చిరుజల్లు-82

0
2

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

మారిన మనిషి

[dropcap]రో[/dropcap]జా సూపర్ బజార్‌లో తనకు కావల్సినవన్నీ ప్లాస్టిక్ బుట్టలో వేసుకుంటూ ముందుకు వెళ్తోంది. దృష్టి సరుకుల మీద ఉన్నందున, చూసుకోలేదు – ఎవరో వ్యక్తి చెయ్యి తగిలింది. “సారీ” అంటూ అతని వంక చూసింది.

అతను అవినాష్.

“బావున్నావా రోజా?” అని చిరునవ్వుతో అడిగాడు అవినాష్.

“బ్రహ్మాండంగా ఉన్నాను” అన్నది రోజా నవ్వేస్తూ.

“ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు?” అని అడిగాడు అవినాష్.

“అదే ఇల్లు, అదే సంసారం, అదే భర్త.. ఆయనలోనూ, నాలోనూ ఏం మార్పు లేదు” అని మళ్లీ నవ్వింది.

“నచ్చినవన్నీ బుట్టలో వేసుకుంటున్నావు.. కానివ్వు..” అన్నాడు అవినాష్.

“నీ మాటల్లో ఏమన్నా గూడార్థం ఉందా?” అని అడిగింది.

“అంత నిగూఢమైనవి ఏం లేవు.. సరుకుల గురించే అన్నాను.”

ఇద్దరూ కౌంటర్ దగ్గర కొచ్చారు. ఆమె క్రెడిట్ కార్డు ఇచ్చింది.

“బిల్ చేసేది నువ్వూ.. పే చేసేది ఆయన.. అన్నమాట..”

“తప్పదు గదా.. భార్యాభర్తలు అన్నాక ఈ ఇచ్చిపుచ్చుకోవటాలు.. ఇచ్చినా ఇవ్వకున్నా.. పుచ్చుకోవటాలు..” అన్నది రోజా.

రోజా అవినాష్ కల్సి చదువుకున్నారు. చాలా సాన్నిహిత్యం ఉంది.

సూపర్ బజార్ నుంచి బయటకొచ్చారు.

“మనం సరదాగా మాట్లాడుకొని చాలా కాలం అయింది. తీరిక ఉన్నప్పుడు ఎప్పుడైనా రాకూడదూ?” అన్నది రోజా.

“నాకు ఉన్నదే తీరిక. ఎప్పుడు రమ్మంటావో చెప్పు. ఆ మధ్య ఒకసారి మీ ఇంటి ముందు నుంచే వెళ్లాను..” అన్నాడు అవినాష్.

ఎప్పుడైనా తమ ఇంటికి రావచ్చునంటూ మరోసారి ఆహ్వానించింది.

రోజా ఆటోలో ఇంటికి చేరింది. సరుకులు లోపలకు మోసుకొచ్చి ఆటో వాడికి డబ్బు ఇచ్చి పంపేసింది.

కరుణాకర్ కాగితాల మీద ఏవో గిలుకుతున్నాడు.

“సరుకులు లోపలికి తీసుకురావటానికి కొంచెం సాయం చేయవచ్చు కదా. చూస్తూ కూర్చుంటారేం?” అని రోజా భర్తను అడిగింది.

కరుణాకర్ గణితశాస్త్రంలో అధ్యాపకుడు. కొత్త కొత్త ఫార్మాలాలు కనిపెట్టాలని కాగితాలు ఖరాబు చేస్తూంటాడు. ఇంటి నిండా పాత పుస్తకాలు, చెత్త కాగితాలు కుప్పలుగా పేరుగు పోయినా ఆయన ఏమీ పట్టించుకోడు. అవన్నీ బయట పారేసి ఇల్లు శుభ్రంగా, నీటుగా ఉంచుకోవాలని రోజా తాపత్రయం. ఆ కాగితాలలో ఒక్కటి కనపడకపోయిన, కరుణాకర్ తన ఆస్తి పోయినంత బాధ పడిపోతాడు.

“ఏదన్నా షార్ట్ సర్క్యూట్ వచ్చి ఈ చెత్త అంతా తగలబడిపోతే బావుండును” అని విసుక్కుంటోంది రోజా.

ప్రతిదీ అందంగా కనిపించాలని రోజా ఆశ. కురణాకర్ గడ్డం పెంచుతాడు. తల దువ్వుకోడు. ఇస్త్రీ బట్టలతో అప్పుడే ప్యాకింగ్ విప్పిన బొమ్మలా కనిపించడు. వేళకు స్నానం చేయడు. తిండి తినడు. పగలు గుర్రెట్టి నిద్రపోతాడు. రాత్రి రెండు గంటల దాకా ఏదో తనదైన లోకంలో విహరిస్తూ ఉంటాడు.

ఆయన మారడు. ఆమె విసుక్కుంటూనే ఉంది. ఇల్లంతా సర్దుతూనే ఉంది – చిరాకు పడదు. అందరిళ్లూ అందమైన షోరూంల్లా ఉంటాయి. తన ఖర్మ ఏమిటో, కొంప చిత్తు కాగితాలు అమ్ముకునేవాడి ఇల్లులా ఉంటోంది.

మర్నాడు అవినాష్ రానే వచ్చాడు. సోఫాలో ఉన్న పుస్తకాలు, కాగితాలు తీసివేసి కూర్చోమన్నది.

“నేను నా భర్తను మార్చాలని ప్రయత్నిస్తున్నాను” అన్నది నవ్వుతూనే.

“భర్తను మారుస్తావా? ఆయన అలవాట్లను మార్చాలని చూస్తున్నావా?” అని అడిగాడు.

“ముందు అలవాట్లను మార్చాలని చూస్తున్నాను. అది కుదరకపోతే ఆయన్నే మార్చేస్తాను” అన్నది రోజా గలగల నవ్వుతూ.

“కంటికి కనిపించే చిన్న చిన్న విషయాలు పట్టించుకోడు గానీ, ఎవరికీ అంతు చిక్కని రహస్యాలను, కొత్త కొత్త సూత్రాలను కనిపెట్టాలని తెగ తాపత్రయ పడిపోతుంటాడు” అనీ అన్నది.

“రహస్యం పిప్పి పన్నులాంటిది. బయటకు లాగేసేదాకా ఒకటే బాధ. భరించలేని బాధ” అన్నాడు అవినాష్.

“ఒక్కోసారి ఆయన్నూ, నిన్నూ పోల్చుకుంటుంటాను. ఆయన ఏమన్నా పట్టించుకోరుగానీ, చెత్త తగలపెట్టమంటే మాత్రం, అగ్గి మీద గుగ్గిలం అయిపోతారు” అన్నది రోజా.

“నాకు అసలు కోపం రాదు. కావాలంటే నన్ను తిట్టి చూడు” అన్నాడు అవినాష్.

“తెలివి తక్కువ వాడికి, తెలివిగల వాడికీ మధ్యా గల తేడా ఒక్కటే. తెలివి తక్కువ వాడికి మనం ఏం చేసినా కోపం రాదు. తెలివిగలవాడు మనం ఏం చేసినా కోపం తెచ్చుకోడు.”

“ఆయన ఆ పిచ్చి లెక్కల గురించి ఆలోచించిన దానిలో పదో వంతు కూడా నా గురించి పట్టించుకోరు.”

“నేను ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తుంటాను” అన్నాడు అవినాష్.

“నువ్వు పెళ్లి ఎందుకు చేసుకోలేదు?”

“పెళ్లి అయితే పోట్లాడటలే గదా జీవితం అని.. నీకో చిన్న విషయం చెబుతాను. నువ్వు వెనకాల ఉండి అన్నీ భరిస్తూ, సహిస్తూ ఉన్నంత కాలం ఆయనలో ఏ మాత్రం మార్పు రాదు. పైగా తన పంతమే నెగ్గాలన్న అభిప్రాయంలో ఉంటాడు. నువ్వు కొంత కాలం ఆయనకు దూరంగా ఉంటే నీ విలువ తెలుస్తుంది” అన్నాడు అవినాష్.

భర్తలో మార్పు తీసుకురావటానికి ఏదో ఒకటి చెయ్యక తప్పదన్న నిర్ణయానికి వచ్చింది. ఆమెకు తను చెప్పింది నచ్చిందని అవినాష్‌కు అర్థమైంది.

“నువ్వు ఎక్కడికో వెళ్లక్కర్లేదు. మా ఇంటి తలుపులు నీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి” అనీ అన్నాడు.

ఆ రోజు రోజా భర్తతో తీవ్రంగా వాదించింది. “మీ పద్ధతులు మారకపోతే నేను ఇక్కడ ఉండలేను” అన్నది చివరకు.

“నేను మారటం కష్టం” అన్నాడు.

“అయితే నేను మీతో కల్సి ఉండటం కష్టం” అన్నది.

“నీ ఇష్టం” అన్నాడు భర్త.

ఆ మాట అంటాడని రోజా ఊహించలేదు. అలా అన్నాక తను ఇంకా అక్కడే ఉంటే తన మాటకు, తనకు విలువ ఉండదు.

అయిష్టంగానే సూట్‍కేసు సర్దుకుంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చింది గాని, ఎక్కడకు వెళ్లాలన్నది పెద్ద సమస్య అయింది.

అవినాష్ తన ఇంటికి రమ్మన్నాడు. అందుచేత ‘చూద్దాం’ అనుకొని అతని ఇంటికి వెళ్లింది.

అతను ఎంతో ఆదరంగా స్వాగతం పలికాడు.

“ఇక్కడ నీకు ఏ ఇబ్బందీ ఉండదు. ఇది నీ ఇల్లే అనుకో” అన్నాడు.

వాళ్లిద్దరూ చిన్ననాటి నుంచి స్నేహితులు. ఇద్దరి మధ్యా ఆడా, మగా అన్న తేడా లేనంతగా సరదాగా ఉంటారు. ఈ మాట అనవచ్చా, అనకూడదా అన్న ఆలోచన కూడా ఉండదు. ఏదన్నా హార్ట్ అయ్యేటట్లు అన్నా, స్పోర్టివ్ గానే తీసుకుంటారు. “ఇది నీ ఇల్లే అనుకో” అన్నమాటకు ఆమె వెంటనే స్పందించింది.

“ఇది నా ఇల్లు ఎలా అవుతుంది?” అని అడిగింది.

“ఇది నీ ఇల్లు అని నీవు అనుకుంటే అవుతుంది” అని నవ్వాడు.

రోజా ఇంత అకస్మాత్తుగా తన ఇంటికి వస్తుందని అవినాష్ అనుకోలేదు. ఆమె రాగానే పేక ముక్కలు, డ్రింక్ బాటిల్స్ కనబడకుండా దాచేశాడు. అల్మారాలోని వస్తువులు శుభ్రంగా తుడిచి నీటుగా అమర్చాడు. కర్టెన్లు మార్చాడు. పనిపిల్ల చేత గదులు శుభ్రం చేయించాడు.

ఇదంతా రోజా ఓ కంట కనిపెడుతూనే ఉంది.

“బ్రహ్మచారిని కదా. ఫ్రెండ్స్ వస్తుంటారు. వాళ్లు వచ్చాక ఇంక చెప్పాలా? ఇల్లు కిష్కింధే అయిపోతుంది.”

“అంటే నేను వచ్చి నీకు ఇబ్బంది కలిగిస్తున్నానా?”

“ఎంత మాట. నీ రాక నాకు ఒక వసంతాగమనం. ఒక చంద్రోదయం. ఒక సర్‌ప్రైజ్. ఒక ప్రైజ్.. ఇప్పుడు నువ్వు వచ్చాక, ఒక కొత్త కళ ఉట్టి పడుతోంది” అని అన్నాడు.

కొత్త అందాలు తీసుకురావటం కోసం, ప్లాస్టిక్ పూలు, పూల గుత్తులు, ఇండోర్ ప్లాంట్స్ వంటివన్నీ తెచ్చాడు.

“నా కోసం ఎందుకింత శ్రమ పడుతున్నావు?” అని అడగింది.

“కారణం చెప్పలేదు. నువ్వు ఏ కారణం చేత కట్టుబట్టలతో ఇల్లు వదలి వచ్చావో అవే అవలక్షణాలు ఇక్కడ కనిపించకూడదు. రేపు యాభైవేలు తెచ్చి ఇస్తాను. నీకు నచ్చినట్లు అన్నీ తీర్చిదిద్దుకో” అన్నాడు అవినాష్.

అతని ఇంట్లో పేకాట ఆడేందుకు, తాగేందుకూ సాయంత్రానికల్లా అక్కడి చేరుకునే స్నేహితులు ఎవరిని రానివ్వటం లేదు.

భర్తను తనకు అనుగుణంగా మార్చుకోవాలని ప్రయత్నించి విఫలమైంది. ఇప్పుడీ స్నేహితుడు ఆమె చెప్పకుండానే తనంతట తానే ఆమె అభిప్రాయాలకు అనుగుణంగా మారేందుకు ప్రయత్నిస్తున్నాడు. రెండు రోజులు ఒక అతిథిగా మాత్రమే ఉండిపోవాలని వచ్చింది. ఈ మాత్రానికే ఇతను హైరానా పడిపోతున్నాడు. ఇదీ ఆమెకు గిల్టీగానే ఉంది.

అవినాష్ సిగరెట్లు, తాగుడు, పేకాట లాంటి అతని అలవాట్లును తన కోసం ఎందుకు మానుకుంటున్నాడు? కనీసం మానుకున్నట్లు తనకు కనబడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈపాటి చిన్న ప్రయత్నం అయినా తన భర్త చేసి ఉంటే సంతోషించేదేమో? ఏమో, ఈ మనుషులు ఎంతకీ అర్థం కారు.

మర్నాడు పుట్టింటికి వెళ్లింది. రెండు రోజులు అయ్యాక వాళ్లూ పసిగట్టారు భర్తతో గొడవ పడి వచ్చినట్లు. పుట్టింటి వాళ్లకూ తెల్సిపోయింది.

ఇప్పుడు ఇంక ఇక్కడ ఉండటమూ ముళ్ల మీద ఉన్నట్లే ఉన్నది.

ఏది ఏమైనా, తన ఇల్లు సాటి మరొకటి రాదని అనుభవంతో తెల్సుకుంది.

బెరుకుగానే తన ఇల్లు చేరుకుంది. ఇప్పుడు తన ఇల్లు చూసి ఆశ్చర్యపోయింది. ఇల్లంతా తీర్చిదిద్దినట్లుంది. కొత్త ఫర్నీచర్‌తో తనకే వింతగా తోచింది.

రోజా ఇంట్లో నుంచి వెళ్లిపోయాక కరుణాకర్‌తో పాటు అదే కాలేజీలో లెక్చరర్‍గా పని చేస్తున్న యమున అతని ఇంటికి తరచూ వస్తోంది.

ఆమెకు అందంగా కనిపించటం కోసం కరుణాకర్ ఇంటి స్వరూపాన్నే మార్చేశాడు.

ఇప్పుడు కరుణాకర్, రోజా కళ్లకు కొత్తగా కనిపిస్తున్నాడు. ఆయన మారిపోయాడు.

కాని ఈ మారిన మనిషి ఆమెను మరో రకంగా భయపెడుతున్నాడు. బాధపెడుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here