Site icon Sanchika

చిరుజల్లు-66

పల్లవి

[dropcap]ము[/dropcap]సురు పట్టింది. రోజంతా సన్నగా జల్లులు పడుతూనే ఉన్నయి.

హోటలు ముందు ఆటో ఆగింది. వేణు, పల్లవి ఆటో దిగి లోపలికి వెళ్ళే లోపల కొద్దిగా తడిశారు. రెస్టారెంటులో కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. స్టార్ హోటల్ కావటం వల్ల, ఎటూగాని సమయం కావటం వల్ల, వర్షం కురుస్తున్నందువల్ల, రెస్టారెంట్ చాలా వరకు ఖాళీగానే ఉంది.

వేణు కావల్సినవేవో ఆర్డరు ఇచ్చాడు. జేబుగుడ్డతో ముఖం తుడుచుకుంటూ పల్లవి వైపు చూశాడు. పైట చెంగు నిండుగా కప్పుకుంది. వేణు మాట కాదనలేక ఇక్కడికి వచ్చిందిగానీ, మనసంతా ఇంటి మీదే ఉంది. త్వరగా వెళ్లిపోవాలి.

“ఏమిటి? చలిగా ఉందా?” అన్నాడు.

“ఊ, లేదు, అదేం లేదు” అన్నది పల్లవి. ఆమె నుదుటి మీద వర్షపు నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నయి.

“ముఖం తుడుచుకో” అంటూ చొరవగా జేబుగుడ్డతో నుదుటి మీది ముత్యాల్ని తుడవబోయాడు. ఆమె వెనక్కి తగ్గి పైట చెంగుతో తనే తుడిచేసుకుంది. కనుబొమల మధ్య నున్న స్టికర్ కింద పడిపోవటం ఆమె గమనించలేదు.

“ఇప్పుడు నువ్వు కడిగిన ముత్యంలా అందంగా ఉన్నావు” అన్నాడు వేణు.

పల్లవికి చాలా ఇబ్బందిగా ఉంది. తొందరగా వెళ్లిపోవాలని ఉంది.

“థాంక్స్” అన్నాడు వేణు.

“దేనికి?” అని అడిగింది పల్లవి.

“నా కోరిక మన్నించి, నాతో ఇంత దూరం వచ్చినందుకు”

“నాకు మీరు ఎంతో హెల్ప్ చేస్తున్నారు. మీ సహకారం లేకపోతే నేను ఆఫీసులో చాలా సమస్యలు ఎదుర్కునే దాన్ని. మీ సహాయానికి కృతజ్ఞతలు. నేనే ఎప్పుడన్నా మీకు పార్టీ ఇవ్వాలనుకున్నాను..” అన్నది పల్లవి.

“సహకారం, హెల్ప్ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు. మనం కొలీగ్స్. ఫ్రెండ్స్. నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్‌. ఆ మాత్రం సహాయం చేసుకోమా ఏమిటి?”

రెండు క్షణాల సేపు ఆలోచించి, నెమ్మదిగా అన్నది “తల్లీ కూతుళ్ళు, తండ్రీ కొడుకుల దగ్గర నుంచీ అనుబంధాలన్నీ డబ్బుతో ముడిపడిన వ్యాపార సంబంధాలు అయిపోతున్న ఈ రోజుల్లో, స్నేహానికి విలువ ఇచ్చేవాళ్ళు దొరకటమూ అదృష్టమే కదా..” అన్నది పల్లవి.

“నీతో స్నేహం కల్సినప్పటి నుంచీ, స్నేహం లోని అసలైన తీయదనాన్ని తెల్సుకుంటున్నాను. జీవితాంతం మన స్నేహానుబంధం ఇలాగే ఉండాలనీ, మరింత ముందుకు సాగాలనీ కోరుకుంటున్నాను..” అన్నాడు ఆమె భుజం మీద చెయ్యి వేస్తూ. ఆమె సున్నితంగా అతని చేతిని తొలగించింది.

“సోక్రటీస్ చిన్న ఇల్లు కట్టుకున్నాడట. ఎవరో వచ్చి ‘నీ హోదాకు తగినట్టు పెద్ద ఇల్లు కట్టుకోవాల్సింది. పదిమంది నీ కోసం వచ్చి పోతుంటారు గదా’ అని అంటే, ‘నిజమైన స్నేహితులు ఒకరిద్దరుంటే చాలుగదా, పదిమందితో పనేముంది’ అని అన్నాడట..” అన్నది పల్లవి.

“అయితే మనం ఒక పని చేద్దాం. మనం కూడా ఒక చిన్న ఇల్లు తీసుకుందాం. మనిద్దరికే సరిపోయేంత చిన్న ఇల్లు. అందుకో నాకు నువ్వు, నీకు నేను మాత్రమే ఉండిపోయేటట్లు..”

అతని మాటల వల్ల పల్లవి చాలా ఇరుకున పడింది. అందుచేత మనసులోని మాటను స్పష్టంగా చెప్పడం మంచిదనుకుంది. “మీరు ఏమనుకుంటున్నారో గానీ, నాకు పెళ్ళి అయింది..” అన్నది.

“ఆ విషయం తెల్సీ, నిన్ను కోరుకుంటున్నానంటే, నా ప్రేమను అర్థం చేసుకోలేవా?”

“ప్రేమ గుడ్డిది అన్నారు..”

“ప్రేమ నిజంగా గుడ్డిది అయితే, నీలాంటి అందమైన దాన్ని ఎందుకు ప్రేమిస్తాను? పూర్ణచంద్రబింబం లాంటి నీ ముఖారవిందాన్ని చూస్తూ ఇలా జీవితం నిశ్చింతగా గడిపేయాలని ఉంది”

“వివాహం అయిన స్త్రీతో ఇలా మాట్లాడటం..”

“తప్పే కావచ్చు. ఆ తప్పు చేయకుండా ఉండలేని బలహీనత నాది. నీ కోసం ప్రాణాలివ్వటానికి సిద్ధంగా ఉన్నాను..” అన్నాడు ఆవేశంగా ఆమె చేతి మీద చెయ్యి వేస్తూ.

ఆర్డర్ ఇచ్చినవన్నీ తెచ్చి ముందుపెట్టాడు బేరర్. తింటున్నంత సేపూ ఆమె సౌందర్యాన్ని పొగుడుతూనే ఉన్నాడు.

“నీలా బ్యూటీ, మోడెస్టీ – రెండూ సమంగా కల్సి ఉన్న స్త్రీని నేనెక్కడా చూడలేదు. అందుకే నువ్వంటే నాకు గొప్ప అడ్మిరేషన్..” అన్నాడు నవ్వుతూ.

ఆ సంభాషణను అంతటితో ముగించాలని ఆమె ప్రయత్నిస్తోంది. కానీ అతను దాన్ని పొడిగించే ప్రయత్నం చేస్తున్నాడు.

“వర్షం తగ్గేటట్లు లేదు..”

“బయట వర్షం. లోన హర్షం. ఇలాంటి సమయంలోనే నీవు ఇంత చేరువగా ఉండటం.. ఏవో లోకాల్లో విహరిస్తున్న ఫీలింగ్..”

“చాలా టైం అయింది” ఆమె గొంతులో అసహనం.

“నీ సౌందర్యాన్ని చూస్తుంటే, కాలం స్తంభించి పోతుంది. ఎంతో ఆలోచించి చెబుతున్నాను. నీతో సహజీవనాన్ని కోరుకుంటున్నాను. నీవు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను. ఆలోచించు. ఇవాళే కాదు, రేపు.. వచ్చే నెల.. వచ్చే ఏడాది.. వచ్చే జన్మలోనైనా సరే.. ఎప్పుడూ నీ కరుణా కటాక్ష వీక్షణాలు నా మీద ప్రసరిస్తాయో, అప్పుడే ఈ జన్మ ధన్యమైందని అనుకుంటాను..” అనీ అన్నాడు.

“వెళ్దామా, బాగా లేటయింది..”

బిల్లు చెల్లించి బయటపడ్డారు.

ఆమె ఆటోలో ఇంటికి వచ్చింది. కానీ మనసంతా అస్తవ్యస్తంగా ఉంది. ఇతన్ని ఇంక ఎంత వీలైతే అంత దూరంగా ఉంచటం మంచిదేమో.. అని అనుకున్నది.

ఇంట్లో సోఫాలో కూర్చుని అంతర్ముఖురాలు అయింది. ఆమె భర్త రాంగోపాల్, పడక గదిలోంచి వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు.

“ఇంత ఆలస్యమైందేం?” అని అడిగాడు.

“ఆఫీసులో లేట్ అయింది. మీకు ఎలా ఉంది?” అని అడిగింది.

“ఆయాసం తగ్గలేదు..”

“మందు వేసుకున్నారా? వెళ్ళి పడుకోండి..”

“ఇప్పటిదాకా పడుకునే ఉన్నాను. పడుకుంటే కళ్ళు మూతలు పడతయి. కళ్ళు మూసుకుంటే, పీడకలలు వస్తయి. తీరా కళ్ళు తెరిచి చూస్తే, జీవితమే పెద్ద పీడకలలా కనిపిస్తోంది..” అన్నాడు వ్యథాభరితంగా నవ్వుతూ.

“మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకుని వర్రీ అవుతున్నారు. ఎలా జరగాలో అలా జరుగుతుంది. మనం నిమిత్తమాత్రులం..”

“రాతిబొమ్మలం కాదు గదా స్పందించకుండా ఉండటానికి. మామూలు మనుషులం. తెర మీద బొమ్మల్ని చూసి చలించిపోయే మనం, స్వయంగా అనుభవించే ఈ సుఖదుఃఖాలకు చలించకుండా ఎలా ఉంటాం? నా జీవితం కొడిగట్టిన దీపం. ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. నా బాధ నేను పోతున్నందుకు కాదు, నిన్ను అర్ధాంతరంగా అన్యాయం చేసి పోతున్నందుకు” అన్నాడు రాంగోపాల్.

“అలాంటి మాటలు అనకండి. నాకు భయం వేస్తుంది” అన్నది పల్లవి బాధగా. “భర్త అనే వ్యక్తి అండదండలు ఎంత నిబ్బరాన్నీ, గుండె ధైర్యాన్నీ ఇస్తాయో, మీతో గడిపిన ఈ కొద్ది కాలంలో గ్రహించాను. ఆ అండ లేని జీవితాన్ని ఊహించుకోలేను” అన్నది పల్లవి పొంగిపొర్లుతున్న దుఃఖాన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తూ.

“అందుకే మనం ఇకనైనా మనసులు విప్పుకొని మాట్లాడుకుందాం, పల్లవీ. ఇప్పుడు కూడా మాట్లాడుకోలేకపోతే, ఇంక ఎప్పటికీ మనం మాట్లాడుకోలేం..”

“సీజన్ బాగాలేదు. బాగా ఆయసపడుతున్నారు. వెళ్ళి పడుకోండి” అన్నది పల్లవి.

“కళ్ళు మూసుకునే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పాలి. నేనెలాగు నా దోవ నేను చూసుకుంటున్నాను. అందుచేత నీ దోవ నువ్వు చూసుకోవాలి..”

“మాట్లాడవద్దన్నానా?”

“దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం తెలివి గల వాళ్ళు చేసే పని. మనం రేపే విడిపోదాం. విడాకులు తీసుకుందాం. నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకో. పేపర్లో ప్రకటన ఇస్తే, ఏదో ఒక సంబంధం దొరక్కపోదు. నీకు మళ్ళీ పెళ్ళి చేసి, నీ జీవితానికి ఒక స్థిరత్వం కల్పిస్తే, నాకు నిశ్చింత. ఆ తరువాత నేను ఎప్పుడు కళ్ళు మూసినా ఫర్వాలేదు..” అన్నాడు రాంగోపాల్.

పల్లవి భర్త భుజం మీద తల వాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది. ఎంతో కాలంగా పంటి బిగువన ఉగ్గబెట్టుకుంటున్న దుఃఖం కట్టలు తెంచుకొని, కన్నీరుగా పెల్లుబికింది.

“ఎందుకంత నిర్దయగా మాట్లాడుతారు? మీరింత జబ్బుతో ఉంటే, మీ ఖర్మకు మిమ్మల్ని వదిలేసి, నా సుఖం నేను చూసుకోనా? ఇదేనా భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధానికి అర్థం?” అన్నది ఆవేశంతో.

రాంగోపాల్ నిట్టూర్చాడు. “లోకం గురించి, నలుగురి గురించీ ఆలోచించవద్దు. లోకం ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఏదోలా డబ్బు సంపాదించినవాడిని అవినీతిపరుడు అంటుంది. సంపాదించలేని వాడ్ని అసమర్థుడు అంటుంది. ఖర్చు చేసేవాడిని దుబారాపరుడు అంటుంది. ఖర్చు చేయని వాదిని లోభి అంటుంది. కష్టపడి పని చేసేవాడిని అమాయకుడు అంటుంది. పని చేయని వాడిని సోమరిపోతు అంటుంది. అందుచేత లోకం గురించి కాదు,  మన గురించి మనం ఆలోచించుకోవాలి..”

“మన గురించి మనం ఆలోచించుకున్నా, మీరు చెప్పింది ఏ మాత్రం సమర్థనీయంగా లేదు. మీరు సంపాదించినంత కాలం, మీరు సుఖంగా ఉన్నంత కాలం మీ దగ్గరగా ఉండి, ఇవాళ జబ్బుపడ్డారు గదా అని మీ ఖర్మకు మిమ్మల్ని వదిలేసి వెళ్ళమంటారా? మానవత్వం ఉన్న మనిషి చేసే పనేనా అది?” అన్నది పల్లవి కన్నీరు తుడుచుకుంటూ.

“మంచితనం, మానవత్వానికి కూడా మినహాయింపులుంటాయి. తన్నుమాలిన ధర్మమూ, మొదలు చెడ్డ బేరమూ కలదా? మన పరిస్థితులను బట్టి మనకు ఏది మంచిదని భావిస్తామో, దానిని అనుసరించటమే సరియైన న్యాయం..”

“ఇంక మీరేం మాట్లాడకండి” అంటూ పల్లవి లేచి లోపలికి వెళ్ళింది.

ఏ పని చేస్తున్నా ఆమెకు భర్త మాటలే గుర్తొస్తున్నాయి.

ఆఫీసులో వేణు ఆమెను క్షణం కూడా వదిలిపెట్టకుండా, నీడలా వెంటబడి తిరుగుతున్నాడు. ఆమెకు సహాయం చేస్తున్నట్లు నటిస్తూనే, ఆమె పూర్తిగా తనపై ఆధారపడేటట్లు చేస్తున్నాడు. చివరకు అతని ప్రమేయం లేనిదే ఆమె ఏమీ చేయలేని స్థితికి వచ్చింది.

ఏదో ఒక కారణం చూపించి ఆమెను తనతో షికార్లకీ, సినిమాలకీ తీసుకెళ్ళేలా చేస్తున్నాడు. కాస్తంత ఏకాంతం దొరికితే చాలు, ప్రేమ పాఠాలు వల్లిస్తున్నాడు.

“రాత్రి నాకో కల వచ్చింది. అందులో నువ్వు చెప్పినట్లు చిన్న ఇంట్లో ఉండిపోయాం. ఎవరో మనల్ని ఒకే గదిలో బంధించారు. గది తలుపులు బిగించారు. ఆ గది ఎంత చిన్నదంటే, నేను రెండు చేతులూ చాస్తే, నువ్వు నా కౌగిట్లోనే ఉంటావు” అంటాడు ఒకసారి.

“నీ చెయ్యి పట్టుకుని నడుస్తున్నాను. పాణిగ్రహణం అంటే ఏమిటో తెల్సా? చెయ్యి పట్టుకోవటమే” అంటాడు ఇంకోసారి.

“నిన్ను ప్రేమించటానికి ఈ జీవితం చాలదు” అంటాడు మరోసారి.

అతను అతి చొరవ తీసుకుంటున్నాడని తెల్సు. కానీ ఎందుకో కాదనలేకపోతోంది. ఉన్న ఒక్క స్నేహితుడ్ని వదిలించుకుంటే, ఇప్పుడు తాను ఉన్న పరిస్థితుల్లో దిక్కెవరు? – అన్న ప్రశ్న ఎదురవుతోంది. ఎంత వద్దనుకున్నా ‘దీపం ఉండగానే’ అన్న భర్త మాటలూ మర్చిపోలేకపోతోంది.

“ప్రపంచంలో ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు గదా. నేను అంటేనే నీకు ఎందుకంత ఇది?” అని అడిగింది – అతని సమాధానం తెల్సుకుందామని.

“కొన్నిటికి కారణాలు ఉండవు. కృష్ణశాస్త్రి అన్నాడు గదా – ‘సలిలము లేల పారు’ – అని. అట్లాగే.. నా ప్రేమ కూడా..”

పల్లవి మనసంతా వికలం అయిపోతోంది.

“భగవంతుడు మనల్ని శాశ్వతంగా విడదీసే రోజు దగ్గర పడుతోంది. ఈలోగా మనమే విడిపోతే మంచిది. నిన్ను విధవగా, అనాథగా ఊహించుకుంటేనే, నా ఊపిరి ఆగిపోతుంది” అంటున్నాడు రాంగోపాల్.

“మీకు తగ్గిపోతుంది. మళ్ళీ ఆరోగ్యవంతులు అవుతారు. లేచి తిరుగుతారు” అంటోంది పల్లవి.

“చావటం కష్టమే. కానీ బ్రతకటం అంతకన్నా కష్టంగా ఉంటోంది. మృత్యువు ఎంత తొందరగా వచ్చి ఆలింగనం చేసుకుంటుందా అని క్షణక్షణం ఎదురు చూస్తున్నాను. నా దిగులు అంతా నీ గురించే..” అంటున్నాడు భర్త.

“అబ్బబ్బ. ఎప్పుడూ అదే గోల. నేను భరించలేకపోతున్నాను. ఇంకోసారి ఆ మాట అంటే, ఇక్కడే తల పగల కొట్టుకుని చస్తాను..” అంటోంది పల్లవి.

చెంపల మీద నుంచి స్రవిస్తున్న బాధను ఇద్దరూ ఒకరికి కనబడకుండా మరొకరు తుడుచుకున్నారు.

క్రమంగా భర్త ఆరోగ్యం సన్నగిల్లిపోతున్న కొద్దీ పల్లవి మానసికంగా క్రుంగిపోతోంది.

ఓ సాయంకాలం పూట.. హోరుగాలి.. భోరున వర్షం.. దీపం ఆరిపోయింది. ఆస్పత్రి వరండాలో నిలబడి నిస్తేజంగా చూస్తున్న ఆమె ముఖం వర్షానికి తడిసిపోయింది. ఏది కన్నీరో.. ఏది వాన నీరో తెలియని.. ధారలు కారిపోతున్నాయి.

కొన్నేళ్ళు నవ్వుతూ, నవ్విస్తూ, లేత లేత కలల పూల వానలు కురిపించిన మనిషి, జీవితానికి అర్థమూ, పరమార్థమూ కల్పించిన భర్త నిర్వికారంగా, నిరాయమంగా, ఇంక తన పాత్ర ముగిసిపోయిందన్న నిశ్చింతగా నిద్రపోతున్నాడు – ఆమెను ఒంటరిగా ఈ జనారణ్యంలో వదిలేసి వెళ్లిపోయాడు.

పల్లవి ఏడ్చి, ఏడ్చి అలసి సొలసి గోడకు చేరగిలబడి, కూలబడిపోయింది.

ఈ వార్త తెలిసి ఆమె ఆఫీసులో పని చేసేవాళ్ళంతా వచ్చారు. విషాద వదనాలతో ఆమెకు సానుభూతి తెలిపారు. కొందరు ధైర్యం చెప్పారు. ఇవన్నీ మొక్కుబడి మాటలనీ, నాలుక చివరి నుంచి వచ్చినవేననీ ఆమెకు తెల్సు.

నిన్నటి దాకా వెంటపడుతూ, ఎన్నో ఊహలు, ఆశలూ రాజేసిన వేణు మాత్రం తిరిగి చూడలేదు.

“వేణుకి చెప్పాను. ఏదో అర్జెంటు పని ఉందంటూ వెళ్ళిపోయాడు” అన్నది కొలీగ్ సుహాసిని.

పల్లవి నిట్టూర్చింది. దేవుడే చిన్నచూపు చూసినప్పుడు, మామూలు మనుష్యులు వీళ్ళు ఎంత? – అనీ అనుకున్నది.

కాలమూ, జీవన వేగమూ ఎవరి కోసమూ ఆగవు. గంటలూ, రోజులూ, నెలలూ, కాలప్రవాహంలో కల్సిపోతున్నయి.

పల్లవి మళ్ళీ ఆఫీసుకు వెళ్తోంది. తల వంచుకొని తన పని తాను చేసుకొని వస్తోంది. వేణు ఆమె ఎవరో తెలియనట్లే, ఏ మాత్రం పరిచయం లేనట్లే ప్రవర్తిస్తున్నాడు.

అవునుగదా – పల్లవి ఇప్పుడు అనాథ.

పైగా ఆమె మనసు గాయపడేట్లు, మాటలు విసురుతున్నాడు.

ఆమెకి ఇది మరింత దుర్లభంగా ఉంది. అతని గురించి పట్టించుకోకపోయినా, అల్లంత దూరం నుంచి అతను విసిరే మాటలు, తూటాల్లా వచ్చి తగులుతూనే  ఉన్నయి.

ఏమిటీ విచిత్ర వైఖరి? ఆమెకు ఏ మాత్రం అర్థం కాలేదు. ఒకసారి సుహాసినిని అడిగింది – ఇలాంటి వాళ్ళు ఉంటారా – అని.

“అప్పుడలా వెంటపడమని నేను అడగలేదు. ఇప్పుడిలా నన్ను తరిమికొట్టేంత తప్పు నేనేమీ చేయలేదు. అతను ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో నాకేం అర్థం కావటం లేదు..”

“ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంది? మగవాడి నైజమే అంత. పరాయి స్త్రీని ట్రాప్ చేయటం మగవాడికి ఒక ఆట. పెళ్ళి అయినా సరే, పిల్లలు ఉన్నా సరే. పరాయి వాడి భార్యతో ప్రేమ కలాపం నడపటం ద్వారా తనో గొప్పవాడిననే ఇగోని పెంచుకుంటాడు. కానీ అదే స్త్రీని – పరిస్థితులు వికటించి పెళ్ళి చేసుకుని ఆమె బరువు బాధ్యతలు మోయాల్సి వస్తే మాత్రం అందనంత దూరం పారిపోతాడు. మనకు కనిపించే ప్రతి పురుషుడి లోనూ ఒక వేణు ఉన్నాడు. వాళ్ళ స్వభావం అర్థం చేసుకోలేక, వాళ్ళు చెప్పేవన్నీ నిజమని నమ్మి, మోసపోతుంటాం.. ఇది నిన్న, ఇవాళ, రేపూ జరిగే, జరుగుతున్న చరిత్ర..” అన్నది సుహాసిని.

మర్నాడు పల్లవి రాజీనామా చేసింది.

జనరల్ మేనేజర్ ఆమెను పిల్చి అడిగాడు “ఎందుకమ్మా రిజైన్ చేస్తున్నావు?” అని.

“ఈ ఆఫీసు బయట చాలా విస్తృతమైన ప్రపంచం ఉంది. ఇక్కడ ఇరుకు గదులు, గాలీ వెలుతురూ చొరబడని హృదయాలూ.. ఊపిరాడటం లేదు. సేద తీర్చే ఒక చల్లని మాట కోసం, స్వచ్ఛమైన గాలి కోసం, కష్టాలూ, కల్మషాలూ లేని మనుషుల కోసం.. వెతుక్కుంటూ విశాల ప్రపంచంలోకి వెళ్ళాలనుకుంటున్నాను..” అన్నది పల్లవి.

ఆయన ఆశ్చర్యంగా చూశాడు. ఆమె నమస్కారం చేసి వెళ్లిపోయింది.

Exit mobile version