Site icon Sanchika

చిరుజల్లు-67

పందిట్లో పెళ్లవుతున్నాది

[dropcap]ప[/dropcap]ది సంవత్సరాల తమ్ముడ్ని వెంట పెట్టుకుని నరసిమ్మ రెండు బజార్ల అవతల ఉన్న నందగోపాల్ ఇంటికి వచ్చాడు.

గేటు తీసుకొని లోపలికి వెళ్తుంటే, ఇంటామె ఎవరని అడిగింది.

“నేనండమ్మా, నరసిమ్మను, మీ బిల్డింగ్ కట్టినప్పుడు పని చేసిన.”

“ఓరి, నువ్వట్రా బాగా పెద్దవాడివి అయ్యావే!”

“పదేళ్లు అయింది గదమ్మ. మేస్త్రీ పని చేస్తున్న. తెల్లారగట్ట నా పెళ్లి. పెళ్లి మండపానికి కొబ్బరి మట్టలు కావాలమ్మ. రెండు మట్టలు కొట్టుకుంటా..” అన్నాడు కొబ్బరి చెట్టు ఎక్కబోతూ.

“ఇంటాయన వచ్చాక ఆయన్ని అడిగి తీసుకో..”

“సారు ఎప్పుడొస్తరమ్మా..”

“రాత్రి పది అవుతుంది.”

“అప్పటి దాకా ఏం చేస్తరమ్మా..”

“ఆ.. గుడ్డి గుర్రానికి పళ్లు తోమతారు..” అన్నదామె విసుగ్గా.

రాత్రి పది గంటలకు నరసిమ్మ, తముడ్ని వెంట పెట్టుకొని వచ్చాడు.

కొబ్బరి ఆకులు కావాలన్నాడు. నందగోపాల్ వీల్లేదన్నాడు.

“పొస్టు టైం పెళ్లి చేసుకుంటున్న సారు.. రెండు కొబ్బరి మట్టలు ఇయ్యండి..”

“నువ్వు పొస్టు టైం కాదు లాస్ట్ టైం చేసుకున్నా మట్టలు ఇయ్యను. మట్టలు కొట్టేస్తే పిందెలు రాలిపోతయిరా..”

“నీ కాల్ మొక్కుతా దొరా.. లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్న, జర ఇయ్యండి సారూ..”

“నేను ఇవ్వను..” గొంతు మార్చి కఠినంగా చెప్పాడు నందగోపాల్.

నరసిమ్మ వెళ్లిపోయాడు.

రాత్రి ఒంటిగంట అయింది. నరసిమ్మ తమ్ముడ్ని తీసుకొని వచ్చాడు. కిటికిలో నుంచి తొంగి చూశాడు. అంతా నిద్దరపోతున్నారు.

కాంపౌండ్ గోడ ఎక్కాడు. దాని మీద నుంచి కొబ్బరి చెట్టు ఎక్కాడు. శబ్దం చెయ్యకుండా నెమ్మది నెమ్మదిగా కొడవలితో కొబ్బరి మట్టను నరికాడు. అది శబ్దం చేస్తూ కింద పడింది.

నందగోపాల్ లేచి లైటు వేసి ‘ఎవడ్రా’ అని అరిచాడు.

నరసిమ్మ కంగారు పడ్డాడు. కిందికి జారబోయాడు. చేతులు గీసుకుపోయి పట్టు తప్పి కింద పడ్డాడు. చేతిలోకి కొడవలి కడుపులో గుచ్చుకుంది. అక్కడికక్కడే పడి చచ్చిపోయాడు.

నరసిమ్మ తాలూకు వాళ్లంతా వచ్చారు. పెళ్లి కూతురు కూడా వచ్చింది. “మాకు పెద్ద కోరికలు ఉండవయ్యా. చిన్న కోరికలు తీరాలన్నా ప్రాణాలు పోవాల్సిందే” అంటూ ఏడ్చింది.

Exit mobile version