Site icon Sanchika

చిరుజల్లు-77

చిరునవ్వు వెల ఎంత?

[dropcap]వెం[/dropcap]కట సుబ్బారావు స్కూటర్ దిగాడు.

వెంకటేశ్వర విలాస్ ప్రొప్రయిటర్ భుజంగరావు కౌంటర్‌లో కూర్చునే సుబ్బారావును చూశాడు. ‘ఈ ముండా కొడుకు మళ్లీ తగలడ్డాడు’ అని గొణుకున్నాడు.

సుబ్బారావు లోపలికి వచ్చాడు. “దయచేయండి సార్, బావున్నారా?” అని మొహం చాటంత చేసుకొని నవ్వాడు భుజంగరావు.

సుబ్బారావు నవ్వలేదు. ఆప్యాయంగా పలకరించినా మాట్లాడలేదు. కస్టమర్లతో చనువుగా మాట్లాడితే, నెత్తినెక్కేస్తారని వాళ్ల డిపార్ట్‌మెంటు వాళ్లు ఎప్పడూ తుమ్మల్లో పొద్దు గుంకినట్లు అలా మొహాలు ముడిచేసుకొని సీరియస్‌గా ఉంటారు. అప్పుడే శవాన్ని తగలేసి వచ్చి తడిబట్టలు విప్పుకున్నంత ముభావంగా ఉంటారు.

“డబ్బు సిద్ధం చేశారా?” అని అడిగాడు సుబ్బారావు తిన్నగా అసలు విషయానికి వస్తూ.

“సర్దుబాటు కాలేదు సర్, మాది చిన్న వ్యాపారం.. ఈ సారికి ఇది ఉంచండి. ఈ పదివేలూ..” అంటూ డబ్బు సుబ్బారావు ముందు ఉంచాడు.

సుబ్బారావు డబ్బు విషయంలో నిక్కచ్చిగా ఉంటాడు. “ఏంటయ్యా ఇది? నాకేమ్మన్నా ముష్టి వేస్తున్నావా? లక్ష రూపాయాలు కట్టాలి. పోన్లేగదా అని తగ్గించాను. పాతికవేలు ఇవ్వమంటే, ఓ, ఇదై పోతావేంటి? ఇంక టైం లేదు రెండు రోజుల్లో నాకు పాతికవేలు ఇచ్చి సర్దుబాటు చేయించుకుటావో? లేక పోతే లక్ష రూపాయలు కడతావా.. తేల్చుకో.. ఎల్లుండి వస్తాను. ఏదో ఒకటి చెయ్యాల్సి ఉంటుంది?” అని దబాయించి వెళ్లాడు సుబ్బారావు.

భుజంగరావుకి ఒళ్లు మండిపోయింది తిట్టుకున్నాడు. ‘ఓరే లంబ్డికొడకా.. కిందటి నెలలో పదివేలు పట్టుకెళ్లావ్ కదరా.. జలగలా పీడీస్తావేందిరా? అవినీతిలో కూడా నీతి ఉండాలారా.., నీ జాతకం మొత్తం నాకు తెల్సు. నా హోటలు ముందు ముష్టి ఎత్తుకునేలా చేస్తాను. చూస్కో..’ అంటూ కాగితం కలం తీసుకున్నాడు. ప్రభుత్వ పెద్దలందరికీ రాశాడు.

“అయ్యా, ఈ సుబ్బారావు అనే మీ అఫీసులోని వ్యక్తి మా రక్తం తాగుతున్నాడు. రెండేళ్ల కిందటి వీడి ఇంట్లో తినటానికి కంచం ఉండేది కాదు. తినటానికి కంచంలోకి కూర ఉండేది కాదు. అలాంటి వాడు కిందటి నెల – వాడి ఆఫీసులోనే పని చేసే విలాసినికి కృష్ణా జ్యూయలరీలో పది లక్షల నెక్‌లెస్ కొని పెట్టాడు. వీడి కూతురు పెళ్లి కుదిరింది. యాభై లక్షలు కట్నం ఇస్తున్నాడు. కూతురి పెళ్ళికి లక్షలకు లక్షలు మంచి నీళ్లల్లా ఖర్చు చేస్తున్నాడు. పెళ్ళికి మీరు వెళ్తారు గదా. ఆ ఖర్చుల కోసం మమ్మల్ని పీడిస్తున్నాడు. రేపు మీ మీద చల్లే పన్నీరు సువాసన వెయ్యకపోతే ఏమీ అనుకోకండి. అందులో మా కన్నీరు కలిసింది. బిర్యానీ రుచిగా లేకపోతే, ఏమి అనుకోకండి. అది మా చెమటతో ఉడికిస్తారు. కుర్మా మరీ ఎర్రగా ఉంటే ఏమీ బాధపడకండి. అందులో మా రక్తం కలిసి ఉంటుంది. ఈ సుబ్బారావు మీద మీరు ఏమీ యాక్షన్ తీసుకోకపోతే, ఈ సారి హోటలుకు వాడు వచ్చినప్పుడు, మా పనివాళ్లు యాక్షన్ తీసుకుంటారు. ఇట్లు ఆకాశరామన్న” అని ఆవేశంగా రాశాడు.

ఒక కాపీ మంత్రి గారికి, ఒకటి సెక్రటరీ గారికీ, ఒకటి కమిషనర్ గారికీ పంపించాడు.

అవి చూడగానే డిపార్ట్‌మెంట్ మొత్తం ఉలిక్కి పడింది. ఆకాశరామన్న సంగతి తరువాత చూద్దాం అని, ముందు సుబ్బారావును సస్పెండ్ చేశారు.

విజిలెన్స్ వాళ్లు ఎంక్వయిరీ మొదలు పెట్టారు.

మర్నాడు ఉదయమే సుబ్బారావు పానకాలరావు ఇంటికి వెళ్లాడు. ఆయన కాళ్ల మీద పడ్డాడు.

“బుద్ధి తక్కువైంది. ఎలాగైనా మీరే కాపాడాలి” అన్నాడు.

“ఎలాగయ్యా వాడెవడో అసాధ్యుడిలా ఉన్నాడు” అన్నాడు పానకాలరావు.

సుబ్బారావు సంచీలో నుంచి ఒక్కటొక్కటే కట్టలు తీసి ఆయన కాళ్ల ముందు పెడ్డాడు.

ఏడాది పాటు విచారణ జరిగింది.

ఆరోపణలు చేసిన వ్యక్తి అజ్ఞాతంగా ఉన్నందున విచారణ కొనసాగించలేమని తీర్మానించారు.

సుబ్బారావు సెస్పెన్షన్ ఎత్తేశారు. మళ్లీ డ్యూటీలో చేరాడు.

భుజంగరావు హోటలుకు వెళ్లాడు. హోటలు ఆదాయం ఎంత ఉంటుందో మరింత ఖచ్చితంగా లెక్కలు వేశాడు.

పాతిక లక్షలు కట్టాల్సి వచ్చింది.

భుజంగరావు సుబ్బారావు చేతులు పట్టుకొని బ్రతిమిలాడాడు.

“నీ మూలంగా నాకు పది లక్షలు ఖర్చు అయింది. అదంతా ఎవరు కడతారు?” అన్నాడు సుబ్బారావు.

ఆ డిపార్ట్‌మెంట్ వాళ్లు సాధారణంగా నవ్వరు.

కానీ ఈ సారి సుబ్బారావు చిరునవ్వు నవ్వాడు.

ఆ చిరునవ్వు వెల పది లక్షల పైనే.

Exit mobile version