Site icon Sanchika

చిరుజల్లు 7

సంతోషానికి చిరునామా

[dropcap]H[/dropcap]appiness does not come from what you have, but what you are.

పుట్టిన ప్రతి జీవి సుఖ సంతోషాలకు లంగరు వేయాలనే అనుకుంటాడు. ఇంకా వీలుంటే స్వర్గ సుఖాలూ అనుభవించాలనీ ఆశిస్తాడు. ఈ స్వర్గ సుఖాలు ఎక్కడుంటాయి అంటె స్వర్గంలోనే కదా ఉంటాయి. మరి స్వర్గం ఎక్కడుందీ అంటే, ఇప్పుడు అక్కడికి వెళ్లి చూసి వచ్చేవాళ్లు ఎవరూ ఉండరు. స్వర్గస్థులయ్యారంటే, చనిపోయారనే అనుకుంటాం. కానీ మనకున్న కావ్యాలూ, కథలూ ఏం చెబుతున్నాయంటే, కొన్ని యుగాల కిందట స్వర్గానికి, భూలోకానికీ రాకపోకలు ఉండేవట. అప్పుడప్పుడు దేవతలు షికారుగా భూలోకానికి వస్తుండేవారట. పుష్కలంగా పుణ్యం చేసుకున్నవారు కూడా స్వర్గానికి అలా పిక్నిక్‍కి వెళ్లినట్లు వెళ్లొస్తుండేవారట. అయితే స్వర్గంలో వాళ్లు ఎలా ఉంటారన్న ప్రశ్న ఉదయిస్తుంది. వారి ఆలోచనలకూ, ప్రవర్తనలకూ, ఇక్కడివారి ఆలోచనలకూ, ప్రవర్తనలకూ చాలా తేడా ఉంది. వారికీ కామ క్రోధాధి ప్రలోభాలు అన్నీ ఉన్నయి. సంతోషం పెల్లుబికినప్పుడు వరాలు గుప్పించటం, ఆగ్రహం వచ్చినప్పుడు శపించటమూ కద్దు. అయితే ఈ కోపతాపాలను పరిమితంగానే ఉంచుకునేవారు. అదుపులో ఉన్నంత కాలం అగ్ని కూడా మంచిదే కదా. అవధులు దాటినప్పుడే ముప్పు ముంచుకొస్తుంది.

పూర్వం మహాభిషుడు అనే రాజు అశ్వమేధాలు, రాజసూయ యాగాలు చేసి లెక్కకు మిక్కిలి పుణ్యం మూట కట్టుకున్నాడు. ఆయన స్వర్గానికి వెళ్లాడు. ఒక రోజు బ్రహ్మగారు కొలువుదీరి యున్నారు. మునిపుంగవులు, మహర్షులూ అందరూ తదేకంగా బ్రహ్మగారి పాదపద్మముల మీదనే దృష్టి సారించి, ధ్యానిస్తున్నారు. మన రాజు గారు కూడా ఆ కొలువులో కూర్చుని యున్నాడు. ఇంతలో గంగాదేవి స్త్రీ రూపంలో వచ్చి నృత్యం చేస్తున్నది. రాజు గారి దృష్టి ఆమె మీదకు మళ్లింది. వాయుదేవుడు కూడా బ్రహ్మగారిని సేవించటానికి ఏతెంచి, ఉధృతంగా వీస్తున్నాడు. కనుక గాలికి ఆమె జుట్టు చెదిరిపోయింది. రాజుగారు ఆమెనే చూస్తున్నాడు. గాలి తాకిడికి ఆమె వస్త్రాలు ఎగిరిపోతున్నయి. రాజుగారు ఆమెనే చూస్తున్నాడు. కటివస్త్రమూ ఎగిరిపోయింది. నగ్నంగా నృత్యం చేస్తున్నది. రాజుగారి దృష్టి అటే ఉన్నది. బ్రహ్మగారికి కోపం వచ్చింది. తన కొలువులోకి వచ్చినా, ఆయనకు కామోద్రేకాలు నశించలేదు గనుక తిరిగి మానవలోకానికి వెళ్లమని శపించాడు. తన కారణంగా శాపానికి గురి అయినందున ఆమెకు రాజుగారి మీద అనురాగం ఏర్పడింది. అలా శాపానికి గురి అయినవాడే శంతన మహారాజుగా జన్మించాడు. గంగ ఆయనను వరించింది. ఇది మహాభారతంలోని ఆదిపర్వంలో ఉన్న కథ. అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి స్థితిగతులు వేరు.

ఇప్పుడు అత్యంత రమణీయమైన, సుఖప్రదరమైన ప్రదేశం ఎక్కడుందీ అంటే  హిమాలయ పర్వతాలని చప్పున చెప్పేస్తాం. ఇప్పటికీ అక్కడ అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయని అంటారు. అయిదారు వందల సంవత్సరాల నుంచీ అక్కడ జీవించి ఉన్నారట. ఎన్నో అపూర్వమైన శక్తులు వారికి ఉన్నాయట. అన్నపానీయాలతో పని లేదట. ఇవన్నీ వినటానికే ఆశ్చర్యంగా ఉంటుంది. అలాంటి చోటుకు వెళ్లి చూసి వస్తే ఎంతో బావుంటుందనిపిస్తుంది. హిమాలయాల ప్రస్తావన వస్తే ప్రవరుడు గుర్తుకు రాకుండా ఉండడు. ఆయనా ఆ సుందర దృశ్యాలను చూడాలని వెళ్లి, చూసి అబ్బురపడిపోయాడు.

అటజనికాంచె భూమి సురుడంబర చుంబి… ఆకాశాన్ని అంటే శిఖరాల నుంచి ప్రవహిస్తున్న సెలయేళ్లు, అంత ఎత్తు నుంచి జారిపడే జలధారల క్రింద ఏర్పడిన లోతైన మడుగులు, అలలు అలలుగా వికసింప చేసే ధ్వనులు నాట్యానికి అనుగుణంగా ఉండే మృదంగ లయ విన్యాసంగా వినిపిస్తుంటే, పురి విప్పిన నెమళ్లు నాట్యం చేస్తున్నయి. నిజంగానే అది అపురూపమైన దృశ్యం. కానీ ఆయన అక్కడే ఉండిపోవాలనుకోలేదు. ఇంటి మీదకు గాలి మళ్లింది. అంటే ఏమన్న మాట… ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, పుట్టిన ఊరు, స్వంత ఇల్లు – వీటిని మించిన – గొప్ప ప్రదేశం మరొకటి ఉండదన్న మాట. వరూధినిని దారి చూపమని అడిగాడు. విలాసవంతమైన ఈ కోన తనది అన్నదామె. ఇల్లు, ఇల్లు అంటూ తపించిపోతావేం – మీ కుటీర నిలయంబులకున్ సరి రాకపోయెనే యిక్కడి రత్నకందరము, లిక్కడి నందన చందనోత్కరం, బిక్కడి గాంగసైకతము లిక్కడి యీ లవనీనికుంజముల్‌ – అంటుందామె. సరే, తరువాత కథ వదిలెయ్యండి. ప్రస్తుతానికి అది అప్రస్తుతం.

ఇప్పటి కాల మాన పరిస్థితుల ప్రకారం, ప్రపంచంలో అత్యంత ప్రశాంతమైన, సురక్షితమైన, సుభిక్షమైన ప్రదేశం ఎక్కడుందీ అని గ్లోబల్ పీస్ ఇండెక్స్ వారు 2021లో సర్వే చేసి ఆ దేశాల జాబితా విడుదల చేశారు. వారు ముఖ్యంగా పరిశీలించిన అంశాలు ఏమిటంటే, అక్కడి ప్రజలు ఎంత సుఖశాంతులతో జీవిస్తున్నారు, ఒకరికొకరు ఎంత గౌరవం ఇస్తున్నారు, ఎంత మర్యాదగా చూస్తున్నారు, ఘర్షణలకు ఎంత దూరంగా ఉన్నారు, కాందిశీకులను ఎంతమందిని ఆదరిస్తున్నారు, నేరాల సంఖ్య ఏ స్థాయిలో ఉందీ, సైన్యం మీద ఎంత ఖర్చు చేస్తునారు, ఇరుగుపొరుగు దేశాలతో ఎంత తరచుగా కయ్యానికి కాలు దువ్వుతున్నారు వంటి అనేకానేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. వాళ్ల లెక్క ప్రకారం తేలింది ఏమిటంటే, అత్యంత ప్రశాంతమైన, సురక్షితమైన ప్రదేశాలలో ఐస్‌లాండ్, న్యూజిలాండ్, డెన్మార్క్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో ఉన్నయి.

డెన్మార్క్‌లో ప్రజల క్వాలిటీ ఆఫ్ లైఫ్ – జీవన స్థితిగతులు ఎంతో బాగున్నయి. ప్రజల మధ్య నున్న అన్యోన్యత, ఆప్యాయత, ఆదరణ ప్రశంసనీయం. ఎవరికన్నా ఉపాధి అకస్మాత్తుగా పోయినా, ఎవరికన్నా జబ్బు చేసినా, ఎవరింట్లోనన్నా ఎవరన్నా మరణించినా, ఇరుగుపొరుగు వారి నుంచి లభించే సహాయ సహకారాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నయి. ఇంట్లో వాళ్లకే గాక, ఇతరులకూ, పెద్దలకూ వారిచ్చే మర్యాద మన్నన్న మెచ్చుకోదగినవిగానే ఉన్నయి. అందరు చిన్న చిన్న సంఘాలు, సంస్థలూ ఏర్పరుచుకొని వీలైనంత తరచుగా కల్సుకొంటుంటారు. కష్టసుఖాలు చెప్పుకుంటుంటారు. సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటూంటారు. అను నిత్యం నాకు తోడునీడగా నలుగురు ఉన్నారన్న ధైర్యం, తృప్తి – దాన్ని మించిన సంతోషం ఇంకెక్కడ ఉంటుంది?

ఇదంతా చూస్తుంటే, చాలా ఏళ్ల కిందట మన పల్లె ప్రాంతాలూ ఇలాగే ఉండేవి కదా అన్న విషయం గుర్తుకు రాకపోదు. ఊరిలోని వారంతా వరసలు కలుపుకుని ఆప్యాయంగా పిలుచుకునేవారు. ఎవరింట్లో ఏ శుభ కార్యం జరిగినా ఊరంతా వచ్చి అక్కడే నిలబడి కావల్సిన ఏర్పాట్లు చేసేవారు. ఉమ్మడి కుటుంబాలలో ఇంటి పెద్ద మాటకు కట్టుబడి ఉండేవారు. జమాఖర్చులూ లెక్క చూసుకునేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ వాతావరణం అంతా మారిపోయి, పల్లెటూర్లూ కక్షలూ, కార్పణ్యాలూ, కొట్లాటలకు ఆలవాలమైపోయాయి. ఒక చిన్న సంఘటన  చాలు, ఊరంతా రణక్షేత్రంగా మారిపోతోంది. భగ్గున తగలబడిపోతుంది. తలలు పగిలిపోతున్నయి.

అసలు కుటుంబ వాతావరణమే మారిపోయింది. పెళ్లి చేసుకొని కష్టసుఖాలు పంచుకుంటూ జీవితమంతా కల్సిమెల్సి ఉండే భార్యని కట్నం డబ్బుల కోసం హింసిస్తాడు. భార్యను కొడతాడు. భార్యాపిలల్ని ఇంట్లోంచి తరిమేస్తాడు. అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు. తన సుఖం కోసం, స్వార్థంతో హత్యలు చేయటానికి వెనకాడని పరిస్థితులు ఏర్పడుతున్నయి. కుటుంబ వ్యవస్థ ఎప్పుడు దెబ్బతింటుందో దాని ప్రభావం సమాజం మీద పడుతున్నది. దీనులూ, దిక్కు లేని వారు, యాచకులుగా మారుతున్నారు. ఆకలి ఎన్నో అనర్థాలకు మూలకారణం అవుతుంది. పగ రగిలిపోతున్నప్పుడు, సంతోషానికి తావు ఎక్కడ?

ఇక సమాజం విషయానికొస్తే, పక్కింటివాడే పరమ శత్రువుగా మారిపోయాడు. ఇరుగుపొరుగు వారితో తగవులు నిత్యకృత్యాలు అయిపోయాయి. ఆదరణ, అన్యోన్యత అన్నదానికి అర్థమే తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నయి. కులాలు, మతాలు, ప్రాంతాలు మనుష్యుల మధ్య చిచ్చురేపుతున్నయి. ప్రభుత్వాలూ, పాలకులూ అవినీతి ఆరోపణలతోనే తమ సమయమంతా గడిపేస్తారు. గౌరవ మర్యాదల మాట దేవుడెరుగు, ఎంతటి వాడినైనా తృణప్రాయంగా తీసిపారెయ్యటం, మానసికంగా కృంగదీయటం జీవన విధానమైంది. దేశ సంపద అంతా ఒక వందమందికో, వెయ్యిమందికో పరిమితమైంది. ఒకరికి తినటానికి తిండి దొరకని దేశంలోనే, రోజుకి లక్షల లక్షలు ఆదాయం వచ్చే బడాబాబులున్నారు. ఎవడికి వాడు గిరి గీసుకొని, ఇది నాది అనుకుని, పక్కవాడిని శత్రువులా చూస్తున్నంత కాలం, మనసుకు శాంతి ఏది? సుఖశాంతులు ఎక్కడివి?

అసలు సుఖమూ, శాంతిని, సంతోషాన్ని కొలిచేందుకు మీటర్లూ, థర్మామీటర్లూ ఏమీ లేవు. తూకం వేసి చూసే తూనికరాళ్లూ లేవు. అలాగే కష్టాలు కూడా. ఒకడికి కష్టంగా తోచించి, మరొకడికి కష్టం కానే కాదు.

ఒక పెద్ద మనిషికి రైల్లో బెర్త్ దొరకలేదు. తెగ బాధ పడిపోతున్నాడు! రాత్రంతా ఎలా ప్రయాణం చేయాలా అని మథనపడిపోతున్నాడు. అతనికి ఎదురుగా కూర్చుని మరొక ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఆయన తన కష్టం అంతా చెప్పుకొచ్చాడు. ఆరు నెలల క్రిందట ఉద్యోగం పోయింది. తిండికి జరగటం కష్టంగా ఉంది. అయిదు నెలల క్రిందట అనారోగ్యంతో భార్య చనిపోయింది. నాలుగు నెలల క్రిందట కొడుకు మర్డర్ కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్లాడు. మూడు నెలల క్రిందట పెద్ద కూతురు ఇద్దరు పిల్లలతో కాన్పుకు పుట్టింటికి వచ్చింది. రెండు నెలల క్రిందట రెండో కూతురు ఎవడితోనే లేచిపోయింది. వాళ్ళు కక్ష గట్టి నిన్న ఇల్లు తగలబెట్టారు. తమ్ముడి దగ్గరకు చెన్నై వెళ్లాలని రైలు ఎక్కాడు. కానీ ఈ రైలు విశాఖపట్టణం వెళ్తోంది. ఇప్పుడు చెప్పండి – బెర్త్ దొరకలేదన్న బాధ, నా బాధల ముందు ఎంత చిన్నది – అని అడిగాడు.

కష్టాల లాగానే సుఖాలు, సంతోషాలు సాపేక్షమైనవి. ఒకరితో పోలిస్తే ఎక్కువ, మరొకరితో పోలిస్తే తక్కువ.

ఇంతకీ సంతోషం అనేది సీసాల్లోనో, పాకెట్లల్లోనో సూపర్ బజార్లో దొరికేది కాదు. అది ఒక మానసిక స్థితి. దాన్ని పెంచుకోవటమూ, తుంచుకోవటమూ మన చేతుల్లోనే ఉంటుంది.

Exit mobile version