చిరుజల్లు-70

0
3

అమ్మ కావాలీ..

[dropcap]ప్ర[/dropcap]తిమాదేవి బస్ స్టాప్‌లో దిగి యూనివర్సిటీ వైపు నడుస్తోంది.

అప్పటికీ, ఇప్పటికీ ఏం మారలేదు. అవే చెట్లు.. లాన్స్.. బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా విద్యార్థులు. అక్కడక్కడా ఒకటి రెండు జంటలు, వాళ్ల లోకంలో వాళ్లు ఉన్నారు. వాతావరణం అంతా అలాగే ఉంది. జోక్స్ వేసుకుంటున్న విద్యార్థుల మధ్య నుండి తప్పుకుంటూ వెళ్లింది. ఇప్పుడు తనను గుర్తించే వాళ్లు ఎవరూ లేరు గానీ, ఇరవై ఏళ్ల కిందట, ఇక్కడ తను ఒక వెలుగు వెలిగింది.

అప్పట్లో స్టూడెంట్స్ అందరికీ తనంటే గొప్ప అడ్మిరేషన్! తన క్లాస్ ఎవరూ మిస్ అయ్యేవాళ్లు కాదు. తన లెక్చర్ ఎంత సేపు విన్నా వాళ్లకు తనివి తీరేది కాదు. సబ్జక్ట్ మీద తనకున్న కమాండ్ అలాంటిది.

ఇరవై ఏళ్ల తరువాత, బాగా పరిచయమైన ఈ ప్రదేశంలోకి అడుగిడుతుంటే, గతం అంతా కళ్ల ముందు మొదులుతోంది. అదంతా ఒక కలలాగా, ఒక భ్రమలాగా ఉంది.

కారిడార్ లోకి వచ్చి ఆ రూం ముందు ఆగింది. నేమ్ ప్లేట్ చూసింది. ‘జోత్స్నాదేవి, పి.హెచ్.డి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్..’ ప్రతిమ నిట్టూర్చింది. రూం ముందూ ఎవరూ లేరు. లోపలికి తొంగి చూస్తే అక్కడా ఎవరూ లేరు.

ఈ జ్యోత్స్న ఒకప్పుడు క్లోజ్ ప్రెండ్. కోలీగ్. తరువాత కాలంలో బద్ధశత్రువు. మొహాలు చూసుకునేవారు కాదు. అందుకే తటపటాయిస్తోంది. ఇన్నేళ్ల తరువాత, అందునా తను ఈ ఉద్యోగం వదిలి వెళ్లాక ఇంకా ఆ నాటి ద్వేషం మిగిలి ఉంటుందా? ఉండదు లెమ్మని తనకు తానే సర్ది చెప్పుకొని, వెళ్లి రూంలో కూర్చోన్నది.

జ్యోత్స్న తనకు జూనియర్. తను రాజీనామా చేయకుండా ఉండి ఉంటే, ఇప్పుడు ఈమె స్థానంలో తనే హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌గా ఉండేది. విద్యార్థులంతా తనను ఆకాశానికి ఎత్తుతుండే వాళ్లు. ఈ పదవికి, ఈ సంతోష సంరంభాలకూ తను దూరం కావటానికి జ్యోత్స్న కొంత వరకూ కారణమే. తన మీద సీనియారిటీ పొందడానికి కొన్ని ట్రిక్స్ ప్లే చేసింది. రాజకీయ పలుకుబడి ఉపయోగించింది. చివరకు తన పంతం నెగ్గించుకున్నది. దేవాలయం లాంటి ఈ విద్యాలయంలో, సాక్షాత్తూ చదువుల తల్లి పాదాల చెంత మాయదారి ఎత్తులన్నీ వేసింది. స్నేహం నటిస్తూనే వెన్నుపోటు పొడిచింది. ఇద్దరూ బద్ధ శత్రువులైపోయారు. మొహాలు చూసుకోనూ లేరు. చూసుకోకుండా ఉండనూ లేరు. ఒకరి వెనక మరొకరు విమర్శలు, చాడీలు, ఫిర్యాదులు, అనుకూల, ప్రతికూల ముఠాలు.. ఎంత కథ నడిచింది! ఈ సఫకేషన్ భరించలేక రిజైన్ చేసింది.

కాని పొరపాటు చేసిందేమో ననిపిస్తోంది. నిజానికి రాజకీయాలు లేని చోటు ఎక్కడుంది? పోటీ ప్రపంచంలో సాగిస్తున్న జీవన యానంలో ఈ నిరంతర ఘర్షణ అనివార్యం కాదా?

 జ్యోత్స్న రూంలోకి రాగానే, ప్రతిమ లేచి నిలబడి నమస్కరం చేస్తూ “నేను గుర్తున్నానా?” అని అడిగింది.

జ్యోత్స్న సంభ్రమాశ్చర్యాలతో అన్నది “అరె, ప్రతిమా! వాటే ప్లెజంట్ సర్‌ప్రైజ్.. ఇది కలా, నిజమా?”

“నిజమే, నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను, నిన్ను చూడాలని..”

“చాలా సంతోషం. ఇప్పుడు ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు?” అని అడిగింది.

“అక్కడే ఉన్నాను. అదే ఇల్లు. అదే ఫామిలీ. అదే నేను. ఏం మార్పులేదు.” అన్నది ప్రతిమ నవ్వుతూ.

“ఉంది, నీలో మార్పు ఉంది. ఆ రోజుల్లో నాజూకుగా అరవిరిసిన రోజాలా ఎంతో అందంగా ఉండేదానివి. ఇప్పుడా అందం. నాజుకుతనం అంతా మాసిపోయినట్లు అనిపిస్తోంది..”

“కావచ్చు. వయస్సు ప్రభావం ఉంటుంది గదా. కాలానికి మనం ఎదురీదలేం”

“మీ ఆయన ఇంకా వైజాగ్ లోనే ఉన్నారా?”

“లేదు. ఇక్కడకు వచ్చేశారు. ఉద్యోగం మానేసి బిజినెస్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది.”

“వెరీ గుడ్.. పిల్లలు?”

“ఒక్కడే బాబు.. సతీష్ చంద్ర..” అని ఆగిపోయింది.

“నువ్వు జాబ్ మానేసి పొరపాటు చేశావేమోననిపిస్తోంది..” అని గతాన్ని గుర్తు చేసింది జ్యోత్స్న.

“అవును. నాకూ అదే అనిపిస్తోంది. ఉద్యోగంలో ఉంటే నేను ఇప్పుడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ అయ్యేదాన్ని కదా అని వచ్చినప్పటి నుంచీ మథన పడుతున్నాను..” అని పేలవంగా నవ్వింది ప్రతిమ.

“ష్యూర్. ఇంత చదువుకొని, పాండిత్యం, ప్రతిభ చేతిలో పెట్టుకొని ఇంట్లో కూర్చోవాలంటే బాధ కూడా. ఎంత సేపు వంట చేయటం, పిల్లల్ని సాకటం, ఇదేనా జీవితం? తొందరపడి రాజీనామా చేసి చాలా పొరపాటు చేశావు. సమస్యలు ఉంటానే ఉంటాయి. అవి లేని దెక్కడ? ప్రాబ్లమ్స్‌కు భయపడి పారిపోతే సమాజంలో బతగ్గలమా చెప్పు?..” అని జ్యోత్స్న హితబోధ చేసింది.

“నిజమే. అప్పట్లో ఇంత దూరం ఆలోచించే ఓపిక, సహనం లేకపోయాయి. ఇప్పుడేమనుకొని ఏం ప్రయోజనం?” అని నిట్టూర్చింది.

కొంత సేపటికి తెప్పరిల్లి చిరునవ్వుతో అన్నది “ఇవ్వాళ సాయంత్రం ఆరుగంటలకు మా ఇంట్లో చిన్న పార్టీ ఏర్పాటు చేశాం నువ్వు తప్పకుండా రావాలి..”

“ఏమిటి విశేషం?” అని నవ్వుతూ అడిగింది జ్యోత్స్న.

“అది సస్పెన్స్. సాయంత్రం అక్కడికి వచ్చాక తెలుస్తుంది” అని నవ్వింది ప్రతిమ.

“అరె, నాతో కూడా చెప్పకూడదా?”

“ఇప్పుడే చెబితే అందులో థ్రిల్ ఉండదు. తప్పకుండా రావాలి. నిన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చినందుకైనా రావాలి..” అన్నది కుర్చీలో నుంచి లేస్తూ.

“నువ్వు పిలిస్తే రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను..” అన్నది జ్యోత్స్న ఆమెను సాగనంపుతూ.

పాత ఫ్రెండ్స్ వేణుగోపాల్, రామాచారి ఇంకో ఇద్దరి ముగ్గుర్ని కూడా సాయంత్రం పార్టీకి రమ్మని ఆహ్వానించింది ప్రతిమ.

ఇంటికి వెళ్తూ దారిపొడుగునా అదే ఆలోచించింది ప్రతిమ. ఉద్యోగం వదులుకొని పెద్ద పొరపాటు చేశానా? ఈ ప్రశ్న ఆమె మెదడును తొలిచేస్తోంది.

ఎన్ని అవస్థలు పడి అయినా ఉద్యోగంలో కొనసాగి ఉంటే, ఇవాళ ఎంత హుందాగా ఉండేది? ఎంత తృప్తిగా ఉండేది? అని ఎవరో మందలిస్తున్నట్లో ఉంది.

కానీ, అప్పటి పరిస్థితులు వేరు, ఆ ఆవేదన అనుభవించే వాళ్లకే గానీ, ఇతరులకు అర్థం కాదు. ఉద్యోగం మానుకోవటానికి, సగం కారణం అక్కడి రాజకీయాలు అయితే, సగం కారణం పిల్లవాడు. అసలు కారణం వాడే.

పెళ్లి అయిన దగ్గర నుంచీ సమస్యలు మొదలైనయి. ఆయనకు వైజాగ్‌లో ఉద్యోగం ట్రాన్స్‌ఫర్ చేయించుకునేందుకు వీలున్న ఉద్యోగాలు కావు. అక్కడ ఆయన ఇక్కడ ఈమె. ఒక వారం ఆయన హైదరాబాదు వస్తే. ఒక వారం ఈమె వైజాగ్ వెళ్లేది. ఏడాది పాటు ఇదే వరస. ప్రెగ్నెన్సీ వచ్చాక మరికొన్ని సమస్యలు తోడైయినయి. ఎక్కుడుండాలి? పిల్లవాడిని ఎవరు చూస్తారు? ఎవరి డ్యూటీలు వాళ్లవి. ఎవరి ఇబ్బందులు వాళ్లవి. అసలు దీనికీ ఒకరి మీద ఆధారపడు కూడదనేది ఆమె జీవిత లక్ష్యం.

పిల్లాడు కాళ్లకూ చేతులకూ కనిపించని బంధమైనాడు. ఆరు నెలలపాటు తిండి, నిద్రా కరువై పోయినయి. అక్కడికీ ఆయన ఉన్న శలవంతా వాడుకొని ఇక్కడే ఉండిపోయారు. ఇంకొంత కాలం శలవు పెట్టుమంటే విసుక్కున్నారు. “ఇంక నాకు శలవు ఇవ్వరు. నీకు ఒక్కదానికీ ఇక్కడ ఉండటం కష్టం అయితే రిజైన్ చేసి వచ్చేయ్. అంత కన్నా ఇప్పట్లో చేయగలిగినదేమీ లేదు” అన్నాడు.

రిజైన్ చేయమని ఎంత తేలికగా అన్నారు? ఆయనకు రిజైన చేయాలన్న ఆలోచన రాలేదు. ఆమెను మాత్రం ఉద్యోగం మానెయ్యమన్నారు. స్త్రీకి ఇల్లు, సంసారం, పిల్లలు.. ఇవి ముఖ్యం. వీటి తరువాతనే ఉద్యోగం, సంపాదన వగైరాలన్నీ. కానీ అంత తేలికగా వదిలేయగల ఉద్యోగం కాదు ఆమెది.

పిల్లాడిని బేబీ కేర్ సెంటర్లో వదిలేసి వెళ్లేది. అక్కడదించగానే వాడికి అర్థమైపోయేది కాబోలు. గుక్క తిప్పుకోకుండా ఏడ్చేవాడు. నెలల పిల్లాడు. తల్లి ఒడి తప్ప ఇంకేమీ తెలియనివాడు. తల్లి కౌగిలిని క్షణమైనా విడిచి ఉండలేనివాడు.. ఏడుస్తున్న వాడిని వదిలి వెళ్లాలంటే బాధ.. ఎవరో ఆమెని రెండుగా చీల్చినంత మానసిక క్షోభ.

ఎంత దూరాన ఉన్నా, ఏ పని చేస్తున్నా వాడి ఏడుపు ఆమెను వెంటాడుతునే ఉండేది. ఏ పని మీదా మనసు లగ్నం చేయలేకపోయేది. కాస్త ఖాళీ దొరికినా పరుగు పరుగున వెళ్లి పిల్లాణ్ణి ఒడిలోకి తీసుకొని, లేత బుగ్గల మీద మద్దులు కురిపించి, పసివాడి ముహాన బోసి నవ్వు మతాబులు వెలిగించి వచ్చేది. మళ్లీ సాయంత్రం వెళ్లేటప్పుటికి, అంత దూరం నుంచే వినిపిస్తుండేది వాడి ఏడుపు. పరుగు పురుగు వెళ్లి వాణ్ణి అక్కున చేర్చుకునేది. ఏడ్చి ఏడ్చి గొంతు ఎండిపోయిన పసివాణ్ణి చూస్తే కళ్ల వెంట కృష్ణాగోదావరీ నదులు పొంగిపొర్లేవి.

ఆయాలు ఎవరూ పట్టంచుకునే వాళ్లు కాదు. ఎంత డబ్బు ఇచ్చినా పసి పిల్లల్ని పెంచటానికి ఎంతో ఓర్పు, సహనం కావాలి. ఆయాల పెంపకం వల్ల పిల్లవాడికి ఎప్పుడూ జ్వరాలూ, జలుబులూ, విరేచనాలూ..

ఒకసారి డాక్టర్ అన్నాడు “ఈ సమయంలో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. ముఖ్యంగా పరిశుభ్రత చాలా అవసరం. ఈ ఈ దశలో వాళ్లకి ఫుల్ టైం తల్లి కావాలి. పార్ట్ టైం తల్లి కాదు..”

ఆ మాటలు ఆయన అనాలోచితంగానే అన్నా, ఆమెకు కొరడా దెబ్బల్లా తగిలాయి. తల్లి ఈజ్ తల్లి. ఇందులో ఫుల్ టైం తల్లి, పార్ట టైం తల్లి అని ఉంటారా? ఆయన ఎందుకు అంత మాట అన్నాడు? తల్లి మనసు గురించి తెల్సే ఆ మాట అన్నాడా? అదే అడిగింది. ఆయన కొంచెం ఆగి చిరునవ్వుతో అన్నాడు.

“పిల్లల్ని కనటం, కొందరికి యాదృచ్ఛికంగా, కొందరికి యాంత్రికంగా జరిగిపోయే ప్రక్రియ. టెస్ట్ ట్యూబ్ బేబీల విషయంలో.. ఆ టెస్ట్ ట్యూబ్‌లు చేసే పనే మీరు చేస్తున్నారు. తల్లి అన్న మాటకు అర్థం అది కాదు. పుట్టిన ప్రాణి ప్రతి చిన్న విషయానికీ భయపడుతుంటుంది. ఉలిక్కి పడుతుంది. ప్రాణ భయంతో ఏడుస్తూంటుంది. పుట్టిన బిడ్డ క్రమంగా ప్రపంచం మీద నమ్మకం ఏర్పరుచుకుంటుంది. మొట్ట మొదట తల్లి మీద ఆ నమ్మకాన్ని ఏర్పరుచుకుంటుంది. తల్లి ఒడిలో ఉంటే రక్షణ ఉందనీ, ఆమె ఎత్తుకుంటే భయం లేదనీ తెల్సుకుంటుంది. ఆమె చేతిలో తీసుకుంటే తనని తల్లి ప్రేమిస్తోందనీ, గుండెలకు హత్తుకుంటే తన పట్ల శ్రద్ధ తీసుకుందనీ ఆ పసి గుడ్డు అర్థం చేసుకుంటుంది. ఆ పసివానికి ఆ నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇవ్వవల్సింది తల్లే. అందుకే ఇంకెవ్వరు ఎత్తుకున్నా ఏడుపు ఆపడు. ఎవరు పాలు పట్టినా తాగడు. ఎవరు నిద్రపుచ్చినా నిద్రపోడు. అయితే ఇవన్నీ మీరు కొద్ది సేపే చేస్తున్నారు. అందుచేతనే మీరు పార్ట్ టైం తల్లులు అన్నాను.. ”

డాక్టరు చెప్పిన దానిలో కొంత నిజం ఉన్నప్పటికీ, పార్ట్ టైం తల్లి అన్న మాటలు ఆమెను శూలాల్లా పొడిచాయి.

ఆ డాక్టర్ని మార్చింది. అయినా పసివాడికి తరచూ రోగాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.

రెండేళ్లు వచ్చినప్పటి నుంచే బడికి పంపించింది. మొదట్లో బాగానే చదివేవాడు. ఇంటి దగ్గర కూర్చో బెట్టి ఆమె చదువు చెప్పేది. స్కూలు నుంచి వచ్చాక ఎండలో తిరుగుతూ, రోడ్డు మీద తిరిగే ఆకతాయి పిల్లలతో ఆడుతుండేవాడు. ఒక రోజు డాబా మెట్ల మీద నుంచి పడి చెయ్యి విరుగ్గొట్టుకున్నాడు. ఫ్రాక్చర్ అయింది. కట్టు కట్టారు.

“ఇంకా నయం. మెట్ల మీద నుంచి పడ్డాడు. తలకు దెబ్బ తగిలితే సీరియస్ అయ్యేది. కన్నో, కాలో దెబ్బతింటే జీవితమంతా ఆవిటి వాడు అయ్యేవాడు. పిల్లల్ని అలా వాళ్ల ఖర్మకు వదియ్యే కూడదమ్మా. ఈ వయసులో మీరు వాళ్లను కనిపెట్టుకొని ఉంటేనే గదా, పెద్దయ్యాక వాళ్ల మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటారు. వాళ్లకు కంఫర్ట్స్, చదువు, డబ్బు, ఆస్తి ఇస్తే సరిపోదు. అవసరమైన సమయం, ప్రేమ, ఆదరణ కూడా అందించాలి..” అన్నాడు పక్కింటాయన.

ఆ మాటలు ఆమెను ఆలోచింప చేశాయి. తను పిల్లవాణ్ణి నిజంగానే నిర్లక్ష్యం చేస్తోందా?

ఒక రోజు ఆమె కొడుకు, స్కూల్లో పిల్లలతో ఆడుకుంటూ, ఇంకో పిల్లవాడ్ని కొట్టి, కింద పడేశాడు. వాడికి దెబ్బ తగిలింది. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు, ఆమె కొడుకు మీదా, స్కూలు యాజమాన్యం మీదా కేసు పెట్టారు. ఆమె పోలీసు స్టేషన్ చుట్టూ తిరగవల్సి వచ్చింది.

“పిల్లల్ని కనగానే బాధ్యత తీరిపోదమ్మా. పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. వాళ్లను సరియైన మార్గంలో పెట్టవల్సిన డ్యూటీ మీదే. మీ డ్యూటీ మీరు చేయకపోతేనే మా డ్యూటీ మేం చేయవల్సి ఉంటుంది. పైగా మీరు పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. మీ పిల్లల్ని దిద్దుకోలేని మీరు, ఇతరుల పిల్లలకు ఏం పాఠాలు చెబుతారు?” అని అన్నాడు ఎస్.ఐ.

ఆమె తలొంచుకున్నది సిగ్గుతో, అవమానంతో.

రాత్రికి ఆమె కొడుక్కి బాగా జ్వరం, కలవరింతలు, భయపడిపోయింది. వీడు తనకు దక్కడా – అన్న భయంమూ ఏర్పడింది.

ఒంటి మీద చెయ్యి వేస్తే చెయ్యి కాలిపోతోంది. పిల్చినా పలకటం లేదు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతున్నాడు.

ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది. జరుగుతున్న వాటిల్లో తన తప్పు ఏమన్నా ఉన్నాదా? పిల్లలు అన్నాక అల్లరి చేయకుండా ఉంటారా? రోగాలూ, నొప్పులూ రాకుండా ఉంటాయా? అంత మాత్రాన అందరూ తల్లినే నిందిస్తారా?

వాళ్ల మాటలు పట్టించుకోకపోయినా, ఉన్న ఒక్క కొడుకూ ఏమైపోతున్నాడు? ప్రాణాలన్నీ వాడి మీదనే పెట్టుకొని, వాడి మీద బోలెడన్ని ఆశలు పెట్టుకొని, ఎన్నెన్నో కలలు కంటోంది. వాడినొక జులాయి వెధవగా ఊహించుకోలేకపోతోంది.

మర్నాడే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది. ద్విపాత్రాభినయం అంతటితో ముగిసింది. ఆ రోజు నుంచీ ఇంక ఆమె దృష్టి అంతా కొడుకు మీదనే కేంద్రీకృతమైంది.

వేళకు నిద్ర లేపటం, స్కూలుకు సిద్ధం చేయటం, స్కూలులో ఎవరితో ఎలా ఉండాలో సుద్దులు చెప్పటం, స్కూలు నుంచి రాగానే బాగోగులు చూడటం, ఈ రోజు జరిగిన విశేషాలు కనుక్కోవటం, తిండి తిప్పలు, కాసేపు ఆటలూ, పాటలూ, హోం వర్క్ చేయించటం, కథలూ కాలక్షేపాలు.. అన్నీ టైం ప్రకారం జరిగిపోతున్నయి.

దగ్గర కూర్చుని చదివిస్తూంటే, వాడికి చదువు మీద శ్రద్ధ పెరిగింది. అన్ని సబ్జక్ట్ లలోనూ సతీష్ చంద్రకే ఫస్ట్ మార్క్‌లు. వాడు స్కూలు నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి, “అన్నిట్లో నేనే ఫస్ట్” అంటూ ఆనందంతో కేరింతలు కొడుతుంటే, ఆప్యాయంగా కౌగిట్లోకి తీసుకున్నప్పుటి ఆనందం అనిర్వచనీయం.

ఇప్పుడింక వాడ్ని చూసి సగర్వంగా తలెత్తుకోవటమే గాని, తల దించుకోవాల్సిన పని లేదు.

***

సాయంత్రం పార్టీకి అందరూ వచ్చారు.

అప్పుడు ప్రతిమ ఎనౌన్స్ చేసింది.

“ఇంత వరకూ పార్టీ ఎందుకు ఇస్తున్నామో ఎవరికీ చెప్పలేదు. ఆ సస్పెన్స్ ఇంకా కొనసాగించటం భావ్యం కాదు. మా అబ్బాయి సతీష్ చంద్ర ఐ.ఏ.యస్. కి సెలెక్ట్ అయ్యాడు. హి యీజ్ టాప్ ఇన్ ది లిస్ట్..”

ఆ ప్రదేశమంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది.

“చిన్నప్పుడు ఎప్పుడూ ‘అమ్మ కావాలీ’ అంటూ ఏడుస్తండేవాడు. ఇప్పుడు ఎంత వాడైపోయాడు?” అన్నది కొన్నాళ్లు ఆయాగా పని చేసిన సుబ్బలక్ష్మి.

“ఇప్పుడూ అమ్మ కావాలీ అనే నేను ఏడుస్తుంటాను” అన్నాడు సతీష్ చంద్ర నవ్వుతూ.

అందరూ అతనికి అభినందనలు తెలిపారు. ఒకాయన మాత్రం అప్పుడే ఇంటర్య్వూ చెయ్యటం మొదలు పెట్టాడు.

“నీ విజయానికి కారణం ఏమిటి?”

“మా అమ్మ” అని తడుముకోకుండా సమాధానం చెప్పాడు. “ఆమె నా కోసం తన కెరీర్‌నే త్యాగం చేసింది. అప్పటి నుంచి ప్రతి క్షణం నేను చెయ్యాలో ఏం చెయ్యగూడదో వివరిస్తూనే ఉంది. పుస్తకాలు చదివి తెల్సుకోలేనివి చాలా ఉంటాయి. వినయం, విధేయత, జీవిత గమ్యం. లక్ష్యసాధన.. ఇవన్నీ అమ్మే నేర్పింది. బాణం వేసేవాడి దృష్టి, ఎప్పుడూ చెట్టు కొమ్మ మీద నున్న పిట్ట మీదనే ఉండాలన్న విషయం రోజూ గుర్తు చేస్తూనే వచ్చింది..” అని కొడుకు అందరి మధ్యలో నిలబడి తన గురించి చెబుతుంటే ప్రతిమాదేవి ఆనందంతో ఉబ్బి తబ్బబ్బు అయింది.

అందరూ ప్రతిమా దేవిని అభినందించారు. ఆ విజయం ఆమెదేనన్నారు.

రాత్రి పది గంటలకు జ్యోత్స్నాదేవి సెలవు తీసుకొని వెడతూ “అప్పట్లో నువ్వు రాజీనామా చేయటమే సరియైన డెసిషన్..” అని చెప్పి కారులో కూర్చుంది.

“మీ పిల్లల్ని కూడా తీసుకు వస్తే బావుండేది” అన్నది ప్రతిమ. అప్పటికే కారు స్టార్ట్ అయింది.

“ఆమె పిల్లల్ని ఎక్కడికీ తీసుకు రాదు” అన్నాడు వేణుగోపాల్.

“ఎందుకని?” అని ఆశ్చర్యంగా అడిగింది ప్రతిమ.

“పరువు పోతుందని..”

ప్రతిమ ఆశ్చర్యంగా చూసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here