[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
శత్రువు
~
[dropcap]ప్రి[/dropcap]యమైన అమ్మకు –
మీకు ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వచ్చేశాను. నా కోసం మీరు కంగారు పడి ఉంటారు. వెతికి ఉంటారు. దిగులు పడి ఉంటారు. అలా చెప్పకుండా రావటం తప్పేనని తెల్సు. కానీ కొన్నిసార్లు తెలిసీ తప్పు చేయాల్సి వస్తుంది. నేను రాజేష్‌ను ప్రేమించాను. అతడిని మీరు అల్లుడిగా అంగీకరించలేరు. ఒప్పుకోరని తెల్సీ, ఒప్పించే ప్రయత్నం చేయటం, నేను ఎదిరించటం, మీరు నన్ను నిర్బంధించటం, మనసు మార్చే ప్రయత్నం చేయటం – ఇదంతా మీకూ, నాకూ కూడా మనోవ్యథను మాత్రమే మిగులుస్తుంది. అందుకనే చెప్పకుండా, ఎలాంటి ఘర్షణ లేకుండా మీ నుంచి దూరంగా వచ్చేశాను. రాజేష్‌ను పెళ్లి చేసుకున్నాను. మీరు లేని కొరత స్పష్టంగా కనిపించినా, ఈ పరిస్థితి అనివార్యమైంది. నాన్న ఎలాగూ నన్ను క్షమించరు. క్షమించమని ఆయనను అడిగే అర్హత కూడా నాకు లేదు. తల్లి మనసు వేరు. పిల్లలు ఎన్ని తప్పులు చేసినా, వాళ్ళ మీద మమకారం పోదు. మనసులో ఏదో ఒక మూల మమతానురాగం మిగిలే ఉంటుంది. ఆ నమ్మకం తోనే అడుగుతున్నాను. నువ్వయినా నన్ను క్షమించు. నీ నుంచి ఆ ఒక్క మాట వింటే నాకు కొంత ఊరటగా ఉంటుంది.
– మీ శాలిని.
~
అమ్మలూ,
నీవు కనిపించకపోతే, ఏ లారీ కింద పడ్డావో, ఏమైపోయావో అని కంగారు పడ్డాం. ఇప్పుడు అసలు విషయం తెల్సింది. ఇలా లేచిపోవటాం కన్నా, నువ్వు పోతేనే బాగుండేది. ఒక ఏడుపు ఏడ్చి ఊరుకునేవాళ్ళం. ఇప్పుడు రోజూ ఏడవాల్సి వస్తోంది. ఎవరో గిట్టనివాళ్లు, శత్రువులు మోసం చేశారంటే, అది వాళ్ళ నైజం అని సరిపెట్టుకునేవాళ్ళం. కానీ కన్నబిడ్డ ద్రోహం చేస్తే, చావు దెబ్బ కొడితే, దాన్ని తట్టుకోగల శక్తి మా బలహీనమైన గుండెలకు లేదు. మాకు పెళ్ళయిన కొత్తలో, కొన్నేళ్ళ దాకా పిల్లలు కలగలేదని దిగులుపడ్డాం. దేవుళ్ళ చుట్టూ తిరిగాం. పూజలూ, పునస్కారాలు, నోములూ, వ్రతాలు, మొక్కులూ – అంటూ ఎంతో తాపత్రయ పడ్డాం. ఇలాంటి కూతురు పుడుతుందని తెలిస్తే, మాకు సంతానమే వద్దని పూజలు చేసేవాళ్ళం. లేక లేక కలిగిన సంతానం కదా అని అపురూపంగా చూసుకున్నాం. కనుపాపలా కాపాడుకుంటూ వచ్చాం. నువ్వు బులి బులి నడకలు నడిస్తే సంబరపడిపోయాం. నువ్వు అమ్మా, అత్తా అంటుంటే ఏనుగు అంబారీ ఎక్కినంతగా పొంగిపోయాం. బుద్ధిగా పాఠాలు చదువుతుంటే, నట్టింట దీపం వెలుగులు విరజిమ్ముతుందని అనుకున్నాం. నువ్వు దిన దిన ప్రవర్ధమానం అవుతుంటే, నీ చుట్టూ ఎన్నో ఆశలు పోగు చేసుకున్నాం. నీ గురించి ఎన్నో కలలు కన్నాం. అన్నీ తన్నేసి చెప్పా పెట్టకుండా నీ దోవన నువ్వు వెళ్లిపోయావు. పసిపిల్లలా ఉన్నప్పుడు గుండెల మీద తన్నితే సంతోషించాం. ఎదిగిన తరువాత, ఇన్ని విషయాలు తెల్సుకున్నాకా, ఇప్పుడు తన్నేసి వెళ్తే ఎలా తట్టుకోగలం? క్షమించమని ఒక్క మాట అనేశావు. ఈ దెబ్బను తట్టుకునే శక్తి మాకు లేదు. ముఖ్యంగా మీ నాన్న సగం చచ్చిపోయి, చేయని తప్పుకు శిక్షను అనుభవిస్తూ వంచిన తల ఎత్తటం లేదు. ఉక్కులాంటి మనిషి ఈ తుఫాను తాకిడికి వంగిపోయారు. క్రుంగిపోయారు. దుఃఖంతో మాట పెగలటం లేదు. కాన్నీటి తడి ఆరటం లేదు. నిన్ను కనేంత వరకూ నేను కష్టపడ్డాను. కానీ నువ్వు పుట్టినప్పటి నుంచి ఎవడితోనో లేచిపోయేదాకా, ఇన్నేళ్ళ పాటు నిన్నొక విశిష్టమైన వ్యక్తిగా తీర్చిదిద్దటం కోసం ప్రతి క్షణం ఆయన పడిన తపన, ఆరాటం అంతా ఇంతా కాదు. ఈ ద్రోహానికి తట్టుకోలేక పిచ్చివాడిలా గొణుక్కుంటున్నాడు. “ఇలాంటి బిడ్డను ఇవ్వటం దేవుడి తప్పా? పిల్లను సక్రమంగా పెంచలేకపోవటం నా తప్పా? అన్నీ తెల్సీ బరితెగించి వెళ్ళిపోవటం దాని తప్పా? లోపం ఎక్కడుంది విశాలాక్షీ?” అని ఆయన అడుగుతుంటే కుమిలి కుమిలి ఏడవటం కన్నా నేనేం చేయగలను? నిద్ర లేచిన దగ్గర నుంచి, నిన్ను నిద్రపుచ్చేంత వరకూ నీ సేవలు చేయటానికి దేవుడు రెండు చేతులే ఇచ్చాడే, ఇంకో రెండు చేతులు ఇస్తే ఎంత బావుండేదని పరితపించేవాళ్ళం. నువ్వు పెళ్ళి చేసుకున్నందుకు మేం ఏడవటం లేదు. గొప్ప వరుడ్ని తెచ్చి కన్యాదానం చేసి సాగనంపేటప్పుడూ ఏడుపు తప్పదు. మా ఏడుపు మా గురించి కాదు. మా గౌరవ ప్రతిష్ఠల గురించీ కాదు. మా భయం అంతా నీ భవిష్యత్తు గురించి. ఇన్నేళ్ళు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల కళ్ళు గప్పి నిన్ను లాక్కుపోయాడంటే, వాడెంత మాయగాడో తెల్సిపోతూనే ఉంది. రేపు నిన్ను మాత్రం మోసం చెయ్యడన్న నమ్మకం ఏమిటి? పెద్దలు కుదిర్చిన పెళ్ళి అయితే, అటు వాళ్ళూ, ఇటు వాళ్ళూ, సెక్యూరిటీగా, అండగా నిలబడతారు. రేపు అతను నిన్ను నడిరోడ్డున వదిలేస్తే నీకు దిక్కు ఎవరు? అసలైన శత్రువు అతను. శత్రువుతో చేతులు కలిపి, నువ్వు శత్రుపక్షంలో చేరావు. శత్రువులను క్షమించగలిగేంత దయాగుణం నాకు లేదు.
– విశాలాక్షి
~
ప్రియమైన అమ్మకు –
అంత ఓపికగా నువ్వు ఉత్తరం రాయటమే గొప్ప. ఆ ఉత్తరం చూసి నిన్ను చూసినంత సంబరపడ్డాను. ఉత్తరం చదువుతుంటే, నువ్వు ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నట్లే అనిపించింది. ముందే చెప్పాను, తప్పు అంతా నాదే. అయితే ఇక్కడో విషయం గుర్తు చేయాలి. భగవంతుడు ప్రతి మనిషికీ రెండు చేతులూ, రెండు కాళ్ళు, రెండు కళ్ళూ ఇచ్చినట్లుగానే – ఒక మనసూ ఇచ్చాడు. ఆ మనసుకు ఆలోచించే శక్తినిచ్చాడు. మనిషి స్వతంత్రంగా ఆలోచించగలగటం వల్లనే ఇన్ని భిన్నమైన ఆలోచనలూ, అభిప్రాయభేదాలూ తలెత్తుతున్నాయి. మీకు తప్పుగా అనిపించేది నాకు ఒప్పుగా అనిపిస్తోంది. మీరు లక్షలు ఖర్చు చేసి, కూతురుకి పెళ్ళి చేసి, ఆ తతంగం అంతా జరపలేక పోయారని మీ బాధ. ఎవడో ముక్కూ మొహం తెలియని వాడు వచ్చి నా మెడలో తాళి కట్టటం, భార్య అనే బిరుదునిచ్చి తనతో తీసుకునిపోవటం, మరుక్షణం నుంచీ అతనికి దాసోహం చెయ్యటం, ఇష్టం ఉన్నా లేకున్నా, జీవితాంతం అతనితో కలిసి ఉండటం, పిల్లల్ని కనటం – నా కోరికలూ, ఆశలూ, అభీష్టాలూ అన్నీ చంపుకుని, అతను ఆడించినట్లు ఆడటం, – నాకు నచ్చదు. అలాంటి వ్యక్తితో కల్సి జీవించలేను. మా ఇద్దరి మధ్య సఖ్యత లేనప్పుడు, అటు వాళ్ళూ, ఇటు వాళ్ళూ ఎంత మంది ఉన్నా చేయగలిగింది ఏమీ ఉండదు. భార్యాభర్తలను కలిపి ఉంచేది ప్రేమ ఒక్కటే. కానీ చిత్రం ఏమిటంటే, చాలామంది ఈ ప్రేమ అంటే ఏమిటో తెలియకుండానే యాంత్రికంగా జీవితం గడిపేస్తారు. చాలామంది గొప్పవాళ్ళు కూడా ప్రేమించుకున్న వాళ్ళను చూసి ఉలిక్కిపడతారు. వాళ్లని వెలేసినట్టు చూస్తారు. తాము చేసినట్టే అందరూ చేయాలి. అందుకు భిన్నంగా ఎవరేం చేసినా, వాళ్ళు ఘోరమైన అపరాధం చేసినట్లు భావించే వాళ్ళే ఎక్కువ. అందుకే ప్రేమ వివాహాలను పైకి హర్షించినా, లోలోపల అయిష్టం వ్యక్తపరుస్తుంటారు. మీరు ఆమోదించిన వ్యక్తిని నేను ప్రేమించాలి. అంతే గదా. మరొకరి ప్రమేయంతోనో, ప్రోత్సాహంతోనే జరిగేది ప్రేమ కాదు. ప్రేమ ఎవరి ఆదేశాలకూ, ఏ నియమాలకూ లొంగదు. ప్రేమికులది ఒక కులం. వాళ్ళది అదో లోకం. రెండు హృదయాలు స్పందిస్తయి. ఇద్దరి చూపులూ కల్సి, ఇద్దరి చూపూ ఒకటే అవుతుంది. చిన్న చిన్న త్యాగాలు చేసుకోవటంతో మొదలుపెట్టి, ఒకరి కోసం మరొకరు ప్రాణాలు ఇవ్వటం దాకా సిద్ధపడతారు. ఆ మనిషికి చేరువ కావటం కన్నా, లోకంలో ఇంకేమీ అక్కర్లేదనిపిస్తుంది. ఆలూమగల మధ్య ప్రేమ అనే ఆభరణం ఉంటే చాలు అనుకుంటారు. నేను ఎంత చెప్పినా, ఎన్నో ఏళ్లుగా మీలో జీర్ణించుకుపోయిన అభిప్రాయాలు మారిపోతాయని నేను అనుకోవటం లేదు. అందుకని మీకు నచ్చచెప్పే విషయాన్ని కాలానికే వదిలేశాను. కాలమూ మిమ్మల్ని మార్చలేకపోతే, అది నా దురదృష్టం. నాన్ననూ, నిన్నూ చూడాలని ఉంది. కానీ మీరు నన్ను రానివ్వరు. మీ మనసులు మారి, మమ్మల్ని దగ్గరకు రానిచ్చే ఘడియ కోసం ఆశగా ఎదురు చూస్తుంటాను.
– మీ శాలిని
~
అమ్మలూ,
నీకీ విషయాలన్నీ ఎవరు నూరిపోశారో, నీ మనసు ఎవరు విరిచేశారో మాకు తెల్సు. అతన్ని ఎలా క్షమించగలము? అతను ఏదో చెప్పాడనుకో, నీ తెలివితేటలు ఏమైనాయి? మేము నీ యోగక్షేమాలు కోరే వాళ్ళమే గానీ, నీకు పరాయి వాళ్ళము కాదు. విత్తనం నాటి, మొక్కను పెంచి, నీళ్ళు పోసి, ఎరువులు వేసి, ఒక మహావృక్షంగా తయారు చేసిన తరువాత, ఆ మహావృక్షమే విరిగి మా నెత్తిన పడింది. అయినా మేము ఆ వృక్షాన్ని ఏమీ అనకూడదు. చెట్టు కూలిపోవటం దాని లక్షణం కాబట్టి. దాని తప్పు లేదు. ఆ చెట్టు నీడన నిలబడాలనుకోవటం మాదే తప్పు. అతను చెప్పింది తప్ప, నీకు ఇంకేది వినిపించదు. తల్లిదండ్రులు చెప్పినట్టు పిల్లలు వినే రోజులు పోయాయి. ఇప్పుడు పిల్లలు చెప్పినట్టు తల్లిదండ్రులు వినాలి. అన్ని బాధ్యతలూ, డ్యూటీలు మాకే గాని, మీకు ఏ బాధ్యతా లేదు. రెక్కలు రాగానే ఎగిరి పోతారు. పోతూ పోతూ, కత్తిని గుండెల్లోకి గురి చూసి విసిరేసి వెళ్తారు. గాయం మానిందా అంటూ ఉత్తరాలు రాస్తారు. తగ్గుతుందమ్మా, ఎప్పటికో ఒకనాటికి గుండె ఆగే నాటికి అయినా నొప్పి తగ్గుతుంది. కాలం మాలోనే కాదు, మీలోనూ మార్పు తెస్తుంది. నాలుగు రోజులు పోయాకా, ఇప్పుడున్న వ్యామోహం తగ్గాక. ఇప్పుడు ప్రేమించిన మనిషే రంగు వెలసిన బొమ్మలా కనిపిస్తుంది. అప్పుడు అసలు కథ ప్రారంభమవుతుంది. మాకూ నిన్ను చూడాలనే ఉంది. కానీ మునుపటి మనుష్యులం కాదు గదా.
– విశాలాక్షి
~
అమ్మకు –
చెట్టు విరిగి మీద పడుతుందని, అనుక్షణం భయపడుతూ, భ్రమ పడుతూ ఉండేవాళ్ళను చెట్టు ఏం చేయగలదు? తల్లిదండ్రులు చెప్పిన మాట చిన్నతనంలో పిల్లలు వింటారు. ఎదిగే పిల్లలు కాలంతో వచ్చే మార్పులను అవగాహన చేసుకుంటారు. ఎవరు చెప్పాలి, ఎవరు వినాలి అని కాక, ఏది మంచిదీ, దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి – అన్నదే ముఖ్యం. నాలుగు రోజులు పోయాక, రంగు వెలసిన బొమ్మలా కనిపిస్తారని అన్నావు. కొందరి విషయంలో అది నిజం కావచ్చు. అందరి విషయంలోనూ కాదు. నాకు టైఫాయిడ్ వచ్చింది. రాజేష్ ఎంత సేవ చేస్తున్నాడో తెలిస్తే ఇలా మాట్లాడవు.
– శాలిని
~
కూతురికి టైఫాయిడ్ అని తెల్సాక విశాలాక్షి నిలవలేకపోయింది. భర్తతో ముంబై వెళ్ళింది. పది రోజులు కూతురు దగ్గర ఉన్నది. అల్లుడి మీద ఆమె అభిప్రాయం మారిపోయింది.
“నేను మీకు శత్రువును కదా. నాకు కాఫీ ఇస్తున్నారేమిటి?” అని అడిగాడు రాజేష్ ఒక రోజు అత్తగారితో చనువు ఏర్పడ్డాక.
“నీలోని శత్రువు అంతమైపోయాడు. అల్లుడే మిగిలాడు” అన్నదామె.
శాలిని నవ్వుకుంది.