రక్షణ
[dropcap]ఆ[/dropcap] వేళ స్టార్ హోటలు అంతా స్టార్స్‌తో నిండిపోయింది. అభిమాన హీరోలు, హీరోయిన్లు, కమెడియన్లు, విలన్లు, ప్రొడ్సూసర్స్, డైరెక్టర్స్, అంతా తలా ఒక రూంలో దిగిపోయారు. కాఫీలు, టిఫెన్లు, డ్రింక్స్ ఆర్డరిచ్చారు. ఫోన్స్‌తో బిజీగా ఉన్నారు. ఒక పక్క నవ్వులు, కేరింతలు. రూంల వద్ద కొందరు, రిసెప్షన్ వద్ద మరికొందరు అభిమాన తారలను చూసేందుకు, వాళ్లతో మాట్లాడేందుకు, ఫోటోలు తీసుకునేందుకు అవకాశం దొరుకుతుందేమోనని తారట్లాడుతున్నారు. ఎవరు ఖాళీగా కనిపిస్తారా, ఎవరినన్నా పలకరించి సమాచారం సేకరించాలని పత్రికల వాళ్లూ, టీ.వీల వాళ్లూ ఎదురు చూస్తున్నారు.
ఇంత మంది మధ్య నుంచి దారి చేసుకొని, లక్ష్మణరావు, నటి లావణ్య ఉన్నరూంలోకి వెళ్లాడు.
“రండి, ఎలా ఉన్నారు? హోం ఎలా నడుస్తోంది?” అని అడిగింది లావణ్య, మొహం మీదకు కమ్ముకుంటున్న నల్లని జుట్టును పక్కకు నెట్టుకుంటూ.
“నేను బాగానే ఉన్నానండి. మీ దయ వల్ల హోంకేం కొదవ లేదు. అన్నీ బాగానే జరుగుతున్నయి. మీరోసారి వచ్చి చూస్తామన్నారు గదాని.. పిల్లలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మీరు కిందటి ఏడాది ఈ ఊరు వచ్చినప్పుడూ మీ కోసం రోజంతా ఎదురు చూసి చూసి, చాలా నిరుత్సాహ పడ్డారు. ఈ సారి అయినా వస్తారని.. ఆశగా ఎదురు చూస్తున్నారు..” అన్నాడు లక్ష్మణరావు.
“అవునా, పాపం.. ఇప్పుడు వెళ్దామా మరి” అని అడిగింది లావణ్య.
“అలాగే” అన్నాడు లక్ష్మణరావు.
రెండు నిముషాల్లో కారు సిద్ధం చేయించింది. గబగబా వెళ్లి కార్లో కూర్చుంది. లక్ష్మణరావు వెళ్లి కారు ముందు సీట్లో కూర్చున్నాడు. ఆమె అంత త్వరగా ఎక్కడకు వెళ్తోందో తెల్కుకోవాలని పత్రికల వాళ్లు ఆమెను ఎంత అనునయంగా అడిగినా లాభం లేకపోయింది.
అరగంట తరువాత కారు హోం ముందు ఆగింది. లావణ్య కారు గేటు దగ్గరనే ఆపించి ఆ బిల్డింగ్ వంక ఒకసారి చూసింది.
“దీని ముందు ఇంత వరకు బోర్డు పెట్టలేదు. మీరే ఏ పేరైనా పెడతారని ఆగాము” అన్నాడు లక్ష్మణరావు.
“గేటు దగ్గర ‘రక్షణ’ అని చిన్న బోర్డు పెట్టించండి. ఈ హోంకు పెద్ద ప్రచారం కల్పించటం నాకు ఇష్టం లేదు” అన్నది లావణ్య.
“రక్షణ ఆడపిల్లకు, ముఖ్యంగా దిక్కులేని ఆడపిల్లలకు కావాల్సింది అదేనమ్మా. చాలా మంచి పేరు పెట్టారు. రేపే ఈ గేటు దగ్గర ‘రక్షణ’ అన్న బోర్డు పెట్టిస్తాను” అన్నాడు లక్ష్మణరావు.
కారు లోపలికి వెళ్లింది. కారు దిగేటప్పటికి, ఆ అనాథ ఆశ్రమంలో ఇరవై మంది అమ్మాయిలు అటూ ఇటూ వరసగా నిలబడి, ఆమె నడిచే దారిలో పూలు జల్లు కురిపిస్తూ స్వాగతం చెప్పారు. ఆ పేద పిల్లల ఆదరానికి ఆమె చలించిపోయింది.
లోపలికి వెళ్లాక, ఒక చిన్న బల్ల మీద కూర్చుని ఒక్కొక్కరి పేరు అడిగి తెల్సుకుంది. వాళ్ల చదువు గురించీ ఆరా తీసింది. వాళ్లతో కల్సి అల్పాహారం తీసుకుంది. వాళ్లు ప్రేమతో ఇచ్చిన స్వీట్లు తీసుకుంది. వాళ్ల మొహాల్లో వెలుగుతున్న వెన్నెల వెలుగును చూసి ఆమె ఆనందించింది.
“మేం మీ సినిమాలన్నీ చూస్తుంటామండీ, మీరంటే మాకు చాలా ఇష్టం” అన్నారు పిల్లలు.
“మీరు సినిమాలు చూడండి. వద్దనటం లేదు. కానీ చదువు మీద ఏ మాత్రం అశ్రద్ధ చూపవద్దు. మిమ్మల్ని చూసి లోకమంతా గర్వపడేలాగా ఎంతో ఉన్నంత స్థాయికి ఎదగాలి. అందుకు చదువే మీకు ఆలంబనం. ఈ చదువే మిమ్మల్ని అందలం ఎక్కిస్తుంది. నాకన్నా మిమ్మల్ని గొప్పవాళ్లను చేస్తుంది” అని వాళ్లకు హితబోధ చేసింది.
“తప్పకుండా మేడం. మీరు మా కోసం ఖర్చు చేస్తున్న ప్రతి పైసా వృథా కానివ్వం. మీకూ ఈ దేశానికీ సేవ చేసి రుణం తీర్చుకుంటాం” అన్నారా పిల్లలు.
ఆ పిల్లల ఆలోచనలకూ, మొహాల్లో కనిపిస్తున్న దృఢ సంకల్పానికి లావణ్య సంతోషించింది. వాళ్లు తమ తృప్తి కోసం, ఆమె కోసం స్వయంగా తయారు చేసిన చిన్న చిన్న వస్తువులను కానుకగా ఇచ్చారు.
“మీరు నాకు ఇచ్చిన ఈ చిన్న కానుకలు, సాయంత్రం నేను అందుకునే అవార్డులకన్నా గొప్పవి. నేను కోరుకునేది, మీ నుంచి ఆశించేది ఒక్కటే. మీరు మంచి స్థితిలోకి వెళ్లాక, మరి కొంతమంది దురదృష్టవంతులైన అమ్మాయిలను ఆదుకోండి. వాళ్లకు కాళ్ల మీద నిలబడేందుకు అవసరమైన చేయూతనివ్వండి..” అన్నది లావణ్య.
ఇంకో గంట సేపు వాళ్లతో కాలక్షేపం చేసి, కారు ఎక్కింది. లక్ష్మణరావు చేతులు జోడించి నమస్కరించి, అక్కడే ఆగిపోయాడు.
కారు ముందుకు కదిలింది.
ఆమెకు గతం అంతా కళ్ల ముందు మెదిలింది.
***
పుట్టి పెరిగిన పల్లెటూరు, తాను పడిన కష్టాలు, ఎదుర్కొన్న చేదు అనుభవాలు అన్నీ స్మృతి పథంలోకి వచ్చాయి.
ఆ రోజుల్లో ఆమె పేరు లచ్మి. ఊరూ చివర మురికి వాడల్లోని చిన్న గుడిసెలో నివాసం. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు.
తల్లి అలివేలు నడి వయసులో ఉంది. ఇరుకు గొందుల్లో సందుల్లో ఉండే, మురికి మనస్తత్వంగల మనుష్యుల మధ్య బతకాలంటే ఎవడో ఒకడు మగవాడి అండ కావాలి. అలివేలుకు వీరాస్వామి పరిచయం అయ్యాడు. వీరాస్వామి అక్కడున్న వాళ్ల మధ్య పెద్ద రౌడీ. బలాదూరుగా తిరుగుతూ, తాగుతూ, అందర్నీ భయపెడుతుంటాడు. ‘నాతో పెట్టుకోకు’ అంటూ బూతులు తిడుతుంటాడు. ‘రౌడీ వెధవ్వి నీతో మాకేంటిరా’ అనుకుంటూ అందరూ వాడ్ని తప్పించుకు తిరుగుతుంటారు.
అలివేలు కూలి పనికి వెళ్లేది. ఆ కొద్దిపాటి రోజు వారీ సంపాదనతోనే రోజులు నెట్టుకొచ్చేది.
కూతురు లచ్మి చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచీ రామచంద్ర రావుగారింట్లో పని చేస్తుండేది. ఇంటెడు చాకిరీ చేస్తే, రెండు పూటలా తిండి పెట్టేవారు. వాళ్లు ఇచ్చిన పాత బట్టలు కట్టుకునేది. వాళ్లింటోనే రోజంతా సరిపోయేది.
తల్లి కూలి పని చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి లచ్మి గుడిసె దగ్గర ప్రత్యక్షమయ్యేది. తల్లిని చూస్తేనే గాని మనసు కుదుట పడేది కాదు. అలివేలుకూ అంతే, కూతుర్ని చూడగానే ప్రాణం లేచి వచ్చేది. తినటానికి పిల్లకు ఏదో ఒకటి కొనుక్కొచ్చి, దాని నోటికి అందించేది.
‘నా సంపాదన అంతా వాడి తాగుడుకే సరిపోద్ది. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తే వాడు గద్దలా వచ్చి తన్నుకు పోయేవాడు. కన్నబిడ్డకు కడుపు నిండా తిండి కూడా పెట్టలేని నేను దేనికి బతకాలి?’ అని కుమిలిపోయేది.
రామచంద్రయ్యగారింట్లో కూరానారలతో తినే తిండి కన్నా కన్నతల్లి చేతులతో పెట్టే కారం మెతుకులే లచ్మికి రుచిగా ఉండేవి.
కాలం వస్తూ తనతో పాటో ఎన్నో మార్పులు తెస్తుంది.
ఎన్నో పండు వెన్నెలలు వచ్చాయి. వెళ్లాయి. లచ్మికి నిండు యవ్వనం వచ్చింది. ఒళ్లు విరుచుకుంటున్న సరికొత్త అందాలెన్నో చిరుగుల బట్టల్లో నుంచి తొంగిచూస్తున్నయి. ఎన్నడెరుగని ఊహ లేవో గుండెల్లో గుసగుసలాడుతున్నయి. అందరి కళ్లూ లచ్మి వైపే మళ్లుతున్నయి. కొందరు పోకిరి వెధవలు నోటి కొచ్చినట్లల్లా వాగుతుంటే మొదట్లో రెచ్చిపోయినా, తరువాత అదీ అనర్థమేనని నొచ్చుకునేది.
“మీ యమ్మ వీరాసామిని చూసుకుంది. నువ్వు ఎవళ్లనో ఒకళ్లని చూసుకో. నేను పనికిరానా?” అంటూ వెంటపడుతుంటే, పట్టపగలు కూడా ఇంటి దగ్గర ఉండటమే కష్టమైపోయేది. తల్లికి చెప్పుకొని ఏడిస్తే, ఆమె కన్నీళ్లతో కూతుర్ని గుండెలకు అదుముకునేది.
“కన్న కూతురికి కడుపు నిండా తిండి పెట్టలేను. ఒంటి నిండా కప్పుకోనికి బట్టలు ఇవ్వలేను. పోకిరి ఎదవల నుంచి కూతుర్ని కాపాడుకోలేను. ఈ ఎదవ బతుకు బతకటం కన్నా గోదారిలో దూకి సావటం మేలు” అని కుమిలి కుమిలి ఏడ్చేది.
రామచంద్రయ్య ఇంట్లో కూతురు పని చేయటాన్ని మాన్పించింది. ఆయన అలివేలును అడిగారు – “అది ఇంతప్పటి నుంచీ ఈ ఇంట్లో పెరిగింది. మా ఇంట్లో మనిషిలాగానే చూసుకున్నాం. కానీ ఇప్పుడు మా ఇంటికి పంపిచటానికే వెనకాడుతున్నావా?” అని.
“మీరు నాకు తండ్రి లాంటోరు. మీ ఇంట్లో ఉంటే దిగుల్లేదు. కాని లోకులు కాకులు బాబుగారు. అందులోనూ లేని వాళ్లంటే మరీ లోకువ. ఎదిగిన పిల్ల. నిలువ నీడలేని పేదోళ్ళం. ఉన్న పరువు కూడా పోతే.. దాని బతుకు నా బతుకులా కాకూడదు బాబుగారూ..” అన్నది అలివేలు.
“అది నిజమే, మా ఇంట్లో మగ పిల్లలున్నారు. ఏ సంబంధమూ లేని ఆడపిల్ల రోజూ రాత్రిళ్లు వచ్చి పడుకుంటుంటే, ఏదో ఒక సంబంధం అంటగడతారు. నీ ఇష్ట ప్రకారమే కానివ్వు..” అన్నాడు రామచంద్రయ్యగారు.
లచ్మి రాత్రిళ్లు ఆ గుడిసెలో పడుకోవటానికి వీరాస్వామి ఒప్పుకోలేదు.
“అది ఈడ పడుకోవటానికి ఈల్లేదు. అంతే” అంటూ తాగొచ్చి పెద్ద గొడవ చేశాడు.
“ఇది దానిల్లు. ఎదిగిన పిల్ల. రాత్రిళ్లు దానింట్లో అది పడుకోక ఇంకేడ పడుకుంటుంది” అని అలివేలు వాదించింది.
పెద్ద యుద్ధం జరిగింది. ఇరుగు పొరుగు గుడిసెల వాళ్లంతా బయటకొచ్చి నిలబడి చోద్యం చూశారేగాని, వీరాస్వామికి ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేకపోయింది.
“నా కూతురు నాతోనే ఉంటది. నువ్వే యాడికన్నా పో” అంటూ తెగేసి చెప్పింది. కూతుర్ని గుడిసెలోకి తీసుకెళ్లింది.
అర్ధరాత్రికి మురికివాడ సర్దుమణిగింది. అంతా గాఢ నిద్రలో ఉన్నారు.
వీరాస్వామి వచ్చి లచ్మి మీద పడ్డాడు. యుముడి లాంటి వాడి ఉక్కు కౌగిలి నుంచి విడిపించుకోవటానికి గిజగిజలాడింది. రక్కింది. గిచ్చింది, కొరికింది, అరిచింది.
అలివేలు లేచింది, వీరాస్వామితో కలియబడింది.
ఆ రాత్రి అలా గడిచిపోయింది.
కూలికి వెళ్తేగాని అలివేలుకు రోజు గడవదు. కూతుర్ని గుడిసెలో ఉంచితే రక్షణ లేదు. మళ్లీ రామచంద్రయ్యగారి కాళ్లు పట్టుకొని ఆయన ఇంట్లోనే దించివెళ్లింది.
రామచంద్రయ్యగారి కొడుకు వేణుగోపాల్ దగ్గర లచ్మికి చనువు. ఒక ఈడు వాళ్లు. ఎన్నో ఏళ్ల నుంచి ఆ ఇంట్లో కలిసి మెలిసి తిరిగుతున్నారు. ఏ చిన్న పనికావాల్సి వచ్చినా వేణుగోపాల్ లచ్మిని కేకేసేవాడు. ఆ చనువుతోనే అడిగింది.
“నాకో వెయ్యి రూపాయలు కావాలి” అని.
“జేబులో ఉంటయి, తీసుకో” అన్నాడు.
ఆ వెయ్యి రూపాయలు తీసుకుంది. ఇంట్లో నుంచి వచ్చేసింది.
ఆడది ఒంటరిగా బయట కొస్తే రక్షణ కరువవుతుందని ఇంట్లోనే తల్లి దగ్గరో, తండ్రి దగ్గరో ఉండమంటారు. కానీ అక్కడా రక్షణ కరువైతే, ఎక్కడికి పోవాలి? ఎక్కడికైనా సరే, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి.
రైలు ఎక్కింది. చెన్నయ్ చేరి హాటల్లో గిన్నెలు కడిగే పనిమనిషిగా జీవితం ప్రారంభించింది. ఎన్నో కష్టాలు పడింది. ఎన్నో అవమానాలు పొందింది. ఎంతో మంది కంట్లో పడింది. ఎక్‌స్ట్రా వేషాలు వేయటానికి ఒప్పుకుంది. యాడ్ ఫిల్మ్‌లో చిన్న వేషాలు వేసింది. ఒక సినిమా డైరెక్టర్ దృష్టి యాడ్ ఫిల్మ్‌లో నటించిన లచ్మి మీద పడింది.
అక్కడి నుంచీ ఆమె నటించిన సిన్మాలు ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. నటిగా స్థిరపడింది. కీర్త ప్రతిష్ఠలూ, సంపదా ఆమెకు అయాచితంగానే వచ్చాయి.
***
కారు స్టార్ హోటలు ముందు ఆగింది. లావణ్య కారు దిగి రూంలోకి వెళ్లింది.
ఆమె ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్లిందో తెల్సుకోవాలని అందరూ ఆసక్తి చూపినా ఆమె ఎవరికీ ఏమీ చెప్పలేదు.
ఒక ఇంగ్లీషు సినిమా పత్రిక విలేఖరి ఒకరు ఆమె ఇంటర్వూ కోసం ఫోను చేశారు.
ఆమె రమ్మన్నది. అతను వచ్చాడు.
అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆ పత్రికా విలేఖరి రామచంద్రయ్యగారి అబ్బాయి వేణుగోపాల్.
“అబ్బాయిగారూ మీరా?” అన్నది లావణ్య సంభ్రమాశ్చర్యంతో.
“నువ్వు ఇప్పుడు గొప్ప నటివి. నేను ఒక పత్రికా విలేఖరిని. నన్ను అబ్బాయిగారూ అనకూడదు” అన్నాడు నవ్వుతూ.
“నేను గొప్పనటినే అయినా, మిమ్మల్ని మర్చిపోయినట్లు నటించే గొప్పనటిని కాను బాబుగారూ. మీ అమ్మగారూ బాగున్నారా అబ్బాయిగారూ..” అన్నది లావణ్య.
“అంతా బాగానే ఉన్నారు. మా అమ్మ గురించి అడిగావు. మీ అమ్మ గురించి అడగలేదేం?”
“అడిగితే ఏం వినాల్సి వస్తుందోనన్న భయం అండీ.”
“నువ్వు ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయిన రోజే ఈ విషయం తెల్సి మీ అమ్మ, వీరాస్వామితో పెద్ద యుద్ధం చేసింది. నీ వల్లనే నా కూతురు నా నుంచి దూరంగా పారిపోయిందని వాడితో గొడవ పడింది. వీరాస్వామి తాగొచ్చి ఆ మైకంలో మీ అమ్మ గొంత పిసికి చంపేశాడు..”
లావణ్య భోరున ఏడ్చింది. వేణుగోపాల్ అన్నాడు.
“నీకు తెలియ జేయ్యాలని చూశాం. పేపర్లోనూ ప్రకటనలు ఇచ్చాను. కానీ చాలా కాలం దాకా నీ గురించి తెలియలేదు. మాకు తెల్సేటప్పటికి నువ్వు అందనంత ఎత్తుకు ఎదిగిపొయ్యావు..”
లావణ్య కన్నీరు తుడుచుకుంది.
“నీవు అనాథ పిల్లల కోసం అజ్ఞాతంగా ఒక ఆశ్రమం నడుపుతున్నావని తెల్సింది. ఆ విషయాన్ని హైలైట్ చేస్తూ రాద్దామనుకుంటున్నాను..” అన్నాడు వేణుగోపాల్.
“వద్దు అబ్బాయిగారూ.. గతం నాకు మిగిల్చిన చేదు అనుభవాలు నాలాంటి దురదృష్టవంతులకు కలగకూడదన్న అభిప్రాయంతో, ఆ ఆశ్రమం నడుపుతున్నానే గాని, అందువల్ల కొంత పబ్లిసిటీ పొందాలని కాదు. నాకు కరువైన రక్షణ నాలాంటి వాళ్లకు కల్పించాలన్నదే, నా ఉద్దేశం” అని నిట్టూర్చింది.
“ఇంకా వివరాలేమైనా..”
“మీకు తెలియని వివరాలేమీ లేవు. ఎన్నో కష్టాలు పడ్డాను. కడవల కొద్దీ కన్నీళ్లు కార్చాను. ఎవరెవరి చేతుల్లోనో నలిగిపోయాను, అవన్నీ నలుగురి చేతుల్లో నలిగే పత్రికలకు ఎక్కించకండి.” అంటూ లావణ్య రెండు చేతులూ ఎత్తి అబ్బాయిగారికి నమస్కరించింది.
“అలాగే” అన్నాడు వేణుగోపాల్.
ఆమె బ్లాంక్ చెక్ మీద సంతకం చేసి ఇచ్చింది. “మాకు వచ్చే ఆదాయంలో నాలుగో వంతు పబ్లిసిటీ కోసం ఖర్చు చేస్తాం. మీరు ఆనాడు ఇచ్చిన వెయ్యి రూపాయలతోనే ఇంత దాన్ని అయ్యాను. మీరు ఇవాళ రాయబోయేది నన్ను మరి కొన్ని మెట్లు ఎక్కెస్తుంది. ఈ మెట్ల అన్నీ, మీరు ఎక్కించినవే. ఎంత ఇచ్చినా మీ రుణం తీరదు. అందుకు కృతజ్ఞతగా బ్లాంక్ చెక్ ఇస్తున్నాను. మీకు కావాల్సినంత తీసుకోండి” అన్నది లావణ్య.
“నాకు వృత్తి రీత్యా చాలా మంది ఎంతో కొంత ఇస్తామంటుంటారు. ఇది మాకు మామూలే. కానీ నేను ఎవరి దగ్గరా ఏమీ తీసుకోను. అది నాకు నేను విధించుకున్న షరతు. కానీ నువ్వు అడిగావు కాబట్టి ఆ రోజు నీకిచ్చిన వెయ్యి రూపాయలు మాత్రం తీసుకుంటాను.. అక్కడకి నీ ఉన్నతిలో నా భాగం ఏదీ లేదని చెప్పటానికే” అన్నాడు వేణుగోపాల్.
“మీరు ఎప్పుడూ గొప్పవారే. ఇవాళ హిమగిరి శిఖరం అంత ఎత్తున కనిపిస్తున్నారు” అన్నది లావణ్య లేచి నిలబడి వంగి కాళ్లకు నమస్కారం చేస్తూ.