చిరుజల్లు-56

0
2

శేష ప్రశ్న

[dropcap]రా[/dropcap]త్రి పది గంటలు అయింది.

హాస్పిటల్ లోని వార్డులన్నీ నిశ్శబ్దం ముసుగు కప్పుకుని నిద్రపోతున్నయి. దూరంగా ఎవరో దగ్గుతున్న శబ్దం సన్నగా వినిపిస్తోంది.

నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ చరణ్‌దాస్ ఫోన్ చూసుకుంటున్నాడు. డాక్టర్ నళిని పత్రిక తిరిగేస్తూ నవ్వుకుంటోంది. “ఏంటీ నవ్వుతున్నావ్?” అని అడిగాడు చరణ్‌‌దాస్.

“ఏదో జోక్ లెండి” అన్నది నళిని.

“ఏంటో చెప్పు, నేనూ నవ్వుతాను గదా..”

“ఏం లేదు. మరో రెండేళ్లల్లో మన రాష్ట్రంలో నిరక్షరాస్యత నిర్మూలిస్తామని మంత్రిగారు బహిరంగ సభలో చెప్పారుట..”

“ఇప్పటికే చాలా వరకు నిర్మూలించారు గదా.. టీవీల్లో కార్యక్రమాలు చూస్తే తెలుస్తోంది..”

“ఓ, మీరు టీవీ చూస్తుంటారా?” అని ఆశ్చర్యంగా అడిగింది నళిని.

చరణ్‌దాస్ సీనియర్ డాక్టర్. నళిని ఈ మధ్యనే చేరిన జూనియర్ డాక్టరు.

“ఇంటికి వెళ్లాక చేసే పని అదే గదా.. ఇంట్లో గంభీరమైన నిశ్శబ్ధం. ఖాళీగా కూర్చుంటే గత జ్ఞాపకాలు మానుతున్న గాయాలను రేపుతుంటయి. ఆ బాధలోనే తెల్లారిపోతుంది..” అన్నడు చరణ్‌దాస్.

“అదేమిటండీ మీరు పెద్ద పేరు ప్రఖ్యాతలు గడించిన డాక్టరు. ఎవరిని కదిలించినా మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసి మాట్లాడుతారు. బోలెడంత సంపాదన. అందరూ మిమ్మల్ని చూసి ఈర్ష్య పడే స్థాయిలో ఉన్నారు. మీరు చూస్తే నిరాశానిస్పృహలతో మాట్లాడుతుంటారు. మీ శ్రీమతిగారు కూడా డాక్టరు అయినందు వలన మీరు ఒంటరిగా ఫీలవుతుంటారనుకుంటా..” అన్నది నళిని పత్రిక పక్కన పడేసి, చరణ్‌దాస్ వంకే చూస్తూ.

“అదో పెద్ద కథ” అన్నాడు చరణ్‌దాస్.

వార్డులో నుంచి ఎవరో పేషెంట్ ఆయాసపడుతోందని నర్స్ వచ్చి చెప్పటంతో ఇద్దరూ లేచి వార్డులోకి వెళ్లి పేషంట్‌ను చూసి వచ్చారు.

“అతను ఇంక ఒకటి రెండు రోజులు కన్నా బతకడు” అన్నాడు చరణ్‌దాస్.

“అవును. మృత్యువు తరుముకొస్తోంది..”

ఒక నిముషం ఇద్దరి మధ్యా నిశ్శబ్దం రాజ్యమేలింది.

“మనిషి చనిపోతే, అక్కడితో అతనికి బాధ నుంచి విముక్తి లభిస్తుంది. కానీ మనిషి బ్రతికి ఉండగానే, ‘మనసు’ చనిపోతే అది భరించలేని భయంకరమైన శిక్ష..” అన్నాడు చరణ్‌దాస్.

“అందరి బాధలను ఇట్టే నివారించే మీరు బాధపడటం ఏమిటండీ” అన్నది నళిని.

“ఒక మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే విషయాలు చాలా ఉంటయి. సగం జీవితం మనల్ని కన్నవాళ్ళని సంతృప్తి పరచటంలో గడిచిపోతుంది. మిగిలిన సగం మనం కన్నవాళ్లను సంతృప్తి పరచటంలోనే సరిపోతుంది. ఇలా అంటి పెట్టుకుని ఉన్నవాళ్ళు సరిగా లేకపోతే, అదే పెద్ద నరకం..”

“అదేంటండీ.. అయిన వాళ్ల కోసం చేసే పనిలో ఎంతో తృప్తి, సంతోషం ఉంటాయని అంటారు గదా.. వాళ్లు లేని జీవితం ఎంత నిర్జీవంగా ఉంటుంది?”

“అందరి మనుషులూ ఒకేలా ఉండరు. అంచేత అందరి జీవితాలు ఒకేలా ఉండవు. ఒకరికి మంచి అనిపించిందీ, గొప్ప విషయం అనిపించిందీ, మరొకరికి చెడుగా అనిపిస్తుంది. ఈ మంచి చెడులకు గల నిర్వచనాలు మనకు మనం ఇచ్చుకున్నవే గదా.. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న కొంచెం అమాయకుడు. ఏదీ పట్టించుకునే వాడు కాదు. ఇంటి భారం చాలా వరకు మా అమ్మనే భరించింది. మా అమ్మ పంచప్రాణాలూ నా మీదనే పెట్టుకొని బ్రతుకుతోంది.. నేను ఏరి కోరి రజనిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా అంత అదృష్టవంతుడు లేడనుకున్నాను.. క్రమంగా వాస్తవం కళ్లముందు నిలబడింది. మా అమ్మకి, రజనికీ అస్సలు సరిపడేది కాదు. ఇద్దరూ ఒకే ఒరలో నున్న రెండు కత్తుల్లా ఉండేవాళ్లు. ఇంట్లో ఉన్నంత సేపూ ఒకరితో మాట్లాడితే మరొకరికి కోపం. అది రకరకాలుగా వ్యక్తమయ్యేది. మనశ్శాంతి లేకుండా పోయింది. అర్థం చేసుకొని సర్దుకుపోదామనే తత్వం ఎవరికీ లేదు. కొంచెం సహనం, కొంచెం ఓర్పు, కొంచెం ప్రేమ ఉంటే, వాదోపవాదాలు, ఘర్షణలు ఉండవు గదా అంటే, ఎవరికీ చెవికి ఎక్కేది కాదు. పోట్లాడలతో విసిగిపోయాను. జీవితం నరకం అయింది..” అన్నాడు చరణ్‌దాస్.

“నిజమే. ఇద్దరూ కావాల్సిన వాళ్లే. అసలు గొడవలు ఎందుకొచ్చాయి?” అని అడిగింది నళిని.

“అహం. దేన్ని అయినా భరించగలం గాని అహాన్ని భరించలేం.. నేనే గొప్ప అన్న అహంభావం..”

“ఒక వేళ ఆమె మనసు మార్చుకుని మీ దగ్గరకు వస్తే, మీరు ఆమెను మళ్లీ రానిస్తారా? అది ఆమె ఇల్లే గదా..” అన్నది నళిని.

“జరగని వాటి గురించి ఎందుకు సీరియస్‌గా ఆలోచించటం? తిరిగి రాదు.. ఇద్దరి మధ్యా ఇప్పుడు.. పాయింట్ ఆఫ్ నో రిటర్న్.. దూరం పెరిగిపోయింది” అన్నాడు చరణ్‌దాస్.

“మీరు ఇద్దరూ డాక్టర్లు. లోకాన్ని చూసిన వాళ్లు. తెల్లారి లేస్తే, ఎన్నో రకాల మనుషులు, ఎన్నో రకాల వ్యక్తిత్వాలు.. ఒక విస్తృత ప్రపంచాన్ని చూసిన వాళ్లు.. అయినా చిన్న సర్దుబాటు చేసుకోలేకపోతున్నారు..” అన్నది నళిని.

“డాక్టర్లు కూడా మనుషులే, నళిని.” అన్నాడు చరణ్‌దాస్.

అంతటితో ఆ సంభాషణ ఆగిపోయింది.

చరణ్‌దాస్ కుర్చీలో కూర్చునే కునికిపాట్లు పడుతున్నాడు.

పన్నెండు గంటలు అయింది.

ఎమర్జన్సీ కేసు.. అరవై ఏళ్ల వ్యక్తి.. గుండెపోటుతో వచ్చాడు. చరణ్‌దాస్, నళిని ఇద్దరూ లేచి వార్డులోకి వెళ్లారు.

కొన్ని పరీక్షలు చేసి, నిద్రపోయేలా చేసి వచ్చి కూర్చున్నారు.

“అతనికి అన్నీ తెలుసు. తాగుడు, సిగరెట్లు, ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని తెలుసు. ఆరోగ్యం పాడయితే, ఎంత ఖర్చవుతుందో తెల్సు. ఎంత ఖర్చు చేసినా మనిషి కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందలేడు తెలుసు. తను చనిపోతే, కుటుంబం ఎన్నిఅవస్థలు పడుతుందో కూడా తెల్సు. అయినా అవి మానడు..” అన్నాడు చరణ్‌దాస్.

మరో గంట గడిచింది. నళిని గదిలోని పెద్ద లైట్లను ఆర్పేసింది. మసక వెలుతురు మాత్రమే ఉంది.

చరణ్‌దాస్, కుర్చీలో వెనక్కి వాలి కళ్లు మూసుకున్నాడు.

నళిని టేబుల్ మీదకు వాలి పడుకుంది.

“కలలు ఎందుకు వస్తాయి?” అని అడిగాడు చరణ్‌దాస్ కళ్లు మూసుకునే.

“నిద్రలోకి జారుకున్నప్పుడు, అతని ఆలోచనలకు అడ్డు ఉండదు. అవి సాధ్యామా, అసాధ్యమా అన్న విచక్షణా జ్ఞానమూ ఉండదు. ఏ కట్టుబాట్లూ, నియమ నిబంధనలూ, భవ బంధాలూ ఏమీ ఉండవు. ఏమైనా ఊహించుకుంటాడు. మహారాజుననుకుంటాడు. స్వర్గ సుఖాలు తాను ఇక్కడే ఇప్పుడే అనుభవించగలననుకుంటాడు.. ఆ భావాలే కల..” అన్నది నళిని కళ్లు మూసుకునే.

“ఇప్పుడు నువ్వు ఏ స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నట్లు కలగంటున్నావు?” అని అడిగాడు చరణ్‌దాస్.

“నా సంగతి సరే. మీరు ఏం కలగంటున్నారో చెప్పండి..”

“కట్టుబాట్లు ఏమీ కలలకు ఉండవన్నావు గదా.. ఇంక ఉన్నది మసక చీకటి. ఈ చీకటిలో నువ్వు, నేనూ.. కలలో ఎప్పుడూ ఇలలో జరగాలని ఏది కోరుకుంటామో, అదే జరుగుతుంటుంది..”

“దేవుడితో మనం మాట్లాడితే, దానిని ప్రార్థన అంటాం. దేవుడు మనతో మాట్లాడితే దాన్ని వరం అంటాం..”

“ఈ రాత్రికి కలగంటాను.. దేవుడు కనిపిస్తాడు. వరం ఇస్తాను కోరుకోమంటాడు. నళిని జీవితాంతం నాతో ఇలాగే పగలూ, రాత్రి కల్సి ఉండేటట్లు దీవించు స్వామీ.. అని అడుగుతాను..”

ఇద్దరూ కళ్లు మూసుకునే ఉండిపోయారు.. ఎవరి కలలు వాళ్లవి.. అవి కల్లలు అని తెల్సినా..

***

మర్నాడు నళిని రజని పని చేసే నర్సింగ్ హోమ్‌కి వెళ్లింది. తనను తాను పరిచయం చేసుకుంది.

“మీతో మాట్లాడుదామని వచ్చాను..” అన్నది నళిని.

“ఏ విషయం?” అని అడిగింది రజని.

“చరణ్ విషయం..”

“అతని విషయం నేను ఏమీ మాట్లాడను.. నాకు సంబంధించినంత వరకూ ఆ అధ్యాయం ముగిసింది..”

“ముగిసిన అధ్యాయమే కావచ్చు. ఒకసారి నెమరేసుకుంటారేమోనని.. మీకోసం కాదు.. నా కోసం..”

“అవన్నీ ఇక్కడ కుదరదు. ఆదివారం మా ఇంటికి రండి.. వీలుంటే చెబుతాను.” అన్నది రజని.

ఆదివారం నాడు నళిని, రజని ఇంటికి వెళ్లింది.

రజని పెద్దగా ఏమీ ఆసక్తి చూపించలేదు.

“మీరు ఎందుకు ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు? మీకు ఏమిటి ఆసక్తి?”

“ఊరికనే..”

“ఊరికనే? ఇదేమన్నా సరదానా? మీరు అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా?”

“అబ్బే, అదేం లేదు..”

“మరి మీకేంటి ఇంటరెస్ట్..”

“ఆయన మీ గురించి చెప్పాడు.. మీరు ఏం చెబుతారో వినాలని వచ్చాను..”

“నా గురించి చెప్పాడా? ఏం చెప్పాడు? ”

“అంటే మీ గురించి కాదు. వాళ్ల అమ్మగారి గురించి చెప్పాడు. ఆవిడ పెద్ద ఆవిడ కదా.. సర్దుకుని పోయి ఉంటే బావుండేదని అన్నాడు.”

“ఎవరు సర్దుకుని ఉండాలి? అతను ప్రేమించానన్నాడు. కొన్నాళ్లు వెంట పడ్డాడు. కొన్ని విషయాలు ముందుగా తెలియవు. అతనికి ఒక తల్లి ఉంది. నిజమే. ఆమె ఒక తరం వెనకటి మనిషి. పాతకాలపు అలవాట్లు, అభిప్రాయాలూ.. కోడలిని కంట్రోలు చేయాలనీ, రాచిరంపాన పెట్టాలనీ, ఆ వింధగా తనేదో గొప్పదాన్ని అయినట్లు ఫీల్ అవాలని ఆమెకు ఉంది. వెళ్లాక వారం రోజులకే మొదలు పెట్టింది. తెల్లగా తెల్లవారక నిద్ర లేస్తావా అంటుంది. తెల్లవారు ఝామున లేచి ఏం చేయ్యాలి అని అడిగాను. మీ వాళ్లు ఇలాంటి పెంపకం పెంచారేంటి – అంటుంది. మా వాళ్లు గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నోరు మూసుకోమన్నాను. పెద్ద గొడవ చేసింది. ఆత్మహత్య చేసుకుంటానంది. చేసుకోమన్నాను. మా అమ్మను ఆత్మహత్య చేసుకోమంటావా అని ఇతను రెచ్చిపోయాడు. నేను అనలేదు. ఆవిడే అన్నది అంటే వినడే. ఆమె మాటకు ఎదురు చెప్పకూడదట. ఏం అన్నా పడి ఉండాలట. నాకేంటి అవసరం? తల్లిని బ్రతిమాలాడి ప్రతి సారీ కాళ్లు పట్టుకుని వేడుకుంటాడు. మారుతున్న కాలంతో పాటు మనుషులు మారాలి. వాళ్లకు తెలియకపోతే నచ్చచెప్పాలి.. అది చేత కాదు. భార్య అంటే అణిగి మణిగి పడి ఉండాలంటాడు. ఏ కాలంలో బ్రతుకుతున్నారు వాళ్లు. భార్య కూడా ఒక మనిషి, ఆమెకు ఇవ్వవల్సిన గౌరవం ఆమెకు ఇవ్వాలన్న విషయం తెలియని వాళ్లతో రోజూ గొడవలు పెట్టుకుని, నా మనశ్శాంతిని పాడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు.. అందుకే దూరంగా ఉంటున్నాను..”

“ఆవిడ ముసలావిడ. బ్రతికినంత కాలం బ్రతకదు. ఆవిడ పోయినాక మీరు మళ్లీ కలుస్తారా?”

“కలవను. మీకు ఇష్టమైతే, మీరు పెళ్లి చేసుకోండి.. చేసుకుంటారా?” అని అడిగింది రజని.

“అది శేష ప్రశ్న కానేకాదు.. ఇప్పుడు నాకూ ఆ ఉద్దేశం లేదు” అన్నది నళిని.

ఒక నెల రోజులలోనే నళిని ఆ హస్పటల్‍లో మానేసి మరో హస్పటల్‍లో చేరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here