చిరుజల్లు-65

0
3

తరం – అంతరం

[dropcap]డా[/dropcap]క్టర్ గీతాంజలి నైట్ డ్యూటీకి వచ్చింది. ఆమె కోసమే ఎదురు చూస్తున్న డాక్టర్ ప్రభావతి చిరునవ్వుతో అన్నది “నాకు రైలుకు టైం అవుతోంది. ఇంకా నువ్వు రాలేదేమా అని ఎదురు చూస్తున్నాను..”

“ఎప్పుడెప్పుడు మీ ఆయన సన్నిధికి చేరి గాఢ పరిష్వంగంలో పడిపోదామా అని కలలు కంటున్న నీకు అలా అనిపించవచ్చు గానీ నేను కరెక్ట్ టైంకే వచ్చాను” అన్నది డాక్టర్ గీతాంజలి.

“నీకు పెళ్ళి అయ్యాకా గాని, ఆ ఆత్రం ఏమిటో అర్థం కాదు” అని నవ్వింది ప్రభావతి, హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుంటూ.

“పెళ్ళి అయినా, ఆయనా ఇక్కడే ఉంటాడు గనుక ఇంత ఆత్రం నాకు ఉండదులే” అని నవ్వేసింది గీతాంజలి కూడా.

డాక్టర్ గీతాంజలి, డాక్టర్ ప్రభావతి కల్సి చదువుకున్నారు. అందుచేత మంచి చనువు ఉంది. ప్రభావతి తన బ్యాచ్ వాడే అయిన మోహన్‍ను లవ్ చేసి పెళ్ళి చేసుకుంది. అతను గుంటూరులో పని చేస్తున్నాడు. శలవులు వచ్చాయంటే చాలు, అతను ఇక్కడికి రావటమో, ఈమె అక్కడికి వెళ్ళటమో – ముందుగానే ప్లాన్ చేసుకుంటారు.

గీతాంజలికి మరో రెండు నెలల్లో వివాహం జరగబోతోంది. ఆమె పెళ్ళి చేసుకునేది డాక్టర్‍నో, యాక్టర్‍నో, ఇంజనీర్‍నో కాదు. అతను ఒక గవర్నమెంటు ఆఫీసులో గుమాస్తా. గీతాంజలి ఫ్రెండ్స్ అంతా శ్రీమంతుల బిడ్డలే గనుక వాళ్ళు తమ హోదాకు తగిన వారినే జీవిత భాగస్వాములుగా చేసుకున్నారు. గీతాంజలి తలచుకుంటే, అన్ని విధాల యోగ్యుడైన వాడు దొరకక పోడు. చాలామంది ఆమె ‘ఊ’ అంటే చాలు, మూడు ముళ్ళు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. అవన్నీ గీతాంజలికి తెలుసు.

వాళ్ళ జీవితాలు వడ్డించిన విస్తరి లాంటివి. తన పరిస్థితి వేరు – అనుకున్నది గీతాంజలి.

ఈ చంద్రానికి మచ్చలేదు. ముఖ్యంగా అతనిని ఇష్టపడడానికి కారణం – అతని తల్లి సావిత్రమ్మ. ఆమె ఒక తరం వెనకటి మనిషే అయినా, ఆమెకున్న సహృదయత, ఔదార్యం ఈ కాలం వారిలో కాగడా వేసి వెతికినా కనిపించవు.

సావిత్రమ్మ గుర్తుకు రాగానే ఇంటికి ఫోన్ చేసి ఆమె ఆరోగ్యం గురించి తెల్సుకున్నది.

“ఆంటీ, నొప్పి ఎలా ఉంది?”

“ఫర్వాలేదమ్మా, టాబ్లెట్ వేసుకున్నాక నొప్పి కొంచెం తగ్గింది” అన్నది సావిత్రమ్మ.

గీతాంజలి ఒకసారి ఆస్పత్రిలోని వార్డులోకి వెళ్ళి రోగులను అందరినీ పలకరించి ధైర్యం చెప్పి వచ్చింది.

మైసమ్మ తెచ్చిన టీ తాగింది.

గీతాంజలికి గతమంతా కళ్ళముందు మెదిలింది.

గీతాంజలి తండ్రి పరాంకుశం నలభై ఏళ్ళ వయసులో దేవయానితో ప్రేమలో పడ్డాడు.

భార్య, ఎదిగిన కూతురు ఉన్నా సరే, దేవయానిని పెళ్ళి చేసుకుంటానని పట్టుబట్టాడు.

“యూత్ రిపీట్స్ ఇన్ ఫార్టీస్” అంటూ పరాంకుశం తన మోహావేశాన్ని సమర్థించుకున్నాడు.

“నీ మొహం రిపీట్స్. ఎదిగిన కూతుర్ని, భార్యని ఇంట్లో పెట్టుకొని, వాళ్ళ బాగోగులు చూడకుండా గాలికి వదిలేసి, ఎవరో ఒక కులుకులాడి మాయలో పడిపోతున్నావు. నీ జీవితాన్నే కాదు, వాళ్ళ బ్రతుకులూ బుగ్గిపాలు చేస్తున్నావు” అని ఎవరెన్ని చెప్పినా పరాంకుశం వినిపించుకోలేదు.

సంపాదన అంతా ఆ ప్రియురాలికే ధారపోశాడు. భార్యనూ, కూతుర్నీ కన్నీటి వర్షంలో నిలబెట్టాడు. విసిగిపోయిన పరాంకుశం భార్య, దేవయానిని తిట్టిపోసిందని, కోపంతో భార్యను చంపేశాడు.

గీతాంజలి తల్లి చనిపోయింది. తండ్రి జైలు పాలు అయినాడు. అయిన వాళ్ళందరూ గీతాంజనీ ఈసడించుకున్నారు.

“మీ నాన్న నిర్వాకాన్ని ఊళ్ళో వాళ్ళంతా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. మీరు మావాళ్ళు అని చెప్పుకోవడానికే మాకు చచ్చే సిగ్గుగా ఉంది..” అని మేనమామలూ చూసీ చూడనట్లు ఊరుకున్నారు.

తెలిసీ తెలియని వయసులో, ఎదిగీ ఎదగని మనస్సుతో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నది. మోకాళ్ల మధ్య తల పెట్టుకొని ఏడుస్తున్న గీతాంజలి తల నిమిరి, దగ్గరకు తీసుకున్నది సావిత్రమ్మ.

చనిపోయిన గీతాంజలి తల్లి, సావిత్రమ్మ చిన్ననాటి స్నేహితురాండ్రు. ఇన్నేళ్ళుగా ఇద్దరి కుటుంబాలలోనూ ఎన్ని వర్షాలు కురిసినా, మండే ఎండలు ఎన్ని కాసినా ఆ స్నేహితురాండ్ర మధ్య నున్న స్నేహం చెక్కు చెదరలేదు.

సావిత్రమ్మ, గీతాంజలిని తన ఇంటికి తీసుకుపోయింది. ఆ పిల్ల చెంపల మీదుగా ధారాపాతంగా కురుస్తున్న కన్నీటి ధారను మునివేళ్ళతో తుడిచేసింది.

“ఏం చేద్దామనుకుంటున్నావు?” అని అడిగింది.

“నాకు చచ్చిపోవాలని ఉంది” అన్నది గీతాంజలి.

“కొంచెం వెనకా ముందుగా అందరూ చనిపోయేవాళ్ళే. మీ అమ్మ చిన్నప్పటి నుంచీ నాకు తెల్సు. అది నిండుగా నవ్విన రోజు లేదు. ఏడుస్తూ అయినా బ్రతుకుదామంటే, మీ నాన్న దాన్నీ ఓర్వలేక చంపేశాడు. మా తరం ఎలాగూ మగవాడి దాష్టీకానికి బలి అయిపోయింది. మీరన్నా కళ్ళు తెరవండి. మీ నుదుటి రాతలు మీరే రాసుకోండి” అని హితవు చెప్పింది సావిత్రమ్మ.

గీతాంజలిని డాక్టరు చేయాలని సావిత్రమ్మ సంకల్పించింది. గీతాంజలి ఆమె మాటలకు ఎదురు చెప్పలేదు.

“అమ్మా, ఒక ఆడపిల్లను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నావు. ఎత్తలేని బరువు ఎత్తుకుంటున్నావేమోనని.. అందరూ అనుకుంటున్నారమ్మా” అన్నాడు చంద్రం తల్లితో.

“అది నిజమే కావచ్చు. కానీ నాకు ఇంకో ఆడపిల్ల ఉండి ఉంటే, దాన్ని బరువు అనుకునేదానినా? నా స్నేహితురాలు.. ఏమీ ఎరుగని రోజుల్లో నాకు కూతురు పుడితే దానికి కోడలిని చేయాలనీ – దానికి కూతురు పుడితే నేను కోడల్ని చేసుకోవాలని అనుకున్నాం. ఇప్పుడు మాత్రం ఏం మించిపోయింది? అలా అని పిల్లల ఇష్టాయిష్టాలు తెల్సుకోకుండా మా పాత కాలపు ఆలోచనలను వాళ్ళ మీద రుద్దాలనీ అనుకోవటం లేదు..” అన్నది సావిత్రమ్మ.

చంద్రానికి పెద్దగా చదువు అబ్బలేదు. ఏదో వానాకాలం చదువు చదివి, చదువు పూర్తి అయిందనిపించాడు. అతని చదువుకు ఆ మాత్రం ఉద్యోగం దొరకటమే అబ్బురం.

సావిత్రమ్మ పట్టుదల అయితేనేం, గీతాంజలి అదృష్టం అయితేనేం, ఆమె డాక్టరు కాగలిగింది.

ఒకరోజు వెన్నెల వెలుగులో నిలబడిన గీతాంజలితో చంద్రం అన్నాడు –

“ఈ వెన్నెలలో, తెల్లని చీరలో, నిలువెత్తు మల్లెపూల రాశిలా ఉన్నావు. గట్టిగా ముట్టుకుంటే ఎక్కడ మాసిపోతావోననిపిస్తుంది..”

“కదిలిస్తే కడివెడు కన్నీళ్ళు తప్ప, ఇంకేమీ ఇవ్వలేని నేను, మీ రుణం ఎలా తీర్చుకొగలను?” అని అన్నది గీతాంజలి.

“అయినవాళ్ళ మధ్యా, కావల్సిన వాళ్ళ మధ్యా రుణాలు ఏమిటి? అంతగా రుణం తీర్చుకోవాలంటే, ఒక చిన్న కానుక ఇవ్వవచ్చు కదా?” అన్నాడు చంద్రం.

“ఏం కానుక?”

“పువ్వులు ఇస్తే వాడిపోతాయి. పుస్తకాలు ఇస్తే చిరిగిపోతాయి. ఉంగరాలు ఇస్తే ఎక్కడో జారిపోతాయి.. అంచేత నాలుగు కాలాల పాటు గుర్తుండేలా, చెరగని, తరగని.. ఎప్పుడు తలుచుకున్నా, ఎంతో మధురంగా ఉండే..”

ఆమె సిగ్గు పడింది.

ఇప్పుడు అవన్నీ గుర్తొచ్చి గీతాంజలి నవ్వుకుంది.

తెల్లవారింది.

చంద్రం ఫోన్ చేశాడు.

“ఏంటి ఇంకా ఇంటికి రాలేదు?”

“ఏంటీ పెళ్ళాన్ని డబాయించినట్లు డబాయిస్తున్నావు? ఇంకా పెళ్ళి కాలేదు. తెల్సా?” అన్నది గీతాంజలి.

“వచ్చే ఏడాది ఈ పాటికి భర్త పోస్ట్ నుంచి తండ్రి పోస్ట్‌కి ప్రమోషన్ కూడా రాబోతోంది. తెల్సా?” అన్నాడు చంద్రం.

గీతాంజలి ఇంటికి వెళ్ళింది.

గదిలోకి వెళ్ళి లైట్ వేసింది. కరెంట్ లేదు. లైట్ వెలగలేదు.

గీతాంజలి సావిత్రమ్మ మంచం మీద కూర్చుని పలకరించింది. పలకలేదు. కుదిపి చూసింది. చలనం లేదు.

చంద్రం వచ్చి ఏం జరిగిందని అడిగాడు.

గీతాంజలి చంద్రం భుజం మీద తల పెట్టుకుని ఏడ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here