కిందట మీరు డేట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆమెను హాస్పటల్‌లో అడ్మిట్ చేశాం. మీరొక సారి వచ్చి చూడాలి మేడమ్..”

ఆ కేసు ఆమెకు అర్థమైపోయింది. ఈ సమయం కోసమే ఎదురు చూస్తోంది. కొంచెం ఆగి నెమ్మదిగా వృత్తి ధర్మం ప్రకారం మాట్లాడింది.

“నేను రావాల్సిన పని లేదు. డ్యూటీ డాక్టరు ఉంటారు. వాళ్లు చూస్తారు” అని ఫోన్ డిస్‌కనెక్ట్ చేసింది.

ప్రశాంతంగా ఉన్న కొలనులోకి బండరాయిని దొర్లించినట్లు అయింది. హాయిగా రిలాక్స్ అవుతున్న సాయం సమయంలో ఆ ఫోన్ కాల్ ఆమె మనసులో చిన్నపాటి అలజడి రేపింది.

నిరంజనరావు..

కొన్నేళ్ల కిందట ఈ నిరంజనరావు అనే వ్యక్తి ముందు అయిదు నిముషాల సేపు తలొంచుకొని కూర్చుంది. అతనితో పాటు అతని తల్లీ, చెల్లి కూడా తనను చూడటానికి వచ్చారు.

ఏవో రెండు మూడు పిచ్చి ప్రశ్నలు వేశారు. సమాధానాలు చెప్పింది.

అతని తల్లి మాత్రం “నీ సంపాదన ఎంత ఉంటుంది?” అని అడిగింది.

ఆ ప్రశ్నకు సమాధానం చెప్పటం ఇష్టం లేక మౌనం వహించింది.

తన ఆదాయం గురించి తండ్రి వాళ్లకు చెప్పిన తరువాత వాళ్ల మొహం వికసించింది.

సంబంధం నచ్చిందని అప్పటికప్పుడే చెప్పేశారు. నిజానికి వాళ్లకు నచ్చింది తను కాదు.. తన సంపాదన అన్న విషయం అర్థమైపోయింది.

నాలుగు రోజుల తర్వాత తన తండ్రి వెళ్లి మిగిలిన విషయాలు మాట్లాడుకొని వచ్చాడు. యాభై లక్షల కట్నం. వారం రోజుల్లో మొత్తం ఇవ్వాలి. ఇచ్చిన తరువాత ముహుర్తం పెట్టుకుంటారు. పెళ్లికి అయిదు వందల మంది.. మంది వస్తారు. మూడు పూటల భోజనాలు పెట్టాలి. పెళ్లి కనీ వినీ ఎరుగునంత ఘనంగా చెయ్యాలి. తన తండ్రి అన్నింటికీ ఒప్పుకొని వచ్చాడు.

తనకు పెళ్లి నిశ్చయమైపోయినట్లు బంధు మిత్రులందరికీ తెల్సిపోయింది. అబినందనల పరంపర ప్రారంబమైంది. ఒక పక్క ఒకింత సిగ్గు. ఒకింత సంతోషం. ఆ నాలుగు రోజులూ ఏ పని చేస్తున్నా ఎక్కడున్నా ఇవే కలలు అలలు అలలుగా తరుముకొస్తున్నాయి.

భవిష్యత్తులో భర్తతో ఎక్కడెక్కడికి వెళ్లేది, ఏమేం చేయాబోయేది ఊహించుకుంటున్న కొద్దీ హృదయం రాగరంజితమవుతున్నది.

అనుకున్న ప్రకారం ఆమె తండ్రి కట్నం డబ్బు అడ్వాన్స్‌గా ఇవ్వటానికి వెళ్లాడు. ఎంత ఉత్సాహంగా వెళ్లాడో, అంత నిరుత్సాహంగా తిరిగొచ్చాడు.

“మొన్న యాభై లక్షలకు ఒప్పుకున్నారు. ఇప్పుడు విజయవాడ నుంచి ఎవరో ఇంకో పది లక్షలు ఎక్కువ ఇస్తామని వచ్చారట. ముందుగానే మీ సంబంధం అనకున్నాం గనుక, అదనంగా ఆ పది లక్షలూ మీరే ఇస్తే బాగుంటుంది.. అని కాబోయే వియ్యపురాలు అన్నది” అన్నాడు తండ్రి.

వీళ్లకు డబ్బు ఒక్కటే ముఖ్యం. పెళ్లిలో మంగళవాయిద్యాలకు బదులు డబ్బులు మూటలు గలగలలే ఎక్కువ, మంత్రాలకు బదులుగా నోట్ల కట్టలు లెక్కపెట్టాలి.

“వాళ్లకు అడ్వాన్స్ ఇచ్చి వచ్చావా?” అని అడిగింది తను.

“లేదు. ఆ మొత్తం ఒకేసారి కావాలిట..” అన్నాడాయన.

తను నిరంజనరావు తల్లికి ఫోన్ చేసి చెప్పింది “మేము మీ సంబంధం కాన్సిల్ చేసుకున్నాం” అని.

“అది కాదు అమ్మాయ్. విజయవాడ వాళ్లు అంత ఇస్తామన్నారని మాట వరసకు అన్నాను. మీకు శక్తి లేకపోతే..” అని నచ్చచెప్పబోయింది ఆమె.

“ఎక్కువ ఇస్తామన్నారు గదా.. వాళ్ల సంబంధమే చేసుకోండి.. మాకు శక్తి లేక కాదు. మీకు అర్హత, యోగ్యత లేకనే, కాన్సిల్ చేసుకున్నాం..” అన్నది తను.

అలా కుదిరింది అనుకున్న సంబంధం వదులుకుంది. అదీ మంచికే అయింది.

ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు వాళ్లే తన కాళ్ల దగ్గరకు వచ్చారు.

నిరంజనరావే మళ్లీ ఫోన్ చేశాడు.

“ఆపరేషన్ చెయ్యాలట. డ్యూటీ డాక్టరుకు అంతగా అనుభవం లేదుట. దయచేసి మీరు రండి మేడమ్..” అని వేడుకున్నాడు.

“నాకు ఇప్పుడు వీలు పడదు.. ఆదివారం, కారు డ్రైవరు కూడా లేడు..” అన్నది.

“నేను కారు తీసుకొస్తాను, మేడమ్..” అన్నాడు నిరంజనరావు.

పావుగంటలో సులోచన రెడీ అయింది. బయట కారు ఆగిన చప్పుడు అయింది. టామీ ‘భౌ’ మంటూ మీదకు ఉరికింది.

ఎదురుగా నిలబడిన సులోచనను చూసి అతను అవాక్కు అయ్యాడు. ఆమెను గుర్తు పట్టడో లేదో మరి. కానీ గతాన్ని తవ్వుకోవటం ఇద్దరికీ ఇష్టం లేదు.

సులోచన తాళం వేసి వచ్చి కారులో కూర్చుంది.

ఆస్పత్రి లోపలికి వెళ్తున్నప్పుడు హాల్లో కూర్చున్న నిరంజనరావు తల్లీనీ, తండ్రినీ చూసీ, చూడనట్లే లోపలికి వెళ్లింది.

సులోచన లోపలికి వెళ్లి మహాలక్ష్మిని పరీక్షించింది. కేసు కొంచెం కాంప్లికేట్ అయింది. నిరంజనరావును పిల్చి చెప్పింది.

“కేసు కాంప్లికేట్ అయింది. ఎక్కువ టైం లేదు. ఆపరేషన్ చెయ్యాలి. పది లక్షలు కౌంటర్లో కట్టి రిసీట్ తీసుకురండి” అన్నది.

“అంత డబ్బు ఇప్పటికిప్పుడు, ఇంత రాత్రి వేళ కొంచెం కష్టం. రేపు ఉదయమే కట్టేస్తాం. ఆపరేషన్ చేయండి మేడమ్” అని హీనస్వరంతో బ్రతిమిలాడుకున్నాడు.

“ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం ఏమీ కాదు గదా.. డేట్ కూడా ఇచ్చాం. ముందుగానే జాగ్రత్త పెట్టుకోవద్దా? మీరు డబ్బ కడితేనే ఆపరేషన్ చేయటానికి వీలవుతుంది” అని అన్నది సులోచన.

“తెల్సు. కానీ ఇంత అవుతుందని అనుకోలేదు. దయచేసి రేపు ఉదయం వరకూ టైం ఇవ్వండి.”

“ఆపరేషన్ డబ్బు కట్టాకనే చేస్తాం.”

“మనుషుల మీద అంత నమ్మకం లేకపోతే ఎలాగమ్మా?” అన్నది నిరంజనరావు తల్లి సాగదీసుకుంటూ.

పేషెంటు పరిస్థితి బాగా లేదు అని నర్స్ చెప్పడంతో సులోచన లోపలికి వెళ్లింది.

నిరంజనరావు అత్తగారూ, మామగారూ కూడా వచ్చారు.

రాత్రి ఒంటి గంటకు ఆపరేషన్ పూర్తియింది.

“ఆడపిల్లా, మగపిల్లాడా?” అని అడిగింది నిరంజనారావు తల్లి.

“మగపిల్లాడే, ఏం ఫర్వాలేదు. ఇంకో అరవై లక్షలు తెచ్చే వాడే పుట్టాడు. సంతోషించండి” అన్నది సులోచన.

మర్నాడు నిరంజనరావు స్వీట్ ప్యాకెట్ తెచ్చి ముందు పెట్టాడు. దాన్ని అతని ముందుకే తోసేస్తూ, “డబ్బు ఇవ్వండి” అన్నది.

“ఇవాళ కూడా బ్యాంకు సెలవు అండీ, చెక్ రాసి తెచ్చాను” అన్నాడు నిరంజనరావు చెక్ చేతికి ఇస్తూ.

ఆమె చెక్‌ను ఒక కాగితం పడవలా మడిచింది.

“దీన్ని జాగ్రత్తగా దాచండి. ఇంకో పాతికేళ్ల తరువాత మీ వాడికి పెళ్లి చేస్తారుగదా. మీ ఇంటికి కోడలుగా వచ్చే పిల్లకు ఈ కాగితం పడవను నా బహుమతిగా ఇవ్వండి. మీ వాడితో కాపురం చేయటం అంటే కన్నీటితో కాగితం పడవల మీద అంటే కరెన్సీ నోట్ల మీద ప్రయాణం చేయటమేనని మీ కొత్త కోడలికి చెప్పండి” అంటూ కాగితం పడవను అతని ముందుకు తోసింది.

నిరంజనరావు సిగ్గుతో తలదించుకున్నాడు.

Exit mobile version