చిరుజల్లు-57

0
2

అమావాస్య చంద్రుడు

[dropcap]స[/dropcap]రిత కాలింగ్ బెల్ నొక్కింది.

తన ఫ్రెండ్ ఝాన్సీ ఇల్లు ఇదేనా, కాదా అన్న సందేహం తోనే కాలింగ్ బెల్ నొక్కింది. వాళ్లిద్దరూ చిన్నప్పటి నుంచీ ఫ్రెండ్స్. విడిపోయి చాలా కాలం అయింది. ఎవరి దారి వారిది అయింది. ఇప్పుడు ఎవరెవరి ద్వారానో ఈ ఫ్రెండ్ అడ్రసు కనుక్కొని, చూసిపోవాలని వచ్చింది.

అయిదు నిముషాల సేపు బెల్ కొట్టినా, తలుపు తీయకపోవటంతో, ఇక వెనక్కి వెళ్లి పోవాలనుకుంటున్న సమయంలో, ఝాన్సీ తలుపు తెరిచి సరితను లోపలికి ఆహ్వనించింది.

“ఏమే, బావున్నావా? ఎన్నాళ్లో అయింది మనం కల్సుకుని..” అన్నది సరిత కుర్చీలో కూర్చుంటూ.

“ఎన్నాళ్లో కాదు. ఎన్నేళ్లో అయింది, మనం కల్సుకుని. ఇప్పుడు ఎక్కడుంటున్నావు? ఈ ఊరికి ఎప్పుడొచ్చావు?” అని అడిగింది ఝాన్సీ, వంటింట్లోకి నడుస్తూ సరితతో మాట్లాడుతూ.

“ఇప్పుడు నేను ముంబయ్‌లో ఉంటున్నా. ఆయన అక్కడొక కంపెనీకి రీజనల్ మేనేజర్. కారూ, ఫ్లాటూ, ఫర్నీచరూ అన్నీ కంపెనీ వాళ్లే ఇచ్చారు. ఈయన తనతో పెళ్లాన్ని, కుక్క పిల్లను మాత్రమే తీసుకెళ్లారు..” అని నవ్వింది సరిత.

ఝూన్సీ కూడా శృతి కలిపింది “అదృష్టవంతురాలివే.. అవీ వాళ్లే ఇస్తామని అనలేదు.. ఇప్పుడు ఎవరింటికి వచ్చావు?” అని అడిగింది.

“మా బంధువుల ఇంట్లో దిగానులే. నీ అడ్రసు కనుక్కోవటానికి ఎంత కష్టపడ్డానో తెల్సా? నీకేమో నేను అసలు గుర్తు కూడా లేను. నువ్వు, మీ ఆయనా ఒకసారి ముంబై రండి. పది రోజులు ఉండి, అన్నీ చూడవచ్చు..” అన్నది సరిత, ఝాన్సీ అందించిన కాఫీ అందుకుంటూ.

సరిత, ఝాన్సీ ఇద్దరూ చిన్నప్పుడు ఎదురెదురు ఇళ్లల్లో ఉండేవాళ్లు. ఒకే స్కూలు, ఒకే క్లాస్, ఒకే బెంచి మీద కూర్చునేవాళ్లు. ఎక్కడికి వెళ్లినా ఏ పని చేసినా ఇద్దరూ జంట కవుల వలె కల్సి మెల్సి చేసే వాళ్లు. ఒకటే బాట. ఒకటే మాట. చదువులోనే కాదు, ధైర్య సాహసాల్లోనూ ఇద్దరూ పోటీ పడుతుండేవాళ్లు. ముఖ్యంగా ఝాన్సీ బాగా అందమైన పిల్ల. మిసమిసలాడుతూ బంగారు బొమ్మలా ఉండేది. అందరి కళ్లూ ఆ పిల్ల మీదనే ఉండేవి.

“మీ శ్రీవారు ఎన్నింటికి దయ చేస్తారు?” అని అడిగింది సరిత.

“ఆయన బంధువులు ఎవరో పోయారు. ఊరికి వెళ్లారు. రావటానికి ఇంకో నాలుగు రోజులు పడుతుంది.”

“మీ ఆయన్ని చూపించక పోయినా, కనీసం ఆయన ఫోటో అయినా చూపించవే” అని అడిగింది సరిత.

“ఫోటోనా? మేం ఫోటోలు తీయించుకోలేదు.”

“అదేమిటే? ఇన్నేళ్ల నుంచి కాపురం చేస్తూ ఒక్క ఫోటో అయినా తీయించుకోలేదా? విచిత్రంగా ఉందే?”

“మాది అందరి లాంటి సంసారం కాదు. చాలా అన్యోన్యమైన దాంపత్యం. మా కనుపాపల్లో, మనస్సులో, హృదయాల్లో చెరిగిపోని ఫోటోలుండగా, ఇంక ఈ గోడల మీద ఎందుకని? అసలు ఇంతకీ ఆయనతో కల్సి ఫోటో తీయించుకోవాలన్న ఆలోచనే  రాలేదు ఎందుకనో..”

ముందు గదిలోకి వచ్చి కూర్చున్నారు.

“మీ ఆయన సంపాదన అంతా ఏం చేస్తున్నారే? ఒక మంచి ఫ్లాట్ అయినా కొనలేదు. కారు కూడా లేదు?” అన్న సరిత ప్రశ్నకు ఝాన్సీ నీరసంగా నవ్వి అన్నది.

“ఏమిటోనే, మాకు వాటి మీద అంతగా మోజు లేదు” అని.

కాలింగ్ బెల్ మోగింది. కిటికీ రెక్క తీసి చూసి, ఆ తరువాత తలుపు తీసింది. పనిమనిషి కూరలు తీసుకొని వచ్చింది. వంకాయలు ఎంతకు తెచ్చావు, బీరకాయలు ఎంతకు తెచ్చావు – అని వివరాలు తెల్సుకుంది. రోజు రోజుకీ ధరలు మండిపోతున్నాయని వ్యాఖ్యానించింది ఝాన్సీ.

స్నానం చేసి వచ్చింది. ఉన్న వాటిల్లో మంచి చీర తీసుకుని కట్టుకుంది. వంటలు,  భోజనాలూ అయినయి. తీరికగా కూర్చుని కబుర్లల్లో పడ్డారు.

“కాలేజీ చదివే రోజుల్లో నిన్ను అందరూ ఝాన్సీ రాణి అని అంటుండేవాళ్లు. అందుకు తగ్గట్టుగానే, ప్రతి పనిలో అందరి కంటే, ధైర్యంగా, ధీమాగా ఉండేదానివి. ప్రతి చిన్న విషయం మీదా కాదన్న వాళ్లతో యుద్ధానికి దిగేదానివి. అప్పటికీ ఇప్పటికీ నీలో ఎంత మార్పు వచ్చిందే? తలుపు తీయాలంటే, వచ్చినదెవరో కిటికీలో నుంచి చూసి గానీ, తీయటం లేదు. ఉన్న నాలుగింటిలో ఏ చీర కట్టుకోవాలా, ఏ కూర వాడాలా – అని ఒకటికి రెండు సార్లు ఆలోచనలో పడిపోతున్నావు. ఇంత అసందిగ్ధత, ఊగిసలాట ఎలా వచ్చాయే నీకు?” అని అడిగింది సరిత.

ఝాన్సీ నెమ్మదిగా నిట్టూర్టింది. కాసేపు మౌనంగా ఉన్నది. తరువాత నెమ్మదిగా అన్నది.

“యవ్వనంలో ఆశయాలూ, ఆవేశాలూ, పెద్ద పెద్ద కోరికలూ, భ్రమలూ, ఇవే మనల్ని ముందుకు నడిపిస్తుంటాయి. అదే లోకం అనుకుంటాం. క్రమంగా ఆ భ్రమలు తొలగిపోతయి. అలసిసొలసి సొమ్మసిల్లి పోవటం తప్ప మరేమీ ఉండదు” అన్నది ఝాన్సీ.

“అసలేం జరిగిందో, ఎందుకింత మార్పు వచ్చిందో చెప్పవే, వింటాను” అన్నది సరిత.

“అందరి కన్నా అందమైన దాన్ని, తెలివిగల దాన్ని అని నా మీద ఒక ముద్ర పడిపోయింది. అందుచేత కించిత్ గర్వంగానూ ఉండేది. ఎవడ్నీ లెక్క చేసేదాన్ని కాదు. నాకేం తక్కువ అన్న ధీమాలో ఉండేదాన్ని. అయితే రోజులు గడిచే కొద్దీ ఇవేవీ ఉద్ధరించలేవని అర్థమైంది. మొదట్లో వచ్చిన రాజకుమారుల వంటి వారందరినీ వంకలు పెట్టి నాకు నచ్చలేదని, చేసుకోను పొమ్మన్నాను. వయసు ముదిరే కొద్దీ, నన్ను చూడటానికి కూడా ఎవరికీ ఇష్టం లేదన్న విషయం తెల్సి వచ్చింది. చివరకు ఈ గణపతిని మా వాళ్లు ఒప్పించి నన్ను పీటల మీద కూర్చో బెట్టారు. నాకీ పెళ్లి ఇష్టం లేదని ఎంత మొత్తుకున్నా మా వాళ్లు వినలేదు. కన్నీరు కారుస్తూనే తాళి కట్టించుకున్నాను. గుణపతి నికార్సయిన నలుపు. పెళ్లికి చూడటానికి వచ్చిన వాళ్లు కూడా కాకి ముక్కుకు దొండపండు అన్నారు. తెల్ల బట్టలు కట్టుకున్న గణపతి ‘బ్లాక్ అండ్ వైట్’ అంటే ఇదే అని నవ్వుకోవటమూ విన్నాను. అమావాస్య చంద్రుడనే బిరుదు కూడా ఇచ్చారు, అయనకు. ఫాస్ట్ కలర్ అని ఇంకొకరు అన్నారు. ఇవన్నీ నా చెవిన పడినయి. కాని అప్పటికే మూడు ముళ్లూ పడినయి. చాలా మందికి లాగానే, ఆ మూడు ముళ్లూ పడినప్పటి నుంచీ, ఇంక నా నడక ముళ్ల దారినే అయింది.”

“నేను అందమైనదాన్ని, అతను నా పక్కన నిలబడేందుకే యోగ్యత లేని వాడు. అయితేనేం అతను భర్త, నేను బార్య. నన్ను లొంగదీసుకోవటమే జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు. మొదటి నుంచీ ఆయన సంపాదన అంతంత మాత్రమే. అందుచేత నేనూ పెళ్లి అయిన కొత్తల్లో కొన్నాళ్లు ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేసినంత కాలం నా మీద అనుమానమే. అవసరం లేకపోయినా సడెన్‌గా మా ఆఫీసుకు వచ్చేవాడు. ఆ సమయంలో నేను ఆఫీసరు రూంలో ఉంటే, ఆయనకూ నాకూ అక్రమ సంబంధం అంటగట్టేవాడు. పక్క సీట్లో వాడితో మాట్లాడుతుంటే, ఎన్నాళ్ల నుంచి సాగుతోంది ప్రేమాయణం అని వేధించేవాడు. ఫైల్స్ చూస్తుంటే, ఎవడికో ప్రేమలేఖలు రాస్తున్నానేవాడు. ఆలస్యంగా వస్తే, ఎవడితో ఇంత సేపు ఉన్నావంటూ వేధింపు. కరెక్ట్ టైం కన్నా ముందే వస్తే ఆఫీసు ఎగ్గొట్టి, ఏ లాడ్జీలోనో ఉండి వచ్చానని సాధింపు. ప్రతి రోజూ ఏదో ఒక గొడవ. దానికి కారణం ఒకటే, తను నలుపు – నా పక్కన ఉండేలేడన్న న్యూనతా భావం లోలోపల. నస భరించలేక పుట్టింటికి వెడితే, అక్కడికి వచ్చి నా పరువు తీసి, నన్నే దోషిగా నిలబెట్టేవాడు. చివరకు జీవితం అంతా తిట్టుకోవటం, కొట్టుకోవటమే – అన్న అభిప్రాయానికి తీసుకొచ్చాడు. ఉద్యోగమూ మాన్పించాడు.. ”

“మా వాళ్ల దృష్టిలోనూ నాకు అహంభావమనీ, మొగుడ్ని లెక్క చేయ్యదనీ ఒక అభిప్రాయం ఏర్పరచాడు. మనసు విప్పి మాట్లాడుకోవటానికి ఒక్క మనిషి కూడా లేకుండా చేశాడు. ఈ పోరాటంలో ఒంటరిదాన్ని అయిపోయాను. విసిగిపోయాను. అలిసిపోయాను.”

“తలుపు తీసి ఉంటే అదీ నేరమే. మూసి ఉంటే దానికీ విపరీతార్థమే. వంకాయ వండితే, బీరకాయ వండలేదంటాడు. బీరకాయ వండితే, పొట్లకాయ ఎందుకు వండలేదంటాడు.. నా ధైర్యం, చొరవ, తెగువ –  అన్నింటినీ కొంచెం కొంచెంగా నరికి ముక్కులు చేసి ఈ నాలుగు గోడల మధ్యనే సమాధి చేశాడు. ఇప్పుడు నేనొక నడిచే శవాన్ని. తీగలు తెగిన వీణను. అతని ఉన్మత్త ప్రేలాపనలకు ఒంటరిగా వెక్కి, వెక్కి ఏడుస్తూ రోజులు వెళ్లదీస్తున్నాను. ఇప్పుడు నాకు నవ్వటం చేతకాదు. సంతోషంగా మాట్లాడటం మర్చిపోయాను. ఈ గజిబిజి జీవితం అర్థం కాని ఒక పజిల్‌లా తయారైంది..” అని చెప్పింది ఝాన్సీ పెల్లుబికి వస్తున్న దఃఖాన్ని మింగుతూ.

సరిత అంతా విన్న తరువాత అన్నది “ఆడదాని ఆశలనూ, కోరికలనూ నాలుగు గోడల మధ్య పాతెయ్యటం కొత్త ఏమీ కాదు. తరతరాలుగా జరుగుతున్న చరిత్ర ఇదే. ఈ ఇంటి బయట విశాలమైన ప్రపంచం ఉంది.. ధైర్యంగా బయటకు రావాలి.. ఎవరి జీవితాన్ని వాళ్లే బాగు చేసుకోవాలి. ఎవరో వచ్చి ఉద్ధరించాలనుకోవటం అవివేకం. రేపు నేను మంబయ్ వెళ్తున్నాను. నాతో వచ్చెయ్. పుట్టిల్లూ, అత్తిల్లే మాత్రమే కాదు. మనకి తెలియని, మనం ఎన్నడూ చూడని అందమైన లోకం ఉన్నది. కొన్నాళ్లు వచ్చి నాతో ఉండు. నీ కాళ్ల మీద నీవు నిలబడు. నిండుగా నవ్వుతూ, నిశ్చింతగా, హాయిగా, స్వేచ్ఛగా బ్రతకటం నీ చేతుల్లోనే ఉంది..” అన్నది సరిత.

ఆ రాత్రి అదే ఆలోచనలతో నిద్రపోయింది ఝాన్సీ. కలలో ఆమె మరో ప్రపంచంలో విహరించింది. అక్కడ తాను ఒక సింహాసనం మీద కూర్చుంది. భర్త తన ఆజ్ఞల కోసం ఎదురు చూసే ఒక సేవకుడిలా కనిపించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here