Site icon Sanchika

చిరుజల్లు-74

అరణ్యంలో హరిణి

[dropcap]అ[/dropcap]డవిలో సింహం ఎదురుగా వస్తున్నప్పుడు, చిన్న చిన్న జంతువులన్నీ భయపడి దూరంగా పారిపోయినట్లు – నరసింహం రోడ్డు మీదకు వచ్చినప్పుడు చిన్న చిన్న మనుషులంతా ఎటు వాళ్ళు అటు తప్పుకుంటారు.

నరసింహానికి నిండా పాతికేళ్ళు లేవు. కానీ అతని చరిత్ర మాత్రం ప్రసిద్ధి కెక్కింది. ఇప్పటికి నలుగురిని హత్య చేశాడు. అతని మీద ఒక్క కేసు కూడా రిజిస్టర్ కాలేదు. ‘కేసు బుక్ చేస్తే పోలీసోడ్నీ లేపీగల్ను’ అంటాడు నరసింహం. పోలీసూ మనిషే. ప్రాణమంటే అతనికీ తీపే. నరసింహం అయిదుగురి ఆస్తుల్ని స్వాహా చేశాడు. ఏ ఒక్కడూ తన ఆస్తి కాజేసాడని కోర్టులో కేసు వేయలేదు. నరసింహం మీద కోర్టులో కేసు వేస్తే, మళ్ళీ ఊళ్ళోకి అడుగుపెట్టలేమన్న భయమే వాళ్ళ నోరు మూయించింది. నరసింహం మాట లెక్క చెయ్యనందుకు లెక్కలేనంత మందిని చితక తన్నాడు. అందరి సమక్షంలోనూ చావగొట్టాక, జనాంతికంగా అంటాడు – “ఎవుడన్నా నా మాట కాదన్నాడో, ఆడికీ ఇదే గతి పట్టుద్ది” అని. అందుకే ఈ రౌడీ వెధవ అంటే అందరికీ భయం.

ప్రపంచంలో మంచిని సమర్థించే వాళ్లు ఉన్నట్లే, చెడును సమర్థించేవాళ్ళూ ఉంటారు. నరసింహాన్ని చూసి అతనిలాగా రెచ్చిపోవాలని ఆరాటపడే కొంతమంది కుర్రాళ్లు అతని చుట్టూ చేరి ఆకాశానికి ఎత్తటం మొదలుపెట్టారు. వాళ్ళందరికీ అతను గురువు అయిపోయాడు. శిష్యగణం కూడా వెలిసినందున, నరసింహం పట్టపగలే చుక్కలు మొలిపించటం మొదలుపెట్టాడు. రోజూ అతను కొలువు తీరే సమయానికి శిష్యగణం అంతా చుట్టూ చేరి ఏదో ఒక వార్త మోసుకొచ్చేవారు. తమ ఆధిపత్యానికి ఎవడన్నా తల ఒగ్గడం లేదని తెలిస్తే నరసింహం రెచ్చిపోయేవాడు. “మాట వినకపోతే శాల్తీ గల్లంతు అవుద్దని చెప్పు” అని శిష్యుల చేత కబురు చేసేవాడు. ఇక శిష్యులు అక్కడికి వెళ్ళి వీరవిహారం చేసి తమ ప్రతాపం చాటుకునేవారు.

ఆ ఊరు ఒక చిన్న జనారణ్యం అయితే అందులో సింహంలా తిరుగుతుంటాడు నరసింహం.

అదే ఊళ్ళో హరిణి కూడా ఉంటోంది. హరిణి కుటుంబరావు కూతురు. ఆయన పోస్ట్ మాస్టర్. కార్డులు, కవర్లూ అమ్మటం, ఒకటికి రెండు సార్లు డబ్బు లెక్కపెట్టుకోవడం, అంతా సరిగ్గానే ఉందని పదే పదే చూసుకోవటం – ఆయన ఎంత జాగ్రత్తపరుడో తెలియజేస్తుంది. ఏ పని చేస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో ముందుగానే ఊహించి రాబోయే ప్రమాదాలకు ఆమడ దూరంలో ఉండటం కుటుంబరావు ముందుచూపునకు నిదర్శనం. ఆయనతో సహచర్యం చేసినందువల్ల ఆయన భార్య సావిత్రమ్మకూ అదే పిరికితనం అలవాటైపోయింది.

హరిణి ఈ కాలం పిల్ల కాబట్టి కళ్లు మూసీ, కళ్ళు తెరిచీ కలలు కనటం అలవాటు. ఆ కలల్లో మేనత్త కొడుకు శ్యామల రావు, మేనమామ కొడుకు సుందరం వచ్చి ఆమె పక్కన నిలిచి ఎన్నెన్నో కాంక్షలను ఆమె పాదాల వద్ద పోగు చేసేవారు. శ్యామల రావు కాబోయే డాక్టరు. అందంగా ఉంటాడు. సినిమాల్లో హీరో వేషాలు ఇస్తామంటే నవ్వుతూ వద్దన్నాడు. సిటీలో రెండు మేడలున్నయి. రెండు కార్లున్నయి. అతన్ని వలచి వలపింప చేసుకుంటే జీవితం నందనవనం అవుతుందని ఆమె ఆశ. ఇక సుందరం ఇంజనీరింగ్ చదువుతున్నాడు. బ్రిలియంట్ స్టూడెంట్ అని పేరు తెచ్చుకున్నాదు. అతనికి బంగారు భవిష్యత్తు ఉంది. సుందరాన్ని చేసుకున్నా హరిణి జీవితం వెన్నెల్లో బృందావనంలా కడు రమణీయంగా ఉంటుంది. కాసేపు మేనత్త కొడుకు తోను, మరి కాసేపు మేనమామ కొడుకుతోనూ హరిణి అలా అలా కలల్లో విహరించి వస్తుంటుంది.

ఈలోగా పొయ్యి మీద పాలు పొంగిపోవటం, కుళాయి కింద పెట్టిన బకెట్ నిండి, నీళ్లు పొర్లిపోతుండటం లాంటివి జరిగిపోతుంటయి. అవన్నీ ఆ అమ్మాయికి శుభ సూచకాల్లాగానే కనిపిస్తుంటయి. కాకపోతే వెనక నుంచి తల్లి స్తోత్రాలు చదువుతుంటుంది. “నిన్ను ఎవడు కట్టుకుంటాడో గాని, వాడికి వేళకు తిండీ తిప్పలు ఉండవు. అది మాత్రం ఖాయం” అంటున్న తల్లి మాటల్ని అస్సలు ఖాతరు చెయ్యదు. ‘ఆఁ మనకేంటి, మన లైఫ్.. బెడ్ ఆఫ్ రోజెస్..’ అనుకుంటుంది స్వగతంలో.

ఆమె కాళ్ళ ముందు ఒక పెద్ద పరుపు. దాని మీద రంగురంగుల గులాబీలు అందంగా పరిచి ఉన్న దృశ్యం కనిపిస్తుంది. మృదువైన పాదాలతో గులాబీల మీద నుంచి నడిచివెళ్తున్నప్పుడు, ఇటు నుంచి శ్యామ్, అటు నుంచి సుందరం చేతులు చాచి రా రమ్మని పిలుస్తున్న ఊహాచిత్రం కనిపిస్తుంది. ఎటూ తేల్చుకోలేక ఆమె సిగ్గుల మొగ్గ అయిపోతుండగా, తల్లి కంఠం ఖంగున మోగుతుంది.

“ఓసి నీ పరధ్యానం పాడు గాను, కూర మాడిపోయిన వాసన వస్తుంటే ఎదురుగా ఉండీ చూడవేమో..” అంటూ.

ఒకరోజు హరిణి స్నేహితురాలు సంధ్య ఇంటికి వెళ్ళి వస్తుంటే, నరసింహం ఎదురుపడ్డాడు. వాడు రౌడీ అని తెలిసినా, వాడితో నాకేంటి అన్నట్లు, వాడిని లెక్క చెయ్యకుండా తన దోవన తను పోయింది హరిణి.

“ఈ ఊర్లో ఎవురూ నా కెదురుగా ఇంత నిర్లక్షంగా, ధీమాగా నడిచి వెళ్ళలేదు. ఈ పిల్ల ఎవురూ, నన్ను లెక్క చెయ్యకుండా వెళ్తుంది” అన్నాడు నరసింహం.

“పోస్ట్ మాస్టర్ కూతురు గురూ” అన్నాడు ఒక శిష్యుడు.

“దీన్ని ఒక చూపు చూడాల్సిందే” అన్నాడు నరసింహం.

స్కూటర్ వెనక్కి తిప్పి తీసుకెళ్ళి హరిణిని గుద్దుకునేటట్లు బండి నడిపాడు.

“ఏంటి, మీద పడతావేం? కళ్ళు కనబడడం లేదా?” అని కోపంగా అడిగింది హరిణి.

“కళ్ళు కనబడబట్టేనే నీ మీద పడింది” అన్నాడు నరసింహం.

“షటప్” అన్నది హరిణి.

“అంటే ఏంట్రా?” శిష్యుడిని అడిగాడు.

“నోరు మూసుకోమంటోంది గురుజీ”

“దాని నోరు మన నోరుతో మూస్తే ఎలాగుంటుందిరా?”

“బాగుంటుంది గురూ” అని శిష్యుడు అన్నాడు.

నడిరోడ్డు మీద నరసింహం ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే చూస్తున్న వాళ్ళంతా వాడి ఆగడాలను తిట్టుకున్నా, హరిణిని ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

జరిగిన సంఘటన గురించి క్షణాల్లో ఊరంతా తెలిసిపోయింది.

కుటుంబరావుకు తల కొట్టేసినట్లు అయింది. సావిత్రమ్మ తనలో తానే కుమిలిపోయింది. హరిణి ఆ షాక్ నుంచి తేరుకోవటానికి రెండు రోజులు పట్టింది. ఒక పక్క ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. మరో పక్క అవమాన భారం క్రుంగదీస్తోంది.

‘ఏమైనా సరే, వీడి అంతు తేల్చుకోవాల్సిందే’ అని నిర్ణయించుకొని హరిణి పోలీస్ స్టేషన్‍కి వెళ్లి కంప్లయింట్ చేసింది.

“అవునూ, మొన్న ఈ సంఘటన జరిగితే ఇప్పుడా వచ్చి కంప్లయింట్ ఇవ్వటం? ఆ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన సాక్షులు ఎవరైనా ఉన్నారా?” అని అడిగాడు ఇన్‍స్పెక్టర్.

“నడిరోడ్డు మీద పట్టపగలు అందరూ చూస్తుండగా నా మీద పడి ముద్దు పెట్టుకున్నాడని కంప్లయింట్ ఇచ్చాను. ఏ ఆడపిల్లా ఇలాంటి అబద్ధాలు కల్పించదు. అయినా ఇది నిజమో కాదో వాడిని పిల్చి విచారించి నిజానిజాలు తేల్చుకోవలసింది మీరు..” అన్నది హరిణి.

“నేను అడగటం కాదమ్మా. వాడిని పిల్చి అడిగితే, వాడు నన్ను అడిగే మొదటి ప్రశ్న – దీనికి సాక్ష్యం ఎవరైనా ఉన్నారా – అని. సాక్ష్యం చెప్పటానికి ఎవరూ ముందుకు రావటం లేదని నువ్వు అంటున్నావు. నేను వాడి మీద యాక్షన్ తీసుకోవాలంటే, అందుకు తగిన సాక్ష్యాధారాలు ఉండాలి కదా?” అని అడిగాడు ఇన్‍స్పెక్టర్.

“ఇలా అయితే ఎలా? ఈ దౌర్జన్యాలు జరుగుతుంటే, నోరు మూసుకుని కూర్చోవటమేనా?” అని అడిగింది హరిణి.

“ప్రజలలో చైతన్యం రావాలి. సామాజిక బాధ్యతను జనం గుర్తిస్తే ఇట్లాంటివి అరికట్టవచ్చు. పామును చూసి పారిపోతుంటే, అది పడగ విప్పుతుంది. మనం కర్ర తీసుకుని వెంటపడితే పారిపోతుంది. ఒక రౌడీ విషయంలోనూ అంతే. మనం భయపడుతుంటే వాడు పడగ విప్పుతాడు. మనం చెయ్యి ఎత్తితే వాడు పారిపోతాడు..” దీర్ఘోపన్యాసం ఇచ్చాడు.

“అన్యాయాన్నీ, దౌర్జన్యాన్నీ అణచివేసేందుకు ఎన్నో అధికారాలు ఉన్న మీరే, ప్రజల మీదకు తోసేసి తప్పుకుంటున్నారు. పడగ విప్పుతాడని పారిపోకూడదని ధైర్యంగా నిలబడినందుకే ఇలాంటి పరిస్థితి ఎదురయింది. ఇక వాడి మీద చెయ్యి ఎత్తితే, ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చు” అన్నది హరిణి.

ఆమె తన మీద రిపోర్టు ఇవ్వటానికి పోలీసు స్టేషన్‍కి వెళ్ళినట్లు తెల్సి, నరసింహం రెచ్చిపోయాడు.

“ఏంది? ఇది నా మీద రిపోర్టు ఇస్తదా? అంత ధైర్యం ఉందా దీనికి?” అని ఊగిపోయాడు నరసింహం.

కుటుంబరావు బావమరిది చనిపోయాడు. ఇంట్లో హరిణి, సావిత్రమ్మ ఉన్నారు.

సావిత్రమ్మ కూరల కోసం బజారుకు వెళ్ళిన సమయంలో నరసింహం ఇంట్లో చొరబడ్డాడు.

హరిణి పైన అత్యాచారం చేశాడు. ఆమె రోదన అరణ్యరోదన అయింది.

కేకలు విని పరుగెత్తుకొచ్చిన ఇరుగుపొరుగు వాళ్ళు ఇంటి ముందున్న రౌడీలను చూసి వెనక్కి వెళ్ళారు.

జరగకూడని ఘోరం జరిగిపోయింది. హరిణి జీవితాన్ని నరసింహం కాలరాసేశాడు.

జనారణ్యంలో హరిణి సింహం కోరల్లో చిక్కుకుంది.

కుటుంబరావు వచ్చాడు. విషయం తెలుసుకున్నా, కొండతో ఢీ కొంటే ప్రయోజనం ఏమీ లేదని ఊరుకున్నాడు. నరసింహం మీద ఫిర్యాదు చేసే ధైర్యం లేదు. చేసి సాధించేది కూడా ఏమీ లేదని తెల్సు.

జీవచ్ఛవాల్లా మారిపోయిన ఈ ముగ్గురికీ నరసింహం పంపిన కబురు పిడుగుపాటులా తోచింది.

“ఎలాగూ నీ కూతురు మా గురూగారి చేతిలో చెడిపోయింది. ఇంక నీ పిల్లకు పెళ్ళి కాదు. పెళ్ళి కానివ్వం. అందుచేత మా గురువు గారికి ఇచ్చి పెళ్లి చేయండి.. కాదంటే, మీ ఇంట్లో ఎవరూ మిగలరు”

ఇదీ నరసింహం నుంచి వచ్చిన కబురు.

ఎన్నో ఊహించుకున్న హరిణి – శ్యాం తోనూ, సుందరం తోనో జీవితాన్ని పంచుకోవాలని కలలు కన్న హరిణి – ఒక వీధి రౌడీకి, ఒక హంతకుడికీ భార్యగా జీవితాన్ని ఊహించుకోలేక పోతోంది.

కుటుంబరావు దంపతులు ఎటూ తేల్చుకోలేక ముందే, నరసింహం ముహూర్తం పెట్టి పంపించాడు.

పది రోజుల్లో పెళ్ళి చెయ్యమన్నాడు.

ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కుటుంబరావు మథన పడుతుండగా, హరిణి ఈ పెళ్ళికి ఒప్పుకుంది.

నిశ్చితార్థం జరిగింది.

ఆ రోజు నరసింహంతో పాటు అతని శిష్యగణం అంతా వచ్చింది. అందరూ ఫంక్షన్ హాల్‍లో ఏర్పాటు చేసిన విందు భోజనం ఆరగించారు.

ఆ సాయంత్రం నరసింహంను హాస్పటల్‍లో చేర్చారు.

“ఫుడ్ పాయిజనింగ్ జరిగింది” అన్నాడు డాక్టర్. “ఇక్కడికి తీసుకు వచ్చేటప్పటికే చాలా ఆలస్యం అయింది. తాగిన విస్కీ లోనూ విషం కలిసింది”

ఆ రాత్రికి నరసింహం చనిపోయాడు.

ఈ విషయం తెల్సి కుటుంబరావు దంపతులు నివ్వెరపోయారు.

ఊళ్ళోని వాళ్ళంతా పీడ విరగడ అయింది – అన్నారు.

“ఏమిటే ఇది?” అని స్నేహితురాలు అడిగింది.

“నా జీవితంలో వాడు విషం చిమ్మాడు. నేనూ వాడి జీవితంలో విషం నింపాను. పోలీసులూ, కోర్టులూ చేయలేని పని నేను చేశాను. పాము పడగ విప్పుతుంది. మనం భయపడి పారిపోతున్నాం. దీనికి పరిష్కారం ఏమిటి? పామును చంపితే, దాని కాటు నుంచి మిగిలినవాళ్ళను అయినా రక్షించగలుగుతాం..” అన్నది హరిణి.

నరసింహం శిష్యుల దృష్టిలో ఆమె హంతకురాలు. ఆ ఊరి వాళ్ళ దృష్టిలో ఆమె రాక్షసుడిని సంహరించిన దేవత.

Exit mobile version