పండగొచ్చింది
[dropcap]పం[/dropcap]డగకు ఒక్కొక్కరే దిగుతున్నారు.
కోడలూ, పిల్లలూ ఆటో దిగుతుంటే వసంతలక్ష్మి నవ్వుతూ ఎదురెళ్లింది.
“ఒక్కదేనివే వచ్చావేం? రామం రాలేదా?” అని అడిగింది మనవణ్ణి అందుకుంటూ.
“ఆయనకు సెలవు దొరకలేదు. పండగ నాటికి వస్తామన్నారు” అన్నది లత సూట్‌కేస్ లోపలకి తీసుకొస్తూ.
మిగతా పండగలకు వచ్చినా రాకపోయినా, ఈ పండగకు మాత్రం నలుగురు కొడుకులూ, కుటుంబాలతో వచ్చేదాకా పతంజలి ఊరుకోడు. పండగ ఫలానా తేదీ – అంటూ నెలరోజుల ముందు నుంచే ఫోన్లు చేస్తుంటాడు – రిజర్వేషన్లు చేసుకున్నారా, లేదా అని కనుక్కుంటూ.
ముంబై, భిలాయ్, ఢిల్లీ, బెంగళూర్‌ల నుంచి నాలుగు కుటుంబాలూ వచ్చి ఇంటి నిండా అంతా బిలబిలమంటూ తిరుగుతుంటే, ఆనంద కోలాహలం తాండవిస్తుంటుంది. నలుగురు కోడళ్లూ అత్తగారిని క్షణమైనా వదిలి పెట్టకుండా ఆమె చుట్టూ మూగుతుంటారు.
వసంతలక్ష్మి వంటింట్లో పనితో సతమవుతుంటే, వాళ్లు నలుగురూ ఆమె చేతిలోని పని అందుకుంటారు.
“మేం ఉన్నాం కదా. ఈ నాలుగు రోజులూ మీరు హాయిగా పిల్లలతో ఆడుకోండి” అంటుంది పెద్దకోడలు.
రెండో కోడలు ఆమెను డ్రాయింగ్ రూంలోకి పంపిస్తుంది. మూడో కోడలు మనమరాలిని ఆమె ఒళ్లో కూర్చోబెడుతుంది. నాలుగో కోడలు ఏ.సి. ఆన్ చేస్తుంది. పిల్లలు ఆమె చుట్టూ చేరి ముద్దు ముద్దు మాటలతో మురిపాలతో ఆమెను సంతోష పెడుతుంటారు.
పిల్లలంటే దేవుడు పంపిన దూతలే. ఈ దేవదూతలకు ఎగిరి పోయేందుకు రెక్కలుంటాయి. నడక నేర్చుకుని, కాళ్లల్లో బలం పుంజుకునే కొద్దీ రెక్కల చప్పుడు మరింత ఎక్కువవుతూ ఉంటుంది.
పతంజలి పిల్లలకు చాక్లెట్లు పంచి పెడుతున్నాడు. చిన్న కోడలు వద్దంటూ వారించింది. “ఇవాళ మేం వాళ్లను సంతోష పెడితేనే గదమ్మా, రేపు వాళ్లు మమ్మల్ని చూసుకునేది” అన్నాడు.
“అంటే పిల్లలకు చాక్లెట్లు ఇవ్వటంలోనూ స్వార్థం ఉందన్నమాట” అన్నది వసంతలక్ష్మి.
“ఆ మాట కొస్తే, పెళ్లాం, పిల్లలు, సంసారం ఈ జంజాటం ఉండాలనుకోవటమూ స్వార్థమే కదా..” అన్నాడు పతంజలి.
సాయంత్రం వసంతలక్ష్మి పెద్ద కోడల్ని వెంట పెట్టుకొని వెళ్లి పండగకు అందరికీ బట్టలు తెచ్చింది.
“ఏమిటో అత్తా, కోడలూ కల్సి చాలా తెచ్చినట్లున్నారే” అని పతంజలి అన్నాడు.
“నువ్వు ముందు మీ మావయ్యకు బట్టలు చూపించమ్మా. తరువాత నేను బిల్లు చూపిస్తాను” అన్నది వసంతలక్ష్మి.
“బిల్లు గురించి భయం లేదు. నీ మొహంలో తాండవిస్తున్న సంతోషానికి ఖరీదు కట్టే షరాబులెవ్వరు?” అన్నడాయన.
“నానమ్మా, దేవుడు రోజూ మనింటికి వస్తుంటాడా?” అని అడిగాడు మనవడు.
“దేవుడు రోజూ మనింటికి వస్తూనే ఉంటాడురా. కానీ ఆయన వచ్చినప్పుడు మనమే ఇంట్లో ఉండం” అన్నది వసంతలక్ష్మి.
“ఆయన ఎక్కడుంటాడు బామ్మా?”
“అంతటా ఉంటాడు. ఎప్పుడూ ఆయన మనల్ని చూస్తూనే ఉంటాడు. మనమే ఆయన వంక చూడం.” అన్నదామె నిట్టూరుస్తూ.
కబుర్లు, కాలక్షేపాలతో రోజు గడిచిపోయింది. నలుగురు కోడళ్లతో కల్సి భోజనం చేసింది. హాల్లో పిల్లలు అందర్నీ పక్కన పెట్టుకొని పడుకుంది. కథలు చెప్పింది. పాటలు పాడింది. చిచ్చుకొట్టి నిద్రపుచ్చింది.
రాత్రి ఒంటిగంట అయింది. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. వసంతలక్ష్మికి నిద్ర పట్టటం లేదు. తలుపు తీసుకొని బయటకొచ్చింది.. చిమ్మచీకటి, గంభీరమైన నిశ్శబ్దం. డాబా మీదకు వెళ్లింది. చల్లగాలి రివ్వున వీస్తోంది. పిట్టగోడను ఆనుకొని కూర్చుంది.
కళ్లు మూసుకుంది. బయట ప్రపంచాన్ని చూడనప్పుడు దృష్టి అంతర్ముఖం అయి మనసు పొరల్లోని ఆలోచనలను కళ్ల ముందు ఆవిష్కరింప చేస్తుంది.
ప్రతిసారీ పండగకు ఆయన వీళ్లందర్నీ తప్పని సరిగా ఎందుకు పిలిపిస్తాడో ఆమెకు తెల్సు. ఇంటి నిండా నా అనే వాళ్లు తిరుగుతుంటే, చేదు జ్ఞాపకాలను నెమరువేసుకునే అవకాశం ఉండదు గదాని.
నీరజ విషయాలేవీ గుర్తుకు రాకుండా చేయాలని ఆయన తాపత్రయం.
నీరజ – తన ముద్దుల కూతురు. గారాల పట్టీ. దాన్ని మర్చిపోవటం సాధ్యమేనా?
మగపిల్లలు ఎంత మంది ఉన్నా, వాళ్ల దారి వేరు. ఊరు మీద పడి తిరుగుతుంటారు. ఆకలేసినప్పుడు తప్ప అమ్మ గుర్తుకు రాదు. ఇక పెళ్ళిళ్లు అయ్యాక, భార్యలకు విధేయులైన భర్తలైపోతారు. ఆడపిల్లలు అలా కాదు. ఎప్పుడూ అమ్మను అంటి పెట్టుకునే ఉంటారు. ఎంత దూరాన ఉన్నా, అమ్మ హృదయంలో తిష్ట వేసుకునే ఉంటారు.
నీరజ అంటే, ఎందుకంత ప్రాణం అంటే, అది ఎంత తెలివిగలదో, అంత మొండి మనిషి. ఎన్ని కష్టాలు రానీ, ఎన్ని నష్టాలు రానీ, అనుకున్నది సాధించే వరకూ నిద్రపోదు. పక్క వాళ్లను నిద్రపోనివ్వదు. దాని మాట కాదనే వాళ్లు ఎవరూ లేనందు వల్ల, దానిది ఆడింది ఆట, పాడింది పాట అయింది.
మిగిలిన విషయాల్లో దాని మాటకు ఎదురు చెప్పకపోయినా, పెళ్లి విషయంలో మాత్రం రాజీపడలేకపోయాం. తన క్లాస్‌మేట్ సుధాకర్‍ను ఇంటికి తీసుకొచ్చేది. ఆంటీ అంటూ చనువుగా తిరుగుతుండేవాడు. తన కొడుకుల్ని చూసినట్లే వాడిని ప్రేమగా చూసేది. కాఫీలు, టిఫెన్లు, భోజనాలు అన్నీ ఇక్కడే కానిచ్చేవాడు. అందుకూ తను అభ్యంతరం చెప్పలేదు.
కానీ వాళ్ల పెళ్లి విషయంలో మాత్రం అంగీకరించలేకపోయాం.
ఒక రోజు నీరజ ఇంటికి రాలేదు. వెతకటానికి అందరూ తలో దోవన వెళ్లారు – తన దోవ తాను చూసుకుందని తెలియక.
దాని ఫ్రెండ్స్ అందరూ అండగా నిలబడ్డారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. పరిస్థితి అర్థమైంది. మేజర్ గనుక పోలీసులూ ఏమీ చెయ్యలేకపోయారు.
రెండు వారాల తరువాత ఫోన్ చేసింది.
“నాన్న నన్ను ఎలాగూ క్షమించరు. మిమ్మల్ని క్షోభ పెట్టినందుకు దేవుడూ నన్ను క్షమించడు. కనీసం నన్ను నువ్వన్నా క్షమించానని ఒక్క మాట అంటే, ఇంత బాధలోనూ కాస్తంత ఊరట..” అన్నది నీరజ. దాని గొంతులో దుఃఖపు జీర.
“మా క్షమాపణలతో నీకేం పని? మేం నీకు ఏమవుతాం గనుక?”
“నాకు జన్మనిచ్చిన తల్లివి.”
“ఆ విషయం గుర్తుంటే నాకు చెప్పకుండా వెళ్లేదానివే కాదు. నిన్ను కని, పెంచి కంటికి రెప్పలా కాపాడి, అడిగినవన్నీ అందించి, సదా నీ క్షేమమే కోరుకునే కన్నతల్లి కన్నా, నాలుగు రోజులు నీ వెంట తిరిగినవాడు ఎక్కువైపోయాడు. మనిషికి కృతజ్ఞత కూడా కరువై పోతోంది. నదిలో నీళ్లు తాగి నదిని మర్చిపోయినంత తేలికగా; వంతెన మీద నుంచి దాటి వెళ్లి, వంతెనను మర్చిపోయినంత తేలికగా, అమ్మనూ మర్చిపోయావు. నీ అవసరం తీరాక..”
“మర్చిపోయి ఉంటే, ఇప్పుడు ఫోన్ చేసేదాన్ని కాదు గదా. తప్పు చేశానన్న బాధ పీడిస్తున్నా, అమ్మ గనుక, క్షమించకపోతుందా అన్న చిన్న ఆశ..”
“ఉన్న ఒక్క కూతురికీ ఎంతో మంచి సంబంధం తెచ్చి నిన్ను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆశ పడ్డాను. ఆరాట పడ్డాను. చివరకు నాకు ఆరాటమే మిగిలింది. ఇంత నాటకం ఆడి, మా నుంచి నిన్ను దూరం చేసిన మనిషి, ఎంతకైనా తెగిస్తాడు. నువ్వు వాడితో జాగ్రత్తగా ఉండు. పోనీ, మాకు దూరమైనా ఫర్వాలేదు. ఎక్కడో చోట నువ్వు క్షేమంగానైనా ఉంటే చాలునని అనుకోవటం తప్ప నేను చేయగలిగిందేమీ లేదు..” అన్నది తను.
అది ఎక్కడుందో, ఏం చేస్తోందో, సరిగా తింటోందో, లేదో అన్న దిగులే తనని కృంగదీస్తోంది. ఆయన మాత్రం దాని పేరు వినపడటానికి వీల్లేదని చిందులేశాడు. కన్నబిడ్డ ఊర్లోనే ఉన్నా, చూడటానికి నోచుకోలేకపోవటం ఎంత బాధ?
తమని కాదని వెళ్లిపోయి అది తప్పు చేసిందా, లేక దాన్ని దూరంగా తరిమేసి తాము తప్పు చేస్తున్నామా అన్న ఆత్మపరిశీలన ప్రారంభమైంది.
అప్పుడప్పుడు ఫోన్ చేసేది. తను బాగానే ఉన్నాననీ చెబుతుండేది.
“నువ్వు నిజంగా బాగానే ఉంటే, నీ గొంతులో వైరాగ్యం తొంగి చూడదు. దేనికో బాధపడుతున్నావు..” అన్నది తను.
“నా బాధ నిన్ను చూడలేకపోతున్నానే..”
“దాటలేని అగాధం సృష్టించుకున్నది నువ్వే కదా..” అన్నది తను.
అది సంతోషంగా లేదని తెల్సినప్పటి నుంచీ, మనోవ్యథ మరీ ఎక్కువైంది.
రోజూ ఉదయమే జాగింగ్‌కు వెళ్తున్నాననీ, సాయంత్రం సంగీతం నేర్చుకుంటున్నాననీ చెప్పింది.
దాని ఇంటికి ఎలాగూ వెళ్లలేదు. కనీసం వీధిలోనైనా దూరం నుంచి అయినా చూడాలనిపించింది.
ఆయనకు చెబితే అగ్గిమీద గుగ్గిలం అవుతారు.
తెల్లవారు ఝామునే లేచి, ఆయనకు తెలియనివ్వకుండా టాంక్‌బండ్‌కు వెళ్లింది.
వాళ్లిద్దరూ అంత దూరంలో రోడ్డుకు అవతల వైపున పరుగులాంటి నడకతో వెళ్తున్నారు. ఎంత వద్దనుకున్నా, తనకు తెలియకుండానే ‘నీరూ’ అని పిలిచింది.
“అమ్మా” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది.
తను కూతురు వైపు పరుగు తీసింది.
చూస్తుండగానే తన కన్నబిడ్డ వేగంగా వస్తున్న బస్సు కింద పడిపోయింది. పరుగు పరుగున తనను చేరుకోబోయి, మృత్యువు ఒడిలోకి ఒదిగిపోయింది. ఒక రకంగా దాని మరణానికి తాను కారణం అయిందా?
ఎన్నేళ్లు గడిచినా, ఆ దృశ్యం తల్చుకుంటే చాలు, కళ్ల వెంట కృష్ణా, గోదావరీ నదులే ప్రవహిస్తయి.
ఎవరిదో చెయ్యి, ఆమె భుజం మీద పడింది – పతంజలి.
“చీకట్లో ఇక్కడేం చేస్తున్నావు?” అని అడిగాడు.
ఆమె చెంపల మీద నీరు తుడిచాడు.
“ఏడుస్తున్నావా?”
“ఏడుపెందుకు? ఎవరికేది ఎంత ప్రాప్తమో, అంతే.”
“నీకేం తక్కువ చేశాను?”
“అన్నీ ఎక్కువే చేశారు. నలుగురు కొడుకులు, నలుగురు కోడళ్లు, ఒక కూతుర్ని తీసుకుంటేనేం? దేవుడు నాకు మరో నలుగురు కూతుర్లను ఇచ్చాడు..”
“ఈ బాధ మర్చిపోవాలనే ప్రతి పండగకు వాళ్లందర్నీ పిలిపిస్తున్నాను.” అన్నాడు పతంజలి.
ఆమెను నెమ్మదిగా పొదివి పట్టుకుని కిందకు తీసుకెళ్లాడు.