Site icon Sanchika

చిరుజల్లు-37

జారుడు మెట్లు

[dropcap]సా[/dropcap]యంత్రం ఆరున్నర అయింది. చీకటి పడుతోంది. పైగా మబ్బుపట్టింది. చినుకులు పడుతున్నయి. కొంచెం చలి అనిపించినా వాతావరణం ఆహ్లాదంగా ఉంది. వినోదిని వరండాలో కూర్చుని సెల్ ఫోన్ తిప్పుకుంటోంది.

ఎవరో ఇద్దరు వ్యక్తులు గేటు తీసుకొని లోపలికి వచ్చారు. సీజర్ భౌ భౌ మంటూ ఎదురెళ్లి వాళ్లను గేటు దగ్గరే నిలేసింది. దూరం నుంచి వాళ్లు ఎవరో తెలియకపోయినా, వినోదిని వినోదం చూస్తూ కూర్చుంది కాసేపు. రెండు నిముషాల తరువాత యాదయ్య వచ్చి కుక్కను లోపలికి తీసుకెళ్లాడు.

కోదండపాణి, చలం వరండా దగ్గరకు వచ్చి వినోదినికి నమస్కారం చేశారు.

“నువ్వా కోదండపాణి, ఏమిటి విశేషాలు? మీ అమ్మాయి బావుందా? మన తోట ఎలా ఉంది?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.

“అంతా బాగానే ఉన్నామమ్మా. వీడు నా మేనల్లుడు. నాలాగా కాదండి. బాగానే సదువుకున్నాడండి పాదరసం లాంటోడు. మీరు ఏదైనా ఉద్యోగం ఇప్పించాల” అన్నాడు కోదండపాణి.

“ఉద్యోగాలు ఇప్పించడం నా వల్ల ఏమవుతుంది? నాన్నగారిని అడుగు” అన్నది వినోదిని ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతూ.

“అయ్యగారిని అడుగుదామనే వచ్చామండి. మీరూ ఒక మాట చెబితే, పని అయిపోతుందండి” అన్నాడు కోదండపాణి.

“అలాగేలే” అన్నది వినోదిని.

నారాయణరావు ఉన్నత పదవిలోనున్న ప్రభుత్వాధికారి. ఆయనకు సొంత ఊరులో పొలాలూ, ఇళ్లు ఉన్నయి. ఎప్పుడో తీరినప్పుడు ఒకటి రెండుసార్లు ఈయన వెళ్లి వస్తుంటాడు. అక్కడి వ్యవహారాలన్నీ కోదండపాణి చూసుకుంటుంటాడు. పైగా నారాయణరావుకు ఎంతో విశ్వాసపాత్రుడుగా ఉంటూ ఆయన అభిమానాన్నీ పొందాడు.

కోదండపాణికి ఎదిగిన కూతురు ఉంది. గుండెల మీద కుంపటిలా ఉన్న అలివేలును ఎవరి చేతులోనైనా పెట్టి బరువు దించుకోవాలనుకుంటున్నాడు. ఆ ఊరిలో కాస్త చదువుకున్నవాడు చలం ఒక్కడే. అందుచేత అక్కడ ఆముదవృక్షంలాగా, అలివేలులాంటి అమ్మాయిల దృష్టిలో హీరోలా కనిపిస్తున్నాడు. తన కూతుర్ని చలానికి ఇచ్చి పెళ్లి చేస్తే పెద్ద సమస్య తీరిపోతుంది గదాని కోదండపాణి అనుకున్నాడు.

ఈ విషయంలో చలాన్ని కదిలించి చూశాడు. “ఉద్యోగం దొరికి జీవితంలో స్థిరపడేదాకా పెళ్లి చేసుకోను, మామా..” అన్నాడు చలం.

“నువ్వు నా కూతుర్ని చేసుకుంటానంటే, నీకు ఉద్యోగం ఇప్పించే పూచీ నాది” అన్నాడు కోదండపాణి.

సరేనన్నాడు చలం.

ఒప్పందం కుదిరాక, కోదండపాణి చలాన్ని వెంట బెట్టుకొని హైదరాబాదు వచ్చి నారాయణరావు ఇంట్లో అమ్మాయి దగ్గర నుంచీ, అమ్మగారిదాకా అందరికీ దండాలు పెట్టి ‘వీడికో ఉద్యోగం ఇప్పించిండమ్మా’ అని మొర పెట్టుకున్నాడు. అందరికీ విన్నవించుకున్నాక, ఆఖరికి అయ్యగారి ముందు చలాన్ని నిలబెట్టాడు.

“మా వోడేనండి. బాగా సదువుకున్నాడు. మెరికలాంటోడు. తమరు వీడికో ఉద్యోగం ఇప్పించాల” అన్నాడు వినయంగా.

“ఈ రోజుల్లో ఉద్యోగాలు ఇప్పించటం అంత తేలిక కాదు, ఇంకేమన్నా అడుగు” అన్నాడు నారాయణరావు.

“గవర్నమెంటు అంతా తమ చేతుల్లో ఉంది. తమరు తల్చుకుంటే రేపీపాటికి ఈడ్ని ఉద్యోగస్థుడ్ని సేయగలరు. మావోడని చెప్పటం కాదండి. పాదరసం లాంటోడండి. ఇట్టే పాకిపోతాడండి” అనీ చెప్పాడు.

“మీ వాడు పాదరసం అయినా, చెరుకు రసం ఇప్పుడు ఉద్యోగం ఇవ్వటం కుదరదు. ఇప్పుడు రిక్రూట్‌మెంటు మీద బాన్ ఉంది…” అన్నాడు నారాయణరావు.

“బాన్ ఉన్నా బోను ఉన్నా, తమరు తల్చుకుంటే, ఏదీ అడ్డురాదండి. ఈడు గొప్ప విశ్వాసం గల మనిషి అండీ. జన్మంతా, బతికి ఉన్నంతకాలం మీ పేరు చెప్పకొని దీపమెట్టుకుంటామండి. మీ పాదాల దగ్గర విశ్వాసంగా పడి ఉంటామండి. నాకు ఈ ఒక్క సాయమూ చేసి పెట్టండి. ఇంత వరకు మిమ్మల్ని ఏమీ అడగలేదండి. ఇక ముందు ఏమీ అడగనండి…” అని కాళ్ల మీద పడినంత పని చేశాడు.

తన పొలాలు, ఆస్తులు అతని చేతులో ఉన్నందువల్లనూ, అతని సహాయం అవసరం అయినందువల్లనూ, కోదండపాణి అంతగా వేడుకుంటున్నందువల్లనూ, నారాయణరావు కాదనలేకపోయాడు.

చలానికి సహాయం చేయాలనే అనుకున్నాడు. ఆయన అనుకంటే చాలు, కాకపోవటం అంటూ ఉండదు. ఎన్ని రూల్సు ఉన్నా వాటిని ఎలా మెలికలు తిప్పాలో ఆయనకు తెల్సు.

చలానికి వారం రోజుల్లో ఉద్యోగం వచ్చింది.

“తమరు చేసిన సాయం ఈ జన్మలో మర్చిపోలేమండి. ఇంకో చిన్న మనవి. తమరు అనుమతిస్తే, ఆ గేటు దగ్గర పడి ఉంటాడు. మీకు కాస్త సాయంగా ఉంటాడు.” అన్నాడు కోదండపాణి.

నారాయణరావు ఆ అభ్యర్థననూ కాదనలేకపోయాడు. అలాగే కానివ్వమన్నాడు. కోదండపాణి “మళ్లీ తమ దర్శనం చేసుకుంటానండి” అని తన ఊరికి బయల్దేరి వెళ్లిపోయాడు.

తరువాత కోదండపాణి తమ ఒప్పందాన్ని గుర్తు చేశాడు. “ఉద్యోగం ఇప్పిస్తే అలివేలును పెళ్ళి చేసుకుంటానన్నావు. ఉద్యోగం ఇప్పించాను. మరి పెళ్లి మాట ఏంటి?” అని అడిగాడు.

“నాలుగు నెలలు కాస్త ఊపిరి పీల్చుకోనియ్. పెళ్లి అంటే మొదటాట సినిమా చూసొచ్చినట్టు కాదు గదా. ముహుర్తాలూ మంచీ చెడూ ఎన్ని చూసుకోవాలి? నేనేం పారిపోనులే మామా” అని దాటేశాడు.

పాలెంలో ఊళ్లో వాళ్లందరికీ అలివేలుకు చలానికి ఇంక పెళ్లి నిశ్చయమైపోయినట్లేనన్న అభిప్రాయం ఏర్పడింది.

కాని చలానికి పట్నం వచ్చాక, నారాయణరావు ఇంట్లో స్థానం సంపాదించాక రోజూ కళ్ల ముందు తిరుగుతున్న వినోదినిని చూశాక, అలివేలు రంగు వెలిసిన బొమ్మలా కనిపించింది.

అదీ గాక, అలివేలును అడ్డు పెట్టుకుని, ఏదో ఆశ పెట్టి, ఒక మెట్టు ఎక్కాడు. ఉద్యోగం సంపాదించాడు. మెల్లగా వినోదినితో స్నేహం చేసి మెల్లగా ప్రేమలో దింపితే ఈ పిల్లతో పెళ్లి అయితే ఇంక జీవితం అనుకోని మలుపు తిరిగినట్లే.. అన్న ఆలోచన చలం మనసును వేధిస్తోంది.

రోజూ పొద్దుటే లేచి తోట పని చేస్తున్నాడు. కొత్త మొక్కలు తెచ్చి నాటుతున్నాడు. వాటి గొప్పదనం గురించి వినోదినికి వివరిస్తున్నాడు. అమ్మాయి గారికి ఇష్టమైన పూలు పూయించి, ఆమె పెదవుల మీద చిరునవ్వులు పూయించాలన్న తాపత్రయంలో ఉన్నాడు.

అమ్మాయిగారికి కావల్సిన పుస్తకాలు, వగైరా వగైరాలన్నీ ఆడగక ముందే తెచ్చి ఇస్తున్నాడు. సినిమాలకు వెళ్లాలంటే టిక్కెట్లు తెచ్చి పెడుతున్నాడు.

ఒకసారి నారాయణరావు సకుటుంబంగా తిరుపతి వెళ్లాలనుకుని రిజర్వేషను చేయించాడు. చివరి నిముషంలో ఆయన ఆఫీసు పని ఒత్తిడి వల్ల హైదరాబాద్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. దేవుడి దగ్గరకు బయల్దేరుతున్నాక ప్రయాణం మానుకోవటానికి సెంటిమెంటు అడ్డొచ్చింది. ఆడవాళ్లను ఒక్కళ్లనూ పంపించేందుకూ మనసొప్పలేదు. వాళ్లకు తోడుగా చలాన్ని పంపిస్తే బావుంటుంది గదా అన్న ఆలోచన వచ్చింది. ఆయన అడగటమే ఆలస్యం, చలం సిద్ధమైనాడు.

ఆ నాలుగు రోజులు పర్యటనలోనూ వినోదినికి నీడలా వెన్నెంటి ఉంటూ మరి కాస్త దగ్గరైనాడు. వద్దంటూనే వాళ్లంతో కల్సి బోజనం చేశాడు. వాళ్లతో కల్సి దేవుడి దర్సనానికి వెళ్లాడు.

“ఏం కోరుకున్నావు?” అని అడిగింది వినోదిని, గుడిలో నుంచి బయటకు వచ్చాక.

“నాలాంటి చిన్న వాళ్ల చిన్న చిన్న కోరికలు తీర్చేందుకు మీరుండగా ఆయన్ని ఎందుకు శ్రమ పెట్టటం” అన్నాడు చలం.

ఒక రోజు సాయంత్రం వీలు చూసుకుని తన గొప్పదనాన్ని అంతా ఆమెకు వివరించాడు.

“ఇప్పుడు చితికిపోయిన వాళ్లమే అయినా, ఒకప్పుడు మేమూ బాగా బ్రతికిన వాళ్లమే. మా తాతగారి హయాంలో వంద ఎకరాల పొలం ఉండేది. ఆయన జల్సాలు వెలగబెడుతూ కొంత ఆస్తి తగలేస్తే, మా నాన్నకున్న వ్యసనాల వల్ల మిగతా ఆస్తి హారతి కర్పూరం అయంది. వాళ్లు సరిగ్గా ఉండి ఉంటే నేను ఇలా అందరి కాళ్లు పట్టుకోవల్సి వచ్చేది కాదు” అంటూ సజల నేత్రాలతో చెప్పి ఆమె సానుభూతిని పొందగలిగాడు.

నారాయణరావు వినోదినికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఢిల్లీ నుంచి నిరంజన్ పెళ్లి చూపులకు వచ్చాడు. అతనికి అమ్మాయి నచ్చింది. వీళ్లకూ అబ్బాయి నచ్చాడు. ఆ సంబంధం సెటిల్ అయ్యే అవకాశాలు ఉండటంతో చలం గుండెల్లో రాయిపడింది.

నిరంజన్‌ను సాగనంపేందుకు విమానాశ్రయానికి వెళ్లిన చలం అతనితో అన్నాడు.

“మీ సంబంధం కుదరటం ఎంతో అదృష్టం. ఇంతకు ముందు రెండు మూడు సంబంధాలు వచ్చాయి. కానీ లాస్ట్ మినిట్‌లో డ్రాప్ చేసుకున్నారు.”

“ఎందుకని?” అని అడిగాడు నిరంజన్.

“పెద్ద కారణం ఏమీ లేదండి. ఆ అమ్మాయి కాలేజీలో చదువుతుండగా చిన్న లవ్ ఎఫైర్ నడిచింది. ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే గదండి. కాకపోతే ఆ ప్రేమించిన కుర్రాడు పనిగట్టుకొని చెడగొడుతున్నాడు. కానీ అది అన్యాయమండి” అన్నాడు చలం.

నిరంజన్ ఏమీ మాట్లాడలేదు.

ఢిల్లీ వెళ్లాక నారాయణరావుకి ఫోన్ చేశాడు.

మర్నాడు పొద్దున్నే నారాయణరావు సామాను బైటకు గిరాటు వేయించాడు. ఇంకోసారి ఆ వీధిలో కనిపిస్తే పిట్టను కాల్చినట్లు కాల్చిపారేస్తానన్నాడు.

ఆఫీసుకు వెళ్లేటప్పటికి చలాన్ని డిస్‌మిస్ చేసినట్లు ఆర్డర్స్ చేతికిచ్చారు.

చలం అనుకున్నదంతా తల్లకిందులైంది. తల తిరుగుతున్నట్లు అయింది.

Exit mobile version