Site icon Sanchika

చిరుజల్లు-78

చీకటి – వెలుగు

[dropcap]సి[/dropcap]నిమా మొదలైంది. పది నిముషాలైంది.

అతను సినిమా హలులోకి వచ్చాడు. వెలుగులో నుంచి ఒక్కసారిగా చీకట్లోకి వచ్చినందువల్ల కంటికేమీ కనిపించటం లేదు. కొద్ది క్షణాల వరకూ – చూపు చీకటికి అలవాటు పడేవరకూ అతను గుమ్మం దగ్గరే నిలబడ్డాడు. తర్వాత చూస్తే హాలు అంతా ఖాళీగానే ఉంది. ఆ క్లాసులోనైతే జనం వేళ్ళ మీద లెక్కించగలిగినంత తక్కువగా ఉన్నారు.

అతను నిలబడిన చోటుకి దగ్గరగానే ఎడమ పక్క సీట్లో ఒకామె కూర్చుంది. పక్కన ఎవరూ లేరు. ముందూ, వెనుకా అంతా ఖాళీగానే ఉంది.

అతను రెండు సెకన్లు ఆలోచించాడు. చీకటిగా ఉంది కదా. ఏమవుతే అదే అవుతుంది లెమ్మని వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు. కూర్చుని సినిమా చూడడంలో నిమగ్నమైపోయాడు.

అయినా గుండె కొంచెం వేగంగానే కొట్టుకుంటోది. ఆమె అభ్యంతర పెడుతుందేమో, లేచి కొంచెం ఎడంగా కూర్చుంటుందేమో అనుకున్నాడు. అలాంటిదేమీ  జరగలేదు. ఆమె కదల్లేదు. తెర మీద కదులుతున్న బొమ్మల్ని దీక్షగా చూస్తున్నది. అతనూ అదే పని చేస్తున్నాడు.

ఆమె జేబురుమాలు అడ్డం పెట్టుకొని చిన్నగా నవ్విన ధ్వని. అది దేనికైనా సంకేతమా అని అతనికి అనుమానం వచ్చింది.

తెర మీద బ్రహ్మానందం ఏదో అన్నాడు. ఆమె నవ్వింది. అతనూ జత కలిపాడు. మళ్ళీ నవ్వితే బావుండుననుకున్నాడు కూడా.

ఇద్దరి దృష్టీ తెర మీదనే ఉంది. నాయికా నాయకులు ఎంతో తమకంగా చూసుకుంటున్నారు.

ఆమె తన చేతిని కుర్చీ చేతి మీద వేసింది. రెండు క్షణాలు ఆగి అతనూ చెయ్యి వేశాడు. ఆమె కోమల హస్తం మృదువుగా తామర తూడులా ఉంది. మెత్తగా నాగుబాములానూ ఉంది. అతనికి ఒళ్ళు జలదరించింది. ఆమె అతని చేతి క్రింద నుంచి తన చేతిని నెమ్మదిగా తీసేసుకుంది.

మరో పది నిముషాలు సినిమా చూస్తున్నారు. మళ్ళీ కవ్వించే దృశ్యం. కుర్చీలో అతడు వెనక్కి మరింత జేరగిలబడి కాళ్ళు ముందుకు చాచాడు. అతని కాళ్ళు ఆమె పాదాలను తాకినయి. ఆమె కాళ్ళు అతని కాళ్ళకు తగలకుండా ఎడంగా జరిపింది.

పక్కనున్న ఈమె ఎవరూ అన్న సందేహం వచ్చింది. ఓరకంట చూచాడు గానీ చీకట్లో సరిగా కనిపించలేదు. ఆమె కొంచెం బొద్దుగా, కొంచెం ముద్దుగా ఉన్నట్లు అనిపించింది.

అతని కంఠం నిండా ఉత్కంఠ నిండి ఉంది. ఏదో వేదన. ఏదో వాంఛ.

ఆమె స్త్రీ. అతను పురుషుడు. ఏకాంతం. సామీప్యం. చీకటి. కోర్కెల్ని రెచ్చగొట్టే హృదయం. సాహసాన్ని ప్రేరేపించే సానుకూల్యం.

చుట్టూ చీకటి. పడగ విప్పుతున్న కోరిక. అతను తన చేతిని ఆమె వీపు మీద నుంచి అవతలి వైపుకు వేశాడు. ఆమె తదేకంగా తెర వైపు చూస్తోంది. అక్కడ శోభనం గదిలో నాయికా నాయకులు కౌగిలింతలలో మునిగి తేలుతున్నారు. పరుపు మీద పడి ఒకరి మీద ఒకరు పడుతున్నారు.

అతని చెయ్యి కొంచెం బెదురుగా ఆమె భుజాన్ని తాకింది. తిరస్కారం ఏమీ ఎదురుకాలేదు.

దుష్టుడు, నీచుడు అయిన విలన్ క్లబ్బులో తాగుతున్నాడు. యవ్వన సంపదనంతా వెల్లడి చేస్తున్న నాట్య విన్యాసం. సగం నీతినీ, సగం బూతునీ కలిపిన పాట.. సవాలు చేస్తున్నట్లు.. సవారి చేస్తున్నట్లు నాట్యం..

అతను ఆమె వైపుకి జరిగాడు. ఆమె అతని వైపుకి వంగింది.

కాసేపటికి లైట్లు వెలిగాయి.

అతను ఆమె వైపు చూశాడు. బిత్తరపోయాడు. ఆమె అతని వైపు చూసింది. నివ్వెర పోయింది.

అతను “నువ్వా?” అన్నాడు. ఆమె ఆ మాత్రం కూడా అనలేకపోయింది.

ఆమె పేరు జ్యోత్స్న. అతని పేరు కృష్ణారావు.

***

హోటల్ మినర్వాలో వాళ్ళిద్దరూ ఒకటే టేబుల్ దగ్గర కూర్చున్నారు. టిఫెను తినడం, కాఫీ తాగటం అయింది.

ఇద్దరి మనసులూ బరువెక్కి ఉన్నాయి. వాళ్ళిద్దరి లోనూ ఆ బట్టతల ఆయన పేరు శర్మ. తెల్ల జుట్టు అయన పేరు వర్మ. ఇంతప్పటి నుంచీ స్నేహితులు. ఈ ఏడాది కొద్ది నెలలు అటూ ఇటూగా రిటైర్ కాబోతున్నారు.

ఇద్దరి జీవితాలు వడ్డించిన విస్తర్లు. అన్ని రకాలుగానూ, అనుకున్న స్థాయిని అందుకున్నారు.

వాళ్ళిద్దరికీ జాయింట్‌గా ఉన్న కోరిక ఏమంటే, శర్మ కూతురు జ్యోత్స్నను, వర్మ కొడుకు కృష్ణారావుకి ఇచ్చి వివాహం చేయాలని. ఈడూ జోడూ చూడముచ్చటగా, చిలకాగోరింకలా ఉన్నారు.

అబ్బాయికి అమ్మాయి నచ్చింది. అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. ఇద్దరికీ అంగీకారమయ్యాక ముహూర్తాలు పెట్టుకున్నారు. ఇంకో నెలలోనే వివాహం జరగబోతోంది. ఇంతలో కథ అడ్డం తిరిగింది.

“ఏం చేద్దాం?” అన్నాడు శర్మ.

“వాళ్ళిద్దరికీ ఇష్టం లేనప్పుడు బలవంతాన ముడి పెట్టలేం కదా” అన్నాడు వర్మ.

“మొదట ఇద్దరూ ఒప్పుకున్నాకనే కదా ముహూర్తాలు పెట్టుకున్నాం. ఇంతలోనే ఏం వచ్చింది?” అన్నాడు శర్మ.

“అదే అర్థం కావటం లేదు. వద్దు అన్న మాట తప్ప, మరో మాట వాళ్ళ నోట నుంచి రావటం లేదు.”

శర్మ నిట్టూర్చాడు.

“ఏమిటో ఈ కాలం పిల్లలు, బొత్తిగా అర్థం కావడం లేదు” అన్నాడు వర్మ.

చీకటి ముసురుకున్నది.

లైటు వేశారు.

వెలుగు వచ్చింది.

చీకటి – వెలుగు – చీకట్లోని మనిషి వేరు. వెలుగులోని మనిషి వేరు.

Exit mobile version