చేజారిన సొమ్ము
[dropcap]శ[/dropcap]శిరేఖ వంచిన తల ఎత్తకుండా వ్యాసం రాసేస్తోంది. ఇంకో గంటలో దానిని పూర్తి చేసి ఎడిటర్‍కి చూపించాలి. పత్రికలో రేపటి పేజీలో అంది ప్రింట్ కావాలి. కొలీగ్ కాఫీకి రమ్మని పిలిచింది. రానని చెప్పింది.
ఇంతలో ఎడిటర్ దగ్గర నుంచి పిలుపు వచ్చింది. రాసేటప్పుడు మధ్యలో బ్రేక్ పడితే, భావవాహిని ఆగిపోతుంది. అయినా తప్పదు గనుక వెళ్ళింది.
“నువ్వు రేపు ఉదయం ప్రతిమాదేవి గారి దగ్గరకు వెళ్ళి ఆమెను ఇంటర్వ్యూ చెయ్యాలి. ఆమెకు ఫోన్ చేసి ఎన్ని గంటలకు రమ్మంటారో కనుక్కో. ఈలోగా ఆమెను అడగాల్సిన క్వశ్చనీర్ తయరు చేసుకో” అన్నాడు ఎడిటర్.
“రేపు నన్ను స్పెషల్ ఇష్యూకి ఆర్టికల్ రాయమన్నారు. ఆమె దగ్గరకు ఇంకెవరినన్నా పంపకూడదాండీ?” అని అడిగింది శశిరేఖ.
“పంపించవచ్చు. కానీ ఆమె ప్రత్యేకించి నీ పేరు చెప్పింది. నిన్నే పంపించమన్నారు” అన్నాడాయన.
శశిరేఖ ఆశ్చర్యపోయింది. ఒక పెద్ద పత్రిక ఆపీసులో తను ఒక రిపోర్టర్ మాత్రమే. తన గురించి ప్రముఖ రాజకీయ నాయకురాలు, వ్యాపారవేత్త అయిన ప్రతిమాదేవికి ఎలా తెల్సు అన్నదే జవాబు దొరకని ప్రశ్న అయింది.
శశిరేఖ తన సీటుకు వచ్చి ప్రతిమాదేవి ఫోన్ నెంబరు కోసం ప్రయత్నించింది. ఆమె నెంబర్లు తేలికగానే దొరికాయి. రెండు సార్లు ప్రయత్నిస్తే రెస్పాన్స్ లేదు. ఒక గంట తరువాత ఆమెతో మాట్లాడగలిగింది. తన పని గురించి ఆమెకు చెబితే, “రేపు మధ్యాహ్నం లంచ్‍కి రా. తీరికగా మాట్లాడుకుందాం” అన్నదామె ఎంతో పరిచయం ఉన్నదానిలాగా.
శశిరేఖ ఆశ్చర్యపోయింది. ఆమెకు ఫోన్ చేయటానికే తను వెనుకాడింది. ఆమె ఏకంగా లంచ్‍కి రమ్మన్నది. ఇది నిజమా? లేక తను వేరే ఎవరో అనుకొని ఆమె పొరపాటు పడుతున్నదా – అన్న సందేహమూ వచ్చింది.
అప్పుడప్పుడు ఇతరుల ద్వారా వినటం, పేపర్లలో ఆమె ఫొటోలు చూడడం తప్ప, ప్రతిమాదేవి గురించి శశిరేఖకు అంతగా తెలియదు. ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలంటే ఆ వ్యక్తిలోని గొప్పదనం ఏమిటి, ప్రత్యేకత ఏమిటి, అలాగే ఆ వ్యక్తి గురించిన విమర్శలు ఏమిటి – అనే అంశాలను ఆ వ్యక్తి చేతనే చెప్పించాలి. అందుచేతనే ముందుగానే కొంత విషయం సేకరించుకొని వెళ్ళాలి. తనతో పని చేసే ఇద్దరు ముగ్గురు సీనియర్లను ఆమె గురించి అడిగితే, ఏవో రెండు మూడు చిన్న చిన్న విషయాలు చెప్పారు తప్ప, ఆమెను పాజిటివ్‍గా గానీ, నెగటివ్‌గా గాని హైలైట్ చేయటానికి పనికొచ్చే అంశాలేమీ తెలియలేదు. ఇంక ఆమె ద్వారానే అన్ని విషయాలూ సేకరించాలని శశిరేఖ అనుకున్నది.
ఆమె ఇల్లు ఎక్కడో తెల్సుకున్నది.
మర్నాడు వర్షం. ముసురు. తెరిపి లేకుండా వాన పడుతూనే ఉంది. ప్రతిమాదేవి ఉండేది శ్రీమంతులుండే పోష్ ఏరియా. శశిరేఖ ఇంతకు ముందు ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు. ఆటో చేసుకుని వెళ్ళింది. ఇల్లు వెతుక్కుని గేటు ముందున్న నేమ్ ప్లేట్ చూసుకుని, గేటు తీసుకుని లోపలికి వెళ్ళింది. లాన్ దాటి పోర్టికో దగ్గరకు వెళ్ళేటప్పటికి కుక్కలు మొరిగాయి. నౌకరు ఎదురుపడ్డాడు.
“అమ్మగారు, పొద్దుటే ఢిల్లీ వెళ్ళారు” అని చెప్పాడు.
“ఎప్పుడొస్తారు?”
“తెలియదు” అన్నాడు నౌకరు.
శశిరేఖ అయిష్టం గానే అక్కడకు వెళ్ళింది. అందుకు కారణాలు రెండు. ఆమె గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన విషయాలేమీ తెలియదు. ఆమెనే చెప్పమనటం భావ్యం కాదు. రెండోది ఈ ఇంటర్వ్యూని ఎలా క్లిక్ చేయాలో తెలియదు. దీనికి తోడు ఇవాళ కంప్లీట్ చేయాల్సిన ఆర్టికల్ ఒకటి ఉంది. ధ్యాస అంతా దానిమీదే ఉంది.
ఇంత దూరం వచ్చినా ఆమె లేనందుకు బాధ పడకపోగా, పెద్ద రిలీఫ్‍గా ఉంది.
ఆఫీసుకు వెళ్ళి, ఆమె ఢిల్లీ వెళ్ళిన విషయం ఎడిటర్‍కి చెప్పి, తన పనిలో మునిగిపోయింది.
వారం రోజుల తరువాత ప్రతిమాదేవి ఎడిటర్‍కి ఫోన్ చేసింది. ఆయన శశిరేఖకు చెప్పాడు. శశిరేఖ ఆమెకు ఫోన్ చేసింది, ఎప్పుడు రమ్మంటారో టైం తెలుసుకునేందుకు.
మర్నాడు మధ్యాహ్నం పన్నెండింటికి రమ్మన్నది.
ఆ సమయానికే శశిరేఖ ఆమె ఇంటికి వెళ్ళింది. ఆమెను చూడటం ఇదే మొదటిసారి. యాభై ఏళ్ళ కన్నా ఎక్కువ వయసుండదు. పొడుగుకు తగిన లావు. విశాలమైన నుదురు. తీర్చిదిద్దినట్టున్న కనుముక్కు తీరు. చూడగానే ఆకట్టుకునే విలక్షణమైన అందం ఆమెది. సన్నని సిల్క్ చీర ఆమె అందాన్ని ఇనుమడింప చేస్తున్నది.
శశిరేఖను సోఫాలో కూర్చోమన్నది. ఎదురుగా ఆమె కూర్చున్న తీరులో ఠీవి, దర్పం కనిపిస్తున్నాయి.
“కిందటి వారం సడెన్‍గా ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది” అంటూ ఆ రోజు కేంద్ర మంత్రిని కలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది. దాన్ని బట్టి ఆమె పలుకుబడి ఎంతటిదో అర్థం అయింది.
రెండు మూడు నిముషాల కోసారి ఆమె ఫోన్‍లు మోగుతూనే ఉన్నయి. అవతల నుంచి మాట్లాడుతున్న వాళ్ళు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అని తెలుస్తూనే ఉంది.
“భోజనం చేసి మాట్లాడుకుందాం” అని అన్నది ప్రతిమాదేవి.
“నేను భోం చేసి వచ్చాను. మీరు భోం చేయండి. నేను వెయిట్ చేస్తాను” అన్నది శశిరేఖ.
“అదేంటి, నేను భోజనానికి రమ్మన్నాను కదా..” అన్నది ఆమె.
అది కిందటి వారం కదా – అని గుర్తు చేయలేకపోయింది శశిరేఖ. పెద్దవాళ్ళతో ఇదే చిక్కు. వాళ్ళ మనసులో ఉన్నదేమిటో తెలిసీ తెలియనట్టే ఉంటుంది. వాళ్ళకు అదీ అలంకారప్రాయంగానే కనిపిస్తుంది.
“ఏం తీసుకుంటావు? వయసులో నాకన్నా చిన్నదానివి. నిన్ను ఏకవచనంలో సంబోధిస్తాను. ఏమీ అనుకోకు” అనీ అన్నది.
“నేను మీకన్నా అన్ని విషయాలలోనూ చాలా చాలా చిన్నదాన్ని. నన్ను ఏకవచనంలో పిలిస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది. పైగా ఏకవచనంలో పిలిస్తే – మనుషులూ, మనసులూ దగ్గర అయినట్లు అనిపిస్తుంది” అన్నది శశిరేఖ, జేబుగుడ్డతో ముఖం తుడుచుకుంటూ.
“అవును. నువ్వు నా కూతురు లాంటి దానివి. నిన్ను శశీ అనే పిలుస్తాను. బాత్‌రూం లోకి వెళ్ళి మొహం కడుక్కుని రా.. నీ కోసం ఫ్రెష్‍గా ఫ్రూట్ జ్యూస్ తెప్పిస్తాను” అన్నది ప్రతిమాదేవి.
శశిరేఖ బాత్‍రూమ్ లోకి వెళ్ళింది. బాత్‍రూమ్ అయినా బెడ్‍రూమ్ అంత విశాలంగా ఉన్నది. అధునాతన సదుపాయాలన్నీ ఉన్నయి. శశిరేఖ ముఖం కడుక్కొని, టవల్‍తో ముఖం తుడుచుకొని వచ్చింది.
ఇల్లు చూద్దువుగాని రమ్మంటూ గదులన్నీ చూపించింది. పాలరాతి మందిరంలా ఉన్న ఆ ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చయి ఉంటుందోనని శశిరేఖ ఆశ్చర్యపోయింది.
“మనం మేడ మీద గదిలో కూర్చుందాం” అంటూ మేడ మీద డ్రాయింగ్ రూమ్‍లోకి తీసుకెళ్ళింది. ఇద్దరూ సోఫాల్లో కూర్చున్నారు.
నౌకరు బయట నుంచి ఫ్రూట్ జ్యూస్, ఐస్ క్రీమ్ తీసుకొచ్చి మధ్యలో నున్న టీపాయ్ మీద పెట్టాడు. మిగిలిన చిల్లర డబ్బులూ అక్కడ పెట్టాడు. ఆ సమయంలో ఒక అయిదు రూపాయల బిళ్ళ దొర్లుకుంటూ వెళ్ళి సోఫాల క్రింద పడిపోయింది. నౌకరు దానిని వెతకటం మొదలుపెట్టాడు.
శశిరేఖ లేచి నిలబడింది. సోఫా కొద్దిగా పక్కకు జరిపి చూశాడు. అయినా అది దొరకలేదు.
నిర్లక్ష్యంగా ఉన్నందుకు ప్రతిమాదేవి నౌకరు మీద కేక లేసింది.
“అయిదు రూపాయల కోసం కాదు. మనది అనుకున్నది ఏదైనా సరే, చెయ్యి జారిపోతే, మనసు ఎప్పుడూ దాని కోసమే మథన పడుతూ ఉంటుంది..” అనీ అన్నది.
ఐస్‍క్రీమ్‍లూ, ఫ్రూట్ జ్యూస్‍లూ అయినాకా, శశిరేఖ ఇంటర్వ్యూ చేయటం మొదలుపెట్టింది. “మీరు రాజకీయాల్లోకి రావటానికి దోహదం చేసిన విషయాలు ఏమిటి?” అని అడిగింది.
“నేను ఇప్పుడు చెప్పేది ఏదీ నువ్వు రాసుకోవద్దు. ఎందుకంటే రాజకీయ నాయకులు వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే ఏం చేయాలనుకుంటున్నారో చెబుతారు. తీరా గెలిచాకా, ఎందుకు చేయలేకపోయారో చెబుతారు. కనుక నేను అలాంటి స్టేట్‍మెంట్స్ ఇవ్వదలచుకోలేదు. రాజకీయాల్లో, బిజినెస్‍లో, గ్లామర్ ఫీల్డ్‌లో ఒక వ్యక్తి ప్రముఖుడు కావచ్చు. అంత మాత్రాన అతని జీవితంలోని ప్రతి విషయమూ జనానికి తెలియవల్సిన పని లేదు. ప్రముఖులకీ ప్రైవేటు జీవితం ఉంటుంది. ఆ ప్రైవేట్ లైఫ్‍లో ఎన్నో ఎత్తుపల్లాలు, సాధించిన ఘనకార్యాలతో పాటు, కొన్ని చీకటి కోణాలూ ఉంటయి.. ఇవాళ నీతో మనసు విప్పి మాట్లాడుకోవటానికి పిల్చాను. అందుచేత ఇవన్నీ నువ్వు పత్రికలో రాయవద్దు” అంటూ కళ్ళు మూసుకుని ఆలోచనల్లో మునిగిపోయింది.
“నా మనసులోని విషయాలు చెప్పాలని నిన్ను రమ్మన్నాను. కానీ చెప్పలేకపోతున్నాను. గడియ పడిన ఈ మనసు తలుపు తీసి ఎంతో కాలం అయింది. ఇన్నేళ్ల తరువాత ఆ తలుపు తీయాలంటే కష్టంగా ఉంది..”
“అవి నేను కాలేజీలో చదివే రోజులు. అప్పటి నుంచీ నాకో ఫీలింగ్ ఉండేది. నేను అందరి కన్నా గొప్పదాన్ని అనీ, నాకు అన్నీ తెల్సు అనుకునేదాన్ని. ఆ వయసు ప్రభావం అలాంటిది. చదువులో, ఆటల్లో, పాటల్లో నాటకాల్లో అన్నిట్లో నేను అందరికన్నా ముందుండేదాన్ని. అది చాలు గదా గర్వపడడానికి. కాలేజీలో స్టూడెంట్ లీడర్ పోస్టుకి ఎన్నికలు జరిగాయి. నేను పోటీ చేశాను. పెద్ద మెజారిటీతో గెలిచాను. అదంతా నాకున్న గ్లామర్ అనుకున్నాను. కానీ తరువాత తెలిసింది నా మీద పోటీ చేసిన శ్రీకాంత్ కూడా తన ఓటు నాకే వేశాడనీ, నా గెలుపు కోసమే కృషి చేశాడని. అతను కంగ్రాట్స్ చెప్పినప్పుడు అడిగాను – ఎందుకిలాంటి పిచ్చి పని చేశావని. మనిషికి మైకం కమ్మినప్పుడు, – ‘ప్రేమ మైకం’ కమ్మినప్పుడు అన్నీ పిచ్చి పనులే చేస్తుంటాడని చెప్పాడు. ‘నీతో పోటీ పడాలని సరదా కొద్దీ పోటీ చేశాను గానీ, నిన్ను ఓడించాలని కాదు. నువ్వు గెలిచే ప్రతి గెలుపూ, నా గెలుపు గానే అనిపిస్తుంది’ అన్నాడు.”
“ఎన్నికల్లో గెలిచానే గానీ, కాలేజీ ఈవెంట్స్‌లో ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియదు. అన్నీ అతనే చేసి పెట్టేవాడు. ‘థాంక్స్’ చెబితే, ‘ఇష్టమైన వాళ్ళ కోసం కష్టపడటంలో ఉన్న ఆనందానికి అవధులే ఉండవు’ అని చెప్పేవాడు. నాకు తెలియకుండానే అతనికి సన్నిహితురాలిని అయ్యాను. విహారయాత్రలకు వెళ్ళినప్పుడు మా స్నేహం హద్దులు దాటింది. వయసూ, మనసూ తొందర పెడుతూ, ముందుకు తోసినప్పుడు, మంచి చెదుల విచక్షణా జ్ఞానమే ఉండదు. అలౌకికమైన ఆనంద పారవశ్యంలో పరిణామాల గురించిన చింతన ఉండదు. అయిదారు నెలలు తెలియని భయంతో తలొంచుకొని తిరిగాను. ప్రతి చర్యకూ ప్రతిచర్య ఉంటుంది. పెద్దవాళ్ళకు తెలియటం, అప్పటికే పరిస్థితి చెయ్యి దాటి పోవటం జరిగింది. ఒక ప్రైవేటు నర్సింగ్ హోమ్‍లో ఒక రోజు రాత్రి ఆడపిల్లను ప్రసవించాను. నిన్నటి దాకా కడుపులో దాచుకున్న బిడ్డను, ఇప్పుడు ఎక్కడ దాచాలో తెలియని దౌర్భాగ్య పరిస్థితి. బిడ్డను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంటే, గుండెల్లో బరువు.. బిడ్డను ఎవరో తీసుకుని వెళ్తుంటే – అప్పుడూ గుండెల్లోనే బరువు. కనిపించని ఈ మమతానుబంధాలు ఎంత బలమైనవో, వాటిని తెంచుకోవటం ఎంత కష్టమో తెలిసే కొద్దీ కళ్ళవెంట కృష్ణా గోదావరీ నదులు పొంగి ప్రవహించాయి. ఆ రోజు రాత్రి ఆ పసికందును ఒక అనాథ శరాణాలయం ముందు వదిలివేశాము. ఒక ఆయా ఆ పాపను అక్కున చేర్చుకోవటమూ దూరం నుంచి చూశాము.”
“స్త్రీకి మాతృత్వం ఒక వరం అంటారు. కొంతమందికి వరాలే శాపాలు అవుతయి. కన్నబిడ్డను దగ్గరకు తీసుకుని ఆలనా పాలనా చూడలేని తల్లి హృదయం ఎంతగా పరితపిస్తుందో అనుభవించిన వాళ్ళకు గాని తెలియదు.. కాలేజీ రోజుల్లో అందరికీ లీడర్‍గా, ఆదర్శప్రాయంగా ఉన్నాననుకున్నాను. కానీ వ్యామోహంలో పడిపోయి, నా పతనానికి నేనే కారణం అయ్యాను. అయితే నా జీవితం పడిలేచే కెరటం లాంటిది. జరిగినదంతా శని ప్రభావం అనుకున్నాను. శని కూడా మేలు చేస్తాడని అంటారు. ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో కోడలిగా అడుగుపెట్టాను. మా మామగారి వారసత్వం వల్ల రాజకీయాల్లోకి దిగాల్సి వచ్చింది.”
“అందరు రాజకీయ నాయకుల లాగానే, పలుకుబడిని ఉపయోగించి వ్యాపారాలూ మొదలుపెట్టాను. అవీ మంచి పేరుతో పాటు, ఐశ్వర్వాన్ని సమకూర్చాయి. ఇన్ని ఉన్నా, ఏం సంపాదించాను, ఏం పోగొట్టుకున్నాను – అని బేరీజు వేసుకున్నప్పుడు, సంపాదించినదంతా ఒక ఎత్తు అయితే, పోగొట్టుకున్న పాప ఒక్కతీ ఒక ఎత్తు అనిపిస్తుంది. ఎన్ని ఉన్నా ఏదో వెలితి.. పిల్లలు లేరు. ఒక పిల్ల ఉన్నా, అందుకోలేని స్థితిలో ఉన్నాను. మనసు మూలల్లో ఎక్కడో చీకట్లో నిస్సహాయంగా ఏడుస్తున్న పసిపాప మెదలుతుంటుంది. ఆ పసికూన ఈ తల్లిని క్షమిస్తుందా? పోనీ భగవంతుడు క్షమిస్తాడా? లోకం దృష్టిలో నేను గొప్పదానిని. పరువు ప్రతిష్ఠలు నా ఇంటి ముందు కాపలా కుక్కలా ఉంటాయి. కానీ..”
ఇందాకటి ఠీవి, గాంభీర్యం ఇవేమీ ఇప్పుడు ఆమెలో లేవు. బేలగా ఏడుస్తున్న ఒక తల్లి, ఒక స్త్రీ ఆమెలో కనిపిస్తోంది. పెల్లుబికి వస్తున్న కన్నీరు తుడుచుకుంటోంది.
కొంచెం సేపు చెప్పటం ఆపేసింది. బాత్‍రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చింది.
“నా పాప ఈపాటికి నీ అంత వయసు పిల్ల అయిఉంటుంది.. నా కథ విన్నావు కదా.. నా మీద నీకు ఏ మూలనన్నా జాలి కలిగిందా? నిన్ను పెంచుకుంటాను. ఈ తల్లి దగ్గరకు వస్తావా?” అని అడిగింది ప్రతిమాదేవి ఎగబీలుస్తూ.
“మీరు తల్చుకుంటే, మీ దగ్గరకు ఎగిరి గంతేసి వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. నన్నే ఎందుకు అడుగుతున్నారు?” అని అడిగింది శశిరేఖ.
ఆమె ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. “ఎన్ని కోట్లు ఉన్నా, మనదీ అనుకున్నది, మనది కాకపోతే, మనసు దాని కోసమే పరితపిస్తుంటుంది..” అన్నది.
ఇంకొంచెం సేపు గడిచాకా, ఆమె బలవంతం మీద శశిరేఖ ఆమెతో కల్సి భోం చేసింది.
బయల్దేరేటప్పుడు “నీకు వీలున్నప్పుడల్లా వస్తూండు. ఇది నీ ఇల్లే అనుకో.. నాకూ ఖాళీ ఉన్నప్పుడు నీకు ఫోన్ చేస్తాను. వస్తూ ఉండు. వస్తూ పోతూ ఉంటే, అనుబంధం బలపడుతుంది..” అన్నది ప్రతిమాదేవి.
“అలాగే.. మీరు గొప్ప రాజకీయవేత్తలు.. మీ దగ్గరకు ఏదో పని మీద ఎంతో మంది వస్తుంటారు. ఇక నుంచీ నేనూ వస్తుంటాను..” అన్నది శశిరేఖ.
ఇద్దరి మనసుల్లో ఏదో బయటికి చెప్పుకోలేని ఉద్విగ్నత ఉన్నది. బరువైన హృదయాలతో విడిపోయారు.
శశిరేఖ ఇంటికి వెళ్ళాక, తల్లిని మాటల్లో పెట్టి, ఒక ప్రశ్న వేసింది –
“అమ్మా, నేను నీ కూతుర్నేనా?” అని.
ఆ మాత్రం దానికే ఆ తల్లి మొహంలో కలవరం కనబడింది.
“ఎందుకలా అడుగుతున్నావు? నీకు నేను ఏం లోటు చేశాను?” అని అన్నది.
“ఏం లేదు. ఒక శ్రీమంతురాలు నన్ను పెంచుకుంటాను, రమ్మన్నది. వెళ్ళమంటావా?” అన్నది శశిరేఖ నవ్వుతూ.
“నేను పేదదాన్ని. నాకు ఉన్నంతలో ఏ లోటూ లేకుండానే పెంచాను. అయినా ఐశ్వర్యం ముందు పేదరికం ఎప్పుడూ వెలాతెలా పోతూనే ఉంటుంది.. వెళ్ళు.. సిరి రా మోకాలు అడ్డటం.. ఎందుకు.. వెళ్ళు” అన్నది ఆ అమ్మ.
“ఊరికే అన్నానమ్మా.. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తాను?” అన్నది శశిరేఖ అమ్మ భుజం మీద వాలిపోయి, మెడ చుట్టూ చేతులు వేసి.
శశిరేఖ మర్నాడు ఎడిటర్‍తో చెప్పింది, “సర్, ప్రతిమాదేవి గారి ఇంటర్వ్యూ నేను రాయటం లేదు..”
“ఎందుకని?”
“ఆమె చెప్పింది ఏదీ రాయటానికి వీల్లేనిది. అలాగే ఆమె చెప్పనిది కూడా రాయటానికి వీల్లేదు కదా..” అన్నది శశిరేఖ.
“మరి, ఆమె ఫోన్ చేసి అడిగితే, ఏం చెప్పాలి?”
“నేనే మీ ముందు ఫోన్ చేసి, ఆమె కన్నా ముందే అడుగుతాను” ఆంటూ ఆమెకు ఫోన్ చేసింది.
“నేను శశిరేఖను, రిపోర్టర్‌ని. బావున్నారా? ఇంతకీ పోయిన ఆ అయిదు రూపాయల కాయిన్ దొరికిందా?”
“దొరకలేదు. ఏ కార్పెట్ కిందో ఉంటుంది. కళ్ళ ముందే చూశాం గదా.. ఎక్కడికి పోతుందిలే..” అన్నది ప్రతిమాదేవి.
ఎడిటర్ అడిగాడు – “ఈ కాయిన్, కార్పెట్‍ల గొడవ ఏంటి?”
“అదొక రకమైన భాష.. భాష ప్రయోజనం, మనసులోని భావాన్ని ఇతరులకి తెలియజెయ్యటమే గదా..” అని నవ్వింది శశిరేఖ.