చిరుజల్లు-81

0
2

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

అన్వేషణ

[dropcap]ర[/dropcap]జని ఆఫీస్ పని మీద ఢిల్లీకి బయల్దేరింది.

రజని కంపార్ట్‌మెంట్‌లో తన బెర్త్ మీద కూర్చుని బయటకు చూస్తోంది. కూపేలోని నలుగురి ప్రయాణీకులలో తను ఒక్కరే స్త్రీ. మీగిలిన మూగ్గురూ మగవాళ్లేనని ఛార్ట్ చూడగానే తెల్సిపోయింది. ఆ ముగ్గురితో కల్సి ఇరవైనాలుగు గంటలు ప్రయాణం చేయాలి.. ఒక పగలూ, ఒక రాత్రీ, ఇదే కూపేలో.

ఒక వ్యక్తి వచ్చి బెర్త్ నెంబరు చూసుకొని సూట్‌కేసు పై బెర్త్ మీద పెట్టుకుని, బయటకు వెళ్లి, ఒక మినరల్ వాటర్ బాటిల్, ఒక మేగజైన్ తెచ్చుకుని, మళ్లీ కిందకు దిగి సిగరెట్ వెలిగించుకున్నాడు. తన పక్కన కూర్చుని సిగరెట్ తాగనందుకు సంతోషించింది.

కొద్ది సేపటికి లోపలికి వచ్చి కూర్చున్నాడు. అతనే పలకించాడు.

“ఎందాకా వెళ్తున్నారు?” అని ఇంగ్లీషులో అడిగాడు.

“ఢిల్లీ దాకా..” అని చెప్పింది.

“ఒంటరిగా వెళ్తున్నారు. అక్కడ ఎవరన్నా ఉన్నారా?” అని అడిగాడు.

“ఢిల్లీ కదా. అక్కడ చాలా మంది ఉంటారు.” అన్నది రజని.

అతను ఇంకేం మాట్లాడలేదు.

పది నిముషాల తరువాత మరో ఇద్దరు వచ్చి ఎదురుగా నున్న బెర్త్ నెంబరు చూసుకొని, సామాను సర్దుకొని కూర్చున్నారు. ఇద్దరూ తెల్సిన వాళ్లలాగా ఉన్నారు. హిందీలో వాళ్ల పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటున్నారు.

వాళ్లు రజనితో మాటలు కలపాలని ప్రయత్నించినా, రజని సంభాషణ పెంచలేదు. వాళ్లు ఏమంత మర్యాదస్థులు లాగా అనిపించలేదు.

రైలు బయలుదేరింది.

సన్నపాటి వ్యక్తి తన సూట్‌కేసు నుంచి ఒక విస్కీ సీసా, మూడు గ్లాసులు తీశాడు. గ్లాసులు నింపి చెరో గ్లాసు తీసుకొని, మూడో వ్యక్తి గ్లాసు అందించాడు.

ఈ మూడో వ్యక్తి ఉద్యోగాన్వేషణలో ఢిల్లీ వెడుతున్నాడని తెల్సుకుని, తమ పలుకుబడి ఉపయోగించి అతనికి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. తనకు చాలా మంది మంత్రులతో సన్నిహిత పరిచయాలున్నాయని చెప్పారు. దానితో అతనికి వాళ్ల మీద గౌరవం పెరిగింది.

ముగ్గురు తాగుబోతుల మధ్య ఆమె ఏకాకిగా మిగిలిపోయింది. పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉన్నది. వీళ్లతో కల్సి ఇరవై నాలుగు గంటలు ఎలా ప్రయాణం చేయాలో తెలియటం లేదు. పైట చెంగుతో ముక్కు మూసుకొని బయటకు చూస్తూ కూర్చొంది. క్రమంగా వాళ్ల వాగుడు శృతి మించుతోంది.

ఇంతలో టి.సి. వచ్చాడు. టికెట్లు చెక్ చేసి వెళ్లాడు. రజని కూడా బయటకు వచ్చి టి.సి.ని అడిగింది.

“వాళ్లు అలా తాగుతుంటే, వాగుతుంటే, వాళ్లతో లేడీస్ ఎలా ప్రయాణం చేస్తారు. మీరైనా చెప్పండి” అని.

“మంచి మర్యాద నేర్చుకోమని కన్న తల్లిదండ్రులు చెబితేనే ఎవరూ వినటం లేదు. ఏ సంబంధమూ లేని నేను చెబితే వింటారామ్మా?” అన్నాడు టి.సి. నిస్సహాయంగా.

“అదేంటండీ అలా అంటారు. రైల్లో ప్రయాణం చేసేటప్పుడు సాటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించకూడదు గదా. ఆ మాత్రం తెలియదా?”

“అందరకీ అన్నీ తెలుసునమ్మా. కానీ ఎవడూ దేన్నీ ఖాతరు చేయడు. ఎవడన్నా ఏదన్నా చెప్పబోతే వాడి మీదనే ఎదురు దాడి చేస్తున్నారు. ఇదీ ఇప్పటి లోకం తీరు. మీ సమస్యను నేను అర్థం చేసుకోగలను. ఆ మూడో కూపేలో ముగ్గురు ఫామిలీ మెంబర్సు, ఒకతను వేరే జెంటిల్‌మన్ ఉన్నాడు. అతను ఒప్పుకుంటే, మీరు అక్కడికి షిఫ్ట్ అయి, అతన్ని మీ బెర్త్ లోకి వెళ్లమనండి” అన్నాడు టీ.సీ.

రజని ఆ కూపేలోకి వెళ్లింది. తన ప్రాబ్లమ్ చెప్పింది. కొంచెం సేపు బ్రతిమిలాడిన తరువాత ఒప్పుకున్నాడు.

రజని గబగబా వెళ్లి తన సూటికేసు తీసుకు వస్తుంటే, అప్పటికే మందు కిక్ ఎక్కుతున్న లావుపాటి వాడు అన్నాడు.

“మేడమ్ దిగిపోతున్నది. అప్పుడే ఢిల్లీ వచ్చేసిందా?”

రజనీ అవతలి కూపేలోకి వెళ్లి ఓ బెర్త్ మారటానికి ఒప్పుకున్న అతనికి థాంక్స్ చెప్పింది.

“ఫర్వాలేదు లెండి. ఐకెన్ అండర్ స్టాండ్ యువర్ ప్రాబ్లం” అన్నాడు.

రజని కొత్త వాళ్ల మధ్య కూర్చుని కుదుట పడింది. అతను ఒప్పుకున్నాడు కాబట్టి సరిపోయింది గానీ, అక్కడే ఉండాల్సి వస్తే ఆ మానవ మృగాల మధ్య తను ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవల్సి వచ్చేదో ఊహించుకుంటేనే భయం వేసింది.

మిగిలిన వాళ్లు మాటలు కలిపారు. ఇక్కడ సంతోషంగా వాళ్లతో కల్సిపోయింది.

రాత్రి అయింది. అంతా నిద్రపోయారు.

తెల్లవారింది. నిద్ర లేచారు.

ఇంకా రైలు పరుగులు తీస్తూనే ఉంది.

పక్క కూపేలో నుంచి తన సీటు ఎక్సేంజ్ చేసిన వ్యక్తి వచ్చాడు.

“మేడమ్, మీ వల్ల ఏం జరిగిందో తెల్సా? ఆ తాగుబోతు వెధవలు.. నేను నిద్ర లేచేటప్పటికి నా సూట్‌కేస్ పట్టుకుపోయారు. నా పర్స్, నా ఫోన్ కూడా కనబడటం లేదు. మూడోవాడు పై బెర్త్‌లో పుడుకొని గురక పెడుతున్నాడు. తన కేమీ తెలియదంటున్నాడు. అన్ని పోగొట్టుకున్నాను. కట్టుబట్టలతో ఢిల్లీలో దిగి ఏం చెయ్యాలో తెలియటం లేదు. టాక్సీకి, ఆటోకి కాదు గదా కాఫీ తాగటానికి కూడా డబ్బులు లేవు. మీకేం? మీరు హాయిగా పడుకున్నారు. నా బెర్త్ మీకు ఇచ్చి మీ బెర్త్ నేను తీసుకున్నందుకు చూడండి ఏమైందో” అన్నాడు ఏడుపు ముఖంతో.

అక్కడే ఉండి ఉంటే, తన పరిస్థితి ఇలాగే ఉండేదన్న ఆలోచన రాగానే గుండె గుభేల్ మన్నది.

“బాధ పడకండి. నా వల్లనే మీకీ కష్టం వచ్చింది. అందుచేత మిమ్మల్ని ఆదుకోవటం నా బాధ్యత” అని అభయం ఇచ్చింది రజని.

ఆమెకు కంపెనీ వాళ్లు తమ గెస్ట్ హౌస్‌లో రూం కేటాయించారు.

రజని అతనిని కూడా తనతో తీసుకువెళ్లి తిండి తిప్పలూ దగ్గర నుంచి అన్నీ ఏర్పాటు చేసింది.

“మీ మీద ఆధారపడినందుకు సిగ్గు పడుతున్నాను” అన్నాడు అతను.

మంచివాళ్లు కరువైపోతున్న ఈ రోజుల్లో ఒక మంచి మనసున్న మనిషి కోసం ఆమె చేస్తున్న అన్వేషణ పూర్తి అయినట్లే అనిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here