సృష్టిలో తీయనిది
[dropcap]గా[/dropcap]యత్రీదేవి ఫోన్ మోగింది. అవతల వైపు నుంచి దేవసేన మాట్లాడుతోంది.
“బిజీగా ఉన్నారా?” అని అడిగింది.
“అబ్బే, ఏం లేదు, చెప్పండి” అన్నది గాయత్రి.
“అమెరికా నుంచి అబ్బాయి వచ్చే నెల పదో తేదీన వస్తున్నాడు. రాగానే అమ్మాయిని చూడటం, పెళ్లి చేసుకోవటం, హానిమూన్‍కి వెళ్లిరావటం, అమ్మాయిని అమెరికా తీసుకుపోవటం – అన్నీ నెల రోజుల్లో జరిగిపోతయి. అందుచేత పిల్లవైపు వాళ్లు గనుక మీరు రెడీ అయిపోవాలి. వ్యవధి ఏమంత లేదు” అన్నది దేవసేన.
“వ్యవధికేముందండీ, ఆ టైం వస్తే అన్నీ అలా నిముషాల మీద జరిగిపోతయి. డబ్బు రెడీగా ఉంటే చాలు. అన్నీ ఆర్డర్ ఇవ్వటమే తరువాయి. ప్రాబ్లం ఏమీ ఉండదు. కానీ అబ్బాయి అమ్మాయిని చూసి ఓ.కే. చెయ్యాలి గదా..”
“ఫోటో, వీడియో పంపాముగదా. ఓ.కే అన్నట్లే. వాడి టేస్టు నాకు తెల్సు. నచ్చినట్లే. పెళ్లి జరుగుతుంది. మీరు ప్రయత్నాలు మొదలు పెట్టండి” అన్నది దేవసేన.
“మీ నోటి చలవ వల్ల అమ్మాయి మెడలో మూడు ముళ్లూ పడితే, మాకు అంతకన్నా కావల్సిందేముంది” అన్నది గాయత్రి.
“అయిపోయినట్లే అనుకోండి.. ఇంకో చిన్న విషయం..”
“చెప్పండి.”
“మీ ఆఫీసులో ఒక ఉద్యోగం ఖాళీగా ఉందట. రెండు రోజుల్లో ఇంటర్వ్యూలు ఉన్నాయట. మా మేనకోడలు అప్లయ్ చేసింది అవకాశం ఉంటే చూడండి.”
“అలాగే.. అమ్మాయి వివరాలు పంపించండి..”
“ఉద్యోగం దానికి వస్తుందంటారా?” అని సంశయంగా అడిగింది.
“వచ్చినట్లే అనుకోండి.. ఆ విషయం నాకు వదిలెయ్యండి” అన్నది గాయత్రి.
“థాంక్స్” అన్నది దేవసేన,
అంతటితో ఫోన్ సంభాషణ ముగిసింది.
సోఫాలో కూర్చుని అంతా వింటున్న హిమబిందు విననట్లే పోజు పెట్టి ఫోన్ చూసుకుంటోంది. గాయత్రి దగ్గరగా వెళ్లి ప్రేమగా కూతురి తల నిమిరింది.
“కల్యాణం వచ్చినా, కక్కొచ్చినా ఆగదన్నారు. నీ పెళ్లి అయిపోతే నా గుండెల మీద కుంపటి దించుకున్నంత రిలీఫ్..”
“అంటే నేను నీకు అంత భారంగా ఉన్నానా? నీ గుండెల మీద కుంపటిలా ఉన్నానా?” అని తెచ్చిపెట్టుకున్న కోపంతో అడిగింది హిమబిందు.
“తల్లికి పిల్ల ఎప్పటికీ భారం కాదు. కానీ పిల్లలకు ఏ వయసులో జరగవల్సిన అచ్చటా ముచ్చటా ఆ వయసులో జరిగిపోతే, అదో ఆనందం. జరగపోతే కలిగే బాధ అలా గుండెల మీద కుంపటిలా – అంటే అనుక్షణం మనిషిని క్రుంగదీస్తుంటుంది. ఏమైతేనేం, నెల రోజుల్లో నువ్వొక ఇంటిదానివి అయిపోతే, నాకు పెద్ద బరువు దించుకున్నట్లు ఉంటుంది..” అన్నది నవ్వుతూ.
పై చదువులకు అమెరికా పంపించమని హిమబిందు పోరు పెడుతోంది. కానీ పెళ్లి చేసి పంపిస్తే తను నిశ్చింతగా ఉంటుందని గాయత్రి భావిస్తోంది. ఇద్దరి మధ్యా విషయంలో కొంత కాలం నుండీ ఘర్షణ జరుగుతూనే ఉంది.
ఇంతలో దేవసేనను దేవుడే చూపించాడు. ఆమె కొడుకు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అక్కడే సెటిల్ అయ్యాడు. మంచి జీతం. ఇల్లూ, కారూ కొనుక్కున్నాడు. ఈ సంబంధం కుదిరి పెళ్లి జరిగిపోతే, కూతురు జీవితం చక్కబడినట్లేనని గాయత్రి భావిస్తోంది.
ఇప్పుడు దాదాపుగా ఇద్దరి కోరికలూ తీరబోతున్నందున, ఇద్దరినీ అందమైన కలలు ముసురుకుంటున్నయి. పెళ్లి అయిపోయినట్లు.. కూతురు అమెరికా వెళ్లిపోయినట్లు, అక్కడి నుంచి ఫోన్‌లో ఫోటోలు పంపిస్తున్నట్లు – కలల అలలు తరుముకొస్తున్నాయి. కదిలిస్తే, సెలయేటి గలగల్లా సంతోషం నిండిన నవ్వులు, ఏవేవో ఆకాశలోకాల నుంచి దిగి వచ్చినట్లు మదిలోనూ, ఎదలోనూ ఏవో, ఎవరెవరివో గుసగుసలు..
కాల్ బెల్ మెగింది.
గాయత్రి వెళ్లి తరుపు తీసింది. ఎదురుగా రాధిక.
“నేను గుర్తున్నానా?” అన్నది చనువుగా నవ్వుతూ, చోరవగా లోపలికి వస్తూ.
“ఆ మాట నేను అనాలి. ఇన్నాళ్లకి మా ఇల్లు గుర్తొచ్చిందన్న మాట..” అన్నది గాయత్రి.
“సంతోషించు. ఇప్పటికైనా నేను నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చానే గానీ, నువ్వు మా ఇంటి వైపు అన్నా తొంగి చూశావా?” అన్నది సోఫాలో కూలబడుతూ.
“నువ్వు రమ్మని పిల్చావా?”
“ఇప్పుడు నువ్వు రమ్మని పలిస్తేనే నేను వచ్చానా?”
“అదే.. నువ్వు వచ్చావంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇద కలా, నిజమా అని.”
“అంటే నేను కలలో కూడా కనిపిస్తున్నానా ఏమిటి?”
“అంతే మరి. నిన్ను కలల్లో చూసి సంతోషించాల్సిందే.. ఇలలో కనిపించవు గదా.”
“కనిపించకపోవటానికి పెద్ద కారణాలు ఏమీ లేవు. వీలు పడలేదు అంతే..”
“ఇంకా ఏమిటి విశేషాలు? అన్నట్లు సారథి రాలేదేం?”
“ఆయనకు తీరిక ఎక్కడ? ఆదివారం నాడూ ఆఫీసే.”
“అంత తీరిక లేకుండా రెండు చేతులా సంపాదిస్తున్నాడన్న మాట..”
“అయ్యో రామ, ఆయన సంపాదన గురించే చెప్పుకోవాలి ఎన్నాళ్లున్నా గొర్రె తోక బెత్తెడే అని..”
“గవర్నమెంటు ఉద్యోగం గదా.. జీతం గాక పైన ఏమన్నా వస్తాయా?”
“పైన కన్నీళ్లు రావల్సిందే.. అన్నట్లు నీకు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చాయాట.. హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ అయ్యవట.. ఎవరి నోట విన్నా నీ పేరే అంటున్నారు..”
“ఏమో మరి, వెనకాల నన్నేం తిట్టుకుంటున్నారో నాకు తెలీదు” అన్నది గాయత్రి నవ్వుతూ.
గాయత్రి, రాధిక చిన్ననాటి స్నేహితురాండ్రు. వాళ్ల స్నేహం బహు విచిత్రమైనది. ఒకరి విడిచి మరొకరు ఉండలేరు. ప్రతి విషయంలోనూ పోటీ పడేవారు. పోటీలో గెలిచి పై చెయ్యి సాధించటానికి ఎత్తుల మీద ఎత్తులు వేసేవారు. ఎంత సన్నిహితంగా ఉంటున్నట్లు కనపించినా, పైకి కనిపించని ఈర్ష్య ఉంటూనే ఉండేది. ఈ ఈర్ష్యలూ, అసూయలూ అపుడప్పుడు బయటపడుతుండేవి. అలిగి వెళ్లిపోతుండేవాళ్లు. సూటిపోటి మాటలతో దెప్పి పోడుచుకునేవాళ్లు. కానీ ఎన్నాళ్లో దూరంగా ఉండలేకపోయేవాళ్లు. నాలుగు రోజులకి అన్నీ మర్చిపోయి కల్సిపోయే వాళ్లు. అలా కలవకుండా ఉండలేని క్షణాన్నే వాళ్లు స్నేహం అనుకునేవాళ్లు.
గాయత్రికి చదువులో ఎక్కువ మార్కులు వస్తే, రాధిక ఈర్ష్యతో రగిలిపోయేది. పగలంతా గాయత్రిని అంటి పెట్టుకొని తిరుగుతూ దాని చదువు చెడగొట్టేది. తను మాత్రం తెల్లవారు ఝామున లేచి చదువుకునేది. గాయత్రి కొత్త బట్టలు కట్టుకుంటే, దానికి తెలియకుండా వెనక ఎక్కడో బ్లేడుతో కోత పెట్టేది. గాయత్రి నగ చేయించుకుంటే, అది ఎక్కడో పారేసుకునే దాకా రాధికకు మనశ్శాంతి ఉండేది కాదు.
ఇన్ని గొడవలు పడుతూనే స్నేహం కొనసాగించారు.
సారథి గాయత్రికి దూరపు చుట్టం. కొత్తగా ఆ ఊరు వచ్చాడు. హాస్టల్లో ఉంటూ, శలవు రోజుల్లో గాయత్రి ఇంటికి చుట్టపు చూపుగా వచ్చేవాడు. కానీ ఆ చుట్టపు ‘చూపు’లో ఏదో కనిపించని విశేషం ఉందని రాధిక పసిగట్టింది. ఆమె అనుమానం నిజమే అయింది. సారథి, గాయత్రి ప్రేమలో పడ్డట్లే కనపడ్డాడు. గాయత్రి అతనితో చనువుగా మాట్లడితే రాధిక ఓర్వలేకపోయేది. వాళ్లిద్దరూ ఎక్కడ చేరితే, తను అక్కడ తిష్ట వేసేది. గాయత్రి సారథికి కొసరి కొసరి వడ్డిస్తుంటే, రాధిక బర్రున చీదేసేది.
అన్నిట్లో లాగానే సారథితో ప్రేమలోనూ గాయత్రితో రాధిక పోటీ పడింది. పోటీ పడ్డాక, ఎన్ని అడ్డతోవలు తొక్కి అయినా సరే, గెలుపు సాధించటం రాధికకు కొత్త కాదు. ప్రేమ పరీక్షలో నెగ్గటం ఎలాగో అనుభవజ్ఞులను అడిగి తెల్సుకుంది.
“ఒక వ్యక్తిని ఆకర్షించాలంటే, అతనికి ఇష్టమైన పనులు చేయాలి. అతని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలి. వీలున్నంత ఎక్కువ సమయం అతనితో గడపాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఒక మనిషి మీద ప్రేమను అంకురింప చేస్తాయి. అతని పట్ల చూపే అమితమైన శ్రద్ధ, అభిమానం ఆదరణ వల్ల ప్రేమ ముదిరి పెళ్లి దాకా దారితీస్తుంది.”
ఈ సూత్రాన్ని అధ్యయనం చేసింది. గాయత్రికి తెలియకుండా రాధిక అతని హాస్టల్‌కి వెళ్లేది. అతని కోసం ఎంతో శ్రమ పడుతున్నట్లు, అతని కోసం ఏ పని చేయటానికైనా సిద్ధంగా ఉన్నట్లు కనిపించేది. ఈ పరుగు పందెంలో తను గాయత్రి కన్నా ఎంతో ముందంజలో ఉన్నట్లు అతనికి అభిప్రాయం కలిగించేది. ఏకాంతంలో మనసు విప్పి చెప్పుకునేది. అతనిని చూడకుండా ఉండలేకపోతున్నట్లు కన్నీళ్లు పెట్టుకునేది. అతని ఓదార్పు కోసం, చిరునవ్వు కోసం, పలకరింపు కోసం పరితపించి పోతున్నట్లు చెప్పేది. వీళ్లిద్దరి రహస్య సమావేశాలు క్రమంగా అతని హాస్టల్ లోని వాళ్లందరికీ తెల్సిపోయి, వాళ్లు ఆటపట్టించే స్థాయికి వచ్చారు.
ఇవన్నీ సారథి మీద పని చేశాయి. ప్రేమ పరీక్షలో రాధిక విజయం సాధించింది. సారథి రాధికను ప్రేమించాడు. పెళ్లి చేసుకున్నాడు.
ఎవరి మనసులో ఏముందో ముగ్గురికీ తెల్సు. ఏవో ముఖ ప్రీతి మాటలు మాట్లాడినా, లోపల ఉన్న ద్వేషం వల్ల, కల్సుకోవటానికి ఇష్టపడేవాళ్లు కాదు. ఎప్పుడన్నా, ఎక్కడన్నా ఒక చోట ఎదురుపడి మాట్లాడుకున్నా, ఏమీ జరగనట్లే పైపైన ఆప్యాయతను ఒలక బోసుకునేవారు. చిన్నప్పటి అన్యోన్యం ఇంకా అలానే ఉన్నట్లు కనిపించేవారు.
చాలా రోజుల తరువాత ఇవాళ రాధిక స్నేహితురాలి ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. గాయత్రి టిఫిన్ తయారు చేస్తున్నంత సేపూ పక్కనే ఉండి పాత కబుర్లు చెబుతూనే ఉంది. తన సంసారంలోని ఇక్కట్లు అన్నీ పూసగుచ్చినట్లు వివరిస్తోంది.
చివరకు అసలు విషయానికి వచ్చింది.
“మీ ఆఫీసులో ఏదో ఉద్యోగం ఖాళీ ఉందిట. మా అమ్మాయి అప్లయ్ చేసింది. నువ్వు తల్చుకుంటే అయిపోయినట్లే అని చెప్పారట. అంతా నీ చేతిలో ఉందని చెప్పగానే ఎంత సంబరపడిపోయానో. నా క్లోజ్ ఫ్రెండ్‌వి నువ్వు ఇవాళ ఇంత పై కొచ్చినందుకు ఆనందం పట్టలేకపోతున్నాననుకో. మా అమ్మాయి అని తెలిస్తే నువ్వు దానినే సెలక్ట్ చేస్తావనుకో. అయినా అడగడం నా ధర్మం కదా. దానికీ జాబ్ దొరికిందంటే, మా సంసారం గట్టున పడ్డట్లే. నీ పేరు చెప్పుకొని రెండు పూటలా ఇంత తిండి తింటాం. ఆయనే వచ్చి అడగాలనుకున్నారు. కానీ నువ్వు ఏమనుకుంటావో అని వెనకాడుతున్నారు..” అని రాధిక పాఠం అప్పజెప్పినట్లు ఆగకుండా చెప్పింది.
గాయత్రి మాట్లాడలేకపోయింది. వెంటనే సరేనని మాట ఇవ్వలేకపోయింది.
“పాత విషయాలు మనసులో పెట్టుకోకు. నా వల్ల ఏమైన తప్పులు జరిగి ఉంటే పెద్ద మనసుతో క్షమించెయ్. చిన్నప్పటి నుంచీ నీడలా నిన్ను అంటి పెట్టుకొని తిరిగాను. నువ్వు నా అక్కవే అనుకున్నాను. చెల్లెలు పొరపాట్లు చేస్తే అక్క క్షమించకుండా ఉంటుందా? నువ్వు మాట ఇస్తే గానీ, నా మనసు కుదుట పడదు..” అని కన్నీళ్లు పెట్టకుంది రాధిక.
గాయత్రి చలించిపోయి సరేనంది.
“ఆ మాత్రం అభయం ఇస్తే చాలు. నిశ్చింతగా వెళ్లిపోతాను. నువ్వు ఇవాళ చేస్తున్న సాయం వల్ల ఒక ఆడపిల్ల జీవితం బాగుపడుతుంది. ఒక సంసారం తెరిపిన పడుతుంది. నీ మేలు మర్చిపోలేము” అని కన్నీళ్లు తుడుచుకుంది.
రాధిక వెళ్లిపోయింది.
గాయత్రి ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉంది. ఉన్నది ఒక్కటే ఖాళీ. గట్టి పోటీ ఉంది. రాధిక కూతుర్ని సెలక్ట్ చేయవచ్చు. కానీ దేవసేనకు ఇచ్చిన మాటతో తన కూతురు జీవిత సమస్య ముడిపడి ఉన్నది. రెండూ ముఖ్యమే. ఎటు మొగ్గాలో తెలియటం లేదు. కాసేపు కూతురి అమెరికా సంబంధం, మరో పక్క కన్నీళ్లతో ప్రాధేయపడుతున్న దృశ్యం..
మర్నాడు గాయత్రి ఆఫీసుకు దేవసేన ఫోన్ చేసింది. రాధిక కూడా ఫోన్ చేసి గుర్తు చేసింది. “వీలున్నంత వరకూ ప్రయత్నిస్తాను” అనే ఇద్దరికీ చెప్పింది.
“నీ దయ, మా ప్రాప్తం.” అన్నది రాధిక గద్గద స్వరంతో.,
ఎన్ని ఎగుడు దిగుడులు ఉన్నా, ఇన్నేళ్ల రాధిక స్నేహం వైపే మనసు మొగ్గు చూపింది. చివరకు రాధిక కూతుర్నే సెలెక్ట్ చేసింది.
ఆ అమ్మాయి మర్నాడే ఉద్యోగంలో చేరింది.
నెల రోజులు గడిచినా దేవసేన మళ్లీ ఫోన్ చేయలేదు. గాయత్రి ఫోన్ చేస్తే “మా వాడు ఇప్పట్లో రావటం లేదు” అని ఒక్క ముక్క చెప్పి తప్పించుకుంది. కానీ అతను వచ్చి మరో సంబంధం కూదుర్చుకున్నాడని తెల్సింది.
“అమ్మా ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోను. ఇంకా చదువుకుంటాను” అన్నది హిమబిందు తల్లి బాధను అర్ధం చేసుకొని.
“అలాగే తల్లీ” అన్నది కూతురి తల నిమురుతూ.
ఇంత జరిగాక ఇప్పుడు గాయత్రిని అమితంగా బాధ పెడుతున్న విషయం మరొకటి ఉన్నది.
“లక్ష రూపాయలు లంచం తీసుకొని, తన కూతురికి ఉద్యోగం ఇచ్చింది” అని రాధిక ఎవరో తెల్సిన వాళ్లతో అన్నదిట.
“చిన్నప్పటి స్నేహానికన్నా, డబ్బుకే విలువ ఇచ్చావా?” అని ఆ తెల్సినవాళ్లు తెల్సీ, తెలియకుండా అనటమే గాయత్రిని వేధిస్తోంది.