Site icon Sanchika

చిరుజల్లు-75

దేరీజ్ నో రీజనింగ్

[dropcap]గో[/dropcap]వర్ధన్ రావు కింది తరగతి కుటుంబానికి చెందినవాడు. కింది తరగతి గుమాస్తా. కింది వాటాలోనే అద్దెకు ఉంటున్నాడు. ఎంత కింది తరగతి వాడైనా పెళ్ళి అనేటప్పటికి, ఎంతో కొంత ఆర్భాటం తప్పదు గదా. అక్కడెక్కడో పెళ్ళి చేసుకొని వచ్చినా, “అదేమిటోయ్, ఫస్ట్ టైమ్ పెళ్ళి చేసుకున్నావ్? ఎంత గ్రాండుగా పార్టీ ఇవ్వాలి?” అంటూ ఆఫీసులోని వాళ్లంతా చంపుకు తింటుంటే, కొత్త పెళ్ళాంతో కన్‍సల్ట్ చేసి, బడ్జెట్ వేసుకుని, ఆఫీసు మూకనంతా ఇంటికి పిల్చి, సింపుల్‍గా పార్టీ ఇచ్చాడంటే ఇచ్చాడన్నట్లు తేలికగా తేల్చేశాడు.

ఆ పార్టీకి పై ఆఫీసర్ అయిన బ్రహ్మచారి గారు కూడా దయతో విచ్చేసి, నూతన దంపతులను ఆశీర్వదించారు. ఆయన ఏమని ఆశీర్వదించాడో ఎవరికీ తెలియదు కానీ ఆ కాసేపు తను పై ఆఫీసర్‍ని అన్న విషయం మర్చిపోయి, నాలుగు ఎంగిలి జోక్ లేసి సరదాగా వాళ్ళతో కల్సిపోవాలని ట్రయ్ చేశాడు. అప్పటి నుంచే ట్రయల్ మొదలైందన్న మాట.

మర్నాటి నుంచి బ్రహ్మచారి గారు గోవర్ధన్ రావుని ప్రేమగా చూడటం మొదలెట్టాడు. గంటకోసారి తన గదిలోకి పిల్చి, టీ ఇచ్చి, “యు ఆర్ జస్ట్ లైక్ మై బ్రదర్ గదా” అంటున్నాడు.

“నువ్వు పార్టీ ఇచ్చినందుకు బదులు తీర్చాలి గదా” అంటూ గోవర్ధన్ రావును బలవంతంగా బార్‍కి లాక్కుపోయాడు. అలవాటు లేదంటున్నా రెండు గ్లాసులు పట్టించాడు. ఆటోలో ఇంటి దగ్గరకు వచ్చి, ఇంట్లోకి వచ్చి ‘అమ్మాయి’ని పలకరించి వెళ్ళాడు.

పై అధికారి చేత డబ్బు ఖర్చు పెట్టించటం మర్యాద కాదని గోవర్ధన్ రావు దంపతులు తెగ మథనపడిపోయారు. అందుచేత ఓ ఆదివారం ఆయన్ను ఇంటికి భోజనానికి పిల్చారు.

భోజనానికి వచ్చిన బ్రహ్మచారి గారు “నీ ఇల్లు బావుంది, ఇంటావిడ లక్ష్మీదేవిలా లక్షణంగా ఉంది. ఆవిడ చేతి వంట అమృతంలా ఉంది” అని తెగ మెచ్చుకున్నాడు. తను తెచ్చిన పూలు పండ్లు సునంద చేతికి ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు ఆమె చేతులను తన చేతులతో నిమిరాడు.

ఆ తరువాత వారానికోసారి బ్రహ్మచారి గారు ఇతన్ని బార్‍కు లాక్కుపోవటం, ఇతనేమో మొహమాటంతో భోజనానికి పిలవటం, ఆయనేమో ప్రతిసారీ పూలు పండ్లూ తెచ్చి సునంద చేతులలో తన చేతులతో ఇవ్వడం, మామూలు అయిపోయింది.

శ్రావణ మాసం వచ్చింది. సునంద పుట్టింటికి వెళ్ళింది. బార్‍లో డబ్బు తగలెయ్యటం ఎందుకని, గోవర్ధన్ రావు ఇంట్లోనే బ్రహ్మచారి గారు విచ్చేసి తాగేసి, అతన్ని, అతని భార్యనీ తెగ మెచ్చుకొని, “నువ్వు చాలా లక్కీ, గోవర్ధన్” అంటున్నాడు. గోవర్ధన్‍కి డ్రింకు బాగా అలవాటు అయింది. తాగకుండా ఉండలేని స్థితికి వచ్చాడు.

సునంద మళ్ళీ భర్త దగ్గరకు వచ్చేసింది. అయినా గోవర్ధన్ భార్యకు నచ్చచెప్పి, ముందుగదిలో బ్రహ్మచారిగారితో కల్సి తాగడం మొదలుపెట్టాడు. సునంద పకోడీలు, పెసరట్లు వేసి ఇచ్చేది. బ్రహ్మచారి గారి బలవంతాన, ఆమె వాళ్ళతో కూర్చోక తప్పటం లేదు.

ఒకరోజు బ్రహ్మచారి గారి బలవంతం మీద సునంద కూడా కొంచెం డ్రింక్ పుచ్చుకుంది. “మర్యాదగా తాగుతావా, పట్టుకొని గొంతులో పొయ్యమంటావా?” అని ఆయన అనటంతో తప్పలేదు.

బీర్ అంటే బార్లీ రసం అనీ, వైన్ అంటే ద్రాక్ష రసమేననీ, పూర్వం దేవతలు తాగిన సురాపానం ఇదేనంటూ బ్రహ్మచారి గారు సునందకు మద్యపానోపాఖ్యాన సారాంశాన్ని సోదాహరణంగా వివరించారు.

నెల రోజుల్లో సునంద వాళ్ళకు కంపెనీ ఇచ్చే స్థాయి నుంచి పార్ట్‌నర్ స్థాయికి ఎదిగింది.

తిథి, వార, నక్షత్రాలన్నీ చూసుకొని బ్రహ్మచారి గారు, గోవర్ధన్ రావును ‘అవుట్’ చేయించాడు. ఉపద్రవాలు ఏమీ కలగకుండా అతని చేత తాగించటంతో ఒంటి మీద స్పృహ లేకుండా పడిపోయాడు. సునంద కంగారు పడితే, బ్రహ్మచారి గారు ఆమె భుజం మీద చెయ్యి వేసి, “మరేం ఫర్వాలేదు, నేనున్నాను” అంటూ ఆమెకు ధైర్యం చెప్పాడు. ఆమెకు అంతా మత్తుగా, గమ్మత్తుగా ఉంది.

ఇక అక్కడి నుంచీ బ్రహ్మచారి గారు ‘ఇన్’ అయిన గంట తరువాత గోవర్ధన్ ‘అవుట్’ అయ్యేవాడు. బ్రహ్మచారి గారు ధైర్యం చెప్పటం కోసం సునందను కౌగిట్లోకి తీసుకొని, పెదవులు పెదవులతోనూ, తనువును తనువుతోను కలిపేవాడు.

తాగిన మైకంలో తడబడే నాలుకతో “నువ్వు నా ఇలదేవతవు, కులదేవతవు” అంటూ పొగడ్తలతో ఆమెను ఉబ్బితబ్బిబ్బు అయ్యేటట్లు చేసేవాడు. ఆమెను వేరే లోకాల్లోకి తీసుకెళ్ళేవాడు.

గోవర్ధన్ రావుకి ఒరిస్సా సరిహద్దుల్లోకి ట్రాన్స్‌ఫర్ అయింది. అతను ఇచ్ఛాపురం వెళ్లిపోయాడు.

బ్రహ్మచారిగారు సునంద దగ్గరకు వస్తూనే ఉన్నాడు. అలా బయటకు తీసుకెళ్ళి చీరలూ, నగలూ కొనిపెడుతూనే ఉన్నాడు. సినిమాలలో, నాటకాలకో వెళ్లి వచ్చేవారు. వచ్చాకా వాళ్ళది ఒక లోకం అయ్యేది.

ఇంతకీ బ్రహ్మచారి గారు బ్రహ్మచారి కాదు. ఆయనకు ఎన్నడో పెళ్ళి అయింది. పిల్లలున్నారు. ఆయన రిటైర్ కాబోతున్నారు. అరవైకి చేరువలోనున్న బ్రహ్మచారిగారికి ఎందుకు చేరువ అయింది, ఎందుకు మొగుడ్ని వదిలెయ్యాలనుకుంది – అని అడిగితే – కొన్నింటికి కారణాలు ఉండవు.

దేరీజ్ నో రీజనింగ్.

Exit mobile version